అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

భారత పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్‌ టాటా (86) కన్నుమూశారు. ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

రతన్ టాటా మరణాన్ని ధృవీకరిస్తూ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

తన వయసు దృష్ట్యా సాధారణ వైద్యపరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్తున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రతన్ టాటా అక్టోబర్ 7న సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. కానీ ఐసీయూలో చికిత్స పొందుతూ అక్టోబర్ 9న తుది శ్వాస విడిచారు.

రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముంబయిలో రతన్ టాటా చనిపోయిన ఆస్పత్రి దగ్గర పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ముంబయిలో రతన్ టాటా తుదిశ్వాస విడిచిన ఆస్పత్రి దగ్గర పోలీసులు

అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు

రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

ఆయన భౌతికకాయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ముంబయిలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్(ఎన్‌సీపీఏ)లో ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు.

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టాటా నానో కారుతో రతన్ టాటా

రతన్ టాటా 1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సూనూ టాటా దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్య ముంబయిలో పూర్తయింది.

అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివారు. 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో చేరారు.

1991లో టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా నియమితులై, 2012 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన టాటా గ్రూప్ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు.

రతన్ టాటాకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. 2023లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో ఆ దేశం రతన్ టాటాను గౌరవించింది.

టాటా ఇండికా విడుదల సమయంలో రతన్ టాటా

ఫొటో సోర్స్, tata.com

ఫొటో క్యాప్షన్, టాటా ఇండికా కారు ఆవిష్కరణ సమయంలో రతన్ టాటా

సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు..

సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు.. 100కు పైగా కంపెనీలు టాటా గ్రూప్‌ నేతృత్వంలో నడుస్తున్నాయి. ఈ కంపెనీల్లో సుమారు 6,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

టాటా గ్రూప్‌కు రతన్ టాటా చైర్మన్‌గా ఉన్న సమయంలో.. పలు ప్రముఖ కంపెనీల కొనుగోళ్లను చేపట్టారు. ఆంగ్లో-డచ్ స్టీల్‌ తయారీ సంస్థ కోరస్, బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీ కంపెనీ టెట్లీ వంటి సంస్థలను టాటా గ్రూప్ టేకోవర్‌ చేసింది.

2011లో ఎకనమిస్ట్ మేగజీన్ ప్రచురించిన ఆయన ప్రొఫైల్‌లో, టాటా ఒక ‘టైటాన్‌’ అని అభివర్ణించింది. ఒక ఫ్యామిలీ గ్రూప్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా నిలపడంలో ఆయన పాత్రను కొనియాడింది.

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రతన్ టాటాకు విమానం పైలట్‌ లైసెన్స్ కూడా ఉంది

రతన్ టాటా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

1937: జననం

1955: అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో చేరిక

1962: టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా టాటా గ్రూప్‌లో ప్రయాణం ప్రారంభం

1963: ప్రస్తుతం టాటా స్టీల్‌గా పిలుస్తున్న టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో చేరిక

1965: టిస్కో ఇంజినీరింగ్ డివిజన్‌లో టెక్నికల్ ఆఫీసర్‌గా బాధ్యతలు

1969: ఆస్ట్రేలియాలో టాటా గ్రూప్ రెసిడెంట్ రిప్రజెంటేటివ్‌గా విధులు

1970: భారత్‌కు తిరిగి రాక, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)లో చేరిక

1974: టాటా సన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు

1981: టాటా ఇండస్ట్రీస్ చైర్మన్‌గా నియామకం

1986-1989: ఎయిర్ ఇండియా చైర్మన్‌గా పనిచేసిన రతన్‌ టాటా

1991 మార్చి 25: టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా జేఆర్‌డీ టాటా నుంచి బాధ్యతల స్వీకరణ

1991: టాటా గ్రూప్ పునర్‌నిర్మాణం

2000 తర్వాతి కాలం: అనేక రంగాల్లో టాటా గ్రూప్ విస్తరణ

2008: టాటా నానో కారు ఆవిష్కరణ

2008: కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డ్

2012 డిసెంబర్: టాటా గ్రూప్‌తో 50 ఏళ్ల అనుబంధం తర్వాత టాటా సన్స్ చైర్మన్‌గా రాజీనామా, టాటా సన్స్ గౌరవ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

2024 అక్టోబర్ 09: ముంబయిలోని ఓ ఆస్పత్రిలో రతన్ టాటా తుదిశ్వాస విడిచారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)