ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌‌లో 32 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించారు.

మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

నిరుడు డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్ సాయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మావోయిస్టుల నియంత్రణకు చర్యలు తీవ్రమయ్యాయి.

ఒకవైపు రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రతిపాదిస్తూనే మరోవైపు వారి ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో 171 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి (2000) నుంచి ఒకే ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది ఏప్రిల్ 16న కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది అనుమానిత మావోయిస్టులను చంపేసినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి.

కానీ శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా ఎక్కువ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బస్తర్ రేంజ్ పోలీస్ ఐజీ ఏం చెప్పారు?

మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని బస్తర్ రేంజ్ పోలీసు ఐజీ సుందర్‌రాజ్ వార్తాసంస్థ పీటీఐకి తెలిపారు.

అబూజ్‌మద్‌లోని తుల్తులి, నెందూర్ గ్రామాల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. ఈ ప్రదేశం నారాయణపూర్-దంతెవాడ సరిహద్దులో ఉంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టుల మృతదేహాల నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వీటిలో ఏకే-47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్ ఉన్నాయన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)