జాన్ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్: ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి వీరికే

ఫొటో సోర్స్, NiklasElmehed/TheNobelPrize/X
భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించారు.
ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌తో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు గాను జాన్.జె.హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు ఈ పురస్కారం లభించింది.
ఈ మేరకు ‘ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ ఈ అవార్డ్ ప్రకటించింది.
హింటన్‌ను ‘గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ’ అని కూడా పిలుస్తారు.


ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత కాలంలోని శక్తిమంతమైన మెషిన్ లెర్నింగ్‌కు పునాదులుగా ఉన్న పద్ధతులను అభివృద్ధి చేయడానికి భౌతికశాస్త్ర సాధనాలను ఉపయోగించినందుకు వీరికి ఈ పురస్కారం లభించింది.
విజేతల్లో ఒకరైన జాన్ హాప్‌ఫీల్డ్ ఇమేజెస్, ఇతర ప్యాటర్న్స్‌ను నిల్వ చేయగల, పునర్నిర్మించగల సామర్థ్యం ఉన్న ఒక అసోసియేటివ్ మెమొరీని సృష్టించారు.
డేటాలోని లక్షణాలను సొంతంగా గుర్తించగల, కనుగొనగల ఒక పద్ధతిని జెఫ్రీ హింటన్ కనుగొన్నారు. ఏదైనా చిత్రంలో నిర్దిష్టమైన అంశాలను గుర్తించే విధానాలను ఆయన డెవలప్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నోబెల్ బహుమతికి ఎంపికైన ఈ ఇద్దరు శాస్త్రవేత్తల కృషి చాలా ప్రయోజనకర ఫలితాలను అందిస్తుందని, భౌతికశాస్త్రంలో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్స్‌ను అనేక రకాలుగా ఉపయోగిస్తారని ఫిజిక్స్ నోబెల్ కమిటీ హెడ్ ఎలెన్ మూన్స్ చెప్పారు.
నిర్దిష్ట లక్షణాలుండే కొత్త పదార్థాలను అభివృద్ధి చేయడానికి వీరి పరిశోధనలు తోడ్పడతాయని ఎలెన్ చెప్పారు.
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ అవార్డును అందిస్తారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ చనిపోగా, ఆ తరువాత అయిదేళ్లకు అంటే 1901లో తొలిసారి నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు.
వివిధ రంగాలలో నోబెల్ బహుమతి పొందిన విజేతలకు ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు అందిస్తారు.
నోబెల్ బహుమతి విజేతలకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్‌లు లభిస్తాయి. అంటే భారత కరెన్సీలో సుమారు 8 కోట్ల 90 లక్షల రూపాయలు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














