టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా ఎంపికైన నోయల్ టాటా ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
టాటా ట్రస్ట్స్ కొత్త చైర్మన్‌గా నోయల్ టాటా నియమితులయ్యారు. ఈయన రతన్ టాటా సవతి తల్లి కుమారుడు.
టాటా ట్రస్ట్స్ అనేది టాటా గ్రూప్‌కు చెందిన అనేక ట్రస్టులతో కూడిన దాతృత్వ సంస్థ. దీనికి దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ గ్రూపుల్లో ఒకటైన టాటా సన్స్‌లో 66 శాతం వాటా ఉంది.
రతన్ టాటా మరణించిన తరువాత శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో 67 ఏళ్ల నోయల్ టాటాను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రతన్ టాటా తరువాత దాదాపు రూ. 34 లక్షల కోట్ల విలువైన టాటా గ్రూప్‌ను ఇప్పుడు నోయల్ టాటా నడపాల్సి ఉంటుంది. నోయల్ టాటా ఇప్పటికే టాటా సన్స్ వ్యవహారాలను చూస్తున్నారు.
నోయల్ టాటా నియామకాన్ని టాటా ట్రస్ట్స్ లాంఛనంగా ప్రకటిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. నోయల్ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది.


ఫొటో సోర్స్, Getty Images
అత్యంత కీలక బాధ్యతలు..
రతన్ టాటా అవివాహితుడు కావడం, పిల్లలు లేకపోవడంతో ఆయన సమీప బంధువులెవరికైనా గ్రూపు పగ్గాలు అప్పగిస్తారనే చర్చ నడిచింది. ఈ విషయంలో గట్టిపోటీదారుగా నోయల్ టాటా పేరు వినిపించింది.
రతన్ టాటా మరణానంతరం దాదాపు రూ.34 లక్షల కోట్లకు పైగా విలువైన టాటా గ్రూప్‌లో 66.4 శాతం వాటా ఉన్న 13 ట్రస్టుల బాధ్యతలను ఎవరు చేపడతారనే దానిపై చాలా ఊహాగానాలు నడిచాయి.
ఈ ట్రస్టులన్నింటికీ నాయకత్వం వహించే వారికి టాటా గ్రూప్‌ను నడిపించే కీలకమైన బాధ్యత ఉంటుంది.
ఈ ట్రస్టులన్నింటికీ రతన్ టాటా తన వారసుడిని ప్రకటించకపోవడంతో ఆయన సవతి సోదరుడు నోయల్ టాటా బలమైన పోటీదారుగా నిలిచారు.
సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ అనే ట్రస్టుల్లో నోయల్ టాటా ట్రస్టీగా ఉన్నారు. టాటా సన్స్‌లో ఈ రెండు ట్రస్టులకు మాత్రమే 55 శాతం వాటా ఉంది.
దీంతో నోయల్ టాటా బలమైన చైర్మన్ అభ్యర్థి అయ్యారు.

ఎవరీ నోయల్ టాటా?
నావల్ టాటా, సిమోన్ టాటాల కుమారుడు నోయల్ టాటా. రతన్ టాటాకు సవతి సోదరుడు.
నోయల్ టాటా బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. తరువాత ఇన్సీడ్(INSEAD) బిజినెస్ స్కూల్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు.
టాటా గ్రూప్‌తో ఆయనకు 40 ఏళ్లుగా అనుబంధం ఉంది.
నోయల్ టాటా ప్రస్తుతం టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లకు చైర్మన్‌గా ఉన్నారు.
టాటా స్టీల్, టైటాన్ కంపెనీల వైస్ చైర్మన్‌గానూ ఉన్నారు.
ఒక్కో అడుగు వేస్తూ..
తొలినాళ్లలో నోయల్ టాటా, రతన్ టాటా మధ్య సంబంధాలు అంత బాగుండేవి కావు. కానీ క్రమంగా టాటా గ్రూప్‌లో నోయల్ స్థాయి పెరిగింది. టాటా గ్రూపును నియంత్రించే ట్రస్టులలో తన పాత్రను పెంచుకున్నారు.
2019 ఫిబ్రవరిలో సర్ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో నోయల్ చోటు దక్కించుకున్నారు. అంతకుముందు 2018లో టాటా గ్రూప్‌లో కీలకమైన టైటాన్‌కు వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
2022 మార్చిలో టాటా స్టీల్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
2011లో టాటా ఇంటర్నేషనల్ చైర్మన్ అయిన నోయల్ ఆ తర్వాత దశాబ్దం పాటు టాటా రిటైల్ చైన్ ట్రెంట్‌కు చైర్మన్‌గా పనిచేశారు.
క్రోమా, వెస్ట్‌సైడ్, జుడియో, స్టార్ బజార్ వంటి రిటైల్ చైన్లను ట్రెంట్ లిమిటెడ్ నడుపుతోంది.
నోయల్ టాటా వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ ఉన్నారు.
నోయల్ టాటా 2010 నుంచి 2021 వరకు టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన దాని టర్నోవర్‌ను 500 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు పెంచారు.
ఆయన నాయకత్వంలో, ట్రెంట్ 1998లో ఒక దుకాణంతో ప్రారంభమైంది. ఇప్పుడు దీనికి 700కి పైగా స్టోర్లు ఉన్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















