జనసేన, టీవీకే: పవన్ కల్యాణ్ సాధించలేనిది విజయ్ సాధించగలిగారా? సోషల్ మీడియాలో ఇద్దరిని ఎందుకు పోల్చుతున్నారు

తమిళనాడు ఎన్నికలు, విజయ్, పవన్ కల్యాణ్, Vijay, Pawan kalyan

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బంగారం సినిమా ఆడియో ఫంక్షన్‌లో విజయ్, పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్‌ జోసెఫ్‌ చంద్రశేఖర్‌ ఈ స్థాయి విజయప్రస్థానం చాలామంది రాజకీయ విశ్లేషకులు ఊహించలేదు. అయితే, విజయ్‌ ఏ స్థాయిలో ప్రభావం చూపినా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌‌తో పోలిక ఉంటుందని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు అలాంటి చర్చే జరుగుతోంది.

విజయ్‌ అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణాది సినీనటుల రాజకీయ గెలుపు ప్రస్థానాల్లో నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన చేరుతూ సాధించిన విజయం, ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ప్రస్థానంపై చర్చకు తెరలేపింది.

మే 4న ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఏపీలో పవన్‌ కేంద్రంగా సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

సహజంగానే పవన్‌ రాజకీయ శైలిని విమర్శించే విపక్ష పార్టీల శ్రేణులు ఇప్పటికే పోలికలు తెస్తూ హోరెత్తిస్తుండగా.. రాజకీయాలపై ఆసక్తి, అవగాహన ఉన్న కొందరు సోమవారం నుంచి సోషల్‌ మీడియాలో విజయ్‌ గెలుపును పోలుస్తూ పవన్‌ పొలిటికల్‌ పిక్చర్‌ను విశ్లేషిస్తున్నారు.

ఇక పోలికలతో మీమ్స్ వగైరాలకైతే కొదువ లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, "ఏపీతో పోలిస్తే తమిళనాడులో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కొంత భిన్నం. ప్రజల ఆలోచనా విధానం కూడా వేరు. విజయ్‌ గెలుపును, ఏపీలో పవన్‌ రాజకీయాన్ని పోల్చిచూడలేం'' అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగేశ్వర్ బీబీసీతో అన్నారు.

"కానీ, చర్చ రాకుండా ఉండదు, సహజంగానే పొరుగు రాష్ట్రం.. ఇద్దరూ సినీనటులు కాబట్టి డిస్కషన్స్‌ రావొచ్చు. కానీ, తమిళనాట ప్రభావ అంశాలు వేరు, ఏపీలో పొలిటికల్‌ లెక్కలు వేరు. ఎక్కడి వాతావరణానికి అనుగుణంగానే అక్కడ నడుచుకోవాలి'' అన్నారాయన.

రాష్ట్రాల వారీగా రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ రాజకీయ లక్ష్య సాధనకు ఇద్దరూ ఎంచుకున్న మార్గాలు భిన్నంగా ఉన్నాయన్న వాదనలను కొందరు ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు.

సినీ కెరీర్‌ పరంగా విజయ్, పవన్‌లది సమస్థాయనే చెప్పాలి. 1990 తరువాత ఇద్దరూ హీరోలయ్యారు. తండ్రి, తల్లి సినీ నేపథ్యంతో హీరోగా పరిచయమైన విజయ్ తమిళనాట భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.

ఇటు చిరంజీవి తమ్ముడిగా రంగప్రవేశం చేసినప్పటికీ తర్వాతి కాలంలో సొంత ముద్రతో 'పవర్‌ స్టార్‌'గా పవన్‌ ఎదిగారు. విజయ్‌తో పోలిస్తే పవన్‌ స్టార్‌‌డమ్ తక్కువేం కాదు.

పవన్‌ నటించిన బంగారం సినిమా ఆడియో ఫంక్షన్‌లో విజయ్ స్వయంగా 'నేను పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌ని' అని మాట్లాడిన అప్పటి వీడియోలను ఇప్పుడు కొందరు పవన్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

తమిళనాడు ఎన్నికలు, విజయ్, పవన్ కల్యాణ్, Vijay, Pawan kalyan

ఫొటో సోర్స్, TVK

ఫొటో క్యాప్షన్, తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది.

15 ఏళ్లుగా విజయ్‌ గ్రౌండ్‌ వర్క్‌

రాజకీయాలకు వచ్చేసరికి విజయ్‌ కొన్నేళ్లుగా స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లారనే చెప్పాలి. విజయ్‌ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే)ను 2024 ఫిబ్రవరి 2న వేలాదిమంది అభిమానుల మధ్య ప్రకటించారు.

వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి రావాలని 15 ఏళ్ల కిందటే నిర్ణయించుకొని ఆ మేరకు గ్రౌండ్‌ సిద్ధం చేశారన్నది తమిళనాడులోని కొందరు రాజకీయ, సామాజిక వేత్తల విశ్లేషణ.

"2009లోనే తన అభిమాన సంఘాలను 'విజయ్‌ మక్కల్‌ ఇయక్కం' అనే సామాజిక సేవా సంస్థగా మార్చి, రాజకీయ పునాదులు వేశారు. ఆ సంస్థ ద్వారా జనాల్లోకి వెళ్లడం, విపత్తు సహాయ చర్యలు, రక్తదాన శిబిరాలతో తన ఫ్యాన్‌ బేస్‌ను ఒక క్రమబద్ధమైన సామాజిక, రాజకీయ శక్తిగా మార్చారు. అందుకే ఈ సంస్థ 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి 115 స్థానాల్లో విజయం సాధించింది. 2024లో పార్టీ పెట్టిన తర్వాత 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా రాజకీయం సాగించారు'' అని చెన్నైలోని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి బీబీసీతో అన్నారు.

"మధ్యలో కుటుంబపరంగా ఇబ్బందులు, రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా విజయ్‌ నిలకడగానే రాజకీయం చేశారు. ఓ స్పష్టమైన వైఖరితో తాను ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్‌గానే పోటీ చేస్తానని ప్రకటించి ఎన్నికల్లో నిలబడ్డారు. స్పష్టమైన పంథాతో విజయ్‌ తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారడానికి ఇంత కంటే ఏం చెప్పాలి'' అని సీనియర్‌ జర్నలిస్టు గాలి నాగరాజు బీబీసీతో చెప్పారు.

"ఎక్కడైనా రెండు బలమైన పార్టీలు ఉంటే మూడో పార్టీకి స్పేస్‌ ఉండదని అంటారు. అలాంటిది తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే బలమైన పార్టీలు ఉన్నప్పటికీ మూడో పార్టీని స్థాపించి విజయ్‌ రాజకీయ తెరపై హిట్టు కొట్టారు. కచ్చితంగా పొలిటికల్‌ స్పేస్‌ ఉంటుందని నిరూపించారు'' అన్నారాయన.

కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తమిళనాడు–తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి

'పవన్‌కు ఆ స్పష్టత లేదు'

"కానీ, పవన్‌ కల్యాణ్‌ రాజకీయానికి వచ్చేసరికి ఆ స్పష్టత కొరవడింది. తమిళనాడుతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు వేరు కావచ్చు.. సామాజిక లెక్కల ప్రభావం ఏపీలో ఎక్కువే కావొచ్చు. అందులో అనుమానం లేదు. కానీ, రాజకీయాల్లో లక్ష్యసాధన దిశగా విజయ్‌తో పోలిస్తే పవన్‌ వైఖరి పూర్తి భిన్నంగా ఉంది'' అని నాగరాజు అభిప్రాయపడ్డారు.

పవన్‌ కల్యాణ్‌ జనసేన స్థాపించి 12 ఏళ్లు అవ్వొచ్చు గానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 17 ఏళ్లు. 2009లో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పార్టీ ప్రచారం చేశారు.

ఆ ఎన్నికల్లో ప్రజరాజ్యం కేవలం 18 సీట్లలోనే గెలవడం, ఆ తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం వంటి పరిణామాలు జరిగాయి.

ఆ తర్వాత 2009 –14 మధ్య రాజకీయంగా స్తబ్దుగానే ఉన్న పవన్‌ కల్యాణ గబ్బర్‌ సింగ్, అత్తారింటికి దారేది సూపర్‌ హిట్‌ సినిమాల తర్వాత మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చారు.

2014 ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో జనసేన పార్టీని ప్రకటించారు. కొన్నిరోజుల తర్వాత, ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని, బీజేపీ, టీడీపీలకు మద్దతిస్తుందని ప్రకటించి ఆ అభ్యర్ధులకు ప్రచారం చేశారు.

తమిళనాడు ఎన్నికలు, విజయ్, పవన్ కల్యాణ్, Vijay, Pawan kalyan

ఫొటో సోర్స్, janasena/fb

బీజేపీ, టీడీపీలపై విమర్శలు

2019 ఎన్నికలకు ఏడాదిన్నరకు ముందు టీడీపీ, బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఆ రెండు పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీనిచ్చి విస్మరించిందంటూ బీజేపీని, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని టీడీపీని విమర్శిస్తూ.. 2019 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో పవన్‌ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోగా, పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కింది. ఆ గెలిచిన ఎమ్మెల్యే అనంతరం అప్పటి అధికార పార్టీ వైసీపీలో చేరారు. ఇక పార్టీ ఓడిపోయిన కొద్దిరోజులకే పవన్‌ మళ్లీ బీజేపీతో జత కట్టారు.

ఆ తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అప్పటి వైసీపీ సర్కారు జైల్లో పెట్టిన ఘటన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించి, ఎన్డీఏ కూటమిలో చేరారు.

మొత్తంగా ఆ ఎన్నికల్లో 21 సీట్లలో పోటీ చేసి అన్నింటా గెలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

తమిళనాడు ఎన్నికలు, విజయ్, పవన్ కల్యాణ్, Vijay, Pawan kalyan

ఫొటో సోర్స్, NaraChandrababuNaidu/Whatsapp Channel

ఫొటో క్యాప్షన్, చంద్రబాబును అప్పటి వైసీపీ సర్కారు జైల్లో పెట్టిన తర్వాత, 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించి, ఎన్డీఏ కూటమిలో చేరారు (ఫైల్ ఫోటో)

పవన్‌ రాజకీయ ప్రస్థానం చూస్తే, ఎక్కడా స్పష్టమైన వైఖరి అవలంబించలేదని అర్ధమవుతోందని గాలి నాగరాజు వ్యాఖ్యానించారు.

"భిన్న ధ్రువాలైన బీజేపీ నుంచి బీఎస్‌పీ, వామపక్షాల వరకు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేశారు. ఎక్కడా క్లారిటీ లేదు, పాతికేళ్ల రాజకీయం అంటారు కానీ ఎక్కడా పార్టీకి నిర్దిష్టమైన నిర్మాణం లేదు. ప్రణాళిక లేదు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య మూడో బలమైన పార్టీగా ఎదిగేందుకు స్పేస్‌ ఉన్నా ఆ స్పేస్‌ను పవన్‌ వాడుకోలేదు. కానీ, విజయ్‌ ఆ స్పేస్‌ను వాడుకున్నారు. అక్కడి పరిస్థితులు వేరు అని చెప్పుకున్నా.. జనం తమ కోసం నిలకడగా నిలబడే వారికోసం ఎప్పటికైనా నిలబడతారు. ఆ నిలకడే ఇక్కడ కొరవడుతోంది " అని నాగరాజు అన్నారు.

తమిళనాడు పరిస్థితులు వేరు: బొలిశెట్టి

ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల మధ్య భౌగోళిక, రాజకీయ వ్యత్యాసం చాలా ఉంటుందని జనసేన నుంచి ఇటీవలే బయటికొచ్చిన బొలిశెట్టి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

"తమిళనాడు రాజకీయం దశాబ్దాలుగా 'సినీ గ్లామర్‌' చుట్టూనే తిరుగుతోంది. ఎంజీఆర్‌ నుంచి జయలలిత వరకు అక్కడి ప్రజలు నటులను ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ఒక్కరే సీఎం అయ్యారు. ఆయన కూడా కేవలం సినీ గ్లామర్‌తోనే అధికారంలోకి రాలేదనే చెప్పాలి. ఆయన సామాజిక వర్గ బలం, అప్పటి పరిస్థితుల వల్లనే సీఎం కాగలిగారు. ఆ తర్వాత చిరంజీవి వచ్చినా నాటి పరిస్థితులు వేరు.. బలమైన ప్రాబల్యం కలిగిన వర్గాల నుంచి ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు విజయ్‌ ఒంటరిగా పోరాడి గెలిచారు, పవన్‌ పొత్తుల మీద ఆధారపడ్డారు అనడం సరికాదు. పవన్‌ 2019లో ఒంటరిగా పోటీ చేసిన అనుభవం నేర్పిన పాఠం 'ఓట్ల చీలికను నివారించడం'. ఏపీలో బలమైన కేడర్‌ ఉన్న ప్రధాన విపక్ష పార్టీని ఎదుర్కోవడానికి పొత్తు అనేది ఒక రాజకీయ అనివార్యం. విజయ్‌కి తమిళనాడులో డీఎంకె, అన్నాడీఎంకేలపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చి ఉండవచ్చు కానీ, ఆంధ్రాలో సమీకరణాలు మరింత క్లిష్టమైనవి'' అన్నారు.

పవన్ కల్యాణ్, విజయ్, తమిళనాడు ఎన్నికలు

ఫొటో సోర్స్, UGC

బొలిశెట్టి మాట్లాడుతూ, "పవన్‌ కల్యాణ్ జనసేనను ఒక భావజాలంతో స్థాపించి అందు కోసం నిలబడ్డారు. విజయ్‌ రాజకీయ ప్రవేశం కేవలం గెలువు కోసం 'పక్కా ప్లానింగ్‌'తో, సరైన సమయంలో జరిగింది. రెండింటికి పొంతనలేదు. విజయ్‌ గెలుపును పవన్‌పై విమర్శగా వాడుకోవడం రాజకీయ ఎత్తుగడ మాత్రమే'' అన్నారు.

"నిజానికి, పవన్‌ కల్యాణ్ 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో సాధించిన విజయం, ఆయన్ను ఒక 'కింగ్‌ మేకర్‌'గా నిలబెట్టింది. అధికారం కోసం కాకుండా, వ్యవస్థ మార్పు కోసం ఆయన వేసిన అడుగులు ఆలస్యంగానైనా మంచి ఫలితాలనిచ్చాయి'' అన్నారు.

"పవన్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర (డిప్యూటీ సీఎం) పోషిస్తున్నారు. ఆయన ప్రభావాన్ని తగ్గించడానికి దురుద్దేశంతో వైరి పక్షాల నుంచి వచ్చే విమర్శలే.. విజయ్‌ని పొగుడుతూ పవన్‌ని తక్కువ చేయడం ద్వారా జనసేన కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం వారి ప్రధాన ఉద్దేశం కావచ్చు. కానీ, ఇవి పరోక్షంగా పవన్‌ కల్యాణ్ ప్రభావాన్ని కూడా చెబుతున్నాయి'' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)