భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

వైవాహిక అత్యాచారం నేరమా..కాదా...

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివాహం అనేది సామాజిక వ్యవస్థ అని, వైవాహిక అత్యాచారం న్యాయపరమైన అంశం కాదని, సామాజికమైనదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది.
    • రచయిత, గీతా పాండే, చెరిలాన్ మొల్లాన్
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ, ముంబయి

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.

అది చాలా తీవ్రమైన చర్య అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది.

భార్యతో బలవంతంగా శృంగారం జరిపే ప్రాథమిక హక్కు భర్తకు లేదని.. అయితే లైంగిక హింస నుంచి వివాహితకు రక్షణ కల్పించేందుకు చట్టాలున్నాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.

వైవాహిక అత్యాచారం విషయంలో భర్తపై విచారణ జరిపేందుకు వీలులేని బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

భారత్‌లో ప్రతి 25మంది మహిళల్లో ఒకరు భర్తల చేతిలో లైంగిక హింసకు గురవుతున్నారని ఇటీవలి ప్రభుత్వ సర్వేలో తేలింది.

వందకుపైగా దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని చట్టవ్యతిరేకమైనదిగా భావిస్తున్నారు.1991లో బ్రిటన్ దీన్ని నేరాల పరిధిలో చేర్చింది.

భారత్‌, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా సహా 30కి పైగాదేశాల్లో మాత్రం ఈ చట్టం పుస్తకాలకే పరిమితమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లైంగిక హింసకు గురవుతున్న భార్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో ప్రతి 25 మంది మహిళల్లో ఒకరు భర్తల చేతిలో లైంగిక హింసకు గురవుతున్నారని ఇటీవలి సర్వేలో తేలింది.

బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని సవరించాలని డిమాండ్

1860నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ 375 సెక్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవలి కాలంలో అనేక పిటిషన్లు దాఖలయ్యయి.

ఈ చట్టం అనేక మినహాయింపులను కల్పించింది.

మైనర్ కాని భార్యతో భర్త బలవంతంగా శృంగారం జరిపినా అది అత్యాచారంగా పరిగణించకపోవడం ఈ మినహాయింపుల్లో ఒకటి.

అయితే ప్రస్తుత కాలంలో ఈ వాదన సరైనది కాదని, ఎవరు బలవంతపు శృంగారం జరిపినా అది అత్యాచారం కిందకే వస్తుందని హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించరాదన్న భారత్‌లో చట్టాలపై ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేశాయి.

భారత ప్రభుత్వం, కొన్ని మత సంస్థలు, పురుషుల హక్కుల కార్యకర్తలు ఈ చట్టాన్ని సవరించాలన్న సూచనను వ్యతిరేకిస్తున్నారు.

వివాహంలోనే శృంగారంపై సమ్మతి ఉందని, ఈ అంగీకారాన్ని భార్యలు వెనక్కి తీసుకోలేరని వారు వాదిస్తున్నారు.

ఈ విషయంలో కోర్టులు వేర్వేరు తీర్పులిచ్చాయి.

2022లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఆగస్టులో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించని భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైవాహిక అత్యాచారం భారత్‌లో నేరం కాదు

49 పేజీల అఫిడవిట్ సమర్పించిన కేంద్రం

వైవాహిక అత్యాచారాలపై కేంద్రం తన స్పందన తెలియచేస్తూ 49పేజీల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

వివాహ బంధం ప్రత్యేకమైనదని, చట్టాలు, హక్కులు, బాధ్యతలు అన్నీ ఉన్న సామాజిక వ్యవస్థ అని కేంద్రం ఆ రిపోర్టులో అభిప్రాయపడింది.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే అది దాంపత్య బంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, వివాహ వ్యవస్థలో తీవ్రమైన అవాంతరాలకు కారణమవుతుందని కేంద్రం తెలిపింది.

వివాహంలో జీవిత భాగస్వామి నుంచి శృంగారం ఆశించడం సహజమైన విషయమని.. అయితే దీనర్థం శృంగారం కోసం భార్యను బలవంతం చేసే హక్కు భర్తకు ఉందని కాదని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

వైవాహిక అత్యాచారాన్ని అత్యాచార వ్యతిరేక చట్టాల కిందకు తీసుకురావడమనేది అతి తీవ్రమైన విషయమని, సరైనది కాదని తెలిపింది.

గృహ హింస, లైంగిక వేధింపులు, లైంగిక హింస వంటివాటిపై చర్యలు తీసుకునే వీలు కల్పిస్తున్న ప్రస్తుత చట్టాలు వివాహితులైన మహిళల హక్కులకు రక్షణ కల్పిస్తాయని అభిప్రాయపడింది.

వివాహం అనేది సామాజిక వ్యవస్థ అని, వైవాహిక అత్యాచారం న్యాయపరమైన అంశం కాదని, సామాజికమైనదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

దీనిపై ఓ విధానం రూపొందించే విషయాన్ని పార్లమెంట్‌కు వదిలిపెట్టాలని కోరింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)