తెలంగాణ కొత్త పాలసీ: మీ పాత వాహనాన్ని తుక్కుగా మార్చేసి, కొత్త వాహనం కొంటే ఎంత రాయితీ వస్తుందంటే..

వాహనాలు, కార్లు, ఆటోలు, డీజిల్, పెట్రోలు, పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో నిర్దేశిత కాలపరిమితి దాటిన పాత వాహనాలను తుక్కు(స్క్రాప్)గా మార్చేందుకు కొత్త పాలసీ తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడ్రనైజేషన్ పాలసీ (వీవీఎంపీ) పేరిట కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఇది రవాణా, రవాణాయేతర (నాన్ ట్రాన్స్‌పోర్ట్) వాహనాలకు వర్తించనుంది.

ఈ కొత్త పాలసీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై స్పష్టత ఇవ్వకపోయినా, దానికి సంబంధించిన విధివిధానాలను మాత్రం రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీకి అనుగుణంగానే రాష్ట్రంలో ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ బీబీసీతో చెప్పారు.

అయితే, ఈ పాలసీపై రవాణా రంగ నిపుణులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

పాత వాహనాలను తుక్కుగా మార్చే పాలసీకి సంబంధించి సందేహాలు, వాటిపై ప్రభుత్వం ఏం చెబుతోందనేది ఒకసారి చూద్దాం.

బీబీసీ న్యూస్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వాహనాలు, కార్లు, ఆటోలు, డీజిల్, పెట్రోలు, పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

పాలసీతో వాహనదారులకు కలిగే ప్రయోజనం ఏమిటి?

1988లో వచ్చిన మోటార్ వాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలకు తగ్గట్టుగా వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడ్రనైజేషన్ పాలసీ (వీవీఎంపీ) తీసుకువస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

‘‘పాలసీ కింద రిజిస్టర్డ్ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ (ఆర్వీఎస్ఎఫ్), ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్) ఏర్పాటు అవుతాయి. పాత వాహనాలను తుక్కుగా మార్చడం వల్ల రోడ్డు భద్రత పెరగడంతోపాటు గాలి కాలుష్యం తగ్గుతుంది. ఇంధనం ఆదా అవుతుంది. వాహన యజమానులకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి’’ అని రవాణా శాఖ చెబుతోంది.

వాహనాలు, కార్లు, ఆటోలు, డీజిల్, పెట్రోలు, పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో నిర్దేశిత కాలపరిమితి దాటిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కొత్త పాలసీ తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్నేళ్లు దాటితే వాహనాలు తుక్కుగా మార్చాలి?

వీవీఎంపీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించిన విధివిధానాల ప్రకారం.. రవాణా వాహనాలు ఎనిమిదేళ్లు కాలపరిమితి దాటితే (రిజిస్ట్రేషన్ తేదీ నుంచి) తుక్కుగా మార్చేందుకు అనుమతి ఉంటుంది.

రవాణాయేతర వాహనాలు, ప్రభుత్వ వాహనాలకు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 ఏళ్ల తర్వాత తుక్కుగా మార్చేందుకు అనుమతి తీసుకోవచ్చు.

వాహనాలు, కార్లు, ఆటోలు, డీజిల్, పెట్రోలు, పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1988లో వచ్చిన మోటార్ వాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలకు తగ్గట్టుగా కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది

పాత వాహనాలు తుక్కుగా మారిస్తే కలిగే ప్రయోజనాలేమిటి?

ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చిస్తే పాలసీ కింద రెండు రకాలుగా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు జేటీసీ రమేశ్ చెప్పారు.

పాత వాహనాలను తుక్కుగా మార్చేశాక కొనుగోలు చేసే కొత్త వాహనాలకు పన్ను రాయితీ అందిస్తారు.

తుక్కుగా మార్చే వాహనాలపై పెండింగులో ఉన్న త్రైమాసిక (క్వార్టర్లీ) టాక్స్, గ్రీన్ టాక్స్‌ను ఏకకాలానికి రద్దు చేస్తారు. ఇది నోటిఫికేషన్ తేదీ నుంచి రెండేళ్ల కాలానికి వర్తిస్తుంది.

ప్రభుత్వ వాహనాల విషయంలో దీర్ఘకాలంగా వినియోగిస్తున్న వాహనాలను మోటారు వెహికల్ చట్టంలోని సెక్షన్ ‘52ఏ’ను అనుసరించి ఈ-వేలం ద్వారా దశలవారీగా స్క్రాప్‌కు పంపించే వీలుంటుంది.

కొత్తగా కొనే వాహనానికి ఎంత పన్ను రాయితీ లభిస్తుంది?

టూ వీలర్, ఫోర్ వీలర్ – ఇలా తుక్కుగా మార్చిన వాహనాన్ని బట్టి అందుకు తగ్గట్టుగా పన్ను రాయితీ పొందవచ్చు.

సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 51ఏ అనుసరించి రవాణా, రవాణాయేతర వాహనాలకు పన్ను రాయితీ కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాల ప్రకారం రవాణా, రవాణాయేతర వాహనాల పరంగా పన్ను రాయితీలు కింది విధంగా లభిస్తాయి.

తెలంగాణ కొత్త తుక్కు పాలసీ

అలాగే, రవాణా వాహనాలకు పది శాతం పన్ను రాయితీ వర్తిస్తుంది. ఇది కొత్తగా రిజిస్టర్ అయిన రవాణా, ఎల్ఎంవీ (లైట్ మోటార్ వెహికల్), ట్రాక్టర్లపై కట్టే త్రైమాసిక, వార్షిక పన్నులపై రాయితీ ఎనిమిదేళ్లపాటు వర్తిస్తుంది.

వాహనాల ఫిట్‌నెస్ తనిఖీకి కేంద్రాలు రానున్నాయా?

రాష్ట్రంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జేటీసీ రమేశ్ చెప్పారు.

ఇప్పటికే జారీ చేసిన విధివిధానాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో దానికి రూ.8 కోట్ల చొప్పున రూ.296 కోట్లు రహదారులు, భవనాల శాఖకు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది.

ఇవి కాకుండా ప్రతి జిల్లా కేంద్రంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ లేదా హెచ్ఎండీఏ పరిధిలో 15 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్టేషన్లు ఏర్పాటయ్యాక ప్రస్తుతం ఆర్టీవో కార్యాలయాల్లో ఉన్న మాన్యువల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేయనుంది.

వాహనాలు, కార్లు, ఆటోలు, డీజిల్, పెట్రోలు, పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుక్కుగా మార్చిన వాహనాల డేటాను ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది

పాలసీపై వస్తున్న అభ్యంతరాలు ఏమిటి?

తుక్కుగా మార్చిన వాహనాల డేటాను ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ వ్యవస్థ అందుబాటులో లేదని చెబుతున్నారు రవాణా శాఖాధికారులు.

నిర్దేశిత కాలపరిమితి దాటిన వాహనాలను తుక్కుగా మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అందుకు తగ్గ సదుపాయాలు లేవని అభిప్రాయపడ్డారు రవాణా రంగ నిపుణులు సీఎల్ఎన్ గాంధీ.

‘‘స్క్రాప్ కింద మార్చే యూనిట్ ఏర్పాటు చేయాలంటే పెట్టుబడి భారీ ఎత్తున కావాలి. అందుకు తగ్గట్టుగా పెట్టుబడిదారులు ముందుకు రావాలి. తుక్కుకు అప్పగించిన తర్వాత సర్టిఫికెట్ ఇచ్చేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

ఆ వాహనాల డేటాను సెంట్రల్ సర్వర్‌తో అనుసంధానం చేయాలి. లేకపోతే తుక్కుగా మార్చామని చెప్పి.. ఇతర రాష్ట్రాలకు తరలించి నడిపించే అవకాశం ఉంది.

అలాగే ఆ డేటా అన్ని రాష్ట్రాలకూ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే పాలసీని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి వీలవుతుంది’’ అని చెప్పారు సీఎల్ఎన్ గాంధీ.

వాహనాలు, కార్లు, ఆటోలు, డీజిల్, పెట్రోలు, పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో వాహనాల సంఖ్య (2024 మే 31 నాటికి)

  • మొత్తం వాహనాలు – 1,65,65,130
  • ఆటో రిక్షాలు – 4,88,786
  • కాంట్రాక్టు క్యారేజీ – 5613
  • ఈ-రిక్షా – 244
  • స్కూల్, కాలేజీ బస్సులు - 29869
  • గూడ్స్ క్యారేజీ – 6,33,364
  • మ్యాక్సీ క్యాబ్ – 27,948
  • మోటారు క్యాబ్ – 1,36,902
  • కార్లు – 22,18,906
  • ద్విచక్ర వాహనాలు – 1,21,74,353
  • ప్రైవేటు సర్వీస్ వాహనాలు – 3135
  • స్టేజీ క్యారేజస్ – 9071
  • ట్రాక్టర్లు, ట్రాలీలు – 745,231
  • ఇతర వాహనాలు – 91708

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)