ఉమెన్ టీ20 వరల్డ్ కప్: హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ కప్ కొడుతుందా?

భారత మహిళల జట్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మనోజ్ చతుర్వేది
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నేటి నుంచి (అక్టోబర్ 3) మొదలయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ టైటిల్‌‌ను సాధించాలని భారత మహిళల క్రికెట్ జట్టు ఉవ్విళ్లూరుతోంది.

ఈ టైటిల్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి పెద్ద పెద్ద జట్లతో భారత్ పోరాడాల్సి ఉంది.

2023లో జరిగిన వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైన భారత జట్టు దాని నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అలాగే 2020 వరల్డ్ కప్ ఫైనల్‌ ఓటమిని మర్చిపోయి, ఈసారైనా టైటిల్‌ గెలవాలనుకుంటోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హర్మన్‌ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

గెలుపుపై విశ్వాసంతో హర్మన్‌ప్రీత్ కౌర్

‘‘ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను గెలవాలన్నది మా జట్టు కల. సాధిస్తామని మాకు నమ్మకం ఉంది. 2020లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌ వరకు చేరుకున్నాం. గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఫైనల్‌కు చేరుకోలేకపోయాం. అంటే అతిపెద్ద వేదికపై మేం విజయం సాధించగలమనే మా సామర్థ్యాన్ని ఇవి సూచిస్తున్నాయి’’ అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు.

‘ఆస్ట్రేలియా మంచి జట్టు. సందేహం లేదు. కానీ, ఏ సమయంలోనైనా, ఎక్కడైనా వారిని ఓడించగలిగే సామర్థ్యం మాలో ఉంది’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు.

‘‘మేం బాగా కష్టపడి ఈ మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాం. మా ప్లాన్లను అమలు చేసే సమయం వచ్చింది’’ అన్నారామె.

ఆస్ట్రేలియా జట్టు సభ్యులు

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాతో పాటు గ్రూప్-ఏలో భారత్

వరుసగా మూడుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో పాటు భారత జట్టు కూడా గ్రూప్-ఏ లో ఉంది. న్యూజీలాండ్, పాకిస్తాన్, శ్రీలంకలూ ఈ గ్రూప్‌లో ఉన్నాయి.

ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌లు గ్రూప్‌-బీ లో ఉన్నాయి.

టోర్నమెంట్ ఫార్మాట్‌ ప్రకారం, రౌండ్-రాబిన్ బేసిస్‌పై గ్రూప్‌లోని టీమ్‌లు ఒకదానితో మరొకటి తలపడతాయి.

ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాలను దక్కించుకున్న జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి.

అక్టోబర్ 17న, 18న సెమీ-ఫైనల్స్‌ మ్యాచ్‌లు, అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది.

భారత జట్టు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ జట్టు మ్యాచ్‌లు ఎవరితో ఎప్పుడెప్పుడు?

అక్టోబర్ 4న న్యూజీలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ఈ మెగాటోర్నీలో తన పోరాటాన్ని ప్రారంభించనుంది.

అక్టోబర్ 6న పాకిస్తాన్‌తో తలపడనుంది. 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాతో భారత జట్టు ఆడుతుంది.

సెమీ-ఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఈ గ్రూప్‌లో కనీసం మూడు మ్యాచ్‌లను గెలవాలి. న్యూజీలాండ్ టీమ్ భారత్‌కు గట్టి పోటీగా కనిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్‌కు మంచి రికార్డు ఉంది. ఇరు దేశాలు 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వాటిల్లో తొమ్మిది మ్యాచ్‌లను న్యూజీలాండ్, నాలుగు మ్యాచ్‌లను భారత్ గెలుచుకున్నాయి.

గత కొన్నేళ్లుగా భారత మహిళల జట్టులో చాలా పురోగతి కనిపిస్తోంది. న్యూజీలాండ్‌ను మాత్రమే కాదు, ఏ జట్టునైనా ఓడింగలమనే విశ్వాసం భారత్‌ జట్టులో కనిపిస్తోంది.

ఈ గ్రూప్‌లో శ్రీలంక నుంచి కూడా భారత్‌కు గట్టి సవాలు ఎదురవుతోంది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో శ్రీలంక మీద భారత్‌కు మంచి రికార్డు ఉందన్నది నిజమే. ఇరు జట్లు 23 మ్యాచ్‌లను ఆడితే....భారత్ 18 మ్యాచ్‌లు గెలవగా....శ్రీలంక 5 గెలిచింది.

అయితే, లంక జట్టును భారత్ టీమ్ తేలికగా తీసుకోవడం లేదు. ఈ ఏడాది జరిగిన మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ టీమ్‌ను ఓడించేందుకు టీమిండియా తీవ్రంగా పోరాడాల్సి ఉంది.

అలాగే, పాకిస్తాన్‌ను భారత్‌కు సంప్రదాయ ప్రత్యర్థిగా పరిగణిస్తున్నా...ఆ జట్టు భారత్‌కు గట్టి సవాల్ విసరలేకపోయింది.

కానీ, భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఈసారి దూకుడుగా ఆడతామని ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా అన్నారు. ఈ చాలెంజ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీలులేదు.

6 సార్లు చాంపియన్‌గా ఆస్ట్రేలియా జట్టు

ఐసీసీ ఉమెన్ టీ20 వరల్డ్ కప్‌ను 2009లో ప్రారంభించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం అంత తేలిక కాదు.

ఇప్పటి వరకు ప్రపంచ కప్‌ ఎనిమిది సార్లు జరగగా.. ఆరుసార్లు ఆస్ట్రేలియా జట్టు చాంపియన్‌గా నిలిచింది.

అంతేకాదు, మూడుసార్లు వరుసగా టైటిల్‌ను గెలుచుకుంది. 2009లో ఇంగ్లండ్, 2016లో వెస్టిండీస్‌ జట్లు చాంపియన్లుగా నిలిచాయి.

క్రీడాకారులు

ఫొటో సోర్స్, Getty Images

స్పిన్నర్ల పాత్ర కీలకం

యూఏఈలో తరచూ స్పిన్ బౌలర్లు మెరుస్తుంటారు. రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనలు భారత విజయంలో కీలకపాత్ర పోషించగలరు.

కానీ, ఈసారి యూఏఈలో శీతాకాలం. మ్యాచ్ ఆడే జట్లు మంచుతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో, ఫాస్ట్ బౌలర్లది కీలక పాత్ర అవుతుంది.

యూఏఈలో చాంపియన్‌షిప్‌ నిర్వహించాలని చివరి నిమిషంలో నిర్ణయించారు. అసలైతే, వీటిని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉంది.

కానీ, అప్పట్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల కారణంగా, ఐసీసీ మరో వేదికను ఎంచుకోవాల్సి వచ్చింది.

ఐసీసీ తొలుత భారత్ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంది. కానీ, వచ్చే ఏడాది 50 ఓవర్ల ఉమన్స్ వరల్డ్ కప్‌ కూడా భారతే నిర్వహించాల్సి ఉంది. దీంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది.

శ్రీలంకలో ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. దీంతో యూఏఈలో ఈ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.

తొలిసారి, పురుషుల జట్టుకు సమానంగా నగదు బహుమతి

ఉమెన్ టీ20 వరల్డ్ కప్ నగదు బహుమతిని పురుషులకు సమానంగా ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది.

దీంతో, ఇంతకు ముందుకంటే 225 శాతం నగదు బహుమతి పెరిగింది.

ఈసారి గెలిచిన జట్టుకు 23.4 లక్షల డాలర్లు( సుమారు రూ. 19.65 కోట్లు) వస్తాయి. అలాగే, రన్నరప్ జట్టుకు 11.7 లక్షల డాలర్లు( సుమారు రూ. 9.8 కోట్లు ) అందుతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)