జమ్మూకశ్మీర్: బీజేపీకి చెందిన ఈ ఏకైక మహిళా ఎమ్మెల్యే ఎన్‌సీ అభ్యర్థిని ఎలా ఓడించారు?

ఫొటో సోర్స్, Instagram/ShagunPariharbjp
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 మంది సభ్యులకు గానూ ముగ్గురు మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు నేషనల్ కాన్ఫరెన్స్ టిక్కెట్‌పై గెలుపొందగా, మరొకరు జమ్మూ ప్రాంతంలో బీజేపీ టిక్కెట్ మీద గెలిచారు.
నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన షమీమ్ ఫిర్దౌస్, సకీనా మసూద్, బీజేపీకి చెందిన శగున్ పరిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
‘‘రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని, అంతా అకస్మాత్తుగా జరిగిపోయిందని’’ శగున్ పరిహార్ బీబీసీతో అన్నారు.
‘‘మా నాన్నను, పెదనాన్నను పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు హత్య చేసినప్పుడు, ప్రజలెవరూ రాజకీయాల్లోకి రాకూడదనే భయాన్ని సృష్టించే ప్రయత్నం జరిగింది. కానీ నేను ఎవరికీ భయపడను. ప్రజలకు సేవ చేయడానికి నా ప్రాణాలను పణంగా పెట్టడానికైనా సిద్ధమే. పార్టీ నన్ను అందుకు తగిన మనిషి అని భావిస్తే, నేను ఆ బాధ్యతను నిర్వర్తిస్తాను.’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.

జమ్మూలో మాత్రమే బీజేపీ ఎందుకు గెలిచింది? బీజేపీకి హిందువులు మాత్రమే ఓటేశారా?
దీనిపై శగున్ స్పందిస్తూ, ‘‘మా పార్టీ కశ్మీర్ లోయలో విజయం సాధించలేదనేది నిజమే, కానీ హిందువులు మాత్రమే బీజేపీకి ఓటు వేశారని దీని అర్థం కాదు’’ అన్నారు.
‘‘2019 తర్వాత జమ్మూకశ్మీర్‌లో సాధారణ జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రజలు ఆర్టికల్ 370కి గురించి చర్చించడం లేదు. రాష్ట్రంలో సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్న కొన్ని పార్టీలే దీనిని ఒక సమస్యగా చూస్తున్నాయి.’’
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్య సమస్యపై శగున్ మాట్లాడుతూ, "ఈసారి ముగ్గురు మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. మహిళా ప్రాతినిధ్యం పెరిగినప్పుడే మహిళా సమస్యలకు ప్రాధాన్యం లభిస్తుంది.’’ అన్నారు.
సెప్టెంబరు 18న కిష్త్‌వార్‌లో మొదటి దశ ఓటింగ్ జరగగా, ఇక్కడి నుంచి శగున్ పరిహార్ విజయం సాధించారు. గెలిచిన తరువాత మీరు చేసే మొదటి పని ఏమిటని శగున్ పరిహార్‌ను జర్నలిస్టులు ప్రశ్నించారు.
దానికి ఆమె, ‘‘భద్రతా సమస్య కారణంగా, మేం మా సైనిక సిబ్బందిలో చాలా మందిని కోల్పోయాం, నేను నా తండ్రిని, పెదనాన్నను కోల్పోయాను, కొంతమంది వాళ్ల సోదరులను కోల్పోయారు, మరికొందరు వాళ్ల కొడుకులను కోల్పోయారు. మేం అనుభవించిన బాధలను మరెవరూ అనుభవించకూడదు,’’ అన్నారు.
జమ్మూ ప్రాంతంలో బీజేపీ 29 సీట్లు గెలుచుకోగా, వారిలో 28 హిందువులు, ఒకరు సిక్కు.

ఫొటో సోర్స్, ANI
శగున్‌ను ‘కుమార్తె’ అని సంబోధించిన ప్రధాని
జమ్మూ ప్రాంతంలో బీజేపీ కిష్త్‌వార్ టిక్కెట్‌ను శగున్ పరిహార్‌కు ఇచ్చింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమె తరపున ఎన్నికల ప్రచారం చేశారు. శగున్ తండ్రి, పెదనాన్నను మిలిటెంట్లు హత్య చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి ప్రస్తావించారు.‘‘ ఆమె తండ్రి, పెదనాన్న చేసిన త్యాగం గొప్పది. శగున్ వయసు గురించి ఆలోచించకండి. ఆమె కుటుంబం చేసిన త్యాగాన్ని చూడండి’’ అని అమిత్‌షా ప్రసంగించారు.
దోడాలో జరిగిన మరో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ శగున్ పరిహార్‌ను 'కూతురు' అని సంబోధించారు.
శగున్ పరిహార్ ఎన్నికల ప్రచారంలో మిలిటెంట్లు, వారివల్ల ఆమె వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన లోటే కీలక అంశాలుగా మారాయి.
అక్టోబర్ 8న ప్రకటించిన ఫలితాల్లో 29 ఏళ్ల శగున్ పరిహార్ విజయం సాధించారు.
ఇక్కడ ఆమె నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజాద్ అహ్మద్ కిచ్లూతో పోటీ పడ్డారు. హోరా హోరీగా జరిగిన పోటీలో శగున్ సజాద్ అహ్మద్‌పై కేవలం 521 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
శగున్‌కు 29,053 ఓట్లు , సజాద్ అహ్మద్‌కు 28,532 ఓట్లు వచ్చాయి.
శగున్‌కు 48 శాతం ఓట్లు రాగా, సజాద్ అహ్మద్‌కు 47.14 శాతం ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, ANI
ఇదీ శగున్ నేపథ్యం
శగున్ పరిహార్ 2021లో ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్‌లో ఎంటెక్ డిగ్రీని పొందారు. దానికి ముందు ఆమె 2017 లో హిమాచల్ ప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీ నుంచి బీఈ పాసయ్యారు.
ఆమె తనకు 92.40 లక్షల ఆస్తులు, రూ.18,000 నగదు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
బీజేపీ ఆమెను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, పరిహార్ తన పీహెచ్‌డీ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు, ఆమె రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకూ సిద్ధమవుతున్నారు.
2018లో శగున్ పరిహార్ తండ్రి అజిత్ పరిహార్, ఆయన సోదరుడు అనిల్ పరిహార్‌లను వాళ్ల ఇంటి సమీపంలో ఉగ్రవాదులు కాల్చిచంపారు.
ఆ సమయంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, అనిల్ పరిహార్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
‘‘మా నాన్నను, పెదనాన్నను స్థానిక ముస్లింలు కూడా ప్రేమిస్తారు. ఇది పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాదులకు నచ్చలేదు’’ అని శగున్ చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాద ప్రాబల్యం ఉన్నప్పుడు సైతం అనిల్ రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
షమీమ్ ఫిర్‌దౌస్
షమీమ్ ఫిర్‌దౌస్ నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకురాలు, పార్టీ మహిళా ఫ్రంట్ అధ్యక్షురాలు.
హబ్బా కడల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అశోక్ భట్‌పై షమీమ్ ఫిర్‌దౌస్ 9,538 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇక్కడ మొత్తం 19229 ఓట్లు పోల్ కాగా అందులో షమీమ్ ఫిర్‌దౌస్‌కు 12437 ఓట్లు రాగా, అశోక్ కుమార్ భట్‌కు 2899 ఓట్లు మాత్రమే పడ్డాయి.
2008, 2014లోనూ హబ్బా కడల్ నుంచి షమీమ్ గెలిచారు.

ఫొటో సోర్స్, ECI
సకీనా మసూద్
సకీనా మసూద్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఆమె పార్టీ సీనియర్ నాయకురాలు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని డీహెచ్ పోరా అసెంబ్లీ స్థానం నుంచి ఆమె గెలుపొందారు.
ఆమెకు 36,623 ఓట్లు పడ్డాయి. ఆమె పీడీపీకి చెందిన గుల్జార్ హమద్ దార్‌పై 17,449 ఓట్లతో విజయం సాధించారు.
సకీనాకు పరిపాలనా రంగంలో మంచి అనుభవం ఉంది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు సాంఘిక సంక్షేమం, పరిపాలనా సంస్కరణలు, విద్య, పర్యాటకం వంటి శాఖలను నిర్వహించారు.
జమ్మూకశ్మీర్‌లోని 90 సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి 48 సీట్లు రాగా, బీజేపీకి 29 సీట్లు, పీడీపీకి 3 సీట్లు వచ్చాయి.
తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సీటు, సీపీఎం, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్‌లకు ఒక్కో సీటు లభించింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయమైంది. గురువారం ఒమర్ అబ్దుల్లా ఎన్‌సీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














