‘బాంబు శకలం తగిలి నాన్న చనిపోయారు, నా కన్ను పోయింది’

- రచయిత, ఫెర్గల్ కీన్, స్పెషల్ కరెస్పాండెంట్
- హోదా, బీబీసీ న్యూస్
మాలక్ ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసి.. కొంచెం ముందుకు వంగి, తన ఒడిలో కూర్చున్న చిన్నారికి ముద్దులు పెట్టింది.
మాలక్ సోదరి రహ్మాకు ఎర్ర జుట్టు, నీలి కళ్లు ఉన్నాయి. వారిద్దరి మధ్య 13 ఏళ్ల వయసు తేడా ఉంది.
ఇజ్రాయెల్ దాడుల్లో తండ్రిని కోల్పోయిన మాలక్‌కు నాలుగు నెలల ఆ చిన్నారి ఊహించలేనంత విలువైన బహుమతి.
‘‘నాకు ఈ చెల్లి అంటే ఎంత ఇష్టమో ఎవరికీ తెలియదు’’ అని ఆమె అంది.
యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన వేళ మాలక్‌ను, ఇతరులను కలిసేందుకు బీబీసీ మళ్లీ గాజా వెళ్లింది.
ఫిబ్రవరిలో మొదటిసారి మేము మాలక్‌ను ఇంటర్వ్యూ చేశాం. అప్పుడే ఆమె తండ్రి చనిపోయారు. ఆయన పేరు అబెద్-అల్‌రహ్మాన్ అల్-నజ్జార్. 32 ఏళ్ల అబెద్ వ్యవసాయ కూలీ.
ఏడుగురు పిల్లల తండ్రి అయిన అబెద్ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు.
ఇజ్రాయెల్ నిర్వహించిన కమాండో ఆపరేషన్‌లో చనిపోయిన 70 మందిలో అబెద్ ఒకరు.
రఫాలో హమాస్ బందీలుగా ఉంచిన ఇద్దరిని రక్షించేందుకు ఈ ఆపరేషన్ జరిపామని ఇజ్రాయెల్ చెప్పింది. బాంబు శకలం తగిలి అబెద్ మరణించినట్టు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ దాడి జరిగిన సమయంలో అబెద్ శరణార్థి శిబిరంలోని టెంట్‌లో కుటుంబంతో కలిసి నిద్రపోతున్నారు.
ఆ దాడిలో మాలక్‌కు ఓ కన్ను పోయింది. ఆ సమయంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.
‘నాకు చాలా నొప్పిగా ఉంది. మా నాన్న చనిపోయారు’ అని చెప్పిందామె.
ఆ తర్వాత డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. దాడుల్లో ఆమె కన్నుపోవడంతో ఆ కన్ను స్థానంలో తెల్లని చిన్న బాల్ అమర్చారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆమెకు కృత్రిమ కన్ను అమర్చే ప్రణాళికలున్నాయి.
అయితే తాను కన్నుపోగొట్టుకోవడం గురించి మాలక్ ఏమీ బాధపడడం లేదు. తన చెల్లి, బేబీ రహ్మాను తన తండ్రి ఎత్తుకుని ఉండుంటే ఆయన సంతోషం ఎలా ఉండేదో అని మాలక్ ఆలోచిస్తుంటుంది. తండ్రి చనిపోయిన మూడు నెలల తర్వాత రహ్మా పుట్టింది.
‘నీలి కళ్లతో ఒక కూతురు కావాలని ఆయనెప్పుడూ కోరుకునేవారు’ అని మాలక్ చెప్పింది.
తాను కంటి డాక్టర్ కావాలన్నది ఇప్పుడు మాలక్ కోరిక. తనలాగా బాధపడుతున్నవారందరికీ కంటివైద్యురాలిలా సాయం అందించాలని మాలక్ కోరుకుంటోంది.


ఆ నొప్పి తీవ్రత మాటల్లో వర్ణించలేను
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో కాంక్రీట్ నేల మీద తన చెల్లెళ్లు, తమ్ముళ్లతో కలిసి మాలక్ కూర్చుంది. ఆమెకు నాలుగు నుంచి 12 ఏళ్ల వయసున్న ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.
యుద్ధానికి ముందు ఆమె తండ్రి ఇతరుల పొలాల్లో కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు.
‘‘మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ బయటకు తీసుకెళ్తుండేవారు. చలికాలంలో మాకు కొత్త దుస్తులు కొనేవారు. మా మీద ఎంతో ప్రేమతో ఉండేవారు. తనను తాను ఏదయినా అనుకునేవారు కానీ మమ్మల్ని ఏమీ అనేవారు కాదు’’ అని మాలక్ గుర్తుచేసుకున్నారు.
2023 అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. 1,200మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. వాళ్లలో పదుల సంఖ్యలో పిల్లలున్నారు.
250మందికిపైగా ప్రజలను హమాస్ బందీలుగా గాజా తీసుకెళ్లింది. వారిలో తొమ్మిది నెలల చిన్నారి సహా 30 మంది పిల్లలున్నారు.
ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ హమాస్‌పై వైమానిక దాడులు, భూతల దాడులు చేస్తోంది. హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 42 వేల మంది చనిపోయారు.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 90 శాతం గాజా ప్రజలు-అంటే దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
మాలక్ కుటుంబం నాలుగుసార్లు తాము ఉన్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలివెళ్లింది.
‘కఠిన పర్వతాలు సైతం భరించలేనంత నొప్పిని నేను భరించాను’ అని మాలక్ చెప్పింది. ‘‘మేం చెల్లాచెదురయ్యాం. దీనివల్ల మా జీవితం మొత్తం చెదిరిపోయింది. ఒకచోట నుంచి మరో చోటకు మారుతూనే ఉన్నాం’’ అని ఆమె చెప్పింది.

ఏ క్షణం ఏమైనా జరగొచ్చు...
గాజాలోకి విదేశీ రిపోర్టర్లను ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించడం లేదు. మానవతా సంక్షోభాన్ని కవర్ చేసేందుకు స్థానిక జర్నలిస్టుల బృందంపై బీబీసీ ఆధారపడింది.
మేం వాళ్లకు కొన్ని ప్రశ్నలందించాం. గడిచిన 12 నెలలుగా గాజాలో పరిస్థితులపై మాట్లాడిన పాలస్తీనియన్లను కాంటాక్ట్ అవ్వమని ఆ జర్నలిస్టుల బృందాన్ని కోరాం.
తాము మాట్లాడిన వారు చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు వెళ్లడం వంటివాటి గురించి జర్నలిస్టులు ఆందోళన వ్యక్తంచేశారు.
చెల్లాచెదురు కావడమంటే నిత్యం భయంతో బతకడం.. బకెట్ నీళ్ల కోసం పంపిన చిన్నారి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందో లేదో చెప్పలేకపోవడం.. అబేద్ భార్య నవారాను ప్రతిరోజూ వెంటాడే ప్రశ్నలివే.
‘‘ఇక్కడ ఎప్పుడూ బాంబులు పడుతూనే ఉంటాయి. మేం ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం. భయం మా జీవితంలో భాగమైపోయింది. నా పిల్లలనెప్పుడూ గట్టిగా పట్టుకుని ఉంటాను’’ అని నవారా చెప్పారు.
హ్యుమేనిటేరియన్ జోన్‌లకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చెప్తుంటుంది.
‘ఐడీఎఫ్ చెప్పినట్టే ప్రజలు అక్కడకు వెళ్తారు. కానీ అక్కడ భద్రత ఉండదు. అక్కడకు వెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే.. ఏమీ తెలియని ప్రాంతంలో ఆహారం కోసం, వంటసామాను కోసం, మందుల కోసం వెతుక్కోవాల్సిఉంటుంది’ అన్నారు నవారా.
అబేద్ కుటుంబం ఇప్పుడు తమ ఇంటికి తిరిగి వచ్చింది. అయితే అక్కడి నుంచి మళ్లీ వెళ్లిపోవాల్సిఉంటుందని వారికి తెలుసు. నవారా మాటల్లో చెప్పాలంటే ‘మొత్తం గాజా స్ట్రిప్‌లో సురక్షితమైన ప్రాంతం అనేది ఎక్కడా లేదు’
వీధుల్లో మురుగునీరు పొంగి ప్రవహిస్తోందని నవారా చెప్పారు. మందుల సరఫరా లేదు. గాజాలో చాలామంది ప్రజల్లానే ఆమెకు ఆదాయం ఏమీ లేదు. తన అత్తమామలు, చారిటీ సంస్థలు అందించే ఆహారంపైనే ఆమె ఆధారపడుతున్నారు.
పిల్లలు స్కూళ్లకు వెళ్లే అవకాశం లేదు. స్కూళ్ల మూసివేతతో 4 లక్షల 65 వేల మంది చిన్నారులు చదువుకు దూరమవుతున్నారని యునిసెఫ్ అంచనావేసింది.
‘‘నా ఆరోగ్యం, నా పిల్లల ఆరోగ్యం అస్సలు బాగుండలేదు. నా పిల్లలను అనారోగ్యం వెంటాడుతోంది. తరచుగా జ్వరాలు, డయేరియాతో బాధపడుతున్నారు. వాళ్లు ఆరోగ్యంగా ఎప్పుడూ కనిపించడం లేదు’’ అని నవారా చెప్పారు.
ఈ బాధలన్నింటితోపాటు తన భర్త అబేద్ జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నాయి.
‘అబేద్ ఫొటో వైపు చూస్తూ.. ఆయనతో మాట్లాడుతుంటాను. ఆయన ఇప్పటికీ బతికి ఉన్నట్టే నాకనిపిస్తుంది’’ అని నవారా అన్నారు. ‘‘ఆయన తిరిగి సమాధానం ఇస్తారు అన్నట్టుగా ఊహించుకుని నేనెప్పుడూ ఆయనతో ఫోన్‌లో మాట్లాడుతుంటా. ప్రతిరోజూ ఆయనతో మాట్లాడుతూ ఏడుస్తుంటా. నేను పడుతున్న బాధలన్నీ ఆయనకు తెలుసనుకుంటుంటా’’ అని నవారా ఆవేదనతో చెప్పారు.
మాలక్ కూడా రోజూ తన తండ్రిని గుర్తుచేసుకుంటుంది. ‘‘రాత్రి సమయంలో నాన్నకు నచ్చిన ఆహారం ఆయన ఫొటో దగ్గర ఉంచి మేం ఆయన కోసం ప్రార్థిస్తాం’’ అని మాలక్ చెప్పారు.
నవారా, మాలక్ కథలు 12 నెలలుగా యుద్ధం మిగుల్చుతున్న బాధలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
యుద్ధం రెండో ఏడాదిలోకి ప్రవేశించిన వేళ మరణాలు, ప్రజలు చెల్లాచెదురవడం గురించిన కథనాలు మా బీబీసీ ప్రతినిధులు అందిస్తూనే ఉన్నారు.
ఉత్తర గాజాలో ఇజ్రాయెలీ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన దాడిలో మరణించిన ఓ దివ్యాంగుడి కుటుంబాన్ని మేం మళ్లీ కలిశాం.

ఫొటో సోర్స్, Handout
ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం
ముహమ్మద్ భార్ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కుక్క మూలుగుతూ కూర్చుంది. కుక్క కొరుకుతున్నా...ఆ గాయాల నుంచి రక్తం కారుతున్నా ఆయన దాన్ని ఆపలేకపోయారు. ఆయన చుట్టూ అంతా గందరగోళంగా ఉంది. ఆయన తల్లి, మేనకోడలు ఏడుస్తూ అరుస్తున్నారు. ఇజ్రాయెల్ సైనికులు పెద్దపెద్దగా ఆదేశాలిస్తున్నారు.
24 ఏళ్ల ముహమ్మద్‌కు డౌన్ సిండ్రోమ్ ఉంది. ఏం జరుగుతోందో ఆయన అర్థం చేసుకోలేరు. జులైలో బీబీసీ ప్రతినిధి మొదటిసారి ఆయన కుటుంబంతో మాట్లాడేటప్పటికి... జరిగిన దారుణం మిగిల్చిన షాక్ నుంచి ఆ కుటుంబసభ్యులు ఇంకా తేరుకోలేదు.
‘‘కుక్క ముహమ్మద్ దగ్గర అరుస్తోంది. చేతిని కొరుకుతోంది. ముహమ్మద్ చేతినుంచి రక్తం చిమ్ముతోంది. ఇలా చాలాసేపు జరిగింది’’ అని ఆయన తల్లి, 70 ఏళ్ల నబీలా చెప్పారు.
‘‘ఈ దృశ్యాన్ని నేనెప్పటికీ మర్చిపోను. అదెప్పుడూ నా కళ్ల ముందే కనిపిస్తోంది. ఆ దృశ్యం నన్ను వదిలిపెట్టదు. మేము ముహమ్మద్‌ను వాళ్ల నుంచే కాకుండా ఆ కుక్క నుంచీ రక్షించలేకపోయాం’’ అని ఆమె ఆవేదనతో తెలిపారు.
జులై 3న ఈ ఘటన జరిగింది. అప్పుడు షెజాయియాలో పోరాటం తీవ్రంగా జరుగుతోంది. హమాస్ సభ్యులకు, తమకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని ఐడీఎఫ్ చెప్పింది.
‘‘హమాస్ నేతల కోసం ఐడీఎఫ్ కుక్క సాయంతో వేట సాగించింది. ఉగ్రవాదుల కోసం, అనుమానితుల కోసం, పేలుడు పదార్థాల కోసం, ఆయుధాల కోసం వెతికేటప్పుడు కుక్కలను సాధారణంగా ఉపయోగిస్తాం’’ అని ఐడీఎఫ్ తెలిపింది.
‘‘ఆ భవనాల్లోపల కుక్క ఉగ్రవాదులను గుర్తించింది. ఒక వ్యక్తిని కరిచింది’’ అని ఐడీఎఫ్ తెలిపింది. సైనికులు ఆ కుక్కను అడ్డుకుని, మరో గదిలో ముహమ్మద్‌కు ప్రాథమిక చికిత్స అందించారు’’ అని ఐడీఎఫ్ చెప్పింది.
ముహమ్మద్ పడిపోయిఉన్న గదిలోకి ఒక మిలటరీ డాక్టరు వచ్చాడని నబిలా తెలిపారు. ముహమ్మద్ బాగానే ఉన్నట్టు బలగాలు చెప్పాయని ఆయన మేనకోడలు అయిన 11ఏళ్ల జన్నా గుర్తుచేసుకున్నారు.
ఆ దాడుల్లో ముహమ్మద్ సోదరులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు విడుదలయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మిగిలిన కుటుంబమంతా అక్కడినుంచి వెళ్లిపోవాలని ఐడీఎఫ్ ఆదేశించిందని నబిలా తెలిపారు. గాయపడ్డ ముహమ్మద్ దగ్గర తమను ఉండనివ్వాలని వారు అభ్యర్థించారు. పోరాటం జరిగే ప్రాంతంలో ఉండొద్దని తక్షణమే అక్కడినుంచి వెళ్లిపోవాలని ఐడీఎఫ్ వారితో చెప్పింది.
బలగాలు ఎంతసేపటి తరువాత అక్కడి నుంచి వెళ్లాయనేది ఆర్మీ చెప్పలేదు.
ముహమ్మద్ ఒంటరిగా మిగిలిపోయారు. సైనికులు ఆయన్ను వదిలి వెళ్లేటప్పుడు ముహమ్మద్ పరిస్థితి ఎలా ఉందో ఐడీఎఫ్ చెప్పలేదు. ముహమ్మద్‌కు సరైన చికిత్స అందించలేదని ఆయన సోదరుడు జిబ్రీల్ భావిస్తున్నారు.
‘‘వాళ్లు బాగా చికిత్స చేయగలరు. కానీ వారు ఆయనమీద ఒక తడిగుడ్డ కప్పి వదిలి వెళ్లిపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన బతికున్నారా లేదా అనేది కూడా వారు చూడలేదు’’ అని జిబ్రీల్ చెప్పారు.
వారం తర్వాత ఇజ్రాయెల్ సైన్యం అక్కడినుంచి వెళ్లిపోయింది. ముహమ్మద్ కుటుంబం తిరిగి వారి ఇంటికొచ్చింది. కిచెన్‌లో నేలపై ముహమ్మద్ మృతదేహం కనిపించింది.
కుక్క ముహమ్మద్‌పై దాడి చేసిన తర్వాత ఆయన మరణానికి కారణం ఏమిటనేది ఇప్పటికీ సరిగ్గా తెలియదు. ఈ యుద్ధపరిస్థితుల్లో ఆ కుటుంబం అటాప్సీ కోరడానికి కూడా వీలుకాలేదు. చివరకు ముహమ్మద్‌ను ఇంటి పక్కనున్న సందులోనే ఖననం చేశారు.

ఇజ్రాయెల్‌పై కచ్చితంగా కేసు పెడతాం
మూడు నెలలు గడిచాయి. ముహమ్మద్‌ను ఖననం చేసిన ప్రాంతంపై ఆయన సోదరుడు జిబ్రీల్ ప్లాస్టిక్ కవర్ కప్పారు. కాంక్రీట్ ఇటుకలు, ఇనపరేకుతో ఆ ప్రాంతాన్ని కప్పిఉంచారు. ఇనుప ముక్కలు, చుట్టుపక్కల బాంబు పేలుళ్లలో దెబ్బతిన్న భవనాలనుంచి వచ్చే వ్యర్థాలు ఆ ప్రాంతమంతా ఉన్నాయి.
ముహమ్మద్ మరణంపై ఆయన కుటుంబం స్వతంత్ర దర్యాప్తును కోరుతోంది.
‘‘యుద్ధం పూర్తయితే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, న్యాయసంస్థలు తిరిగి ఈ ప్రాంతానికి వస్తాయి. ఇజ్రాయెల్ ఆర్మీపై మేం కచ్చితంగా కేసు పెడతాం’’ అని జిబ్రీల్ చెప్పారు.
‘‘ముహమ్మద్‌ది ప్రత్యేకమైన కేసు. ఆయన ఎలాంటి పోరాటం చేయలేదు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు. ఓ సాధారణ పౌరుడు. ఇంకా చెప్పాలంటే ఆయన సాధారణమైన పౌరుడు కూడా కారు. ప్రత్యేక అవసరాలున్న మనిషి’’ అని జిబ్రీల్ ఆవేదన వ్యక్తంచేశారు.

ధ్వంసమైన ఆసుపత్రి
డాక్టర్ అంజాద్ ఎలావా స్నేహితులు, ఇరుగుపొరుగువారిలో చాలామంది కనిపించడం లేదు. వాళ్లలో కొందరు చనిపోయారు. మరికొందరు సురక్షితంగా ఉండగలమన్న భావనతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వీధుల్లో తమలో తాము మాట్లాడుకుంటున్న ప్రజలను డాక్టర్ ఎలావా చూశారు.
‘‘ఎవరి మానసిక పరిస్థితి సరిగా లేదు’’ అని ఎలావా చెప్పారు.
ఉత్తర గాజాలోని అల్-షిఫా ఆస్పత్రిలో అత్యవసర సర్వీసుల విభాగంలో 32 ఏళ్ల ఎలావా వైద్యసేవలందిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన కొత్తలో గాజా స్ట్రిప్‌లో అది అతిపెద్ద ఆసుపత్రి. తర్వాత ఐడీఎఫ్ చేసిన రెండు భారీ దాడుల్లో ఆసుపత్రిలో చాలా భాగం ధ్వంసమైంది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి హమాస్ సభ్యులు, ఇతరులు దాడులు చేయడానికి, ప్రణాళికలు రచించడానికి ఆ ఆస్పత్రిని ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ ఐడీఎఫ్ ఈ దాడులు చేసింది. అయితే గాజా ఆరోగ్యశాఖ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అల్-షిఫా ఆస్పత్రిలో ఇజ్రాయెల్ యుద్ధనేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది.
తన కళ్ల ముందే చిన్నారులు చనిపోవడాన్ని, యుద్ధం మిగిల్చిన గాయాలతో బాధపడుతున్నవారిని డాక్టర్ ఎలావా చూశారు. శుభ్రమైన నీళ్లు లేక వ్యాధులు వ్యాపించాయి. బీబీసీ మొదటిసారి ఆయన్ను కలిసినప్పుడు ఆ ప్రాంతంలో తీవ్రమైన పోషకాహారలోపం ఉంది.
ఫిబ్రవరిలో మొదటిసారి బీబీసీ ఇంటర్వ్యూ చేసినప్పుడు... రెండు నెలల చిన్నారి మహమౌద్ ఫాటో మరణానికి తాను ప్రత్యక్షసాక్షిగా ఎలా మారారో డాక్టర్ ఎలావా వివరించారు. ఆస్పత్రికి తరలించేలోపే ఆ బాబు చనిపోయాడని చెప్పారు.
‘‘ఆ బాబుకు పాలు ఇవ్వలేదు. బాబుకు పాలివ్వగలిగేస్థితిలో తల్లి లేదు. సరైన ఆహారం లేక ఆమెకు పాలు రాలేదు. పాలు లేక తీవ్రమైన డీహైడ్రేషన్ బారినపడ్డ బాబు ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి చివరిశ్వాస తీసుకుంటున్నాడు’’ అని డాక్టర్ ఎలావా చెప్పారు.
అక్టోబరు 7 దాడులు జరిగిన 12 రోజుల తర్వాత డాక్టర్ ఎలావాకు కొడుకు పుట్టాడు. మహమౌద్ ఫాటో మరణించిన తర్వాత తన కుటుంబంలోనూ డాక్టర్ ఎలావాకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.
‘‘మేం చాలా షాక్ తిన్నాం. మా పిల్లాడు కూడా ఇలాగే అవ్వొచ్చు. కొన్నిరోజుల తర్వాత నా కొడుకు కూడా ఇదే పరిస్థితిలో ఉండొచ్చు’’ అని ఆయన చెప్పారు. అదృష్టవశాత్తూ డాక్టర్ ఎలావా కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడు. మొదటి పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు.
ఉత్తరగాజాలో అందరిలానే డాక్టర్ ఎలావా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఇల్లు ధ్వంసమైంది. కుటుంబంతో కలిసి ఓ రోగి ఇంట్లో ఆయన తలదాచుకున్నారు.
మానవతా సాయం గాజాలోకి వెళ్లకుండా ఇజ్రాయెల్ తరచుగా అడ్డుకుంటోందని ఐక్యరాజ్యసమితి, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.
జనవరి తొలి వారాల్లో మానవతాసాయానికి సంబంధించిన 69శాతం విజ్ఞప్తులను ఇజ్రాయెల్ తిరస్కరించింది.
ఉత్తరగాజాకు ఇంధనం అందించడంతో పాటు రిజర్వాయర్లు, బావుల్లో నీటిని శుద్ధి చేసేందుకు ఉపయోగించే మందులు, ఆరోగ్యానికి సంబంధించిన సాయం అందించే 95శాతం కార్యకలాపాలను ఇజ్రాయెల్ తిరస్కరించింది.
అయితే మానవతాసాయాన్ని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది.
ఎప్పుడు ఖాళీ సయయం దొరికినా, డాక్టర్ ఎలావా ఆహారం కోసం క్యూలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 29న ఆయన ఉత్తర గాజాలోని నబుల్సిపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు.

మునపటి జీవితం కావాలి
ఐడీఎఫ్ రక్షణగా ఉన్న మానవతాసాయం కాన్వాయ్ దగ్గర పిండి దొరుకుతుందన్న ఆశతో వేలమంది అక్కడకు చేరారు.
అప్పుడు జరిగిన కాల్పుల్లో 100 మందికి పైగా చనిపోయారని, 700మందికిపైగా గాయపడ్డారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అయితే ట్రక్కుల వెంట ప్రజలు పరుగులు తీయడం వల్ల ఎక్కువమంది మరణించారని ఐడీఎఫ్ చెప్పింది.
ముందు హెచ్చరికగా కాల్పులు జరిపామని, తర్వాత బలగాలు ప్రమాదకరంగా భావించినవారిని కాల్చామని తెలిపింది.
అయితే ఐడీఎఫ్ వాదన అబద్ధమని చాలామంది బాధితులు చెప్పారు. గుంపులుగా ఉన్న జనంపైకి ఆర్మీ కాల్పులు జరపడం వల్లే తొక్కిసలాట జరిగిందని వారు తెలిపారు.
గాయానికి తనకు తాను చికిత్స చేసుకున్న తర్వాత డాక్టర్ ఎలావా.. గాయపడ్డ ఇతరులకు చికిత్స అందించారు. కొన్నిరోజుల్లోనే ఆయన అల్-షిఫాలో తిరిగి విధులకు హాజరయ్యారు.
ఇటీవల తిరిగి గాజా వెళ్లిన బీబీసీ సహచర జర్నలిస్ట్ ఎమర్జెన్సీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఎలావాను గుర్తించారు. గాయపడ్డ పిల్లలకు ఎలావా అక్కడ చికిత్స అందిస్తున్నారు.
‘‘అవయవాలు పోగొట్టుకున్న పిల్లలను చూస్తే గుండె పగిలిపోతుంది. ఇది చాలా వేదన కలిగిస్తుంది. జీవితంలో ఇంకా ఏ అనుభవమూ చూడని పిల్లలు ఇక్కడ మనకు కాళ్లు పోగొట్టుకుని కనిపిస్తారు’’ అని ఎలావా ఆవేదనతో అన్నారు.
ఖాళీ దొరికినప్పుడు ఆయన బయటకు వెళ్లి ధ్వంసమయిన ఆస్పత్రి భవనాన్ని పరిశీలిస్తారు.
‘‘ఒకప్పుడు ఇది అత్యవసర చికిత్స విభాగంలా ఉండేది. ఆపరేటింగ్ రూమ్‌లా ఉండేది. కార్డియాలజీ విభాగంలా ఉండేది’’ అని ఆయన గుర్తుచేసుకుంటారు.
ఇజ్రాయెల్ రెండో దాడి జరిపిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు అనేక సామూహిక సమాధుల నుంచి దుర్వాసన వచ్చేది.
‘‘సంఘటనా స్థలంలోనే ఉరితీసిన గుర్తులు, తలలో బుల్లెట్ దూసుకెళ్లడం వల్ల అయిన గాయాలు, కొన్ని మృతదేహాల అవయవాలపై చిత్రహింసలకు సంబంధించిన గుర్తులు కనిపించాయి’’ అని ఆస్పత్రి డైరెక్టర్ మొహమద్ ముఘీర్ చెప్పారు.
యుద్ధనేరాల ఆరోపణలను ఐడీఎఫ్ ఖండిస్తోంది. చనిపోయిన ఇజ్రాయెలీ బందీల కోసం వెతికే క్రమంలో సైన్యం వెలికితీసిన మృతదేహాలను తిరిగి ఖననం చేశామని చెబుతోంది.
స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల డైరెక్టర్ వోల్కర్ టర్క్ కోరుతున్నారు.
ఇప్పుడక్కడ చాలా ఆహారం ఉంది. డాక్డర్ ఎలావాకు పిండి సరఫరా ఏర్పాటు ఉంది. కానీ కూరగాయలు, పళ్లు, మాంసం దొరకడం లేదు. వాటికి బదులు రెడీమేడ్ ఆహారాన్ని వారు తింటున్నారు.
గాజాలో ప్రజలను రక్షించడానికి పోరాడుతున్న మిగిలినవాళ్లలా డాక్టర్ ఎలావా కూడా యుద్ధం ముగియాలని ప్రార్థిస్తున్నారు.
‘‘మేం మళ్లీ మా పాత జీవితాలు కొనసాగించాలనుకుంటున్నాం. సురక్షితంగా నిద్రపోగల, వీధుల్లో స్వేచ్ఛగా తిరగగల, ఇప్పటికీ జీవించిఉన్న మా బంధువులను, ఇష్టమైనవారిని చూసిరాగల పరిస్థితులను కోరుకుంటున్నాం’’ అని డాక్టర్ ఎలావా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














