పదకొండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి గాజాలో నిర్బంధించారు, పదేళ్ల తర్వాత ఆమె ఎలా బయటికి వచ్చారంటే..

ఫొటో సోర్స్, Reuters
పదేళ్ల పాటు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ దగ్గర బందీగా ఉన్న యాజిదీ మహిళను రక్షించామని ఇజ్రాయెల్, అమెరికా, ఇరాక్ అధికారులు తెలిపారు.
ఇరాక్‌కు చెందిన ఆమెను పదేళ్ల కిందట ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కిడ్నాప్ చేసి, గాజాకు తీసుకెళ్లింది. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు.
మతపరంగా మైనారిటీలు అయిన యాజిదీలు ఎక్కువగా ఇరాక్, సిరియాలలో నివసిస్తారు.
2014లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యులు ఉత్తర ఇరాక్‌లోని సింజార్‌లో యాజిదీ కమ్యూనిటీని ఆక్రమించి, వేల మంది పురుషులను ఊచకోత కోశారు. బాలికలను, మహిళలను బానిసలుగా చేసుకున్నారు. అలా బందీలుగా మారిన వారిలో ఫౌజియా అమీన్ సిడో ఒకరు.
గాజాలో ఆమెను నిర్బంధించిన 21 ఏళ్ల వ్యక్తి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
నిందితుడు చనిపోయిన తర్వాత ఫౌజియా గాజాలోని మరో ప్రాంతానికి పారిపోయారు.
"ఇజ్రాయెల్, అమెరికా, ఇతర అంతర్జాతీయ దేశాల సమన్వయంతో జరిగిన సంక్లిష్ట ఆపరేషన్" అనంతరం చివరికి సిడో విముక్తి పొందారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆమెను ఇజ్రాయెల్, జోర్డాన్‌ల మీదుగా ఇరాక్‌కు తీసుకెళ్లారు.


ఫొటో సోర్స్, Reuters
ఆమెను రక్షించేందుకు నాలుగు నెలలుగా ప్రయత్నిస్తున్నామని, కానీ గాజాలో ఉన్న పరిస్థితుల కారణంగా ఇన్నాళ్లూ తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇరాక్ విదేశాంగ శాఖ అధికారి సిల్వాన్ సింజారీ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. చివరికి ఆమెను బయటికి తీసుకురాగలిగామని తెలిపారు.
ఆమె ఇప్పుడు శారీరకంగా బాగానే ఉన్నారని, అయితే ఇన్నేళ్లుగా నిర్బంధంలో ఉండడం, గాజాలోని భయానక పరిస్థితుల కారణంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదని సింజారీ అన్నారు.
కెనడియన్ ఫిలాంత్రపిస్ట్ స్టీవ్ మామన్ పంచుకున్న వీడియోలో, ఆ యువతి ఇరాక్‌లోని తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోవడం కనిపించింది.
ఈ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ మమన్, ‘‘గాజాలో బందీగా ఉన్న ఫౌజియాను సింజార్‌లోని ఆమె ఇంటికి తిరిగి తీసుకువస్తానని నేను వాగ్దానం చేశాను. మా టీమ్ ఇప్పుడే ఆమెను తల్లి, కుటుంబ సభ్యులతో కలిపింది’’ అని పేర్కొన్నారు.
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఒకప్పుడు తూర్పు ఇరాక్ నుంచి పశ్చిమ సిరియా వరకు విస్తరించిన 88,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని నియంత్రించేది.
2014 ఆగష్టులో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ఇరాక్‌లోని సింజార్ ప్రాంతంలో యాజిదీ మైనారిటీలను బందీలుగా చేసుకున్నారు.
అనేక యాజిదీ గ్రామాలలో, 14 ఏళ్లు పైబడిన స్త్రీలను పురుషులు, బాలుర నుంచి వేరు చేశారు. ఆ తర్వాత పురుషులను తీసుకెళ్లి కాల్చి చంపి, స్త్రీలను అపహరించుకుపోయారు.
వీరిని బహిరంగంగా విక్రయించడం లేదా ఇస్లామిక్ స్టేట్ సభ్యులకు "బహుమతి"గా, సెక్స్ బానిసలుగా అప్పగించారని వారి చెర నుంచి తప్పించుకున్న కొంతమంది యాజిదీ బాలికలు, మహిళలు తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ 3,000 మందికి పైగా యాజిదీలను చంపి, దాదాపు 6,000 మందిని అపహరించుకుపోయారని అంచనా.
ఈ వర్గానికి చెందిన దాదాపు 3,500 మందిని రక్షించగా, ఇంకా సుమారు 2,600 మంది జాడ తెలియడం లేదని ఇరాక్ అధికారులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














