ఇజ్రాయెల్ అడుగులు ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నడిపిస్తాయా

గాజా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలో ధ్వంసమైన భవనం పక్క నుంచి వెళుతున్న పాలస్తీనా పిల్లలు.

గాజాలో యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ భూతల దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 200 క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై బాంబు దాడి చేసింది.

మిడిల్ ఈస్ట్‌ (మధ్యప్రాచ్యం)లోపెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, విశ్లేషకులు ఈ ప్రాంతంలో యుద్ధం చెలరేగుతుందనే భయాందోళనలు వ్యక్తం చేశారు.

మధ్యప్రాచ్యంలోని వివిధ ప్రాంతాలను కవర్ చేసే బీబీసీ కరస్పాండెంట్ల నుంచి ఈ ప్రాంతాలలో యుద్ధ ప్రమాదం ఎంత వరకు ఉంది? ఈ యుద్ధం ప్రపంచంలో ఘర్షణకు దారితీస్తుందా? అని తెలుసుకోవడానికి ప్రయత్నించాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గాజా

ఫొటో సోర్స్, AFP

నవాల్ అల్ మాగ్ఫీ, సీనియర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ కరస్పాండెంట్

హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడులలో ఇప్పటివరకు 40,000 మందికి పైగా మరణించారు.

లెబనాన్‌లో కేవలం ఒక్క వారంలోనే 1,000 మందికి పైగా మరణించారు. ఈ ప్రాణ, ఆస్తి నష్టం చాలా తీవ్రమైనది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు, ఆ ప్రాంతం శిథిలావస్థకు చేరుకుంటోంది. అక్కడ దశాబ్దాలుగా లేనటువంటి అత్యంత ప్రమాదకరమైన సంక్షోభాన్ని చూస్తున్నాం.

ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో హిజ్బుల్లాను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా కీలక నేతలు తుడిచిపెట్టుకుపోయారు.

హమాస్‌కు వ్యతిరేకంగా ఏడాది నుంచి సాగుతున్న దాడి గాజాలోని లక్షలాది మంది జీవితాలపై విధ్వంసకర ప్రభావాన్ని చూపింది.

ఇది హమాస్ సామర్థ్యాలను గణనీయంగా తగ్గించింది. అయినప్పటికీ, హమాస్ అంత త్వరగా ముగిసిపోయే అవకాశం లేదు. ఇది లోతుగా విస్తరించి ఉంది. అయితే, నస్రల్లా హత్య, ఇరాన్ ప్రతిస్పందన ఈ ప్రాంతాన్ని ప్రమాదకర యుద్ధానికి చేర్చాయి.

ఇరాన్ క్షిపణి దాడుల అనంతరం ఇజ్రాయెల్ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వివాదం మరింత తీవ్రమవుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

ఒక వైపు లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాక్‌లలో ఇరాన్ మద్దతు ఉన్న దళాలు, మరొక వైపు అమెరికా, బ్రిటన్ వంటి పశ్చిమ దేశాలలో ఇజ్రాయెల్ మిత్రదేశాలు ఉన్నాయి.

ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందన్నదే అతిపెద్ద ప్రశ్న.

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో "మిడిల్ ఈస్ట్ ముఖచిత్రాన్ని మార్చడానికి 50 సంవత్సరాలలో ఇదే అతిపెద్ద అవకాశం" అని అన్నారు. ఇరాన్ చమురు స్థావరాలపై దాడికి దిగాలని ఆయన సూచించారు.

ఆయన మాటల ప్రకారం మిడిల్ ఈస్ట్ నిజంగా పెను ప్రమాదం అంచున ఉందనడంలో సందేహం లేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చేస్తున్న దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయి.

లెబనాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లెబనాన్ ఘర్షణలతో విసిగిపోయింది.

నిస్రీన్ హాతూమ్, బేరూత్ నుంచి బీబీసీ అరబిక్ సర్వీస్ కరస్పాండెంట్

పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎదుర్కోవడానికి లెబనాన్ సిద్ధంగా లేదు. పొరుగు దేశాల్లో యుద్ధ భయాలు నెలకొన్నాయి.

ఇందులో సిరియా, ఇరాన్, ఇరాక్, యెమెన్, జోర్డాన్ ఉండవచ్చు. అక్టోబర్ మొదటివారంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఈ భయాలు రెట్టింపయ్యాయి.

ఇప్పుడు ఇరాన్ మళ్లీ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకోవచ్చు.

ఇది యుద్ధ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

లెబనాన్‌లోని హిజ్బుల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోంది కానీ, లెబనాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదు.

దౌత్య ప్రయత్నాలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఫ్రాన్స్ నేతృత్వంలోని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్ 1701ని అమలు చేయడం, లెబనాన్ సైన్యాన్ని బలోపేతం చేయడం, మద్దతు ఇవ్వడం, సైన్యం మోహరించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు ఉన్నాయి.

లెబనాన్ పూర్తిస్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా నిరోధించడానికి దౌత్య ప్రయత్నాలే ఏకైక మార్గం. సైనిక కార్యకలాపాలు ఎటువంటి శాశ్వత పరిష్కారాలను అందించవని, వివాదాన్ని ముగించడంలో చర్చలు, దౌత్య మార్గాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని మునుపటి యుద్ధాలు నిరూపించాయి.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2006లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం 34 రోజులు కొనసాగింది.

ఆ సమయంలో, గాజాలో యుద్ధం జరగలేదు. అలాగే సిరియా, ఇరాక్, ఇరాన్, యెమెన్‌ల ప్రమేయం కూడా లేదు.

అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. లెబనాన్ ప్రస్తుతం అంత బలంగా లేదు.

ఇరాన్ క్షిపణి దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది.

ముహన్నద్ టుటుంజీ, బీబీసీ న్యూస్ అరబిక్ ప్రతినిధి, జెరూసలేం

ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ప్రాంతీయ యుద్ధం మరింత పెరిగి ఎప్పుడైనా ప్రపంచ సంఘర్షణగా మారొచ్చు.

ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఇది రాజుకుంది, ఆ తర్వాత ఇరాన్ దాని సరిహద్దు నుంచి ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులు చేసింది.

అయితే, అమెరికా పరిస్థితిని అదుపు చేసింది. ప్రతీకార దాడి చేయడానికి ఇజ్రాయెల్‌కు మద్దతివ్వబోమని అమెరికా కూడా స్పష్టం చేసింది.

అయితే, హనియే, నస్రల్లాల హత్య.. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు వంటి వరుస సంఘటనలు ఇరాన్‌ను మునుపటి కంటే నేరుగా, శక్తిమంతంగా ప్రతిస్పందించే స్థితిలో ఉంచాయి.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మిడిల్ ఈస్ట్‌లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకోకుండా ఇది అసాధ్యమని ఆయన అభిప్రాయపడుతున్నారు.

హిజ్బుల్లాపై పైచేయి తర్వాత ఇజ్రాయెల్‌లో ఉత్సాహపూరిత వాతావరణం ఉంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర చర్యలు తీసుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్‌ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటే, దానికీ మిత్రులుంటారు, ఇది ప్రపంచ ఘర్షణకు దారితీయవచ్చు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలనే ఇజ్రాయెల్ ఉద్దేశం ఈ విస్తృత యుద్ధానికి దారితీయవచ్చు. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడులు సాకుగా ఉపయోగపడతాయి. అయితే, ఇజ్రాయెల్‌ను ఇలా చేయడానికి అమెరికా అనుమతిస్తుందా అనేది పెద్ద ప్రశ్న.

వెస్ట్ బ్యాంక్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెస్ట్ బ్యాంక్‌లోని నస్ షామ్స్ క్యాంప్‌లో ఇజ్రాయెల్ సైనికులు (2024 ఆగస్టు 28న తీసిన ఫోటో).

ఇమాన్ ఎరెకత్, బీబీసీ అరబిక్ సర్వీస్ ప్రతినిధి, పాలస్తీనా భూభాగాల నుంచి

గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది ప్రజలు ఈ క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. గాజా, పాలస్తీనా భూభాగాలకు మద్దతు ఇవ్వడానికి విదేశీ జోక్యాన్ని వారు కోరుకున్నారు. ప్రస్తుత పరిస్థితి పూర్తిస్థాయి యుద్ధంగా మారొచ్చని బీబీసీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.

పాలస్తీనా భూభాగాల్లో ఇరాన్ క్షిపణులు పడిన దృశ్యాలు పలువురు పాలస్తీనియన్లకు గుర్తులుగా మారాయి.

భవిష్యత్ తరాల కోసం వారు భద్రపరచాలనుకుంటున్న ఫోటోలు అవి.

ఇరాన్ దాడులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పాలస్తీనా భూభాగాల్లో ఇరాన్ క్షిపణులు పడిన దృశ్యాలు పలువురు పాలస్తీనియన్లకు గుర్తులుగా మారాయి.

హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హత్య, జులైలో హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియే హత్య పూర్తి స్థాయి యుద్ధానికి పరిస్థితులను సృష్టించాయి.

పాలస్తీనా భూభాగాలలో ఇజ్రాయెల్ చర్య మరో స్థాయికి చేరుకుందని, మరింత క్రూరంగా మారవచ్చని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయని చాలామంది పాలస్తీనియన్లు విశ్వసిస్తున్నారు.

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ

కస్రా నాజీ, బీబీసీ న్యూస్ పర్షియన్ ప్రతినిధి

ఇరాన్ నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయాలనే నిర్ణయం ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీకి అంత సులభం కాదు.

ఆయన సాధారణంగా తక్షణ చర్యలకు మొగ్గుచూపరు. "వ్యూహాత్మక సహనాన్ని" ఇష్టపడతారు.

హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడులకు ప్రతిస్పందించడం వెనుక అలీ ఖమేనీ, ఆయన ప్రభుత్వంపై వారి ప్రాక్సీ మిలీషియా సభ్యులు, ఇతరుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది.

జూలైలో టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతిస్పందన లేకపోవడంతో ఇరాన్ పెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇరాన్‌లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు హనియేను చంపేశారని చాలామంది నమ్ముతున్నారు.

అయితే ప్రస్తుతం తమ దేశం పెద్ద యుద్ధం చేసే స్థితిలో లేదని ఇరాన్ అగ్రనేతలకు తెలుసు.

సైనిక పరంగా ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా ముందుంది. అయితే, ఇజ్రాయెల్ వైమానిక శక్తి పరంగా ఇరాన్‌పై ఆధిపత్యాన్ని కలిగి ఉంది.

కొన్నేళ్లుగా అమెరికాతో పాటు పలు దేశాల ఆంక్షలు ఇరాన్‌ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశాయి.

కొద్ది మంది ఇరానియన్లు ఇజ్రాయెల్‌తో యుద్ధానికి మద్దతు ఇస్తున్నారు. అయితే, యుద్ధం మరిన్ని ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని మరికొంతమంది భావిస్తున్నారు.

అదే సమయంలో చాలామంది ఇరానియన్లు ఇజ్రాయెల్‌ను తమ శత్రువుగా పరిగణించడం లేదు. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ రిస్క్ తీసుకునేలా ఉన్నారు.

వీడియో క్యాప్షన్, ఏక కాలంలో అనేక యుద్ధరంగాల్లో పోరాడుతున్న ఇజ్రాయెల్ ముందున్న సవాళ్లేంటి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)