అసెంబ్లీ ఎన్నికలు 2024: హరియాణాలో బీజేపీ, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌ విజయం

ఈ ఇంటరాక్టివ్ చూసేందుకు అధునాతన బ్రౌజర్, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

नायब सिंह सैनी నాయబ్ సింగ్ సైనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాయబ్ సింగ్ సైనీ

హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. 90 స్థానాలలో బీజేపీ 48 స్థానాలలో విజయం సాధించింది. కాంగ్రెస్ 37 స్థానాలు గెలిచింది. ఇండిపెండెంట్లు ముగ్గురు గెలవగా.. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అభ్యర్థులు ఇద్దరు గెలిచారు.

జమ్మూ కశ్మీర్‌‌కు సంబంధించి మొత్తం 90 సీట్లకు ఫలితాలు ప్రకటించారు. అక్కడ జేకేెఎన్‌సీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ 6 స్థానాలు గెలిచింది.

బీజేపీ ఇక్కడ 29 సీట్లు గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. పీడీపీ 3 సీట్లు.. సీపీఎం, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్క సీటు గెలిచాయి. 7 స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

హరియాణా, జమ్మూ కశ్మీర్, బీజేపీ, కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికలు, వినేశ్ ఫోగాట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ 6015 ఓట్ల తేడాతో జులానా నియోజకవర్గంలో గెలుపొందారు

హరియాణాలోని జులనా స్థానం నుంచి పోటీ చేసిన వినేశ్ ఫోగాట్ తన సమీప బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 6015 ఓట్ల తేడాతో గెలిచారు.

హరియాణాలో ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి రాసిన లేఖను ఆయన 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

హరియాణా, జమ్మూ కశ్మీర్, బీజేపీ, కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికలు, వినేశ్ ఫోగాట్
ఫొటో క్యాప్షన్, హరియాణాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

మూడోసారి బీజేపీ ప్రభుత్వం: హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ

హరియాణాలో మూడోసారి తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ చెప్పారు.

మరోవైపు కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఇంటికి అభిమానులు చేరుకున్నారు.

మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ శ్రేణులు విజయంపై ధీమాగా కనిపించాయి.. తమ పార్టీ 60కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అభిమానులు మీడియాకు చెప్పారు.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 61 శాతం పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది.

జమ్మూ కశ్మీర్‌లో మూడు దశలలో 90 స్థానాలకు అక్టోబర్ 1తో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో 63.88 శాతం ఓటింగ్ నమోదైంది.

హరియాణా, జమ్మూ కశ్మీర్, బీజేపీ, కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికలు, వినేశ్ ఫోగాట్
ఫొటో క్యాప్షన్, హరియాణాలో స్వీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు

హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 46 సీట్లు సాధించాలి. చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ఈ మ్యాజిక్ ఫిగర్‌ను దాటుతుందని అంచనావేశాయి.

రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

అందులో 101 మంది మహిళలు ఉన్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కల్పించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపారు.

హరియాణా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్నివీర్ స్కీమ్‌ను ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చింది. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా నర్నౌల్ ఎన్నికల ప్రచార సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

"అగ్నివీర్ స్కీమ్ వల్ల హరియాణా ప్రత్యేకించి దక్షిణ హరియాణా బాగా నష్టపోయింది. అంతకు ముందు ప్రతీ ఏటా 5వేల మంది యువకులు సైన్యంలో చేరేవారు. అయితే ప్రస్తుతం 250 మంది మాత్రమే చేరుతున్నారు" అని అన్నారు.

భూపిందర్ సింగ్ హుడా వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అదే స్థాయిలో స్పందించారు. ఆయన భివానీ సభలో మాట్లాడుతూ " హరియాణాకు చెందిన ప్రతి అగ్నివీరుడికి సైన్యంనుంచి బయటకు రాగానే ఉద్యోగం దొరికేలా చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది" అని చెప్పారు.

హరియాణా, జమ్మూ కశ్మీర్, బీజేపీ, కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికలు, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జమ్మూ కశ్మీర్‌‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి ఆధిక్యం

జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించింది.

పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.

నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన బడ్గామ్, గండేర్బల్ నియోజకవర్గాల్లో విజయం సాధించారు.

జమ్మూ కశ్మీర్‌లో 20 జిల్లా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

90 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను సాధిస్తామని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ హామీ ఇచ్చాయి. బీజేపీ కూడా కేవలం బీజేపీ మాత్రమే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వగలదని ప్రచారం చేసింది.

జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ కశ్మీర్‌లో 7 స్థానాలు, జమ్మూలోని 25 స్థానాల్లో పోటీ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీర్‌లో 51 సీట్లు, జమ్మూలో 32 సీట్లలో పోటీ చేసింది.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)