బంగ్లాదేశ్‌: మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన కిరీటంలోని బంగారాన్ని దోచుకెళ్లిన దొంగ, భారత్ ఎలా స్పందించిందంటే..

మొహమ్మద్ యూనస్

ఫొటో సోర్స్, X/Chief Advisor of the Government of Bangladesh

ఫొటో క్యాప్షన్, ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్‌

బంగ్లాదేశ్‌లో ఇటీవల పూజ మండపాలపై జరిగిన దాడులను, ఒక ఆలయంలో జరిగిన చోరి ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది.

ఇవి చాలా బాధాకరమైన ఘటనలు అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. హిందువులతో పాటు ఇతర మైనార్టీల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.

ఇదే సమయంలో, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ ఆకస్మికంగా శనివారం ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.

నిజానికి ఈ ఆలయానికి ఆదివారం వెళ్లాలని ఆయన షెడ్యూల్ పెట్టుకున్నారు. కానీ, ఒకరోజు ముందే ఆయన ఈ ఆలయానికి వెళ్లారు.

‘‘బంగ్లాదేశ్‌లోని హిందువుల అతిపెద్ద పండగ దసరా (దుర్గా పూజ) సందర్భంగా హిందూ కమ్యూనిటీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు మొహమ్మద్ యూనస్ శనివారం పాత ఢాకాలో ఉన్న ఢాకేశ్వరి ఆలయానికి వెళ్లారు’’ అని బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ తన అధికారిక ‘ఎక్స్’ అకౌంట్‌లో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకల సమయంలో జరిగిన 35 అవాంఛిత ఘటనలకు సంబంధించి 17 మందిని అరెస్ట్ చేసినట్లు ఢాకా పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలతో పాటు బంగ్లాదేశ్‌లోని యశోరేశ్వరి కాళీ మందిరంలో దొంగతనం జరిగింది. ఈ ఆలయంలోని కాళీ మాతకు భారత ప్రధాని నరేంద్ర మోదీ బహమతిగా ఇచ్చిన కిరీటంలో బంగారం ఉన్న భాగం చోరీకి గురైంది.

2021లో బంగ్లాదేశ్‌ను సందర్శించినప్పుడు ప్రధాని మోదీ ఈ కిరీటాన్ని బహూకరించారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి

ఫొటో సోర్స్, Getty Images

భారత విదేశాంగ శాఖ ఏం చెప్పింది?

ఈ చోరీపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

‘‘ఢాకాలోని పూజ హాల్‌ మీద జరిగిన దాడిపై, యశోరేశ్వరి కాళీ మాత ఆలయంలో జరిగిన చోరీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

‘‘ఇవి చాలా బాధాకరమైన సంఘటనలు. ఆలయాలను, దేవతామూర్తులను అపవిత్రం చేసేలా జరుగుతున్న దాడులను గత కొన్ని రోజులుగా గమనిస్తున్నాం. హిందువులకు, ఇతర మైనార్టీలకు, వారు పూజలు చేసుకునే ప్రాంతాల్లో ముఖ్యంగా పండగల సమయాల్లో, భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని విదేశాంగ శాఖ తెలిపింది.

దీనికి ముందు కూడా భారత విదేశాంగ శాఖ స్పందించింది.

‘‘2021లో యశోరేశ్వరి కాళీ మాత ఆలయాన్ని సందర్శించినప్పుడు ప్రధాని మోదీ ఇచ్చిన కిరీటం తాజాగా చోరీకి గురైందని పలు కథనాల్లో చూశాం. దీనిపై మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టి, కిరీటాన్ని తిరిగి తీసుకురావాలి. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఢాకాలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?

దుర్గా పూజల సందర్భంగా ఈ నెలలో బంగ్లాదేశ్‌లో సుమారు 35 అవాంఛిత ఘటనలు చోటు చేసుకున్నాయని ఆ దేశ పోలీసులు చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

ఈ కేసులలో ఇప్పటి వరకు 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢాకాలోని ఒక పూజ మండపాన్ని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఐజీపీ) మొహమ్మద్ మోయినుల్ ఇస్లాం సందర్శించారు. యశోరేశ్వరి ఆలయంలో కిరీటం చోరీకి గురైన తర్వాత, ఐజీపీ ఇస్లాం ఈ మండపాన్ని సందర్శించారు.

ఈ చోరీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, యశోరేశ్వరి ఆలయాన్ని 2021లో సందర్శించిన ప్రధాని మోదీ

కిరీటాన్ని ఎలా దొంగిలించారు?

యశోరేశ్వరి ఆలయంలో కిరీటం చోరీకి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.

ఎవరూ లేని సమయంలో, తెల్ల టీ-షర్ట్, జీన్స్ వేసుకున్న ఒక యువకుడు ఈ ఆలయంలోకి ప్రవేశించినట్లు ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ చూపించింది. కిరీటంలో బంగారం ఉన్న భాగాన్ని తీసుకుని, జేబులోపెట్టుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అందులో కనిపించింది.

ఆ చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని వెతికి పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలిస్తున్నామని చెప్పారు.

మొహమ్మద్ యూనస్

ఫొటో సోర్స్, X/Chief Advisor of the Government of Bangladesh

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ యూనస్‌కు స్వాగతం పలికిన పూజ కమిటీ

బంగ్లాదేశ్‌లో ఇంకెక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయి?

ఢాకాతో పాటు, బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.

చిట్టగాంగ్‌లోని జత్రా మోహన్ సేన్ హాల్‌లో దుర్గా పూజ మండపం వద్ద ఏర్పాటు చేసిన స్టేజీ మీద ఇస్లామిక్ రివల్యూషన్‌కు పిలుపునిస్తూ ఆరుగురు వ్యక్తులు పాటలు పాడినట్లు బీడీన్యూస్24.కామ్ పేర్కొంది.

ఇస్లామిక్ రివల్యూషన్‌కు పిలుపునిస్తూ పాటలు పాడిన వారిలో ఇద్దరిని చిట్టగాంగ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసింది.

ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

స్థానిక హిందూ కమ్యూనిటీని ఈ సంఘటన షాక్‌కు గురి చేసిందని, ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించిందని చిట్టగాంగ్ పూజ పరిషత్ జనరల్ సెక్రటరీ ఉజ్జల్ చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మరింత ఉద్రిక్త, ఆందోళనకర పరిస్థితులకు దారి తీసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)