బతుకమ్మ: ఈ పూల పండుగ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రారంభించారు?

బతుకమ్మ
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తొమ్మిది రోజుల పాటు మహిళలే కేంద్రంగా జరిపే సామూహిక ఉత్సవం బతుకమ్మ. తెలుగు నేలలో తెలంగాణలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది బతుకమ్మ.

తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ, అస్తిత్వ ఉద్యమాల్లో బతుకమ్మది చెరగని స్థానం అని సాంస్కృతిక పరిశోధకులు చెప్తుంటారు.

ఇంతకీ.. బతుకమ్మ తెలంగాణకే పరిమితమా? అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రారంభించారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బతుకమ్మ

అలిగిన బతుకమ్మ

దసరా పండగకు ముందు ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ నిర్వహిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి.

ఈ తొమ్మిది రోజుల్లో ‘ అలిగిన బతుకమ్మ’ పేరుతో ఆరో రోజున బతుకమ్మ ఆడరు. ఆ రోజును ‘అర్రెం’ అని పిలుస్తారు.

బతుకమ్మ పుట్టుక వెనుక అనేక పురాణ, జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి.

ధర్మాంగధ రాజు కుమార్తె బతుకమ్మ అనేది ఒక పురాణగాథ అయితే.. వదినలు చేసిన కుట్రలో చనిపోయిన చెల్లెలు, చెరువు ఒడ్డున అన్నయ్యకు తంగేడు చెట్టుగా కనిపించిందన్నది ప్రచారంలో ఉన్న మరొక జానపద కథనం.

అయితే చరిత్రకారుల్లో ‘బతుకమ్మ’ పుట్టుకపై భిన్నాభిప్రాయాలున్నాయి.

కాకతీయుల కాలంలో జైనమతంతో సంబంధం కలిగి ఉందని, ఆదివాసీ సమూహాల్లో పుట్టి ఆ తర్వాత మైదాన ప్రాంతాలకు వ్యాప్తి చెందిందన్న విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయి.

జానపద సంప్రదాయానికి చెందిన బతుకమ్మ కాలక్రమంలో ‘శిష్టవర్గాల’ చేతుల్లో గౌరీ దేవీ, మహాలక్ష్మి ఆరాధనగా మారిందన్న వాదనలూ ఉన్నాయి.

స్థూలంగా పరిశీలిస్తే ప్రకృతిని స్త్రీ దేవత రూపంలో ఆరాధించే సంస్కృతిగా బతుకమ్మ కనిపిస్తుంది.

బతుకమ్మ

‘’ఓరుగల్లు కాకతీయులు మొదట జైన మతాన్ని అవలంబించారు. ఆ తర్వాత శైవ మతం తీసుకున్నారు. జైన రక్షక దేవతల్లో ఒకరైన కూష్మాండిని గుమ్మడి పూలతో ఆరాధించేవారు. బతుకమ్మ మతపరమైన ఉత్సవం. జైనం నుంచి వచ్చి, కాలక్రమంలో శైవంగా మారింది” అని చరిత్రకారులు మలయశ్రీ అభిప్రాయపడ్డారు.

బతుకమ్మ ఆదివాసీ సముదాయాల్లో పుట్టి మైదాన ప్రాంతాలకు వ్యాప్తి చెందిందని, బతుకమ్మ సామూహిక నృత్యగానం ఆదివాసీల థింసా నృత్యానికి దగ్గరగా ఉంటుందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.

“ఫలానా సమయంలో పుట్టిందని నిరూపించడానికి శాసనాధారాలు లేవు. సాధారణంగా పూలతో దేవతలను పూజిస్తారు. అయితే, పూలనే పూజించే పండగ ఇది. తల్లులు, శిశువుల మరణాలు ఎక్కువగా ఉన్న సమయంలో సంతానం, ఆరోగ్యాలతో ముడిపడిన స్త్రీదేవతారాధనలో విశ్వాసాన్ని బతుకమ్మ ప్రతిఫలిస్తుంది. బతకడం అనే భావన ఇది’’ అని ఆయన అన్నారు.

బతుకమ్మ

తీరొక్క పువ్వులు..

“ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమీ కాయొప్పునే గౌరమ్మ..

పొట్లాయి పువ్వొప్పునే గౌరమ్మ, పొట్లాయి కాయొప్పునే గౌరమ్మ..’’

బతుకమ్మ పేరు చెప్పగానే గుర్తొచ్చేది తీరొక్క(అనేక రకాల) పువ్వులు, పాటలు.

కరీంనగర్‌కు చెందిన జానపద పరిశోధకులు మాదాడి నారాయణ రెడ్డి 1970వ దశకంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారంలో ఉన్న బతుకమ్మ పాటలను సేకరించారు.

అందులో ఒక పాటలో ప్రస్తావించిన పువ్వుల జాబితాలో.. ఎండియ పువ్వులు, యాపాయి, సన్నజాజి, గన్నేరు, చెన్నజెర్ల, చెన్నంగి, నేతిబీర, నేల గుమ్మడి, ఊడుగు, ఉల్లెంత, కట్లాయి, కలిగొట్టు, చికిరెంత, చిక్కుడు, జాజి, విరజాజి, సంపెంగ, మొగిలి, బంతి, చేమంతి, బంగారి, పత్తి, పగడం పువ్వుల ప్రస్తావన ఉంది.

బతుకమ్మలో విరివిగా వాడే తంగేడు పువ్వును తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ప్రకటించారు.

బతుకమ్మను పేర్చడంలో వాడే పువ్వుల్లో అధిక శాతం నిత్య జీవితంలో, దేవతారాధనలో పెద్దగా వాడనివే ఉంటాయి. అడవి పువ్వులు ఎక్కువగా కనిపిస్తాయి.

“తెలంగాణలో ఇనుము తయారీ, తోళ్లు శుభ్రం చేసే పరిశ్రమలో తంగేడు బొగ్గు, కర్రను విరివిగా వాడేవారు. గునుగు పూలకు నీటిని శుభ్రపరిచే లక్షణం ఉంది. పనిముట్లు, వస్తువుల తయారీ వంటి ఉత్పత్తి సంబంధిత కార్యకలాపాలతో ముడిపడి ఉన్న ఈ పువ్వులు, మొక్కలతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేక ఇలా గౌరవించారని అనుకోవచ్చు’’ అని శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బతుకమ్మ

ఆటపాటల కలబోత

బతుకమ్మ పాటలు చారిత్రక, సామాజిక, సాంస్కృతిక అంశాల కలబోతగా ఉంటాయి.

‘జానపదుల దేశీ సాహిత్యంలో ప్రాసలు, పాండిత్యం ఉండదు. గ్రామీణులు తమ ఉద్రేకోత్సాహాలను, నమ్మకాలను తెలియజెప్పే సాహిత్యం ఇది. మతం, గాథలు, చరిత్ర మొదలైన అంశాలన్నీ ఈ సాహిత్యంలో నిక్షిప్తమై కుతూహలంతో ఆకట్టుకుంటాయి” అని ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్యం, సంస్కృతి పుస్తకంలో ప్రొఫెసర్ బిరుదరాజు రామరాజు అభిప్రాయపడ్డారు.

పితృస్వామ్య సమాజంలో బతుకమ్మ స్త్రీలకు భావస్వేచ్ఛను ఇచ్చిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

గడప లోపలున్న స్త్రీలు బయటకొచ్చి సామూహిక ఆర్తి, ఆవేదనను పంచుకునే భావ ప్రకటన స్వేచ్ఛ బతుకమ్మ పాటల్లో కనిపిస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ బీబీసీతో అన్నారు.

మహిళలు గొంతు విప్పడానికి, వారిలో నిద్రాణమై ఉన్న కళలు బయటికి రావడానికి ఈ పాటలు పనికొచ్చాయి.

జనగామ రైలు యాక్సిడెంట్ విషాదాన్ని బతుకమ్మ పాటల రూపంలో పాడుతుంటే తమ చిన్నతనంలో గంటల తరబడి వినేవాళ్లం అని ఆయన గుర్తుచేసుకున్నారు.

తెలంగాణకే పరిమితమైందా?

బతుకమ్మ

బతుకమ్మ తెలంగాణ ప్రాంతంలోనే బహుళ ప్రాచుర్యం పొందింది.

అయితే బతుకమ్మను పోలిన పూల పండగలు దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కనిపిస్తాయని జయధీర్ తిరుమల రావు అన్నారు.

‘’నిజానికి అన్ని పండగలు కూడా ప్రాంతీయమైనవే. కొన్ని పండగలు వేరే ప్రాంతాలకు పోవు. ఉన్నవే సరిపోతాయనుకుంటే అతి వ్యాప్తి జరగదు. ఇది ఒక సాంస్కృతిక లక్షణం అంతే’’ అని శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు.

బతుకమ్మలో కుల వివక్ష - సాంస్కృతీకరణ

శ్రమజీవుల పండగగా ఉన్న బతుకమ్మకు దైవత్వాన్ని ఆపాదించి ‘నిమ్న వర్గాలకు’ దూరం చేశారని అరుణోదయ విమలక్క అన్నారు. దశాబ్ద కాలం పైగా ‘బహుజన బతుకమ్మ’ పేరుతో ఆమె ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

‘’నిజానికి ఇది శ్రమజీవుల పండగ. బహుజనులను ఐక్యం చేయడంలో భాగంగా బహుజన బతుకమ్మ ద్వారా అందరిని ఒకేచోట చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. వెలివాడలు.. ఊరువాడలు కావాలనేది మా నినాదం’’ అని విమలక్క అన్నారు.

‘’పండగలు, పబ్బాలు ప్రజాదరణతో పాటూ పేరు, గౌరవం, ఆదాయం పొందినప్పుడు కొన్ని వర్గాలు దాన్ని అందిపుచ్చుకుంటాయి. ‘శిష్ట వర్గం’ పైపూతలు పెట్టి ఉండవచ్చు. కానీ, మౌలికంగా బతుకమ్మ ఉత్పత్తి వర్గాలకు చెందిన బహుజనులు చేసుకున్న దేవత” అని శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బతుకమ్మ

‘తెలంగాణ ఉద్యమ ఐకాన్‌గా బతుకమ్మ’

తెలంగాణ సాహిత్యకారుల అభిప్రాయంలో.. ప్రత్యేక తెలంగాణ పోరాట సమయంలో ఈ ప్రాంత ప్రాచీన సాహిత్యం వెలికి వచ్చేందుకు, కొత్త సాహిత్య రచనకు బతుకమ్మ ఒక ప్రేరణగా నిలిచింది.

‘’తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కూడా భాగమైంది. ఇక్కడి ప్రజలతో పాటు బతుకమ్మ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేసింది’’ అని జానపద గాయని వొల్లాల వాణి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)