మాంటెనెగ్రో: ఈ చిన్నదేశానికి రష్యన్లు, యుక్రెనియన్లు భారీగా ఎందుకు వెళుతున్నారు?

- రచయిత, రాబర్ట్ గ్రీన్నాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మా వాళ్లు రష్యన్, యుక్రెనియిన్ ప్రజలను గౌరవిస్తారు. వాళ్లతో చెడుగా ప్రవర్తించడం నేను ఎప్పుడూ చూడలేదు’’ అని సావో డోబ్రోవిక్ చెప్పారు.
కానీ ఆ మాటలు ఉద్రిక్తతలు, ఘర్షణలకు కావాల్సిన దినుసులన్నీ ఉన్నాయన్నట్టుగా ధ్వనించాయి. సుదీర్ఘమైన యుద్ధంతో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్న రష్యా, యుక్రెయిన్ ప్రజలు ఇప్పడీ చిన్నదేశంలో తలదాచుకోవడానికి వస్తున్నారు.
ప్రస్తుతానికైతే మాంటెనెగ్రో ఈ వలసలను తట్టుకోగలుగుతోంది.
మాంటెనెగ్రో ఓ చిన్న బాల్కన్ దేశం.
2022 ఫిబ్రవరి నుంచి యుక్రెనియిన్ శరణార్థులు, రష్యన్ ప్రవాసులు ఐరోపాకు వలస వెళుతున్నారు. యుద్ధం, సైనిక నిర్బంధం, వ్లాదిమిర్ పుతిన్ పాలన నుంచి వారంతా తప్పించుకుంటున్నారు.
40 లక్షల మందికి పైగా యుక్రెనియిన్లు తాత్కాలిక రక్షణ కోసం యూరోపియన్ యూనియన్‌కు పారిపోయారు. చాలామంది పోలాండ్, జర్మనీలకు వెళ్లారు.
మోంటెనేగ్రో 2 లక్షల మంది యుక్రెనియిన్లను అనుమతించింది, దీంతో యూరోపియన్ యూనియన్ వెలుపల అత్యధిక సంఖ్యలో యుక్రెనియిన్ శరణార్థులను కలిగి ఉన్న దేశంగా మారింది.
"మాంటెనెగ్రో ప్రజలు చాలా ఓపికగా ఉంటారు, వారు పరోపకారులు" అని బుద్వాలో అడ్రియాటిక్ రిసార్ట్‌లోని ఒక ప్రాపర్టీ యజమాని అయిన డోబ్రోవిక్ చెప్పారు.
ఇక్కడి వారి ప్రవర్తన ఆశ్చర్యపరుస్తోందని బుద్వాలో రష్యన్ సాంస్కృతిక కేంద్రం ‘రిఫోరమ్’ను నడుపుతున్న నటల్య సెవెట్స్-యెర్మోలినా చెప్పారు.
మాంటెనెగ్రోలో బుద్వా ఒక పట్టణం.


నాటో సభ్య దేశం..
మాంటెనెగ్రో ఒక నాటో సభ్య దేశం, యురోపియన్ యూనియన్‌లో చేరడానికి ప్రయత్నిస్తోంది, దాని సమస్యలు దానికున్నాయి. ఇక్కడ సెర్బ్ జాతి జనాభా అధికంగా ఉంది, వీరిలో చాలామంది రష్యాకు మద్దతు ఇస్తున్నారు.
రెండేళ్ల కిందట, గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో ఆరుగురు రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించారు.
ఏది ఏమైనప్పటికీ, శరణార్థుల సంక్షోభాన్ని మాంటెనెగ్రో చక్కగా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా యుక్రెనియిన్లకు తాత్కాలిక రక్షణ హోదా కల్పించినందుకు ఈ దేశం ప్రశంసలు అందుకుంది, ఈ హోదాను మార్చి 2025 వరకు పొడిగించింది కూడా.
2023 సెప్టెంబర్ నాటికి, 10,000 కంటే ఎక్కువ మంది యుక్రెనియిన్లు ఈ హోదా నుంచి ప్రయోజనం పొందారు. 62,000 మంది యుక్రెనియిన్లు ఏదో ఒక రకమైన చట్టపరమైన హోదా కోసం నమోదు చేసుకున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇది మాంటెనెగ్రో మొత్తం జనాభాలో దాదాపు 10 శాతం.
రష్యా, బెలారస్‌ల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చారు. వీసా-రహిత ప్రవేశం, మతం, ఒకే రకమైన భాష, ప్రభుత్వ విధానాల కారణంగా చాలామందికి మాంటెనెగ్రో ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

పౌరసత్వం కష్టం
మాంటెనెగ్రోలో లభించే సాదర స్వాగతం ప్రతీసారి మంచి జీవన ప్రమాణాన్ని అందించదు. తీర ప్రాంతాలలో వలసదారులకు అనేక ఉద్యోగాలు ఉన్నప్పటికీ, కాలానుగుణంగా ఉంటాయి, జీతాలు కూడా తక్కువే. ఇక్కడ మెరుగైన, వృత్తిపరమైన ఉద్యోగాలు దొరకడం కష్టం. కొంతమంది ఇంటి నుంచి పని చేయగలుగుతున్నారు.
మరొక సవాలు ఏమిటంటే, ఇక్కడ పౌరసత్వం పొందడం చాలా కష్టం. మాంటెనెగ్రోలో చాలా సంవత్సరాలుగా రష్యన్ ఉనికి బలంగా ఉంది. రష్యన్లతో పాటు యుక్రెనియిన్లకు కూడా మాంటెనెగ్రోలో ఆస్తి లేదా కుటుంబ సంబంధాలున్నాయి, చాలామంది యాదృచ్ఛికంగా ఇక్కడకే చేరుకున్నారు.

ప్రిస్టానిస్ట్ చేయూత
శరణార్థులకు సహాయం చేయడానికి లాభాపేక్ష లేని ఆశ్రయం ‘ప్రిస్టానిస్ట్’ను ఏర్పాటు చేశారు. ఇది బుద్వాలో ఉంది, కష్టాలతో వచ్చిన కొత్తవారికి సురక్షితమైన స్థలాన్ని, వారు స్థిరపడటానికి ప్రిస్టానిస్ట్ రెండు వారాల పాటు నివాసాన్ని అందిస్తుంది. డాక్యుమెంట్స్, ఉద్యోగాలను పొందడం, ఇంటి కోసం వెతకడంలో సహాయం చేస్తుంది. యుక్రెనియిన్లకు యుద్ధం నుంచి విరామంగా రెండు వారాల పాటు ఇక్కడకు రావడానికి అనుమతి ఉంది.
వాలెంటినా ఓస్ట్రోగ్లియాడ్ (60) ఆగ్నేయ యుక్రెయిన్‌లోని జపోరిజ్జియా నుంచి ఏడాది క్రితం తన కుమార్తెతో మాంటెనెగ్రోకు వచ్చారు. జపోరిజ్జియా చాలాసార్లు రష్యన్ దాడులకు గురైంది. ఇప్పుడు, వాలెంటినా ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్నారు. తన కొత్త దేశాన్ని ఆమె ఆస్వాదిస్తున్నారు. అక్కడి ప్రజలు చాలా దయతో ఉన్నారని వాలెంటినా అన్నారు.
ఖార్కివ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన సాషా బోర్కోవ్ తన భార్య, 4-16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆరుగురు పిల్లల నుంచి దూరమయ్యారు. వారు ఆగస్టు చివరిలోనే యుక్రెయిన్ నుంచి బయటికి వచ్చేశారు.
బోర్కోవ్ అంతకుముందు అక్రమ వలసదారులను రవాణా చేసినందుకు హంగేరిలో జైలుకు వెళ్లారు. బోర్కోవ్‌పై ఈయూ నిషేధం విధించడంతో పోలాండ్ సరిహద్దులో ఆపారు. అయితే, ఆయన కుటుంబాన్ని జర్మనీకి వెళ్లడానికి అనుమతించారు. బోర్కోవ్ ఐరోపా చుట్టూ ప్రయాణించిన తర్వాత, చివరకు మాంటెనెగ్రో రావడానికి అనుమతి దక్కింది.
"మీరు ప్రతిరోజూ ఇళ్లు ధ్వంసమవడం, ప్రజలను చంపేయడం చూసినప్పుడు, విన్నప్పుడు అక్కడి పరిస్థితిని వివరించడం కష్టం" అని బోర్కోవ్ తన దేశ పరిస్థితి గురించి చెప్పారు.
"మా ఫ్లాట్ దెబ్బతినలేదు, కానీ కిటికీలు విరిగిపోతూనే ఉన్నాయి, బాంబులు దగ్గరగా పడుతున్నాయి" అని బోర్కోవ్ అన్నారు.
" ప్రిస్టానిస్ట్ కేంద్రంలోకి నన్నుతీసుకువెళ్లారు. నాకు ఆహారం, పానీయం, ఉండటానికి స్థలాన్ని ఇచ్చారు. నేను విశ్రాంతి తీసుకున్నాను, తర్వాత పని కోసం వెతికాను" అని ఆయన చెప్పారు.
బోర్కోవ్ ఇప్పటికే ఉద్యోగం సంపాదించారు, ఆయన కుటుంబం త్వరలో కలుస్తుందని భావిస్తున్నారు. తాత్కాలిక రక్షణకు యుక్రెయిన్ శరణార్థి కేంద్రంలో బోర్కోవ్ దరఖాస్తు చేస్తున్నారు.

రష్యన్, యుక్రెయిన్ జంట పెళ్లి
యులియా మాట్సుయ్ యుక్రెయిన్ పిల్లల కోసం బుద్వాలో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ పిల్లలు చరిత్ర, ఇంగ్లీష్, గణితం, కళలలో పాఠాలు నేర్చుకోవచ్చు. లేదా డ్యాన్స్, పాడటం, సినిమాలు చూడవచ్చు.
ఈ రెండు స్వచ్ఛంద సంస్థలలో రష్యన్ వలంటీర్లున్నారు. ఇవి మాంటెనెగ్రోలో రష్యన్, యుక్రెయిన్ కమ్యూనిటీల మధ్య మంచి సంబంధాలను ఏర్పరచడంలో సహాయపడ్డాయి.
ఇక్కడ వలంటీర్లు, నివాసితుల మధ్య స్నేహం పెరిగింది. ప్రిస్టానిస్ట్‌లో నివసించిన ఒక రష్యన్-యుక్రెయిన్ జంట ఇటీవల వివాహం చేసుకున్నారు.
యుక్రెయిన్ నటులు విక్టర్ కోషెల్, కటారినా సించిల్లో రష్యన్ సంగీతకారుడు మిఖాయిల్ బోర్జికిన్‌తో కలిసి పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Ruslan Sukhushin/Facebook
జర్మనీలా కాకూడదు: బోర్జికిన్
మాంటెనెగ్రోలో కొంతమంది వలసదారుల భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. కఠినమైన పౌరసత్వ చట్టాల వల్ల వారిలో చాలామంది శాశ్వతంగా అక్కడ ఉండలేరు. యుద్ధం ముగిసిపోతే ఇంటికి తిరిగి వెళ్లడానికి యుక్రెనియిన్లు ఆసక్తి చూపుతున్నారు, వారి ఇళ్లు ఇంకా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"ప్రస్తుతం, మా జీవితాలకు పెద్ద ముప్పు ఉంది, కానీ యుద్ధం ముగిస్తే, మేం ఇంటికి వెళ్తాం" అని సాషా బోర్కోవ్ చెప్పారు. "ఇంటి కంటే మెరుగైన ప్రదేశం లేదు." అని ఆయన అన్నారు.
అయితే, పరిస్థితి మారడానికి చాలా సమయం పడుతుందని రష్యన్లు అంటున్నారు.
ఇంటికి తిరిగి వెళ్లడానికి తొందరపడటం లేదని రష్యాలోని పెట్రోజావోడ్స్క్ నుంచి వచ్చిన నటల్య సెవెట్స్-యెర్మోలినా చెప్పారు.
"నా సమస్య ఏమిటంటే, నన్ను హింసించింది పుతిన్ కాదు, అదే నగరంలో నివసించిన ప్రజలు" అని ఆమె అన్నారు.
"పుతిన్ చాలా దూరంగా ఉన్నారు, కానీ పుతిన్ మరణించినా కూడా, ఆయన ఆదేశాలను అనుసరించే వారు అక్కడే ఉంటారు" అని నటల్య అన్నారు.
మార్పుకు దశాబ్దాలు పట్టవచ్చు అందుకే, త్వరగా తిరిగి వెళ్లే అవకాశం లేదని రష్యన్ సంగీతకారుడు బోర్జికిన్ చెప్పారు.
"కొత్త తరం ఎదగడానికి జర్మనీకి (నాజీల తర్వాత) 30 సంవత్సరాలు పట్టింది. మాకు కూడా అంత సమయం పడుతుందేమోనని భయపడుతున్నా" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














