గాయాలు, భయాలు, అనాథలైన చిన్నారులు: 2023 అక్టోబర్ 7 హమాస్ దాడుల తర్వాత మారిపోయిన జీవితాలు

తన భర్త బతికి ఉన్నారో లేదో బట్‌షెవకు తెలియదు. యవ్వనంలోకి అడుగు పెడుతున్న అబ్దుల్లా అనాథలా మిగిలాడు. క్రిస్టినా, అబ్దుల్ రహమాన్ మళ్లీ నడవగలం అని భావిస్తున్నారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాతి పరిణామాలతో ఇజ్రాయెల్, గాజా, లెబనాన్, వెస్ట్ బ్యాంక్‌లలో ఉంటున్న తమ జీవితాలు ఎలా మారిపోయాయో వారు బీబీసీకి వివరించారు.
ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసి, దాదాపు 1,200 మందిని చంపేసి, 251 మందిని బందీలుగా పట్టుకువెళ్లి ఏడాదైంది.
హమాస్ దాడికి ప్రతీకారంగా, వెంటనే గాజాపై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక, భూతల దాడులతో ఆపరేషన్ మొదలు పెట్టింది. అప్పటి నుంచి గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 41 వేల మందికి పైగా మరణించారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Batsheva Yahalomi
ఆయనకు ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు
అక్టోబర్ 7కు ముందు ఒహద్ యహలొమి, ఆయన పదేళ్ల కుమార్తె యేల్ దగ్గర్లో ఉన్న పొలంలోకి తమ పెంపుడు జంతువుల్ని తోలుకెళ్లారు. యేల్, ఆమె అన్న ఇటన్ తమ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఒహద్ భార్య బట్‌షెవ తన చిన్న కుమార్తెతో కలిసి ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ పాప వయసు ఏడాదిన్నర.
నిర్ ఓజ్ కిబ్బుట్జ్ ప్రాంతంలో జీవితం చాలా క్లిష్టంగా ఉంటుంది. గాజా సరిహద్దుకు మైలు దూరంలో దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉన్న ఈ గ్రామంలో 400 కంటే తక్కువ మంది ఉంటున్నారు.
“అక్కడ జీవితం మాకు చాలా ఇష్టం, అందరూ అమాయకంగా ఉండేవారు. అది మాకు స్వర్గం” అని 45 ఏళ్ల బట్‌షెవ చెప్పారు.
తర్వాతి రోజు ఉదయం ఆ కుటుంబం రాకెట్ దాడులు జరుగుతాయని హెచ్చరించే సైరన్ మోతలతో నిద్ర లేచింది. గాజాకు చెందిన సాయుధ గ్రూపుల దాడుల గురించి అప్రమత్తం చేసే సైరన్ శబ్దం వారికి కొత్తేం కాదు.
అయితే, కొన్ని నిమిషాల తర్వాత అది రాకెట్ దాడి కాదని వాళ్లకు అర్థమైంది. “అల్లాహు అక్బర్” అనే కేకలు, బయట నుంచి తుపాకీ మోతలు వినిపించాయి.
దీంతో ఆ కుటుంబం కొన్ని గంటల పాటు ఇంట్లోనే సేఫ్ రూమ్‌లో ఉండిపోయింది. అయితే ఓ సాయుధుడు తలుపు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. వాళ్ల బారి నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు తాను సేఫ్ రూమ్ నుంచి బయటకు వెళ్లాలని ఒహద్ భావించారు.
“ప్రతి కొన్ని నిమిషాలకు ఓసారి ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పేవారు” అని బట్‌షెవ గుర్తు చేసుకున్నారు. “మా చివరి నిమిషాలు” అని ఆయన తన స్నేహితులకు సందేశం పంపించారు.


ఫొటో సోర్స్, Batsheva Yahalomi
ఏకే 47 తుపాకులు, గ్రనేడ్లతో సాయుధులు ఇంట్లోకి చొరబడ్డారు. సేఫ్ రూమ్‌ను కనుక్కుని అందులోకి ప్రవేశించడానికి ముందు ఒహద్‌ను కాల్చారు. “వాళ్లు మా వైపు తుపాకులు గురి పెట్టి ఇంగ్లీష్‌లో ‘గాజాకు పదండి’ అని అరిచారు. వాళ్లకు ఏం కావాలో నాకప్పుడే అర్థమైంది” అని ఆమె గుర్తు చేసుకున్నారు.
హమాస్ సాయుధులు బట్‌షెవను, ఆమె కుమార్తెల్ని ఒక బైక్ మీద, ఇటన్‌ను మరో విదేశీయుడిని ఇంకో బైక్ మీద గాజాకు తీసుకువెళ్లారు. బట్‌షెవ ఆమె కుమార్తెల్ని తీసుకెళ్తున్న బైక్ పాడవడంతో వాళ్లు తప్పించుకున్నారు. అయితే ఇటన్‌ను, అతని తండ్రిని బందీలుగా పట్టుకెళ్లారు.
ఇటన్‌ను హమాస్ గాజాలో 52 రోజులు బంధించింది. అక్టోబర్ 7న చిత్రీకరించిన వీడియోలను చూడాలని ఒత్తిడి తెచ్చారు. “మహిళలు, చిన్నారులు, ప్రజల్ని వాళ్లు ఎంత క్రూరంగా చంపారో అతను చూశాడు” అని బట్‌షెవ చెప్పారు. ఈ యుద్ధంలో కుదిరిన బందీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇటన్‌ను నవంబర్‌లో విడుదల చేశారు.
జనవరిలో సాయుధ పాలస్తీనీయులు ఒహద్ వీడియో ఒకటి విడుదల చేశారు. అందులో ఆయనకు గాయాలైనా, బతికే ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇజ్రాయెల్ దాడిలో మరణించారని రిపోర్టులు వచ్చాయి. ఒహద్ పరిస్థితి గురించి వస్తున్న వార్తల్ని నిర్ధారించడం లేదా అప్‌డేట్ ఇవ్వడం వీలు కాదని ఇజ్రాయెల్ సైన్యం బట్‌షెవకు చెప్పింది.
అక్టోబర్ 7న బాగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో నిర్ ఓజ్ ఒకటి. ఈ గ్రామంలో పదుల సంఖ్యలో స్థానికుల్ని కాల్చి చంపడం లేదా కిడ్నాప్ చేశారు. కాలిపోయిన ఇళ్లతో ఉన్న ఈ గ్రామం ఆ రోజు జరిగిన దానికి జ్ఞాపకంగా మిగిలింది.
ఏడాది నుంచి తన పిల్లలు అదే మంచం మీద తనతోనే నిద్రిస్తున్నారని, వారికి పీడకలలు వస్తున్నాయని బట్‌షెవ చెప్పారు.
నాన్న ఎప్పుడు వస్తారని వాళ్లు తరచూ తల్లిని అడుగుతున్నారు.
“కష్టమైన విషయం ఏంటంటే ఆయనకు (ఒహద్‌కు) ఏం జరిగిందో తెలియదు. ఆయన బతికున్నారో లేదో తెలియడం లేదు,” అని బట్‌షెవ చెప్పారు.

ఆసుపత్రిలో తల్లిదండ్రుల గురించి తాను అడిగే ప్రశ్నల నుంచి సిబ్బంది దృష్టి మళ్లించేవారని అబ్దుల్లా గుర్తు చేసుకున్నాడు. వారు చనిపోయారనే విషయం అతని కజిన్, అమ్మమ్మ తర్వాతెప్పుడో చెప్పినప్పుడు, అలా జరిగి ఉంటుందని తాను అనుకున్నానని, అదే నిజమైందని అబ్దుల్లా చెప్పాడు. “దాని గురించి ఇంకా బాధ పడుతూనే ఉన్నాను” అని అన్నాడు.
“నాకు ఇప్పుడు జరుగుతున్న దాని కంటే నేను చనిపోయి ఉంటే బావుండేది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
“నా చెయ్యి తెగిపోయినట్లు అనిపిస్తోంది” అని అబ్దుల్లా చెప్పాడు. అతని ఎడమ చేతి మీద పెద్ద గాయపు మచ్చను చూపిస్తూ “వాళ్లు దీన్ని సరిచేసేందుకు ప్రయత్నించారు. అయితే అది కాలేదు. ఇది తరచూ నెప్పి పెడుతూనే ఉంది” అని చెప్పాడు.
అబ్దుల్లా ప్రస్తుతం తన అక్క, చెల్లెలు, అమ్మమ్మతో కలిసి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో జీవిస్తున్నాడు. అతని అక్క మిన్నా వయసు 18 ఏళ్లు, చెల్లెలు హలా వయసు 11 ఏళ్లు. వాళ్ల తల్లిదండ్రులు చనిపోయిన రోజు మిన్నా, హలా దక్షిణ గాజాలో ఉన్నారు. కారులో వారు కూర్చునేందుకు చోటు లేకపోవడంతో వాళ్లు ఇంట్లోనే ఉండిపోయారు. అహ్మద్‌కు ప్రస్తుతం ఖతార్‌లో చికిత్స జరుగుతోంది.
“ఆనందంగా గడిపిన రోజులు పోయాయి. మా అమ్మ, నాన్న, అంకుల్ చనిపోయారు. మొత్తం కుటుంబం ఆనందంగా ఉండటానికి వాళ్లే ఆధారం” అని అబ్దుల్లా చెప్పాడు.
“వాళ్లు లేకపోతే మేము బతికి ఉన్నట్లే కాదు. మేము స్కూలుకు వెళ్లే వాళ్లం, ఆడుకునే వాళ్లం, హాయిగా ఉండేవాళ్లం. గాజా చాలా అందంగా ఉండేది. అయితే అదంతా పోయింది” అని అబ్దుల్లా చెప్పాడు.
తన స్నేహితుల్లో కొంతమందితో సంబంధాలు లేవని, మిగతావాళ్లు యుద్ధంలో చనిపోయారని అబ్ధుల్లా తెలిపాడు.
“ఈ సందేశం ఇజ్రాయెల్ కోసం. వాళ్లు నాకు, మాకు మిగిల్చింది ఇదే. మీరు నా తల్లిదండ్రుల్ని తీసుకెళ్లారు. నా విద్యాబ్యాసాన్ని తీసుకెళ్లారు. నా సర్వస్వాన్ని నాకు దూరం చేశారు.”

'దీని కంటే చనిపోయినా బావుండేది'
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు అబ్దుల్లాకు 13 ఏళ్లు. ఉత్తర గాజాలోని అల్ తవమ్ ప్రాంతంలో ఉండేవాడు. అప్పటి వరకు అతని జీవితం స్కూలు, స్నేహితులతో ఫుట్‌బాల్, బీచ్‌కు వెళ్లడం, కుటుంబ సభ్యులతో సరదాగా సాగింది.
అతని పుట్టిన రోజుకు ముందు రోజు, స్థానికులు దక్షిణం వైపు వెళ్లాలని సూచించే పాంప్లెట్లు ఈ ప్రాంతమంతా వెదజల్లారు.
దీంతో ఆ కుటుంబం నిత్యావసర వస్తువుల్ని ప్యాక్ చేసుకుని సలాహ్ అల్ దిన్ రోడ్డెక్కింది. ఇళ్లను వదిలి వచ్చేవారికి ఈ మార్గం సురక్షితమైనదని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.
అయితే వాళ్లు రోడ్డు మీద వేగంగా వెళుతున్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ప్రయోగించిన బాంబు తమ వాహనాన్ని తాకిందని అబ్దుల్లా చెప్పాడు.
“నేను నా సోదరుడు అహ్మద్ కారులో నుంచి ఎగిరి పడ్డాం” అని అబ్దుల్లా గుర్తు చేసుకున్నాడు.
అహ్మద్ వయసు అప్పుడు 16ఏళ్లు. అతని ఒక కాలు విరిగిపోయింది. మరో కాలికి స్టీలు ప్లేట్లు వేశారు.
పదునైన వస్తువు ఏదో అబ్దుల్లా చేతిలోకి దూసుకుపోయింది. అవి అతని తల, వెన్నెముక భాగం, నోట్లోకి కూడా వెళ్లాయి. పొట్టమీద గాయాల మచ్చలను చూపించేందుకు అతను తన దుస్తుల్ని కూడా తీసేశాడు.
అతని తల్లి, తండ్రి, అంకుల్ శరీరాలు ముక్కలైపోయి కాలిపోయిన దశలో తర్వాత గుర్తించారని బంధువులు బీబీసీతో చెప్పారు.
తమ మీదకు డ్రోన్‌సాయంతో క్షిపణిని ప్రయోగించారని అబ్దుల్లా, అతని కుటుంబం, మరి కొందరు ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి తెలిపారు.
తాము పౌరుల వాహన శ్రేణి మీద దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణల్ని ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. ఇవన్నీ “నిరాధార ఆరోపణలు” అని అభివర్ణించింది.
“సమగ్రంగా పరిశీలించిన తర్వాత, ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినట్లు ఎలాంటి ఆధారం లేదు” అని ఇజ్రాయెల్ సైన్ అధికార ప్రతినిధి బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Handout
“నేను ఒక కాలు మాత్రమే కోల్పోయాను అని ఉపశమనం పొందుతున్నాను”
“నన్ను నేను ఫొటో జర్నలిస్టుగా పరిచయం చేసుకునేదాన్ని. ఇప్పుడు నన్ను నేను యుద్ధ బాధితురాలినని చెప్పుకోవాల్సి వస్తోంది” అని క్రిస్టినా అస్సి చెప్పారు.
గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ కోసం లెబనాన్ దక్షిణ సరిహద్దుల్లో యుద్ధాన్ని కవర్ చేసేందుకు స్వదేశం వెళ్లాలని చెప్పడంతో ఆమె ఎగిరి గంతేశారు.
2023 అక్టోబర్ 7న దాడుల తర్వాత లెబనీస్ సాయుధ గ్రూప్ హిజ్బొల్లా ఇజ్రాయెల్ మీదకు రాకెట్లు ప్రయోగించడం ప్రారంభించింది. సరిహద్దులకు అటు ఇటు జరిగిన దాడులు తర్వాతి రోజుల్లో భారీ సంఘర్షణకు దారి తీశాయి.
2023 అక్టోబర్ 13న క్రిస్టినా, కొంతమంది జర్నలిస్టుల బృందం దక్షిణ లెబనాన్‌లోని ఒక గ్రామానికి వెళ్లింది. ఈ గ్రామం ఇజ్రాయెల్ సరిహద్దుల నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి.
ప్రెస్ అని రాసి ఉన్న జాకెట్లు వేసుకోవాలని, హెల్మెట్లు పెట్టుకోవాలని 29 ఏళ్ల క్రిస్టినా తన బృందానికి చెప్పారు. వారు ప్రయాణిస్తున్న కారు బానెట్ మీద ‘టీవీ’ అని పసుపు రంగు టేపుతో పెద్ద అక్షరాలతో రాశారు. ప్రెస్ కావడంతో తమకు భద్రత ఉంటుందని భావించినట్లు ఆమె చెప్పారు.
హఠాత్తుగా, అక్కడ కాల్పులు మొదలయ్యాయి. ఆ తర్వాత క్రిస్టినాకు గుర్తున్న విషయం, కాల్పులు మొదలైన తర్వాత తాను ఉన్న పక్కనున్న కారు తగలబడటంతో ఆమె తన కారులో నుంచి బయట పడే ప్రయత్నం చేశారు. బరువైన బుల్లెట్ ప్రూఫ్ కోటు, చేతిలో కెమెరా ఉండటంతో ఆమె కదలడం చాలా కష్టమైంది “నా కాళ్ల నుంచి రక్తం ధారగా కారడం నాకు కనిపించింది. నేను నిలబడలేకపోయాను” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Handout
12 రోజుల తర్వాత, క్రిస్టినా ఆసుపత్రిలో కళ్లు తెరిచారు. “నాకు ఒక కాలు మాత్రమే పోయింది. రెండు కాళ్లు పోలేదని కాస్త ఊపిరి పీల్చుకున్నాను” అని ఆమె చెప్పారు.
ఆ దాడిలో రాయిటర్స్ జర్నలిస్టు 37 ఏళ్ల ఇస్సామ్ అబ్దల్లా ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. “ఎవరు చనిపోయారని ఒక నర్స్ నన్ను అడిగినప్పుడు, నేను కంగారుగా ఆన్‌లైన్‌లో అతని పేరు వెతికాను. హెడ్‌లైన్స్‌లో చూసినదాన్ని నమ్మలేకపోయాను” అని ఆమె చెప్పారు.
లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి మధ్యంతర దళాలకు చెందిన దర్యాప్తు బృందం ఇజ్రాయెల్ వారిపై 120 మిల్లీ మీటర్ల షెల్స్ ప్రయోగించిందని తెలిపింది. జర్నలిస్టులని స్పష్టంగా కనిపిస్తున్నా దాడి చెయ్యడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని ఈ టీమ్ పేర్కొంది. ఆ దాడిని యుద్ధనేరంగా గుర్తించి దర్యాప్తు చేపట్టాలని హక్కుల సంస్థలు డిమాండ్ చేశాయి.
“మా భూభాగంలోకి ఉగ్రవాదుల చొరబాటుగా భావించి సైనికులు దాడి చేశారు” అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వారిని ఆపేందుకు ట్యాంకులు, మందుగుండు ప్రయోగించారు. ఈ సంఘటనపై సమీక్ష జరుగుతోంది అని ఇజ్రాయెల్ ఆర్మీ బీబీసీకి తెలిపింది.
ఇప్పుడు ఏడాది తర్వాత క్రిస్టినా తన వాస్తవాన్ని జీర్ణించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తనకు జరిగిన దాని పట్ల కోపం, అసహనం కలుగుతోందని ఆమె చెప్పారు. “నాకు అన్నింటి మీద నమ్మకం పోయింది. ఒక జర్నలిస్టుగా నన్ను అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ చట్టాలు లాంటివి కాపాడుతాయని ఒకప్పుడు అనుకునే దాన్ని” అని చెప్పారు.
క్రిస్టినాకు ఇప్పటికీ చికిత్స కొనసాగుతోంది. ఆమె ఇప్పటికీ నడవలేకపోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గాయపడిన జర్నలిస్టులు, చనిపోయిన వారికి గౌరవ సూచకంగా 2024 జులైలో ఆమె వీల్ చెయిర్‌లో కూర్చుని ఒలంపిక్ జ్యోతి పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెందిన ఆమె సహచరులు కూడా పాల్గొన్నారు.
2023 అక్టోబర్ 13న ఏం జరిగిందనే దాన్ని పక్కన పెడితే, ఆమె తిరిగి తన పనిలోకి రావాలనే ఆశతో ఉన్నారు.
“నేను నిలబడగలిగిన రోజు, కెమెరా పట్టుకుని నడిచిన రోజు, నేను ఎంతో ప్రేమించే నా పని మళ్లీ చెయ్యగలిగిన రోజు, అప్పుడు నేను విజయం సాధించినట్లు” అని క్రిస్టినా అన్నారు.

ఫొటో సోర్స్, Family photo
“నేను అరుస్తూనే ఉన్నా అతను స్పందించలేదు”
రోజంతా మొక్కజొన్న పొత్తులు అమ్మిన తర్వాత అబ్దుల్ రహమాన్ అల్ అష్‌ఖర్, అతని స్నేహితుడు, లియాత్ షవానేహ్ సాయంత్రం పూట వీధిలో నడిచి వెళుతున్నారు.
“అంతలోని హఠాత్తుగా మా మీద బాంబులు పడ్డాయి. అంతే” 2023 సెప్టెంబర్ 1 రాత్రి ఏం జరిగింతో 18 ఏళ్ల అబ్దుల్ రహమాన్ గుర్తు చేసుకున్నాడు.
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని సిలత్ అల్ హరితియా అనే గ్రామం మీద ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ప్రయోగించిన ఆయుధాలు ఈ ఇద్దరి యువకుల్ని తాకాయి.
అబ్దుల్‌రహమాన్‌కు రాకెట్ శబ్ధం వినిపించినా తప్పించుకునేందుకు సమయం లేకుండా పోయింది. “నేను ఒక్క అడుగు మాత్రమే వెయ్యగలిగాను. లియాత్ వైపు తిరిగి అరుస్తూనే ఉన్నాను. అయితే అతను స్పందించలేదు” అని అతను చెప్పాడు.
16 ఏళ్ల లియాత్ చనిపోయాడు. అబ్దుల్‌రహమాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన రెండు కాళ్లు మోకాళ్ల కింద నుంచి తీసేయాల్సి వచ్చింది.
దాడి జరిగిన పది రోజుల తర్వాత తనకు మెలకువ వచ్చిందని, తన గుండె మూడు సార్లు కొట్టుకోవడం ఆగిపోయిందని అబ్దుల్‌రహమన్ చెప్పాడు.
అతను ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నాడు. అతని గాయాల జాబితా చాలా పెద్దది. అతని రెండు చేతుల్లో ఒక చేతికి మెటల్ ప్లేట్లు అమర్చారు. రెండు వేళ్లు బాగా దెబ్బ తిన్నాయి. పొట్టలో తగిలిన గాయాలకు అనేక సర్జరీలు చేయాల్సి వచ్చింది.
గాయాల వల్ల నొప్పి మాత్రం తగ్గలేదు అని అతను చెప్పాడు.
2023 అక్టోబర్ 7 తర్వాత వెస్ట్ బ్యాంక్‌లో హింస పెరిగింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో వందల మంది పాలస్తీనీయులు చనిపోయారు. ఇజ్రాయల్ మీద దాడుల్ని మొగ్గలోనే తుంచేసేందుకు తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Family photo
దాడికి ముందు అబ్దుల్‌రహమాన్ జీవితం సాధారణంగా ఉండేది. స్నేహితులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత ఉదయం ప్రార్థనల్లో పాల్గొనడం, తర్వాత మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ తండ్రికి సాయం చేయడం.
ప్రస్తుతం అతను తన కనీస అవసరాలైన బాత్‌రూమ్‌కు వెళ్లడం కోసం కూడా అన్న మీద ఆధారపడుతున్నాడు. అతని తల్లి అతనికి భోజనం తినిపిస్తున్నారు.
ఈ దాడి గురించి తెలుసుకునేందుకు బీబీసీ ఇజ్రాయెల్ సైన్యాన్ని సంప్రదించింది. దాడి జరిగిన సమయంలో “జెనిన్ ప్రాంతం నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మినెషి బ్రిగేడ్‌లోని టెర్రరిస్టుల బృందం తమ సైనికుల వైపు పేలుడు పదార్ధాలు విసరడం చూసి తాము వైమానిక దాడి చేసినట్లు” ఇజ్రాయెల్ సైన్యం బీబీసీకి వివరించింది.
ఆ సమయంలో నీ చేతిలో తుపాకులున్నాయా? ఏవైనా ఆయుధాలున్నాయా? అని అడిగినప్పుడు “ఆయుధాలా? ఎలా? నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను. తెల్ల దుస్తులు వేసుకుని బయటుకు వెళుతున్నాను. అంతే,’’ అని అబ్దుల్ రహమాన్ చెప్పాడు.
అతను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని తన సొంతకారులో తిరగాలని కలలు కనేవాడు. “ఇవాళ నాకు ఏదైనా కోరిక ఉందంటే , అది కేవలం నేను నడవాలని మాత్రమే” అన్నాడు.
బీబీసీ ప్రతినిధులు మిఖాయిల్ షువల్, హయా అల్ బదర్నేహ్, మనల్ ఖలిల్, ఇమన్ ఇరికత్, అలా దరగ్మే అందించిన సమాచారంతో... దిమా అల్ బబిలే రాసిన కథనం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














