వేట్టయన్ రివ్యూ : ఫైట్స్‌లో జోరు, డ్యాన్స్‌లో ఈజ్ - రజినీకాంత్ వేటాడేశాడా

ఫొటో సోర్స్, Lyca Productions
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
'జై భీమ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్, రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా వేట్టయన్.
అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ వంటి నటులతో భారీ అంచనాల మధ్య విడుదలైంది.
ఇంతకూ వేట్టయన్ కథ ఏమిటంటే... ఎస్‌పీ అజిత్ (రజినీకాంత్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. న్యాయం జరగడం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా పర్లేదు అనుకునే మనస్తత్వం కలవాడు. లాయర్ సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్.
ఒక ప్రభుత్వ పాఠశాల టీచర్ హత్య ఎందుకు జరిగింది? దాన్ని ఛేదించే క్రమంలో ఎస్‌పీ అజిత్ ఏ స్కామ్స్‌ను బయటపెట్టాడు? చివరకు ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? అన్నదే కథ.


ఫొటో సోర్స్, LycaProductions@Insta
రజినీ, అమితాబ్ కాంబినేషన్ ఎలా ఉంది?
రజినీకాంత్ ఎస్‌పీ అజిత్ పాత్రలో నటించారు. ఎలివేషన్ సీన్స్‌లో, ఫైట్స్‌లో బాగా నటించారు.
సీరియస్ కథకు తగ్గ పాత్ర చిత్రణ లేకపోయినా, ఆయన తన పరిధి మేరకు బాగా నటించారు.
న్యాయవాది, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ సత్యదేవ్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. అమితాబ్ బచ్చన్ పాత్రకు స్క్రీన్ టైమ్, కథలో ప్రాధాన్యం తక్కువ ఉంది.
అలాగే ‘రజినీకాంత్-అమితాబ్ బచ్చన్’ కాంబినేషన్ సీన్లు అంత బాగా లేవు. ఈ కాంబినేషన్ సినిమాకు ప్లస్ కాలేదు.
ఫహాద్ ఫాజిల్ పోలీసులకు సాయం చేసే దొంగ పాత్రలో నటించారు. 'రజనీకాంత్ -ఫహాద్' కాంబినేషన్ సినిమాకు ప్లస్ పాయింట్. ఫహాద్ తన పరిధిలో సినిమాలో హాస్యాన్ని బాగానే పండించారు. ఈ సినిమాకు ఫహాద్ ఫాజిల్ నటన ప్లస్ పాయింట్.

ఫొటో సోర్స్, LycaProductions@Insta
‘రాయన్’ సినిమాతో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న నటి దుషారా విజయన్. ఈ సినిమాలో ‘శరణ్య’ అనే కంప్యూటర్ టీచర్ పాత్రలో నటించారు.
నిడివి తక్కువే అయినప్పటికీ, కథలో ముఖ్య పాత్ర ఇది. ఈ స్ట్రాంగ్ ఎమోషనల్ పాత్రలో దుషారా బాగా నటించారు.
ఏఎస్‌పీ పాత్రలో రితికా సింగ్ ఫరవాలేదనిపించారు.
అభిరామి, శ్రీకృష్ణుడు, రావు రమేష్, రోహిణి అతిథి పాత్రల్లో నటించారు.
రానా దగ్గుబాటి విలన్‌గా నటించినా, ఆయన స్క్రీన్ నిడివి తక్కువ ఉంది. అలాగే పాత్ర చిత్రణ కూడా పేలవంగా ఉంది.
తన వరకూ రానా బాగానే నటించాడు. స్టార్ కాస్ట్ ఉన్నా, ఆ పాత్రలను సినిమాకు ప్లస్ అయ్యేలా డిజైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.
ఆ రెండు పాటలు స్పెషల్
‘మనసిలాయో’ పాటలో ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ కూడా కనిపిస్తారు. అలాగే మంజు వారియర్ డ్యాన్స్, రజనీకాంత్ ఈజ్ వల్ల ఈ పాట ఆకర్షణగా నిలిచింది. ‘మండుతున్న సూర్యుడిలా’ ఎమోషనల్‌గా కనక్ట్ అయ్యే పాట.
ఈ రెండు పాటలు సినిమాకు ప్లస్ పాయింట్స్.
దాదాపుగా సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఎమోషనల్ సన్నివేశాలలో, హీరో ఎలివేషన్ సీన్స్‌లో అనిరుధ్ సంగీతం ‘సినిమాటిక్ అనుభూతి’ని ప్రేక్షకులు గొప్పగా ఫీల్ అయ్యేలా చేసింది.
ఈ సినిమాలో ముఖ్య పాత్ర సత్యదేవ్‌కు (అమితాబ్ బచ్చన్ ) తెలుగు డబ్బింగ్ సరిగ్గా నప్పలేదు.
అలాగే ఇంకొన్ని పాత్రల డబ్బింగ్ కూడా పాత్రలకు తగ్గట్టు లేదు.
దీని వల్ల కూడా ప్రేక్షకులు ఎమోషనల్‌గా స్టోరీతో కనక్ట్ అయ్యే స్కోప్ తగ్గింది.

ఫొటో సోర్స్, LycaProductions@Insta
దర్శకుడు జ్ఞానవేల్ మెప్పించారా?
టీజే జ్ఞానవేల్ నుంచి 'జై భీమ్' సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీని మీద అంచనాలు పెరిగాయి. సామాజిక అంశాలను ప్రేక్షకులతో ఇంటెన్స్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడం జ్ఞానవేల్ డైరెక్షన్ మార్క్.
కానీ ఊహించిన స్థాయిలో ఈ సినిమాలో డైరెక్టర్ మార్క్ కనిపించలేదు. కథ కంటే కూడా సినిమాలో హీరో ఎలివేషన్‌కే ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్న సినిమా ఇది.
కథ కమర్షియల్ హిట్ ఫార్ములా అయినప్పటికీ, సామాజిక అంశాల కేంద్రంగా ఉన్న ఈ సినిమాలో అవి సరిగ్గా నప్పలేదు.
విద్య, న్యాయం అందరికీ సమానంగా అందాలన్న నోట్‌తో సినిమా మొదలవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభించకపోవడం, అక్కడ చదివే విద్యార్థులు నైతిక విలువలు తప్పి ప్రవర్తించడం, ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రావాలని చెప్పడం ఈ సినిమాలోని సామాజిక అంశం.
అలాగే పిల్లల మీద కోచింగ్ చూపే ఒత్తిడి, కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ చేసే మోసాల గురించి కూడా కథతో కనక్ట్ అయ్యే ఎలిమెంట్ ఉంది.
ఈ సినిమాలో ఇవి లోతైన అంశాలు. కానీ వీటిని సినిమాలో సీరియస్‌గా, స్ట్రాంగ్‌గా ప్రెజెంట్ చేయలేకపోయారు. కథ కన్నా హీరోకే ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో ముఖ్య కథ తేలిపోయింది.
ఈ సామాజిక అంశాలను ప్రేక్షకులతో కనక్ట్ అయ్యే బలమైన ఇన్సిడెంట్స్ లేవు. హిట్ ఫార్ములా స్టోరీ ఉన్నా, వాటిని సరిగ్గా చూపించలేదు.

ఫొటో సోర్స్, LycaProductions@Insta
స్క్రీన్ ప్లే ఎక్కడ తప్పింది?
ఈ సినిమాలో దర్శకుడు కథను ఒక హత్య, దాని చుట్టూ అల్లుకున్న సామాజిక సమస్యల కేంద్రంగా రాసుకున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే లాగింగ్‌గా ఉంది.
సెకండ్ హాఫ్‌లో మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నా, అవి పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాలేదు.
ఈ సినిమాలో హీరోను పోలీస్ ఆఫీసర్‌గా బలంగా నిలబెట్టే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ చాలా బలహీనంగా ఉంది.
ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాను యాక్షన్ సినిమాగా మార్చడంతో సినిమాలో ఆత్మ లోపించింది.
ప్లస్ పాయింట్స్ :
1. సంగీతం
2. మనసిలాయో, గుండెలు మండే పాటలు
3. స్టోరీ
4. ఫహాద్ ఫాజిల్ కామిక్ టైమింగ్
మైనస్ పాయింట్స్ :
1. బలహీనంగా పాత్రల చిత్రణ
2. అమితాబ్ బచ్చన్ పాత్రకు తగిన ప్రాధాన్యం లేకపోవడం
3. కొన్ని పాత్రల డబ్బింగ్ నప్పకపోవడం
4. ల్యాగింగ్ ఫస్ట్ హాఫ్
కొంతమేరకు పర్లేదు అనిపించినా, అంచనాలను అందుకోలేకపోయిన సినిమానే ‘వేట్టయన్ -ద హంటర్’.
(అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














