జమ్మూకశ్మీర్‌లో ఫారూక్ అబ్దుల్లా పార్టీ ఎలా గెలిచింది? కాంగ్రెస్ 6 సీట్లకే ఎందుకు పరిమితమైంది
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ఫారూక్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చాలా ఏళ్ల తర్వాత ప్రజల విశ్వాసాన్ని చూరగొందని జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.
మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)ని ప్రజలు ఈ ఎన్నికలలో తిరస్కరించారు.
మరోవైపు, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ జమ్మూ ప్రాంతం దాటి తన పరిధిని విస్తరించలేకపోయింది. కాంగ్రెస్ 6 సీట్లకే పరిమితమైంది.
జమ్మూ కశ్మీర్‌లోని 90 అసెంబ్లీ సీట్లలో సగానికి పైగా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి.


ఫొటో సోర్స్, ANI
పదేళ్ల తర్వాత ఎన్నికలు
ఆర్టికల్ 370 రద్దు.. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తీసేసిన తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఈసారి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
ఇంతకుముందు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది.
గతంలో 29 సీట్లు గెలుచుకున్న పీడీపీ, ఇపుడు కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. గతంలో 30 స్థానాలు గెలుచుకున్న భాజపా ఆ సంఖ్యకు దగ్గరగా వచ్చింది.
కశ్మీర్ లోయ ఓటర్లు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఏకపక్షంగా ఓటు వేసినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి.
జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో సగటున 63 శాతం ఓట్లు పోలయ్యాయి. తొలి దశలో 61 శాతం ఓటింగ్ నమోదు కాగా, రెండో దశలో 57.3 శాతం, మూడో దశలో 68.72 శాతం నమోదైంది.
లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని మొత్తం ఐదు స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ రెండు స్థానాలను గెలుచుకోగా.. ఒమర్ అబ్దుల్లా బారాముల్లా స్థానంలో ఇంజనీర్ రషీద్ చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. జమ్మూ ప్రాంతంలోని రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ విజయం సాధించారు.

ఫొటో సోర్స్, ANI
జమ్మూ, కశ్మీర్ లోయలో విభజన
జమ్మూలోని హిందువుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి.. కశ్మీర్ లోయలోని ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి ఎక్కువ ఓట్లు పడ్డాయని ఫలితాలు సూచిస్తున్నాయి.
ఈ ఫలితాల్లో ప్రాంతం, మత ప్రాతిపదికన ఓట్ల విభజన స్పష్టంగా కనిపిస్తోంది.
జమ్మూలోని సాంబా, ఉధంపూర్, కథువా వంటి హిందూ మెజారిటీ జిల్లాల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
ఈ జిల్లాల్లో బీజేపీ తన జాతీయ నాయకులతో ప్రచారం నిర్వహించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ నాలుగు ర్యాలీలు, హోంమంత్రి అమిత్ షా పద్నాలుగు ర్యాలీలు నిర్వహించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారం చేశారు.
ముస్లిం జనాభా అధికంగా ఉన్న జమ్మూలోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లో బీజేపీ ముస్లిం అభ్యర్థులను నిలబెట్టినా ఫలితం లేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్టికల్ 370 రద్దు ప్రభావం ఉందా?
"ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో హిందూ ఓటు బ్యాంకు తమతోనే ఉంటుందని, అక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెడితే ముస్లిం ఓట్లు కూడా పడతాయని భావించి బీజేపీ ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చింది, కానీ ఫలితం మరోలా ఉంది. బీజేపీని ముస్లిం ఓటర్లు తిరస్కరించారు’’ అని సీనియర్ జర్నలిస్ట్ తారిఖ్ భట్ అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉద్యోగాలు, భూమి యాజమాన్య హక్కుల గురించి అక్కడి ఓటర్లలో భయం, ఆందోళనలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాదు, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం పోరాడతామని నేషనల్ కాన్ఫరెన్స్ హామీ కూడా ఇచ్చింది.
“370 తర్వాత జమ్మూ కశ్మీర్‌లో మార్పులు జరిగాయి. ఆ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా నేషనల్ కాన్ఫరెన్స్ బలంగా పోరాడింది. మరోవైపు, పీడీపీకి చెందిన చాలామంది నాయకులు పార్టీని వీడారు, ఆ పార్టీ కూడా దెబ్బతింది’’ అని తారిఖ్ అన్నారు.
తారిఖ్ మాట్లాడుతూ "లోక్‌సభ ఎన్నికల సమయంలో కశ్మీర్ ఓటర్లు ఎటువైపు వెళ్తారనే దానిపై ఒక అంచనా ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక సమస్యలు కూడా పాత్ర పోషించాయి" అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఓటర్ల సందేశమిదే..
జమ్మూ కశ్మీర్ ఎన్నికలు ఎన్‌సీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే జరిగాయని విశ్లేషకులు చెప్తున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలు విద్యుత్, నీరు, రోడ్లు వంటి సమస్యల గురించి మాట్లాడినప్పటికీ.. చివరికి ఓటర్లకు అత్యంత ముఖ్యమైన అంశం ఆర్టికల్ 370 రద్దు అని అభిప్రాయపడ్డారు విశ్లేషకులు.
కశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 40కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ మాజిద్ జహంగీర్ అన్నారు.
‘‘గతంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఏవైనా పొరపాట్లు చేసినా వాటిని మరచిపోయి, గెలిపించాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది’’ అని జహంగీర్ అన్నారు.
2014 ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 16 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం ఆ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది.

ఫొటో సోర్స్, ANI
జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదు. సమీకరణాల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ అవసరం లేకపోయినా.. ప్రభుత్వంలో చేరాలనుకుంటే ఆ పార్టీని స్వాగతిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా చెప్పారు.
"పదేళ్ల తర్వాత, ప్రజలు మాకు మెజారిటీ ఇచ్చారు, మేం ప్రజల అంచనాలను నెరవేర్చాలనుకుంటున్నాం, వారి సమస్యలను పరిష్కరించడమే మా మొదటి పని" అని ఫలితాల అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫారూక్ అబ్దుల్లా అన్నారు.
“గెలుపు ఓటములు సహజం. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు సుస్థిర ప్రభుత్వాన్ని ఇస్తే, బీజేపీని దూరంగా ఉంచగలవని ప్రజలు భావించారు. అందుకే వారు నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టాన్ని గౌరవించాలి’’ అని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ ద్వారా కశ్మీర్ ప్రజలు తమ మౌనాన్ని వీడారని విశ్లేషకులు భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














