జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద దాడులు, బీజేపీకి చెందిన మాజీ సర్పంచ్ మృతి, ఇద్దరు పర్యటకులకు గాయాలు

జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, ANI

కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు తీవ్రవాద దాడుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షోపియాన్‌లో జరిగిన దాడిలో ఐజాజ్ అహ్మద్ అనే వ్యక్తి మరణించారు.

అనంతనాగ్‌లో రెండో దాడి జరిగింది. అక్కడ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పర్యటకులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

కశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికల పోలింగ్ జరగడానికి రెండు రోజుల ముందు ఈ దాడులు జరిగాయి.

జమ్మూకశ్మీర్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరుగుతుండగా.. శ్రీనగర్ లోక్ సభ స్థానానికి మే 13న పోలింగ్ పూర్తయింది. బారాముల్లాలో మే 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నాయి.

పోలీసులు ఏమంటున్నారు?

రెండు దాడులకు సంబంధించి కశ్మీర్ జోన్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొదటి దాడి అనంతనాగ్‌లోని యాన్నార్‌లో జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన ఫర్హా, ఆమె భర్త తబ్రేజ్‌‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.

''రెండో దాడి షోపియాన్‌లో జరిగింది. హుర్పోరాలో ఐజాజ్ అహ్మద్ అనే వ్యక్తిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన స్థితిలో ఐజాజ్‌ను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.''

జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, X/Twitter

ఈ రెండు ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులను మోహరించామని, కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

యాన్నార్‌లోని ఓపెన్ టూరిస్ట్ క్యాంపు ప్రాంతంలో శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి.

ఈ ఘటన జరిగిన అరగంట తర్వాత, అంటే రాత్రి 10.30 గంటలకు షోపియాన్‌లో ఐజాజ్ అహ్మద్ షేక్‌ లక్ష్యంగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు.

వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, ఐజాజ్ అహ్మద్ మాజీ సర్పంచ్, ఆయన బీజేపీ మద్దతుదారుగా ఉన్నారు. తీవ్రగాయాలపాలైన ఐజాజ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.

రాత్రి 10.36 నిమిషాలకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఐజాజ్ అహ్మద్ కుటుంబ సభ్యుడు ఇర్ఫాన్ అహ్మద్ షేక్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

''10-15 నిమిషాల తర్వాత, ఐజాజ్‌‌పై కాల్పులు జరిపినట్లు వాళ్ల అమ్మ చెప్పారు. వెంటనే మేం ఐజాజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ, అప్పటికే ఐజాజ్ చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి'' అని ఆయన చెప్పారు.

''కాల్పులు జరిపిన వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో, ఎటు వెళ్లిపోయారో తెలియదు'' అని ఆయన అంటున్నారు.

జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

"పహల్గామ్‌లో ఇద్దరు పర్యాటకులపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నా. దాని తర్వాత షోపియాన్‌లోని హుర్పోరాలో సర్పంచ్‌పై దాడి జరిగింది'' అని ఆమె అన్నారు.

"కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. ఎలాంటి కారణం లేకుండా ఎన్నికను వాయిదా వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడులు ఆందోళనకరం" అన్నారు.

మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్-రాజౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి మే 7న పోలింగ్ జరగాల్సి ఉండగా, ఎన్నికల సంఘం మే 25కి వాయిదా వేసింది.

జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, X/Twitter

ఈ దాడులను జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఖండించారు.

అనంతనాగ్, షోపియాన్‌లో జరిగిన దాడులను ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఖండించారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలకు ఇలాంటి క్రూరమైన దాడులు భంగం కలిగిస్తున్నాయి'' అని నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, శాంతి, సామరస్యం కోసం కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబం ధైర్యంగా ఉండాలని, బాధితులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్లు అందులో రాశారు.

జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, X/Twitter

షోపియాన్‌లో మాజీ సర్పంచ్ ఐజాజ్ అహ్మద్ షేక్ హత్యను ఖండిస్తూ బీజేపీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

''ఐజాజ్ అహ్మద్ జమ్మూ కశ్మీర్‌‌కి చెందిన బీజేపీ వీర సైనికుడు. తీవ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది'' అని ఆ పార్టీ పేర్కొంది.

జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, X/Twitter

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)