ఉద్యోగానికి చేసిన దరఖాస్తు 48 ఏళ్ల తరువాత తిరిగొచ్చింది

- రచయిత, జేక్ జకర్‌మన్
- హోదా, బీబీసీ న్యూస్
తనకు ఎంతో ఇష్టమైన ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కనీసం సమాధానం కూడా రాలేదేంటని 48 ఏళ్లుగా ఆశ్చర్యపోతున్న ఆ మహిళకు ఎట్టకేలకు సమాధానం దొరికింది.
70 ఏళ్ల టిజి హోడ్‌సన్ లింకన్‌షైర్‌లోని గెడనిహిల్‌కు చెందినవారు. ఆమె 48 ఏళ్ల కిందట ఓ ఉద్యోగానికి చేసిన దరఖాస్తు తిరిగి తనవద్దకే రావడాన్ని చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయారు.
ఆమె 1976లో మోటారు సైకిల్ స్టంట్ రైడర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. కానీ ఆ కవరు పోస్టాఫీసులోని ఓ సొరుగు వెనుక పడిపోయింది. దీంతో ఆమెకు సంబంధిత కంపెనీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
ఈ ఉద్యోగం రాకపోయినా హోడ్‌సన్ ప్రపంచమంతా చుట్టివచ్చే ఓ సాహసోపేతమైన ఉద్యోగాన్ని పొందారు.
ఇక మోటారు సైకిల్ స్టంట్ రైడర్ ఉద్యోగానికి పంపిన దరఖాస్తు తిరిగి తన వద్దకే రావడాన్ని ఓ అద్భుతం అంటారు హోడ్‌సన్.
‘‘ఆ ఉద్యోగం గురించి నాకు ఏ బదులు ఎందుకు రాలేదా అని ఇన్ని రోజులు ఆశ్చర్యపోయేదాన్ని. దానికి కారణం ఇప్పుడు తెలిసింది" అని హోడ్‌సన్ అన్నారు.


ఫొటో సోర్స్, submitted
లేట్ డెలివరీ
హోడ్‌సన్‌కు తిరిగివచ్చిన లెటర్‌పైన ‘లేట్ డెలివరీ బై స్టెయిన్స్ పోస్ట్ ఆఫీస్. ఓ సొరుగు వెనుక కనిపించింది. కేవలం 50 ఏళ్లుమాత్రమే ఆలస్యమైంది’’ అని చేత్తో రాసిన నోట్ ఉంది.
ఆ లెటర్ ఎవరు తిప్పి పంపారో హోడ్‌సన్‌కు తెలియదు.
"ఇన్నేళ్లలో నేను దాదాపు 50 ఇళ్లు మారి ఉంటాను, మూడు నాలుగు దేశాలు కూడా మారాను, అయినా సరే వాళ్లు నా ఆచూకీని కనుక్కోగలడం మిస్టరీ" అని ఆమె అన్నారు.
"లండన్‌లోని నా ఫ్లాట్‌లో కూర్చొని ఈ లెటర్ రాస్తున్న దృశ్యం నాకు ఇంకా గుర్తుంది. ఆ లెటర్ పంపిన తరువాత ప్రతీరోజూ జవాబు కోసం ఎదురుచూసేదాన్ని. కానీ ఏ సమాధానం రాకపోవడంతో చాలా బాధపడ్డాను. మోటారు సైకిల్ స్టంట్ రైడర్ కావాలని చాలా బలంగా కోరుకున్నా’’ అని హోడ్‌సన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Submitted

కలలన్నీ నెరవేర్చుకున్న హోడ్‌సన్
తనకు ఎంతో ఇష్టమైన ఉద్యోగం గురించి ఎటువంటి సమాచారం రాకపోయినా హోడ్‌సన్అక్కడే ఆగిపోలేదు. మరికొన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నించారు.
ఆమె ఆఫ్రికా వెళ్లారు. అక్కడ స్నేక్ హ్యాండ్లర్‌గా, హార్స్‌విస్పరర్‌గా పని చేశారు.
విమానం నడపడం నేర్చుకున్న హోడ్‌సన్, ఏరోబాటిక్ పైలట్‌గా, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేశారు.
"స్టంట్ రైడర్ పోస్టు కోసం ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వాళ్లకి నేను ఒక అమ్మాయిననే విషయం తెలియకుండా ఉండటానికి ఆ లెటర్‌లో చాలా జాగ్రత్తలు పాటించాను. నేను అమ్మాయినని తెలిస్తే వాళ్లు నన్ను ఇంటర్వ్యూకి పిలవరేమోనని భావించాను’’ అని తాను పంపిన ఆ లెటర్‌వైపు చూస్తూ హోడ్‌సన్ చెప్పారు.
స్టంట్ రైడర్‌గా చేసేటప్పుడు ఎన్ని ఎముకలు విరిగినా పట్టించుకోనని ఆ లెటర్‌లో అమాయకంగా రాశాను అని చెప్పారు హోడ్‌సన్.
‘‘ఇవన్నీ జరిగిన తర్వాత, ఇంత కాలం అయ్యాక ఆ లెటర్ తిరిగి నాదగ్గరకే రావడం నమ్మశక్యంగా లేదు’’ అంటారు హోడ్‌సన్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














