కొడుకు వీర్యం కోసం కోర్టుకెక్కిన తల్లిదండ్రులు, కోర్టు ఏం చెప్పిందంటే...

సరోగసీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

‘‘మేం చాలా దురదృష్టవంతులం. మా అబ్బాయిని పోగొట్టుకున్నాం. కానీ కోర్టు మాకు చాలా విలువైన బహుమతి ఇచ్చింది. ఇప్పుడు మేం మా కొడుకును మళ్ళీ చూసుకోగలం’’ అంటూ హర్బీర్ కౌర్, గురువిందర్ సింగ్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ దంపతుల ఆనందానికి కారణం కోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పే. చనిపోయిన తమ కొడుకుకు సంబంధించి ఆస్పత్రిలో భద్రపరిచిన వీర్యాన్ని తమకు అప్పగిస్తే సరోగసీ ద్వారా తాము మనవడినో, మనవరాలినో పొందుతామని వీరు కోర్టును ఆశ్రయించారు.

నాలుగేళ్లపాటు కొనసాగిన ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుతో కౌర్, గురువిందర్ సింగ్ దంపతులు చాలా సంతోషిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హర్బీర్ కౌర్, గురువిందర్ సింగ్ దంపతులకు ప్రీత్ ఇందర్ సింగ్ అనే కుమారుడు ఉన్నారు. 30 ఏళ్ల ఇందర్ సింగ్‌కు నాన్ -హాడ్కిన్స్ లింఫోమా (ఒకరకమైన బ్లడ్ క్యాన్సర్) ఉన్నట్టు 2020 జూన్‌లో నిర్థరణ అయింది. దీంతో చికిత్స కోసం ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.

ఇందర్‌సింగ్‌కు కీమోథెరపీ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు, ఆయనకు ఆస్పత్రి ఓ సూచన చేసింది. ‘‘కీమోథెరపీ వీర్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వీర్యాన్ని నిల్వచేసుకోవాలని సూచించింది.’’ అని గురువిందర్ సింగ్ బీబీసీకి చెప్పారు.

అవివాహితుడైన ప్రీత్‌ఇందర్ సింగ్ ఇందుకు అంగీకరించడంతో, ఆయన వీర్యాన్ని 27 జూన్ 2020న భద్రపరిచారు. కానీ సెప్టెంబర్ నెల మొదట్లో ఆయన చనిపోయారు.

ఆస్పత్రిలో భద్రపరిచిన తమ కుమారుడి వీర్యాన్ని ఇవ్వాలంటూ కొన్ని నెలల తరువాత ఇందర్‌ సింగ్ తల్లిదండ్రులు చేసిన వినతిని దిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి తిరస్కరించింది.

దీంతో కౌర్ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. 2020 డిసెంబర్‌లో దిల్లీలోని గంగారామ్ హాస్పిటల్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆసుపత్రి ఫెర్టిలిటీ ల్యాబ్‌లో భద్రపరిచిన తమ కుమారుడి వీర్యాన్ని తమకు అప్పగించాలని ఆ పిటిషన్‌లో కోరారు.

సెమెన్ శాంపుల్ నిల్వ

ఫొటో సోర్స్, Getty Images

తమ కొడుకు వీర్యం శాంపుల్‌తో పుట్టే పిల్లలను తాము పెంచి పెద్ద చేస్తామని వారు కోర్టుకు చెప్పారు. తాము చనిపోయిన తర్వాత, ఆ బిడ్డ పూర్తి బాధ్యతలు తమ ఇద్దరి కూతుర్లు చూసుకుంటారని 60వపడిలో ఉన్న ఆ తల్లిదండ్రులు తెలిపారు.

‘‘భారత చట్టాల ప్రకారం, వీర్యం దానం చేసిన వ్యక్తి సమ్మతిస్తే, అతని మరణానంతర సంతానోత్పత్తిపై ఎలాంటి నిషేధం లేదు’’ అని జస్టిస్ ప్రతిభా సింగ్ ఈ కేసులో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు.

వీర్యదాతకు జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేనప్పుడు ఆ శాంపుల్‌ను తల్లిదండ్రులు పొందవచ్చని, హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారు చట్టబద్ధమైన హక్కుదారులు అవుతారని చెప్పారు.

‘‘అక్కాచెల్లెళ్లను ఎక్కువగా ప్రేమించేవాడు. స్నేహితులు కూడా అతణ్ణి బాగా ఇష్టపడేవారు. నా ఫోన్ స్క్రీన్‌పై ఉన్నది తన ఫోటోనే. ప్రతి రోజూ ఉదయం ఫోన్‌పై ఉన్న నా కొడుకు ముఖం చూసిన తర్వాతే రోజు ప్రారంభమవుతుంది’’ అని తల్లి హర్బీర్ కౌర్ చెప్పారు.

గోప్యతాపరమైన కారణాలతో బీబీసీతో తమ కొడుకు ఫోటోను పంచుకునేందుకు వారు ఇష్టపడలేదు.

తన కొడుకు వీర్యాన్ని సరోగసీలో వాడాలనుకుంటున్నామని, ప్రీత్ ఇందర్ వీర్యంతో పిల్లల్ని కనేందుకు తమ కూతుర్లలో ఒకరు ఒప్పుకున్నారని తల్లి చెప్పారు.

ఈ కేసు చాలా అరుదైనదని, కానీ, ఇలాంటివి ముందు జరగలేదని కాదని పిటిషనర్ల తరపు న్యాయవాది సురుచి అగర్వాల్ అన్నారు.

జర్మనీలో బ్రెయిన్ క్యాన్సర్‌తో చనిపోయిన 27 ఏళ్ల కొడుకు వీర్యంతో 48 ఏళ్ల మహిళ పుణేలో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన 2018 నాటి కేసును ఆమె కోర్టులో ప్రస్తావించారు.

ఆ మహిళ కుమారుడికి అప్పటికి పెళ్లి కాలేదు. జర్మనీలో ఓ ఆస్పత్రిలో చనిపోయిన తర్వాత ఆయన వీర్యాన్ని తల్లి, ఆయన సోదరికి అప్పగించారు.

సంతానోత్పత్తి

ఫొటో సోర్స్, Getty Images

న్యూయార్క్‌ సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ కేసును కూడా అగర్వాల్ ఉదాహరణగా పేర్కొన్నారు.

చనిపోయిన తర్వాత ఆ వ్యక్తుల వీర్యంతో సంతానోత్పత్తికి అనుమతి ఇస్తున్న పలు కేసులను తన తీర్పులో జస్టిస్ సింగ్ ఉదహరించారు.

వాటిలో ఇజ్రాయెల్‌కు చెందిన 2002 నాటి కేసు కూడా ఉంది. గాజాలో చనిపోయిన 19 ఏళ్ల సైనికుడి తల్లిదండ్రులు తమ కొడుకు వీర్యంతో సరోగసీ ద్వారా పిల్లల్ని కనేందుకు అనుమతి పొందారు.

అమెరికా, బ్రిటన్, జపాన్, చెక్ రిపబ్లిక్, ఇతర కొన్ని దేశాలు లిఖితపూర్వకమైన సమ్మతితో చనిపోయిన తర్వాత ఆ వ్యక్తుల వీర్యంతో సంతానోత్పత్తికి అనుమతి ఇస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియా ఒక ఏడాదిపాటు వేచి చూడాలనే నిబంధన విధించింది. అప్పటికి కాస్త భావోద్వేగాలు కుదురుకుంటాయనే ఉద్దేశంతో ఈ నిబంధన ప్రవేశపెట్టింది.

అయితే, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, మలేషియా, పాకిస్థాన్, హంగేరీ, స్లోవెనియా వంటి దేశాలు ఈ విధానంపై నిషేధం విధించాయి.

భారత్‌కు సరిహద్దు దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లు దీనిపై ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను రూపొందించలేదు.

చనిపోయిన తర్వాత వ్యక్తుల సంతానోత్పత్తికి అనుమతిస్తోన్న చాలా దేశాల్లో, గర్భధారణకు వీర్యాన్ని లేదా నిల్వ ఉంచిన అండాలను వాడుకోవాలనుకునే చాలా కేసుల్లో జీవిత భాగస్వామి ప్రమేయం ఉంటుంది.

కానీ ప్రీత్ ఇందర్ సింగ్ కేసులో మాత్రం చట్టబద్ధంగా ఆయన శాంపుల్‌ను జీవిత భాగస్వామికి మాత్రమే ఇవ్వగలమని గంగారామ్ హాస్పిటల్ కోర్టులో తెలిపింది.

పెళ్లి కాని ఒక వ్యక్తి వీర్యాన్ని తల్లిదండ్రులకు లేదా చట్టబద్ధమైన హక్కుదారులకు ఇచ్చేలా ఎలాంటి స్పష్టమైన చట్టాలు లేదా మార్గదర్శకాలు లేవని ఆస్పత్రి పేర్కొంది.

భారత ప్రభుత్వం కూడా ఆ తల్లిదండ్రుల పిటిషన్‌ను వ్యతిరేకించింది. భారత్‌లో ఉన్న సరోగసీ చట్టాలు పిల్లల్ని కనలేకపోతున్న దంపతులకు లేదా మహిళలకు ఉద్దేశించినవి అని, మనవడు/మనవరాలిని పొందాలనుకుంటున్న వారి కోసం కాదని పేర్కొంది.

ఫెర్టిలిటీ క్లినిక్

ఫొటో సోర్స్, Getty Images

ప్రీత్ ఇందర్‌కు ఇంకా పెళ్లి కాలేదన్న విషయాన్ని అధికారులు కోర్టులో ప్రస్తావించారు. ఒంటరి వ్యక్తులు సరోగసీ ద్వారా పిల్లల్ని పొందేందుకు ఇండియా అసిస్టెడ్ రీప్రొడెక్టివ్ టెక్నాలజీ(ఏఆర్‌టీ) యాక్ట్ 2021 అనుమతించడం లేదని తెలిపారు.

అలాగే, నిల్వ చేసిన తన వీర్యాన్ని తల్లిదండ్రులు వాడుకునేలా ఆయన రాతపూర్వకంగా లేదా మౌఖికంగా ఎటువంటి సమ్మతిని తెలపలేదు. దీంతో, ఆటోమేటిక్‌గా వాడుకునే హక్కును వారు పొందలేరని ఆస్పత్రి చెప్పింది.

అయితే, ఐవీఎఫ్ కోసం తన వీర్యాన్ని నిల్వ చేస్తున్నట్లు ప్రీత్ ఇందర్ స్పష్టంగా పేర్కొనట్లు ఆయన తల్లిదండ్రుల న్యాయవాది అగర్వాల్ కోర్టులో చెప్పారు.

వీర్యాన్ని నిల్వ చేసేటప్పుడు ఇచ్చిన ఫామ్‌పైన తండ్రీ కొడుకుల ఫోన్ నెంబర్లున్నాయని, అంటే అది సమ్మతి కిందకే వస్తుందని అగర్వాల్ బీబీసీతో చెప్పారు. ఈ శాంపుల్‌ను ల్యాబ్‌లో నిల్వ చేసేందుకు తండ్రే ఫీజును చెల్లించినట్లు తెలిపారు.

పిల్లలను కనేందుకు ప్రీత్ ఇందర్ తన వీర్యాన్ని వాడుకునే అనుమతిని ఇచ్చారని అగర్వాల్ చేసిన వాదనతో జస్టిస్ ప్రతిభా సింగ్ ఏకీభవించారు.

‘‘ప్రీత్ ఇందర్‌కు పెళ్లికాలేదు. జీవిత భాగస్వామి లేరు. పిల్లల్ని కనేందుకు శాంపుల్‌ను వాడాలన్నది ఆయన ఉద్దేశ్యం. ఆయన చనిపోయినప్పుడు తల్లిదండ్రులే హక్కుదారులు అవుతారు. వీర్యం శాంపుల్ ఓ జన్యు పదార్థం. దీన్ని పొందే అర్హత తల్లిదండ్రులకు ఉంటుంది’’ అని తీర్పు ఇచ్చారు.

కోర్టు తీర్పుపై కౌర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ప్రార్థనలు ఫలించాయని, తమ కొడుకును త్వరలోనే తిరిగి పొందుతామని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)