డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రచారం ఎలా మొదలైంది? అసలు ఆ అవకాశం ఉందా?

తమిళనాడు, టీవీకే, స్టాలిన్, డీఎంకే, ఏఐఏడీఎంకే
    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకున్నప్పటికీ సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది.

234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. ఇందులో విజయ్ రెండు స్థానాల్లో గెలిచారు కాబట్టి నికరంగా 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మెజారిటీ కంటే 11 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో డీఎంకే, ఏఐఏడీఎంకే(అన్నా డీఎంకే) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని బుధవారం(మే 6) ప్రచారం జరిగింది. డీఎంకే వర్గం వెంటనే ఈ ప్రచారాన్ని ఖండించింది.

అదేసమయంలో ''ఏది జరిగినా, ఎడప్పాడి పళనిస్వామి ఒక మంచి, దూరదృష్టి ఉన్న నిర్ణయం తీసుకుంటారు. పళనిస్వామి 'కింగ్‌మేకర్' కాదు, ఆయనే కింగ్'' అని ఏఐఏడీఎంకే నాయకుడు సెమ్మలై విలేకరులతో అన్నారు.

రాజకీయ సిద్ధాంతాలపరంగా భిన్న ధ్రువాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రచారం నిజమైన రాజకీయ ప్రయత్నాల వల్ల వచ్చిందా లేక ఊహాగానమా లేక కావాలనే వదంతి వ్యాపింపజేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొంతమంది జర్నలిస్టులు మాత్రం అలాంటి ప్రయత్నం నిజంగానే జరిగిందని చెబుతున్నారు.

కానీ డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు ఈ వార్తలను స్పష్టంగా ఖండించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడు, టీవీకే, స్టాలిన్, డీఎంకే, ఏఐఏడీఎంకే

ఫొటో సోర్స్, @TVKPartyHQ/X

ఫొటో క్యాప్షన్, టీవీకే అధినేత విజయ్

సోషల్ మీడియాలో చర్చ

108 స్థానాల్లో గెలిచిన టీవీకేకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే పార్టీలు తమ నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో డీఎంకే మద్దతుతో ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఏర్పడబోతోందనే వార్త టీవీ చానళ్లు, సోషల్ మీడియా, ఉత్తర భారత మీడియాలో కూడా వ్యాపించి చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడు సీనియర్ జర్నలిస్ట్ ఆర్.కె. రాధాకృష్ణన్ "ఇలా చేయొద్దు" అంటూ రూపొందించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆయన డీఎంకే-ఏఐఏడీఎంకే పొత్తు గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన దాని గురించే మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది.

తమిళనాడు, టీవీకే, స్టాలిన్, డీఎంకే, ఏఐఏడీఎంకే
ఫొటో క్యాప్షన్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కే రాధాక్రిష్ణన్

డీఎంకే ఖండన

ఈ ప్రచారం జరిగిన కొన్ని గంటల్లోనే డీఎంకే స్పందించింది.

"కాంగ్రెస్ ద్రోహం చేసినప్పటికీ, డీఎంకే సమర్థమైన ప్రతిపక్షంగా పనిచేయాలని నిర్ణయించుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకోవడానికి ఏఐఏడీఎంకేపై బీజేపీ ఒత్తిడి తెస్తోంది. ఇది ప్రజా తీర్పును అవమానపరచడమే. ప్రజాస్వామ్యం గెలుస్తుందని నమ్ముతున్నాను" అని డీఎంకే ఎంపీ కళానిధి వీరాస్వామి తన ఫేస్‌బుక్ పేజీలో రాశారు.

"విజయ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి. ఆరు నెలలపాటు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా మేం పరిస్థితిని సమీక్షిస్తాం. రాజ్యాంగ సంక్షోభాన్ని గానీ, మరో ఎన్నికలను గానీ డీఎంకే కోరుకోవడం లేదు. కొత్త ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని, మహిళల హక్కుల కోసం వెయ్యి రూపాయల పథకాన్ని కొనసాగించాలి" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ అన్నారు.

ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు సెమ్మలై మరోలా స్పందించారు.

"ఎడప్పాడి పళనిస్వామి ఒక మంచి, దూరదృష్టిగల నిర్ణయం తీసుకుంటారు. పళనిస్వామి 'కింగ్‌మేకర్' కాదు, ఆయనే 'కింగ్' అని సెమ్మలై వ్యాఖ్యానించారు.

ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ "ఇలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేసే సీనియర్ జర్నలిస్టులనే ఈ ప్రశ్న అడగాలి. డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి పనిచేసే అవకాశం కొంచెమైనా ఉందా అని ఆలోచిస్తే ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారు కాదు. అబద్ధాలు ఎక్కువ కాలం నిలవవని ఒక్క రోజులోనే స్పష్టమైంది. నిజం చెప్పాలంటే ఇలాంటి సమాచారంపై వ్యాఖ్యానించడం మన ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తున్నా" అని విమర్శించారు.

తమిళనాడు, టీవీకే, స్టాలిన్, డీఎంకే, ఏఐఏడీఎంకే

ఫొటో సోర్స్, mkstalin/X

డీఎంకే ఆరోపణలు

‘‘కొంతమంది జర్నలిస్టులు నైతికత లేకుండా వ్యవహరిస్తున్నారనేదానికి ఈ ప్రచారమే ఉదాహరణ" అని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై అన్నారు.

ఏ జర్నలిస్ట్, ఎవరి ప్రేరేపణతో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించారో 'నిజమైన మీడియా' మాత్రమే కనుక్కోవాలని శరవణన్ అన్నాదురై అన్నారు.

ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రచారం జరిగిందని ఆరోపించారు. కొలత్తూర్ నియోజకవర్గంలో స్టాలిన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, దాన్నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రచారం జరిగిందని ఆరోపించారు.

తమిళనాడు, టీవీకే, స్టాలిన్, డీఎంకే, ఏఐఏడీఎంకే

ఫొటో సోర్స్, Social Media

ఫొటో క్యాప్షన్, ఏఐఏడీఎంకే ప్రతినిధి కోవై సథ్యన్

జర్నలిస్టులు గందరగోళం సృష్టిస్తున్నారా?

ఈ సమాచారాన్ని ఎవరు ప్రచారం చేసినా...మీడియా దానిని పట్టించుకోకుండా ఉండాల్సిందని, దీనివల్ల ఇతర విషయాల నుంచి దృష్టి మరలదని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి బాబు మురుగవేల్ అన్నారు.

"ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. కానీ, డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి విభిన్న భావజాలాలున్న రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఆలోచనను మీడియా ఇంత సులువుగా ఎలా స్వీకరించిందో నాకు అర్థం కావడం లేదు" అని బాబు మురుగవేల్ బీబీసీ తమిళ్‌తో అన్నారు.

''ఒకవేళ అలా జరిగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు డీఎంకే, ఏఐఏడీఎంకే రెండింటినీ ఓడించి, టీవీకేకు భారీ మెజారిటీ కట్టబెడతారు. దీనివల్ల రెండు పార్టీలకూ భారీ నష్టం కలుగుతుంది. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు'' అని ఆయనన్నారు.

"తమిళనాడు రాజకీయాల్లో ఎన్ని గెలుపోటములు ఉన్నప్పటికీ డీఎంకే లేదా ఏఐఏడీఎంకే ఇలాంటి ప్రయత్నం చేసే అవకాశం చాలా తక్కువ'' అని ద్రవిడ ఉద్యమ విశ్లేషకులు దురై కరుణ అన్నారు.

"కొంతమంది జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు నిరాధారమైన విషయాలు వ్యాప్తి చేస్తున్నారు. తమిళ మీడియా రంగంలో దీనిని నివారించాలి" అన్నారు.

''ఈ సమాచారంలో కొంత భాగం రాజకీయ పార్టీల మీడియా పరిచయాల ద్వారా జర్నలిస్టులకు చేరుతోందన్నది కూడా వాస్తవం. సమాచారం ఎక్కడి నుంచి వచ్చినా సరే బ్రేకింగ్ న్యూస్‌ను రిపోర్ట్ చేయడంలోనూ, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలోనూ జర్నలిస్టులు అత్యంత జాగ్రత్త వహించాలి" అని ఆయన అన్నారు.

"ఇది వదంతి లేదా ఊహాగానం కాదు. మాకున్న సమాచారం ప్రకారం ఇలా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇది నిజం. నేను సంకీర్ణ ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదు. ఇది జరగకూడదని మాత్రమే రాశాను. ఆ తర్వాత ఏం జరిగిందనే దాని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు" అని సీనియర్ జర్నలిస్ట్ ఆర్.కె. రాధాకృష్ణన్ బీబీసీ తమిళ్‌తో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.