రెండు కాళ్లు కోల్పోయినా వెనుకడుగు వేయలేదు, ఇప్పుడు ఆ దేశంలో ‘మోస్ట్ వాంటెడ్’ బ్యాచిలర్

ఫొటో సోర్స్, Warner/STB Channel
- రచయిత, డయానా కురిష్కో
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌కు చెందిన 26 ఏళ్ల ఒలెక్సాండర్ బుడ్కో సైన్యంలో విధుల్లో ఉండగా ఆయన సమీపంలో బాంబు పేలింది. దీంతో ఆయన రెండు కాళ్లు తెగిపోయాయి.
2022 ఆగస్టులో ఈశాన్య ఖార్కివ్ ప్రాంతాన్ని రష్యన్ దళాల నుంచి రక్షించే క్రమంలో ఆయన తన రెండు కాళ్లను పోగొట్టుకున్నారు.
అక్కడికి రెండేళ్ల తర్వాత ఒలెక్సాండర్ రియాలిటీ టీవీ షో స్టార్ అయ్యారు. ఇప్పుడు ఆయన ప్రేమ కోసం చాలామంది మహిళలు పోటీ పడుతున్నారు.
ఈ రియాలిటీ షో ప్రసిద్ధ అమెరికా సిరీస్ ‘ది బ్యాచిలర్’కు యుక్రెయిన్ వెర్షన్.
ఈ షోకు సంబంధించిన ప్రకటనలో ఆయన ఒక పువ్వు వైపు చూస్తున్నట్లు చూపించారు. మరొక ప్రకటనలో మిలటరీ యూనిఫాంలో ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కనిపిస్తారు.
కీయెవ్‌లోని గులాబీ తోటలో ఒలెక్సాండర్‌తో మాట్లాడాను. అంత బిజీగా ఉన్నప్పటికీ ఉత్సాహంతో కనిపించారు.
గత జనవరిలో తన గర్ల్‌ఫ్రెండ్‌తో విడిపోయానని ఒలెక్సాండర్ తెలిపారు. రియాలిటీ షోలో ప్రేమను పొందాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
‘ఈ షోను లక్షలాది మంది చూస్తున్నారు.. భాగస్వామిని ఎంచుకోవడం కష్టమే’ అని ఆయన అభిప్రాయపడ్డారు.


‘షోలో పాల్గొనడానికి ఇంకో కారణం ఉంది’
ఈ షోలో కనిపించడానికి ప్రేమ ఒక్కటే కారణం కాదని.. డిజేబుల్డ్ యుక్రేనియన్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన పెంచాలనుకోవడం కూడా ఒక కారణమని ఒలెక్సాండర్ చెప్పారు.
"ఈ షోను లక్షలాది మంది వీక్షిస్తారు, వారి ఆలోచనలు పాజిటివ్‌గా మార్చడానికి ఇది నాకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Warner/STB Channel
ఒలెక్సాండర్ నేపథ్యం ఏమిటి?
నిజానికి, తన జీవితం యుద్ధం ముందు కంటే ఇప్పుడు బాగుందని ఒలెక్సాండర్ అంటున్నారు. ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారు. ముందురోజు రాత్రి ఒక మ్యూజిక్ వీడియో చిత్రీకరణలో పాల్గొన్నానని ఒలెక్సాండర్ చెప్పారు. ఒకప్పుడు, ఆయన జీవితం ఇలా ఉండేది కాదు.
రష్యాతో యుద్ధానికి ముందు ఒలెక్సాండర్ గ్రాఫిక్ డిజైన్ కోర్సు చదువుతుండేవారు. కీయెవ్ రెస్టారెంట్‌లో బారిస్టా(సర్వర్)గా పని చేస్తుండేవారు.
అప్పటికి ఒలెక్సాండర్ కలలు చాలా సింపుల్.. ప్రయాణించడం, ప్రపంచాన్ని అన్వేషించడం, కెరీర్‌లో ఎదగడం, ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవడం.. ఇలాంటివే ఆయన కోరుకున్నారు. కానీ రెండు సంవత్సరాల క్రితం సైన్యంలో చేరిన వేల మంది యుక్రెయిన్ పురుషులలో ఆయన కూడా ఒకరయ్యారు. ఆ తరువాత అంతా మారిపోయింది.
2022 ఆగస్టులో ఇజియం సమీపంలో ఒలెక్సాండర్ విధుల్లో ఉన్నారు, యుద్ధం ప్రారంభంలోనే ఇజియంను రష్యా ఆక్రమించింది. రష్యా తూర్పు నుంచి తన దళాలను పంపడానికి కీలకమైన సైనిక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంది.

ఫొటో సోర్స్, EPA
‘నొప్పి కలిగిన రెండు మూడు సెకన్ల తరువాత నా కాళ్లను కోల్పోయినట్లు అర్థమైంది’
విధుల్లో ఒలెక్సాండర్ తీవ్రంగా గాయపడిన ఒక నెల తర్వాత ఇజియం నగరాన్ని రష్యా నుంచి యుక్రెయిన్ స్వాధీనం చేసుకుంది.
"భూమి నన్ను కప్పేసినట్లు అనిపించింది. నా కాళ్లలో భయంకరమైన నొప్పి అనిపించింది. అది కాలు తీసేయడానికి దారితీస్తుందని నాకు అర్థమైంది" అని ఒలెక్సాండర్ చెప్పారు.
"భయంకరమైన నొప్పితో అరిచాను, సహాయం కోసం అరిచాను" అని అన్నారు.
తోటి సైనికులు సజీవంగా ఉన్నారని తెలుసని ఒలెక్సాండర్ అన్నారు. వారు తనను మట్టిలో నుంచి బయటికి తీసి, ప్రథమ చికిత్స అందించారని తెలిపారు. అయితే కాళ్లకు ఎంత పెద్ద గాయమైందో అప్పుడే అర్థమైందని ఒలెక్సాండర్ చెప్పారు.
"నొప్పి కలిగిన రెండు మూడు సెకన్ల తర్వాత, నా కాళ్లను కోల్పోయినట్లు నాకు అర్థమైంది" అని ఒలెక్సాండర్ చెప్పారు.
ఒలెక్సాండర్ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ ఇజియం చాలావరకు శిథిలమైపోయింది.
ఆ సమయంలో నగరం సమీపంలోని సమాధుల వద్ద 400కు పైగా మృతదేహాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
‘బయట తిరగడం సులభం కాదు’
ఒలెక్సాండర్ ఆరు నెలల్లోనే కృత్రిమ కాళ్లతో నడవగలిగారు.
“నాకు ప్రోస్తటిక్స్ లేకపోవడంతో వీల్ చెయిర్ ఉపయోగించాల్సి వచ్చింది. రాజధాని నగరం అయినప్పటికీ, వీల్ చెయిర్‌లో కీయెవ్‌లో తిరగడం ఎంత కష్టమో నాకు అర్థమైంది” అని ఒలెక్సాండర్ గుర్తు చేసుకున్నారు.
“ఒంటరిగా రహదారిని దాటలేరు, ప్రతిచోటా మెట్లు ఉన్నందున చాలా భవనాల్లోకి వీల్ చెయిర్‌తో వెళ్లలేరు’ అని ఒలెక్సాండర్ అన్నారు.
యుద్ధంలో గాయపడిన వారి సంఖ్యపై అధికారిక సమాచారం లేనప్పటికీ, వేలాది మంది అవయవాలను కోల్పోయినట్లు అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
రియాలిటీ షో
ఇది ‘లెగ్స్ ఆఫ్’ అనే రియాలిటీ షోను రూపొందించేలా చేసింది. దీనికి ఒలెక్సాండర్ హోస్ట్.
యుక్రెయిన్ నగరాలలో తిరిగేటప్పుడు వికలాంగులు ఎదుర్కొనే సవాళ్లను ఈ ‘షో’ హైలైట్ చేస్తుంది.
ఒలెక్సాండర్ షో హోస్ట్ చేస్తూనే, ఒక పుస్తకాన్ని రాశారు. ‘ఇన్విక్టస్ గేమ్స్’లో ఆయన పతకాలు సాధించారు.
అమెరికాలో డ్యాన్స్ బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. అన్నీ గాయాల నుంచి కోలుకునే సమయంలోనే ఆయన చేశారు.
ఒలెక్సాండర్ యుక్రెయిన్‌లో బాగా ప్రాచుర్యం పొందారు.
యుక్రెయిన్‌లో ‘ది బ్యాచిలర్’ షోలో ఆయనదే ప్రధాన పాత్ర అని ప్రకటించిన కొద్దిసేపటికే ‘ది బ్యాచిలర్’ అప్లికేషన్ పోర్టల్ క్రాష్ అయింది.
‘కాళ్లు లేనప్పటికీ ఒలెక్సాండర్ బైక్, కారు నడుపుతారు. పర్వతాలను అధిరోహిస్తారు. జీవితాన్ని సంపూర్ణంగా గడుపుతారు’ అని ఎస్టీబీకి చెందిన నటాలియా ఫ్రాంచుక్ చెప్పారు. ఎస్టీబీ అనేది యుక్రెయిన్ టెలివిజన్ నెట్‌వర్క్. ఇది ‘ది బ్యాచిలర్’ షో టెలికాస్ట్ చేయనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














