శంకర్: దిల్లీ జూ ‘వాజా’ సభ్యత్వం కోల్పోయేలా చేసిన ఈ ఏనుగు కథేంటి?

శంకర్

ఫొటో సోర్స్, Ministry of Environment, Forest and Climate Change

ఫొటో క్యాప్షన్, దిల్లీలో జూలోని శంకర్
    • రచయిత, సుమేధ పాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని జంతుప్రదర్శన శాలలో 29 ఏళ్ల ఏనుగు 'శంకర్' చెవులు ఆడిస్తూ గడ్డి నములుతోంది. మొన్నటిదాకా ఉన్న గొలుసులతో బందీ అయిన ఆ ఏనుగు ఇప్పుడు స్వేచ్ఛగా అటు ఇటూ తిరుగుతోంది.

1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగును సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో దిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది.

వాజా అనేది ప్రపంచవ్యాప్తంగా జంతువులు, వాటి ఆవాసాల సంరక్షణకు అంకితమైన ప్రాంతీయ సంఘాలు, జాతీయ సమాఖ్యలు, జంతుప్రదర్శనశాలలు, అక్వేరియంల ప్రపంచ కూటమి.

వాజా విధించిన సస్పెన్షన్‌తో దిల్లీ జూ సభ్యులు వాజా సమావేశాలకు హాజరు కాలేరు. చాలామంది ఈ సస్పెన్షన్‌ కారణంగా జూ విశ్వసనీయత కోల్పోయినట్లు చూస్తున్నారు.

'శంకర్' మాత్రమే కాకుండా, మరో ఆఫ్రికన్ ఏనుగు రిచీ మైసూర్ జూలో ఉంటోంది. 2017 గణాంకాల ప్రకారం భారతదేశంలో 30 వేల ఏనుగులు ఉన్నాయి. వీటిలో చాలా ఏనుగులు పర్యాటకులను ఆకర్షించడానికి, సవారీ కోసం ఉపయోగిస్తున్నారు.

ఇటీవల, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ‘ప్రచురితం కాని ఒక నివేదిక’ను ఉటంకిస్తూ.. గత ఐదేళ్లలో ఏనుగుల సంఖ్య 20 శాతం తగ్గిందని, అనేక ప్రాంతాల్లో 2017తో పోలిస్తే ఇది 41 శాతం వరకు ఉందని పేర్కొంది.

"మా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు న్యూదిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశాం" అని బీబీసీతో వాజా చెప్పింది.

"మేము ప్రస్తుతం ఇంతకన్నా ఎక్కువ సమాచారాన్ని పంచుకోలేం" అని తెలిపింది.

తోడు కోసం పరితపిస్తున్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు జులైలో గొలుసు తగిలి గాయపడింది. ఏనుగులు తోడుకోసం వెంపర్లాడే సమయంలో వాటి ప్రవర్తన చాలా మారుతుంది, అవి దూకుడుగా ఉంటాయి.

సెంట్రల్ జూ అథారిటీ, దిల్లీ జూ డైరెక్టర్‌లకు వాజా రాసిన లేఖలో దిల్లీ జూలో ఆఫ్రికన్ ఏనుగును నెలల తరబడి బంధించి ఉంచారా? అని ప్రశ్నించారు. అయితే, దీన్ని జూ అధికారులు తోసిపుచ్చారు.

2015లో జపనీస్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంలపై వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ చర్యలు తీసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శంకర్

ఫొటో సోర్స్, NIKITA DHAWAN/BBC

ఫొటో క్యాప్షన్, తోడు లేక శంకర్ ఇబ్బంది పడుతోంది

గొలుసుల నుంచి విముక్తి

పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ జూను సందర్శించిన అనంతరం పశువైద్యాధికారి, ఏనుగు సంరక్షకులతో మాట్లాడారు.

శంకర్ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సవివరంగా చర్చించామని, ప్రణాళికను కూడా సిద్ధం చేశామన్నారు మంత్రి.

"తోడుకోసం వెంపర్లాటలో శంకర్ కోపంగా ఉన్నాడు, గోడను బద్దలు కొట్టడం మొదలుపెట్టడంతో బంధించాల్సి వచ్చింది" అని కీర్తి వర్ధన్ సింగ్ బీబీసీతో చెప్పారు.

"తోడు కోసం ఏనుగులు ఇలా ప్రవర్తించడం సహజమే.. శంకర్‌కి తోడును అందించడం, బోనును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు.

"శంకర్‌కు గొలుసులు తొలగించారు" అని మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ఏనుగు సంరక్షకులకు శిక్షణ ఇవ్వాలని, ఏనుగులకు ఆహార ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిపుణులను కోరింది.

శంకర్‌ని పరీక్షించేందుకు వంతార బృందాన్ని కూడా రప్పించారు. వంతారా అనేది గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న హైటెక్ జూ. దీని వ్యవస్థాపకులు పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.

శంకర్‌కు ఆహారప్రణాళికతోపాటు , దాన్ని చూసుకునే వ్యక్తి గురించి కూడా సమావేశంలో చర్చించారు. దీంతో పాటు ఏనుగు పరిస్థితిని తెలుసుకునేందుకు నేరుగా వెళ్లి చూడాలని వంతార టీమ్ నిర్ణయించింది.

శంకర్

ఫొటో సోర్స్, @KVSinghMPGonda

ఫొటో క్యాప్షన్, శంకర్‌కు తోడుకోసం బోట్స్‌వానా, జింబాబ్వేలతో సంప్రదిస్తున్నారు

ఏనుగు సమస్య ఏంటి?

శంకర్ ఒక అరుదైన ఆఫ్రికన్ ఏనుగు. దీనికి ఉండే పెద్ద చెవులు ఇతర ఆసియా ఏనుగుల నుంచి భిన్నంగా కనపడేలా చేస్తాయి. అది ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, శంకర్‌కు తోడుగా బాంబే అనే ఆడ ఏనుగు ఉండేది, 2005లో అది మరణించింది.

తర్వాత, శంకర్‌ను భారతీయ ఏనుగుల మందలో ఉంచారని, అక్కడ ఒక ఆడ ఏనుగు శంకర్‌ను తల్లిలా చూసుకుందని జూ అధికారులు చెబుతున్నారు.

శంకర్ వయసులోకి వచ్చాక, తోడుకోసం పరితపిస్తున్నా సంతానోత్పత్తిలో పాల్గొనకుండా నిరోధించారు, అంతర్జాతీయ చట్టాలు క్రాస్-స్పెసిస్ సంభోగాన్ని నిషేధించడమే దీనికి కారణం.

దీంతో శంకర్‌కు భాగస్వామిగా ఉండేందుకు మరో ఏనుగును విరాళంగా ఇవ్వాలని భారత మంత్రిత్వ శాఖ బోట్స్‌వానా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

శంకర్‌కి తోడు కోసం ఇతర దేశాలతో కూడా సంప్రదిస్తున్నామని దిల్లీ జూ డైరెక్టర్ డాక్టర్ సంజీత్ కుమార్ చెప్పారు.

"మేము ప్రస్తుతం వారితో మాట్లాడుతున్నాం, సమాచారాన్ని పంచుకుంటున్నాం. బోట్స్‌వానా, జింబాబ్వే ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయి" అని ఆయన చెప్పారు.

శంకర్ కోసం ఉద్యమం

ఈ ఏడాది నవంబర్ 3 నాటికి 'జంతు సంక్షేమ లక్ష్యాలు 2023'కి అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే సభ్యత్వం రద్దు కావొచ్చని భారత సెంట్రల్ జూ అథారిటీ (సీజెడ్ఏ)ని వాజా హెచ్చరించింది.

జంతు సంక్షేమ లక్ష్యాలు-2023లో జంతు సంరక్షణ కోసం నిర్దేశించిన ప్రమాణాలను అమలు చేయడం, అనుసరించడం తదితరాలు ఉన్నాయి.

దిల్లీ జూ సీజెడ్ఏ పరిధిలోకి వస్తుంది, ఇది భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద ఉంది. సీజెడ్ఏ భారతదేశంలోని జంతుప్రదర్శన శాలలలో జంతువుల సంక్షేమం, ఆరోగ్యం కోసం ప్రమాణాలు, నిబంధనలను అమలు చేస్తుంది. అంతేకాదు ప్రణాళిక లేని, ప్రమాదకర జంతుప్రదర్శన శాలలను గుర్తించి, సరిగ్గా తీర్చిదిద్దడంలో కూడా భాగంగా ఉంటుంది. దేశంలో జంతు ప్రదర్శన శాల నిర్వహించాలంటే సీజెడ్ఏ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది.

వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) 1935 నుంచి క్రియాశీలకంగా ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో జాతీయ సంఘాలు, జంతుప్రదర్శన శాలలు, అక్వేరియంల కూటమిగా పనిచేస్తుంది. వాజా సభ్యత్వాన్ని సీజెడ్ఏ కోల్పోతే, దేశంలోని అన్ని వాజా అనుబంధ సంస్థలు కూడా తమ సభ్యత్వాన్ని కోల్పోతాయి.

దాన్ని పొందేందుకు సంస్థలు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అంటే, మొత్తం ప్రక్రియను కొత్తగా మొదలుపెట్టాలి.

శంకర్‌ కోసం ఉద్యమించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో శంకర్ ఏళ్ల తరబడి ఒంటరిగా జీవిస్తోందంటూ 'యూత్ ఫర్ యానిమల్స్' అనే ఎన్జీవో వ్యవస్థాపకురాలు నికితా ధావన్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్‌ను జూ నుంచి వన్యప్రాణుల అభయారణ్యంలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు.

ఆఫ్రికన్ ఏనుగులు పెద్దయ్యాక తమ జీవితంలో ఎక్కువ భాగం ఒంటరిగానే గడుపుతుంటాయని, అందుకే శంకర్ ఒంటరిగా ఉండటం సమస్య కాదని వంతారాకు చెందిన డాక్టర్ అడ్రియన్ చెప్పారు.

2023లో 29 ఏళ్ల ఏనుగు ముత్తు అనుచితంగా ప్రవర్తించడంతో దానిని ఇంటికి తిరిగి పంపించారు. ఆ ఏనుగును 2001లో థాయ్ రాజకుటుంబం శ్రీలంకకు బహుమతిగా ఇచ్చింది.

కాగా, అక్టోబర్ 11న కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఎక్స్‌లో ఏనుగు గురించి స్పందిస్తూ..

శంకర్ ఆరోగ్యం, ప్రవర్తన, ఆహారంపై అటవీ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, జూ, వంతారా బృందం, దక్షిణాఫ్రికాకు చెందిన ఏనుగుల నిపుణుడు డాక్టర్ అడ్రియన్, ఫిలిప్పీన్స్‌కు చెందిన మహోత్ మైఖేల్ నుంచి వివరాలు తెలుసుకున్నామని, గతంతో పోలిస్తే శంకర్ ప్రవర్తన చాలా మెరుగైందని తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)