అప్పుడు ‘ఇండియా అవుట్’ అన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, ఇప్పుడు సాయం కోసం వస్తున్నారా?

మొహమ్మద్ ముయిజ్జు, మాల్దీవులు, నరేంద్రమోదీ, భారత దేశం, దిల్లీ

ఫొటో సోర్స్, X/MEA India

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడైన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి
    • రచయిత, అంబరాసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఈ వారం (అక్టోబర్ 6 నుంచి 10 వరకు) భారత పర్యటన సందర్భంగా బెయిలవుట్ ప్యాకేజీ కోరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మాల్దీవులు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అప్పులు చెల్లించడం కష్టంగా మారింది.

మాల్దీవుల్లో దిల్లీ ప్రభావాన్ని తగ్గిస్తాననే హామీ ఇచ్చి ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ముయిజ్జు మొదటి అధికారిక ద్వైపాక్షిక పర్యటన ఇది.

ముయిజ్జు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. మాల్దీవులు తన పెద్ద పొరుగు దేశాన్ని విస్మరించలేదని ఈ పర్యటన సూచిస్తోందని నిపుణులు అంటున్నారు.

సెప్టెంబర్‌లో మాల్దీవుల వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు 440 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇవి ఒకటిన్నర నెల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి.

సెప్టెంబర్‌లో అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ మూడీస్ మాల్దీవుల క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించింది. అప్పు ఎగవేసే రిస్కులు పెరిగాయని పేర్కొంది.

భారత్ బెయిలవుట్ ప్యాకేజీ ఇస్తే మాల్దీవుల విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి.

ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పర్యటన కాకుండా తుర్కియే, చైనాలలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

2024 జనవరిలో ఆయన చైనా పర్యటనకు వెళ్లడం దౌత్యపరంగా భారత్‌ను నిర్లక్ష్యం చేయడమే అని విశ్లేషకులు భావించారు.

గతంలో మాల్దీవుల అధ్యక్షులుగా ఎన్నికైనవారు మొదట భారత పర్యటనకు వచ్చేవారు.

ముయిజ్జు చైనాలో పర్యటించడం, అదే సమయంలో మాల్దీవులకు చెందిన మంత్రులు భారత ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది.

"ప్రెసిడెంట్ ముయిజ్జు భారత పర్యటన ఒక కీలక మలుపు" అని మాల్దీవులకు చెందిన విశ్లేషకులు, వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు అజీమ్ జహీర్ చెప్పారు.

"ముఖ్యంగా మాల్దీవులు భారత దేశం మీద ఎంతగా ఆధారపడి ఉందో ఈ పర్యటన స్పష్టం చేస్తుంది. దాన్ని ఏ దేశం కూడా భర్తీ చేయలేదు” అని జహీర్ అన్నారు.

బీబీసీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మొహమ్మద్ ముయిజ్జు, మాల్దీవులు, నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 జూన్‌లో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మొహమ్మద్ ముయిజ్జు

హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న దాదాపు 1,200 పగడపు దీవుల సముదాయమే మాల్దీవులు. ఈ ద్వీప సమూహ దేశం జనాభా 5 లక్షల 20 వేలు.

మాల్దీవులు ఆహారం, మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం భారత్ మీద ఆధారపడుతోంది.

ముయిజ్జు భారత పర్యటన అజెండాలో ఆర్థిక ప్యాకేజీ అంశం ఉందన్న విషయాన్ని భారత ప్రభుత్వం కానీ, మాల్దీవుల ప్రభుత్వం కానీ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ప్రధాని మోదీతో ముయిజ్జు చర్చల్లో ఇది భాగం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

“గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఆర్థిక సాయం పొందడమే ముయిజ్జు పర్యటన ప్రధాన ఉద్దేశం” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మాల్దీవియన్ సీనియర్ ఎడిటర్ ఒకరు బీబీసీకి చెప్పారు.

‘‘క్షీణించిన విదేశీ మారక నిల్వల్ని పెంచుకునేందుకు మాల్డీవ్స్ సెంట్రల్ బ్యాంక్ 400 మిలియన్ డాలర్ల మార్పిడి ఒప్పందం కోసం ఎదురు చూస్తోంది. ఇది జరగాలని ముయిజ్జు కోరుకుంటున్నారు” అని ఆయన వివరించారు.

మాల్దీవుల ఆర్థిక పరిస్థితిపై రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మాల్దీవుల రుణ భారం 2025లో 600 మిలియన్ డాలర్లు, 2026 నాటికి బిలియన్ డాలర్లకు చేరవచ్చు. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉన్నాయని మూడీస్ తెలిపింది.

మాల్దీవుల ప్రభుత్వ రుణాలు సుమారు 8 బిలయన్ డాలర్లు. ఇందులో భారత్, చైనాకు చెల్లించాల్సిన చెరో 1.4 బిలియన్ డాలర్లు కూడా ఉన్నాయి.

"ఐదేళ్లపాటు రుణ చెల్లింపులను వాయిదా వేయడానికి చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ముయిజ్జు వివిధ సందర్బాల్లో చెప్పినా, బీజింగ్ నుంచి ఆర్థిక సహాయం అందలేదు" అని మాల్దీవియన్ ఎడిటర్ చెప్పారు.

మాల్దీవులను రక్షించేందుకు మరే ఇతర దేశం ముందుకు రాకపోవడంతో భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దడానికి ముయిజ్జు ఇప్పుడు భారత పర్యటనకు వస్తున్నట్లు కనిపిస్తోంది.

"మాల్దీవులకు తగ్గిన భారత పర్యటకుల సంఖ్యను పెంచడం, మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేతల తీరుపై వివరణ ఇవ్వడం లాంటి అంశాలు ఈ పర్యటనలో ఉంటాయి” అని జహీర్ చెప్పారు.

మొహమ్మద్ ముయిజ్జు, మాల్దీవులు, నరేంద్రమోదీ, భారత దేశం, దిల్లీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024 జనవరిలో చైనా పర్యటనకు వెళ్లారు.

మాల్దీవులపై భారత్ ప్రభావం చాలా కాలంగా ఉంది. హిందూ మహా సముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని భారత్ పర్యవేక్షిస్తోంది. అయితే ముయిజ్జు చైనాకు దగ్గరవడం ద్వారా దీన్ని మార్చాలని అనుకున్నారు.

ముయిజ్జు అధ్యక్షులైన తర్వాత 2024 జనవరిలో తమ దేశంలో ఉన్న 80 మంది భారత సైనికుల్ని ఉప సంహరించుకోవాలని భారత దేశానికి అల్టిమేటం ఇచ్చారు. మాల్దీవులకు కొన్నేళ్ల క్రితం విరాళంగా ఇచ్చిన డోర్నియర్ విమానం, హెలికాప్టర్లు, రెండు రెస్క్యూ, గూఢచర్య హెలికాప్టర్ల నిర్వహణ కోసం భారతీయ సైనికులు అక్కడ ఉన్నారని భారత ప్రభుత్వం తెలిపింది.

చివరికి, విమానాలను నడపడానికి సైనికుల స్థానంలో భారతీయ సాంకేతిక సిబ్బందిని నియమించాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత మాల్దీవుల ప్రాదేశిక జలాల్లో సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసేందుకు అంతకు ముందున్న ప్రభుత్వం భారత్‌తో కుదుర్చుకున్న హైడ్రో గ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్దరించేది లేదని ప్రకటించారు.

ముయిజ్జు మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు మోదీ గురించి ‘జోకర్’, ‘ఉగ్రవాది’, ‘ ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మాల్దీవులను బహిష్కరించాలని భారతీయ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే ఈ వ్యాఖ్యలు ఆయా మంత్రుల వ్యక్తిగతమని, వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవుల ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. తర్వాత ఆ ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేశారు.

మాల్దీవుల మీద భారత సామాజిక మాధ్యమాల్లో కనిపించిన విమర్శలపై ముయిజ్జు స్పందించారు. "మేము చిన్నవాళ్లమే కావచ్చు, కానీ అది మమ్మల్ని బెదిరించేందుకు మీకు లైసెన్స్ ఇవ్వదు" అని అన్నారు.

మాల్దీవుల బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆహారం, మౌలిక వసతులు, వైద్య సేవల విషయంలో భారత్ మీదనే ఆధారపడుతున్న మాల్దీవులు.

చైనీస్ పరిశోధన నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 3ను ముయిజ్జు ప్రభుత్వం అనుమతించింది. దీనిపై భారత నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొంతమంది దీనిని డేటాను సేకరించే మిషన్‌గా భావించారు. అయితే తర్వాతి రోజుల్లో దీన్ని చైనా సబ్‌మెరైన్ ఆపరేషన్స్‌ కోసం ఉపయోగించుకుంది.

ఇదంతా జరుగుతున్నప్పటికీ ఈ ఏడాది జూన్‌లో నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముయిజ్జును ఆహ్వానించారు.

ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు పునరుజ్జీవం ఇచ్చింది.

"ఎన్డీయే ప్రభుత్వపు 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానానికి మూలస్తంభాలలో మాల్దీవులు ఒకటి" అని జైశంకర్ మాలేలో చెప్పారు.

"ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటల్లో క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశానికి పొరుగు దేశాలే తొలి ప్రాధాన్యం. అందులో మాల్దీవులకు ప్రాధాన్యత ఉంది” అని జైశంకర్ చెప్పారు.

బంగ్లాదేశ్‌లో భారత్‌తో సన్నిహితంగా వ్యవహరించిన షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, భారత విధానాలను విమర్శించే కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానమంత్రిగా తిరిగి రావడం వంటి పరిణామాల మధ్య మాల్దీవుల వ్యవహార శైలిలో వచ్చిన మార్పు భారత్‌కు స్వాగతించదగినదే.

భారత దేశాన్ని వ్యతిరేకించడం సరికాదని ముయిజ్జు గ్రహించారు. మాల్దీవుల్ని సందర్శించే భారతీయుల సంఖ్య గతేడాది 50 వేలు తగ్గింది. దీని వల్ల మాల్దీవులకు 150 మిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్లు అంచనా.

భారత్ నుంచి ఆర్థిక సహాయం అందకపోతే మాల్దీవులకు కష్టాలు తప్పవని ముయిజ్జుకు తెలుసు. అందుకే ఆయన భారత పర్యటనకు ఆయనతో పాటు మాల్దీవులకు కూడా చాలా కీలకమైనది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)