అరుంధతి రెడ్డి: సికింద్రాబాద్ అమ్మాయి టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఇండియాను గెలిపించింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బోడ నవీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘ఎప్పుడైనా సరే, పాకిస్తాన్‌పై భారత్ గెలుపు అనేది ఎమోషనల్. ఈరోజు ఆ విజయానికి కారణం నా బిడ్డ అయినందుకు నేను ఎంత గర్వంగా, సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను’ అని భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి తల్లి భాగ్యరెడ్డి ‘బీబీసీ తెలుగు’తో చెప్పారు.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచులో అరుంధతి రెడ్డి 19 పరుగులు ఇచ్చి కీలమైన 3 వికెట్లు తీసుకున్నారు.
టీమ్ ఇండియా విజయానికి ఇదే ప్రధానం కావడంతో “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా అరుంధతి రెడ్డి నిలిచారు.
ఈ తరుణంలో పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి ఎవరు..? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.


ఫొటో సోర్స్, arundhati.reddy/Instagram
సికింద్రాబాద్ గల్లీ క్రికెట్‌తో ప్రయాణం మొదలు
హైదరాబాద్‌కు చెందిన అరుంధతి రెడ్డి రైట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్.
సింపుల్‌గా చెప్పాలంటే తనో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.
తల్లి పేరు భాగ్యరెడ్డి. ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అరుంధతి రెడ్డి పుట్టి, పెరిగిందంతా సికింద్రాబాద్ ప్రాంతంలోనే.
చిన్నతనంలో తన సోదరుడితో, వాళ్ల ఫ్రెండ్స్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడేవారు. ఆ సమయంలో అరుంధతిలో ఉన్న ప్రతిభను గుర్తించిన అక్కడివారు, తనను అకాడమీలో చేర్పించాలని తల్లి భాగ్యరెడ్డికి సూచించారు.
“నేను యూనివర్సిటీ స్థాయి వాలీబాల్ ప్లేయర్‌ను. నా కూతురు వచ్చి క్రికెట్ ఆడుతానంటే ఎంతో సంతోషించాను. వెంటనే అకాడమీలో చేర్పించాను” అని భాగ్య రెడ్డి బీబీసీ తెలుగుతో చెప్పారు.
సౌతాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ అంటే అరుంధతి రెడ్డికి ఎంతో ఇష్టం.
ఆయన స్ఫూర్తితోనే పేస్ బౌలింగ్ నేర్చుకున్నట్లు అరుంధతి తన ఇన్‌సాగ్రామ్ పోస్టుల్లో చెప్పుకొచ్చారు.
“క్రికెట్ పేరుతో అమ్మాయి సమయాన్ని వృథా చేస్తున్నారని టీచర్లు చెప్పేవారు. అమ్మాయికి స్పోర్ట్స్ అవసరమా..?అని సన్నిహితులు హితబోధ చేసేవారు. అయినప్పటికీ, ఓ ప్లేయర్‌గా నాకు ఆటపై నమ్మకం ఉంది. నా బిడ్డపై ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా నా బిడ్డను ఆపలేదు” అని భాగ్యరెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, arundhati.reddy/Instagram
21 ఏళ్లకే వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ
2018 సెప్టెంబర్ 19న శ్రీలంకతో సిరీస్‌లో మహిళల జాతీయ టీ20 జట్టులోకి అరుంధతి రెడ్డి అరంగేట్రం చేశారు.
అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ జట్టుకు కూడా ఎంపికయ్యారు.
ఆ తరువాత ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.
2021 మేలో భారత మహిళల టెస్ట్ టీమ్‌లోనూ చోటు దక్కించుకున్నారు.
అయితే, 2018 నుంచి 2021 వరకు సాఫీగా సాగిన ఆమె ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. జాతీయ జట్టుకు దాదాపు మూడేళ్లపాటు దూరమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
కఠినమైన నిర్ణయాలే... బలమైన సెకండ్ ఇన్నింగ్స్‌కు పునాదులు
“2018 నుంచి 2021 మధ్య కాలంలో ఓ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా 26 టీ20లు ఆడి 18 వికెట్లు తీశారు. ఇదేం పేలవ ప్రదర్శన కాదు. అయినప్పటికీ, పూజా వస్త్రకర్, శిఖా పాండే వంటి వారు గట్టిపోటీనివ్వడంతో జట్టులో ఎక్కువ మంది పేస్ ఆల్ రౌండర్లను తీసుకోలేకపోవడంతో అరుంధతి రెడ్డికి జట్టులో స్థానం దొరకలేదు” అని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో పేర్కొంది.
ఈ కష్ట కాలంలో జాతీయ జట్టులో స్థానం సంపాదించాలంటే మరింత కఠోర సాధన చేయాలి.
అందుకని ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ రైల్వేస్ జట్టును అరుంధతి రెడ్డి వీడారు.
ఈ నిర్ణయం చాలా కఠినమైనదని టీం ఇండియా మహిళల జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ బిజు జార్జ్ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో తో చెప్పారు.
“మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి రైల్వే ఉద్యోగం అనేది భద్రతనిస్తుంది. అయినప్పటికీ, దానిని వదిలిపెట్టడం సాహసోపేతమైన నిర్ణయం. కానీ, ఆ అడుగే ఇప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కేలా చేసింది” అని బిజు జార్జ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. 2023 సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీలో అరుంధతి రెడ్డి బ్యాటింగ్‌లో సత్తా చాటారు. 5 ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేశారు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో 9 ఇన్నింగ్స్‌లో 7.62 ఎకానమీతో 8 వికెట్లు తీసుకుని సత్తా చాటారు.
డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు అరుంధతి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తరువాత జరిగిన ఇంటర్ జోనల్ మల్టీ డే టోర్నమెంట్ లో సౌత్ జోన్ తరపున సత్తా చాటారు.
దీంతో టీం ఇండియా తలుపులు తెరచుకున్నాయి. భారత్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో అన్ని ఫార్మాట్స్‌కు ఎంపికై రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ప్రకటించిన మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ అరుంధతి రెడ్డి పేరుంది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల క్రికెట్‌లో 3 ఏళ్ల గ్యాప్ చాలా పెద్ద విషయం
“మహిళల క్రికెట్‌లో 3 ఏళ్ల గ్యాప్ అనేది చాలా పెద్ద విషయం. ఆ సమయంలో క్రికెట్ వదిలేసి పెళ్లి లేదా ఇతర కెరీర్స్ వైపు అడుగులేస్తుంటారు. కానీ, అరుంధతి రెడ్డి మాత్రం కసిగా నిలబడ్డారు” అని హైదరాబాద్‌కు చెందిన టీం ఇండియా మాజీ క్రికెటర్, క్రికెట్ అనలిస్ట్ నోయల్ డేవిడ్ అన్నారు.
‘హైదరాబాద్‌లో ప్రాక్టీస్ సమయంలో ఎవరూ లేకున్నా తానొక్కరే సాధన చేయడం నేను చూశాను. తనో ఫైటర్. భారత మహిళా క్రికెట్ జట్టుకు దొరికిన ఓ గొప్ప పేసర్ అరుంధతి రెడ్డి. గోస్వామి తరహాలో మంచి పేరు తెచ్చుకుంటుంది” అని నోయల్ డేవిడ్ అన్నారు.
అరుంధతి రెడ్డి బౌలింగ్ గణాంకాలు..!
ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్‌లో పొందుపరచిన వివరాల ప్రకారం 31 ఇంటర్నేషనల్ టీ20లలో ఆమె 25 వికెట్లు తీశారు. 2 ఇంటర్నేషనల్ వన్డేలలో 3 వికెట్లు తీశారు. టీ20ల్లో 19 పరుగులకు 3 వికెట్లు ఆమె కెరీర్ బెస్ట్.
అరుంధతి మళ్లీ హెచ్‌సీఏకు ఆడాలి
“అరుంధతి బౌలింగ్ యాక్షన్, రన్‌అప్ అద్భుతంగా ఉంటుంది. తనో హార్డ్ వర్కర్. వివిధ కారణాల వల్ల అరుంధతి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు వెళ్లిపోవడం బాధాకరం. అరుంధతి రెడ్డి మళ్లీ హైదరాబాద్‌కు ఆడేలా చూడాలని హెచ్‌సీఏను కోరుతున్నాను” అని నోయల్ డేవిడ్ అన్నారు.
“కారణాలు ఏవైనా కావొచ్చు గానీ, ఇలాంటి ప్రతిభావంతమైన ఆటగాళ్లను హెచ్‌సీఏ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలి పెట్టకూడదు” అని నోయల్ డేవిడ్ అన్నారు.
“తాము ఏదైనా సాధిస్తాం అన్న విశ్వాసాన్ని తల్లిదండ్రుల్లో పిల్లలు కలిగించాలి. అలాగే, పిల్లలు కచ్చితంగా సాధిస్తారనే నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగి ఉండాలి. అప్పుడే కాస్త ఆలస్యమైనప్పటికీ మంచి ఫలితాలు వస్తాయి. అందుకు ఉదాహరణ మా జీవితమే” అని భాగ్య రెడ్డి బీబీసీ తెలుగుతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














