దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు సాహిత్యంలో నోబెల్

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
53 ఏళ్ల ఈ ఫిక్షన్ రచయిత్రి గతంలో తన నవల ‘ది వెజిటేరియన్’కు మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గెలుచుకున్నారు.
నోబెల్ ప్రైజ్ కమిటీ 1901 నుండి సాహిత్య పురస్కారాన్ని అందిస్తోంది, ఒక మహిళ ఈ బహుమతిని గెలుచుకోవడం ఇది 18వసారి.
దక్షిణ కొరియా నుంచి సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి వ్యక్తి హాన్ కాంగ్.
నోబెల్ బహుమతి బోర్డ్ హాన్‌ను, ‘‘సంగీతం, కళలకు తనను తాను అంకితం చేసుకున్న’’ వ్యక్తి అని ప్రస్తుతించింది.
ఆమె కళకు సరిహద్దులు లేవని కమిటీ పేర్కొంది.

రచయిత్రి హాన్ కాంగ్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో జన్మించారు. తను నవలా రచయిత హాన్ సెంగ్- వోన్ కుమార్తె.
‘ది వెజిటేరియన్’ పుస్తకం 2016లో ఇంటర్నేషనల్ మ్యాన్‌బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.
అవార్డు గెలుచుకునే సమయానికి ఆ పుస్తకం విడుదలై దాదాపు దశాబ్దం అవుతోంది. 2015లో తొలిసారిగా ఆ పుస్తకాన్ని డెబోరా స్మిత్ ఇంగ్లీష్‌లోకి అనువదించారు.
‘ది వైట్ బుక్’ , ‘హ్యుమన్ యాక్ట్స్’, ‘గ్రీక్ లెసన్స్’ తదితర పుస్తకాలను హాన్ కాంగ్ రచించారు.
హాన్ కాంగ్ కవితా, ప్రయోగాత్మక శైలిని స్వీడిష్ అకాడమీ కమిటీ అధ్యక్షుడు ఆండర్స్ ఓల్సేన్ ప్రశంసించారు. అలాగే, సమకాలీన సాహిత్యంలో ఆమెను ఓ ఆవిష్కర్తగా అభివర్ణించారు.
“మానవ శరీరం, ఆత్మ.... జీవించి ఉన్నవారు, మరణించిన వారి మధ్య మధ్య కనెక్షన్స్ గురించి హాన్ కాంగ్ మంచి అవగాహన ఉంది” అని ఆయన అన్నారు.














