దామగుండం రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఈ ప్రాజెక్టుపై స్థానికుల అభ్యంతరాలేమిటి?

వికారాబాద్ పరిధిలోని దామగుండం అటవీప్రాంతం
ఫొటో క్యాప్షన్, దామగుండం అటవీ ప్రాంతం
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవిలో భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) రాడార్ స్టేషన్‌కు మంగళవారం (అక్టోబర్ 15) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే, ఈ రాడార్ ప్రాజెక్టు వల్ల ఇక్కడి అడవి నాశనమై, మూసీ నది పూర్తిగా దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.

కానీ, అంత తీవ్ర ప్రభావం ఉండదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో దామగుండం అనే అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవి వికారాబాద్ పరిధిలోకి వస్తుంది.

పూడూరు గ్రామం మీదుగా వెళ్తే ఈ అడవి పరిధిలో ఒక పాతకాలం నాటి రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది.

ఈ అడవిని ఆనుకుని చుట్టూ అనేక పల్లెలు ఉన్నాయి.

పశువుల మేత, ఇతరత్రా అవసరాలకు అక్కడివారు ఈ అడవిపై ఆధారపడుతుంటారు. అడవి మధ్యలో కొన్ని తండాలు కూడా ఉన్నాయి.

అనేక చిన్న చిన్న నీటి ప్రవాహాలు ఈ అడవిలో ఉన్నాయి.

ఈ అడవిలో ఇండియన్ నేవీ ఒక రాడార్ స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించింది.

‘భారత నావికా దళం తెలంగాణను ఒక కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలో రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ను వికారాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ వీఎల్ఎఫ్ స్టేషన్ ద్వారా ఓడలు, జలాంతర్గాములతో కమ్యూనికేషన్ చేస్తారు” అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దామగుండం అడవి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వికారాబాద్ అడవులు (ఫైల్ ఫొటో)

ఇదంతా అటవీ భూమి కావడంతో వికారాబాద్ జిల్లా అటవీ అధికారికి, భారత నావికా దళానికి మధ్య తుది ఒప్పందం మూడు నెలల కిందట జరిగింది.

దీని ప్రకారం 1,174 హెక్టార్ల (2,901 ఎకరాలు) అటవీ భూమిని నేవీకి అప్పగించింది తెలంగాణ అటవీ శాఖ.

దీనికి పరిహారంగా తెలంగాణ అటవీ శాఖకు కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(కంపా) నిధులు రూ.133.54 కోట్లు, నేవీ నుంచి మరో రూ.18.56 కోట్లు వచ్చాయి.

2027 నాటికి ఈ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం.

ఇక్కడ రాడార్ స్టేషన్ నెలకొల్పడం మాత్రమే కాకుండా, అందులో పనిచేసే సిబ్బంది స్థానికంగానే నివసించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

రాడార్ స్టేషన్‌లో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తారని ఒక అంచనా. వారంతా అక్కడే ఉండటానికి వీలుగా టౌన్‌షిప్ నిర్మిస్తారు. ఆసుపత్రులు, బ్యాంకు, మార్కెట్.. ఇలా అన్నీ అక్కడకు వస్తాయి.

చుట్టూ 27 కిలోమీటర్ల మేర గోడ కడతారు. దాదాపు రెండున్నర వేల మంది నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

దామగుండం రాడార్ స్టేషన్ నమూనా

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, దామగుండం రాడార్ స్టేషన్ నమూనా

ఏమిటీ వీఎల్ఎఫ్ రాడార్?

వీఎల్ఎఫ్ రాడార్ అంటే ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్. ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటానికి దీన్ని వాడతారు.

ఇది 3 KHz నుంచి 30 KHz రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తుంది. రక్షణ రంగంతో పాటు అనేక ఇతర రేడియో కమ్యూనికేషన్ అవసరాలకు ఇది వాడతారు.

ఈ సిగ్నల్ నీటి లోపల కూడా 40 మీటర్ల వరకూ వెళ్లగలదు కాబట్టి సబ్ మెరైన్లతో కమ్యూనికేషన్‌కి వాడతారు. అంతేకాదు, వెయ్యి కిలోమీటర్ల దూరానికి కూడా చాలా తక్కువ నష్టంతో తరంగాలు వెళ్తాయి.

అంటే కమ్యూనికేషన్ బలహీనం కాదు. వికారాబాద్‌లో స్టేషన్ ఏర్పాటుచేసినా అటు అరేబియా, ఇటు బంగాళాఖాతం.. రెండు సముద్రాలకూ కమ్యూనికేట్ చేయవచ్చు.

యూఎస్, యూకే, రష్యా, నార్వే, పాకిస్తాన్, జర్మనీ, ఆస్ట్రేలియాలకు ఇలాంటి వీఎల్ఎఫ్ రాడార్ వ్యవస్థలు ఉన్నాయి.

భారత్‌కు ఇలాంటి స్టేషన్ ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి దగ్గర ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ పేరుతో ఉంది. అది 1990 నుంచి పనిచేస్తోంది.

రెండో స్టేషన్ కోసం విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే తూర్పు నావికా దళం తెలంగాణలోని వికారాబాద్‌ను ఎంచుకుంది.

ప్రస్తుతం రష్యా, భారత్‌లు వీఎల్ఎఫ్ టెక్నాలజీని నావికా దళం కోసం ఉపయోగిస్తున్నాయి.

వీఎల్ఎఫ్ లాగే ఈఎల్ఎఫ్ (ఎక్స్‌ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ) అనే వ్యవస్థ కూడా ఉంది. ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. దామగుండంలో ఏర్పాటు చేస్తున్నది ఈఎల్ఎఫ్ రాడార్ స్టేషనా లేక వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషనా అనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి.

 దామగుండం అటవీప్రాంతం
ఫొటో క్యాప్షన్, రామలింగేశ్వర స్వామి దేవాలయం

దామగుండంలోనే ఎందుకు?

సాధారణంగా నేవీ అనగానే అందరికీ సముద్రం గుర్తొస్తుంది.

కానీ సముద్రమే లేని తెలంగాణలో నావికా దళ స్టేషన్ ఏంటనేదే చాలామందికి కలిగే అనుమానం.

అయితే భారత్‌కు తూర్పున ఉన్న బంగాళాఖాతం, పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రం – ఈ రెండు సముద్రాల్లోని జలాంతర్గాములతో మాట్లాడటానికి, ఈ రెండు సముద్రాలకూ మధ్య దాదాపు సమాన దూరంలో ఉన్న తెలంగాణలోని వికారాబాద్ ప్రాంతం సరైనది అని నేవీ భావించినట్టు ఒక ప్రభుత్వ అధికారి బీబీసీతో చెప్పారు.

దీనిపై నేవీ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

అడవిపై ఆధారపడే స్థానిక గ్రామాల ప్రజలు
ఫొటో క్యాప్షన్, దామగుండం అటవీప్రాంతం

ప్రక్రియ ఎందుకు ఆలస్యమైంది?

ఈ రాడార్ స్టేషన్ నిర్మాణ ప్రక్రియ 2010లోనే ప్రారంభమైంది. అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వాన్ని నేవీ సంప్రదించింది.

‘‘పర్యావరణ అనుమతులు వచ్చినప్పటికీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేవీకి భూమి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి’’ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో రాసింది.

దానికి ఓ కారణం ఉంది. ఈ ప్రాజెక్టుకు 2014లోనే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు వచ్చాయి.

అదే సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రక్షణ శాఖకు సంబంధించిన భూముల వ్యవహారంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేశారు.

‘‘సికింద్రాబాద్ కేంద్రంగా ఉండే రక్షణ స్థావరాలను నగరానికి దూరంగా మార్చడం, దానికి బదులు రక్షణ శాఖకు కావల్సినన్ని భూములు అందించడం, సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండును సచివాలయ నిర్మాణానికి అడగడం.. ఇలా రకరాకల ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే వాటికి రక్షణ శాఖ ఒప్పుకోలేదు. దామగుండం భూములు నేవీకి ఇవ్వడం గత ప్రభుత్వ హయాంలో ఆలస్యం కావడానికి ఇదే కారణం’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి బీబీసీతో అన్నారు.

అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ వాదన మరోలా ఉంది.

మనుషులతో పాటు, జంతువులకు కూడా రాడార్‌తో ముప్పు ఉందని గుర్తించే బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి చెప్పారు.

దామగుండం అటవీ పరిరక్షణ ఉద్యమానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మద్దతు ప్రకటించారు.

దామగుండం రక్షణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు.


దామగుండం అటవీప్రాంతం
ఫొటో క్యాప్షన్, చెట్లను నరికివేస్తారని పర్యావరణ వేత్తల ఆందోళన

పర్యావరణవేత్తల అభ్యంతరం ఏంటి?

ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చిన దశ నుంచి పలువురు పర్యావరణ వేత్తలు దీనిపై ఆందోళన చేస్తూనే ఉన్నారు. కోర్టులకు కూడా వెళ్లారు.

ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డి, నరసింహారెడ్డి, బీవీ సుబ్బారావు వంటి వారంతా దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

‘‘మూసీ నది సహా చిన్న ప్రవాహాలు కొన్ని ఈ అడవిలోనే పుడతాయి. ఏదైనా అడవిని నరకడం వేరు, నది జన్మస్థలంలో ఉండే చెట్లను నరికి పర్యావరణాన్ని దెబ్బతీయడం వేరు. అనేక చిన్న చిన్న ప్రవాహాలు కలసి నదిగా రూపాంతరం చెందుతాయి. అలా మూసీ నది పుట్టే ప్రదేశం ఈ అడవి. ఒక వైపు లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ అంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదే మూసీ జన్మించిన స్థలాన్ని నాశనం చేయడానికి భూమి ఇచ్చింది. భారతదేశ రక్షణ ముఖ్యమే. కానీ ఇండియన్ నేవీ ఇదే స్థలాన్ని ఎందుకు ఎంచుకోవాలి? రాడార్ స్టేషన్ వద్దు అనడం లేదు. అడవిలేని, నదులు పుట్టని మరేదైనా స్థలంలో రాడార్ స్టేషన్ పెట్టమంటున్నాం. తాము కూడా చెట్లను పెంచుతాం అని అధికారులు అంటున్నారు. సహజంగా పెరిగే అడవికి, వీళ్లు పెంచే సామాజిక అడవులకూ పోలిక లేదు. వందల సంవత్సరాల నుంచి ఏర్పడ్డ గొప్ప పర్యావరణ వ్యవస్థ ఆ అడవి. దాన్ని నాశనం చేసి ఎక్కడో చెట్లను పాతితే సరిపోదు’’ అని బీబీసీతో అన్నారు పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమరెడ్డి.

అక్కడ మొత్తం 12 లక్షల చెట్లను నరికివేస్తారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

దామగుండం అటవీప్రాంతంలో నీటి ప్రవాహం
ఫొటో క్యాప్షన్, దామగుండం అటవీప్రాంతంలో నీటి ప్రవాహం

రేడియేషన్‌పై ఆందోళన

అడవి పోవడంతో పాటు రాడార్ స్టేషన్ వలన రేడియేషన్ ఉంటుందేమోనని గ్రామస్తులు భయపడుతున్నారు.

‘‘అది సముద్రంలో ఓడలకు సిగ్నళ్లు పంపే స్టేషన్. ఇక్కడ నుంచి విశాఖపట్నం, ముంబయి వంటి దూర ప్రాంతాలకు సిగ్నల్ వెళ్లినప్పుడు పక్కనే ఉన్న మాపైన ఆ ప్రభావం పడదా? ఆ రేడియేషన్ వల్ల జబ్బులు వస్తాయి. అడవి నాశనమై పోతుంది. అన్నింటికీ మించి రామలింగేశ్వర దేవస్థానం నేవీ అధీనంలోకి వెళ్తే, మమ్మల్ని స్వేచ్ఛగా తిరగనివ్వరు. రేడియేషన్ వల్ల మేమే కాకుండా పుట్టే పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే ఇక్కడ రాడార్ స్టేషన్ పెట్టొద్దు’’ అని బీబీసీతో అన్నారు దామగుండం అడవిని ఆనుకుని ఉన్న పూడూరు గ్రామానికి చెందిన సుల్తాన్‌పురం రాములు అనే వృద్ధుడు.

అయితే గ్రామంలోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ అంశం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఎక్కువ మంది సిద్ధంగా లేరు.

స్థానిక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా రాడార్ స్టేషన్‌కి మద్దతుగా ఉన్నారు.

ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అంటున్నారు.

పర్యావరణవేత్తలు చెబుతున్నన్ని చెట్లను నరకడం లేదని అటవీ శాఖ అంటోంది. దీనిపై తెలంగాణ అటవీ శాఖ పీసీసీఎఫ్ ఆర్కే డోబ్రియాల్ బీబీసీతో మాట్లాడారు.

మొత్తం 12 లక్షల చెట్లు నరికేస్తారన్న మాట తప్పు అని ఆయన అన్నారు.

రాడార్ స్టేషన్ నిర్మాణం తర్వాత కొత్త చెట్లు పెంచుతామంటున్న అటవీశాఖ
ఫొటో క్యాప్షన్, దామగుండం అటవీప్రాంతంలోని చెట్లు

‘నేవీకి ఇచ్చే స్థలంలో మొత్తం చెట్లు లక్షా 93 వేలు’

‘‘నేవీకి ఇచ్చే మొత్తం స్థలంలో చెట్లన్నీ లెక్కిస్తే లక్షా 93 వేలు ఉన్నాయి. అలాగని అవన్నీ నరికేస్తారని కాదు. ఆ స్థలంలో వారికి భవనాలు నిర్మించే ప్రదేశాల్లో ఉన్న చెట్లను మాత్రమే నరకుతారు. మిగతా చెట్లను అలానే ఉంచేస్తారు. ఎన్ని చెట్లు కూలుస్తారనే విషయంలో కొద్దిరోజుల్లో స్పష్టత వస్తుంది. నాకు తెలిసి వెయ్యిలోపు చెట్లను మాత్రమే నరుకుతారు. వాళ్లకిచ్చిన స్థలంలో ఉన్న చెట్లన్నీ నరికేస్తారనడం సరికాదు. ఇక అక్కడ గోడ కట్టడం వల్ల కూడా పెద్ద నష్టం ఉండదు. ఆ ప్రాంతంలో పెద్ద జంతువులు ఎక్కువగా లేవు. మూసీ నదిపై కూడా ఇది ఎలాంటి ప్రభావం చూపదు. పర్యావరణ వ్యవస్థకు ఏ ఇబ్బందీ లేదు. నేవీకి ఇచ్చిన స్థలానికి ప్రతిగా, వారిచ్చిన డబ్బుతో మేం 17 లక్షల చెట్లను ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల పెంచుతున్నాం’’ అని అన్నారు డోబ్రియాల్.

ఇక అడవి పరిధిలో ఉన్న రామలింగేశ్వర ఆలయానికి భక్తుల రాకపోకలను అనుమతించడానికి నేవీ అంగీకరించినట్టు కూడా అధికారులు చెప్పారు.

దీనిపై ఆరేళ్ల క్రితమే కోర్టుకు వెళ్లారు పర్యావరణవేత్తలు.

‘‘ప్రస్తుతం ఏం జరగబోతోందోనని గమనిస్తున్నాం. మేం దీనిపై పోరాటం కొనసాగిస్తాం’’ అన్నారు పురుషోత్తమ రెడ్డి.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ నేవీ.. రాడార్ స్టేషన్ శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇక్కడ నేవీ తలపెట్టింది వీఎల్ఎఫ్ స్టేషనా.. ఈఎల్ఎఫ్ స్టేషనా? మైదాన ప్రదేశం కాకుండా ఈ అటవీ ప్రదేశం ఎంచుకోవడానికి ఉన్న ప్రత్యేక కారణాలు ఏంటి? వంటి వాటిపై స్పందన కోసం ఇండియన్ నేవీ ప్రధాన కార్యాలయ ప్రజా సంబంధాల అధికారుల్ని బీబీసీ సంప్రదించింది. వారి నుంచి సమాధానం రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)