పెళ్లి వద్దనుకుంటున్న అమ్మాయి, అబ్బాయి కథ

పెళ్లిళ్లపై విముఖత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ కోసం

ఆధునిక భారత సమాజంలో పెళ్లితో జీవితం సెటిల్ అయిపోయినట్లే అని భావించే యువత సంఖ్య మెల్లగా తగ్గుతోంది. పెద్దవాళ్ళను సంతృప్తిపరచాలనో, సమాజం కోసమో తమ ఇష్టాలకు వ్యతిరేకంగా బతకాలని వాళ్లు అనుకోవడం లేదు.

పెళ్లి తమకు సరిపడదు అనుకుంటున్న ఇద్దరు యువతీయువకులతో బీబీసీ మాట్లాడింది.

జీవితం ఆనందంగా గడపడానికి పెళ్లి ముఖ్యం కాదు అని స్పష్టంగా చెప్పే హైదరాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వినయ్ (పేరు మార్చాం) తన కథను బీబీసీతో పంచుకున్నారు.

‘‘ఉద్యోగం వచ్చింది, ఇక సంబంధాలు చూడటం మొదలుపెడతాం’’.. ఉద్యోగంలో కాస్త సెటిల్ అవ్వగానే, ఇంట్లో వాళ్లు వినయ్‌ను అడిగిన మాట ఇది.

తను వద్దు, టైం కావాలని అడిగాడు.

వెంటనే వాళ్లు ‘‘ఎవరినైనా ప్రేమిస్తున్నావా?’’ అని ప్రశ్నించారు.

అలా ఏం కాదు, కానీ తనకు టైం కావాలని వినయ్ అన్నాడు. దానికి వాళ్లు సరే అన్నారు. అప్పటికి వినయ్ వయస్సు 27 సంవత్సరాలు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వినయ్ ఇంజినీరింగ్ చేసి, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పని చేసి, చివరకు ఒక యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ ప్రొఫెషనల్‌గా స్థిరపడ్డాడు.

చదివింది ఇంజనీరింగ్ అయినా, తన మనసుకు దగ్గరైన పని క్రియేటివ్ రంగం అని గుర్తించాడు.

వినయ్‌కు చేసే ఉద్యోగంపై ఎంత స్పష్టత ఉందో, జీవితంపైనా అంతే స్పష్టత ఉంది.

సాధారణంగా టీనేజ్ నుంచే ప్రేమలు, ఇష్టాలు మొదలవుతాయి. వినయ్‌కు ఎవరినైనా చూసి ఆకర్షణ కలిగినా, ఎవరితోనైనా ప్రేమలో పడాలి అనే భావన మాత్రం కలగలేదు.

కోవిడ్ లాక్‌డౌన్‌లో వినయ్ ఇంట్లో అందరూ ఒకచోట ఉన్నప్పుడు, అతని పెళ్లి ప్రస్తావన వచ్చింది.

ఇప్పటికైనా పెళ్లి చేసుకో, ఒక పని అయిపోతుంది అని బంధువులు అన్నారు.

"పెళ్లి అంటే ఒక పనా? నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు" అని వినయ్ అన్నాడు. అతని మాటలు వాళ్లకు షాక్‌లా తగిలాయి.

ఎవరినీ ప్రేమించలేదంటున్నావు, పెళ్లి వద్దంటున్నావు, నీ సమస్య ఏంటి? అంటూ చాలా ప్రశ్నలు వేశారు.

వినయ్ తల్లిదండ్రులకు అతని నిర్ణయంపై కోపం వచ్చింది.

వాళ్లు, ‘పెళ్లి చేసుకోకుంటే ప్రాణాలు తీసుకుంటాం’, ‘ఇంటికి పెద్ద కొడుకుపెళ్లి చేసుకోకపోతే, నలుగురూ ఏమంటారు’, ‘ఇంకా మీ అబ్బాయికి పెళ్లి చేయరా అని అడుగుతుంటే, ఏమని సమాధానం చెప్పాలి,’ ఇలా రకరకాలుగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు.

single

అయితే వినయ్ తన ఆలోచనలను వాళ్లకు స్పష్టంగా చెప్పేశాడు.

అతని మాటల్లో చెప్పాలంటే..

"నేను పెళ్లి చేసుకుని ఒక బంధంలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. అలా అని, నేను హద్దులు మీరి విచ్చలవిడిగా ప్రవర్తించాలని కూడా అనుకోవడం లేదు. నా పరిమితులు నాకు తెలుసు. మీ ఆనందం కోసం నేను పెళ్లి చేసుకుంటే, అవతలి అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది. అప్పుడు రెండు జీవితాలు సమస్యలో పడతాయి. ఇవన్నీ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మా అమ్మానాన్నలను అడిగాను’’

‘‘నేను పెళ్లి వద్దు అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేనేమీ ప్రేమలో ఫెయిల్ అవ్వలేదు. లివ్-ఇన్‌లో భంగపడలేదు. హాస్టల్స్‌లో ఉంటూ చదువుకున్నాను. నేను మెట్రో సిటీలలో రకరకాల కార్పొరేట్ సంస్ధల్లో ఉద్యోగాలు చేశాను.’’

‘‘నాతో నేను గడపడం నాకిష్టం. నా కంపెనీని నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఒక వ్యక్తితో గాఢమైన బంధంలో ఇరుక్కోలేను. అలా అని నాకు మనుషులంటే ఇష్టం లేదని కాదు, అందరితో మాట్లాడతాను. నలుగురితో కలిసి ఉంటాను. కానీ పెళ్లి అనే ఒక తంతు, తర్వాత వచ్చే జీవితాన్ని నేను హ్యాండిల్ చేయలేనని మాత్రం అనిపించింది.’’

పెళ్లిళ్లపై విముఖత

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఎవరైనా ఒక వ్యక్తి నా స్పేస్‌లో ఒక వారం రోజులు ఉంటే, నా విషయాల్లో జోక్యం చేసుకోనంత వరకు బాగానే ఉంటుంది. కానీ, అవతలి మనిషి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నన్ను నేను మలచుకోవలసి వస్తే చాలా ఇబ్బంది పడతాను. ఈ ధోరణి ఎప్పుడైతే నాకర్ధం అయిందో, నేను పెళ్లి అనే బంధంలో ఇమడలేనేమో అనిపించింది.’’

‘‘అమ్మా, నాన్న, బంధువులు నాకు చాలా నచ్చజెప్పాలని చూశారు. ‘ఇప్పుడంటే వయసులో ఉన్నావు, మరి వయసు పెరిగాక నీకంటూ ఒక తోడు, ఒక కుటుంబం ఉండాలి కదా’ అన్నారు.’’

‘‘నాకు వారసత్వం, రక్తం పంచుకుని పుట్టే పిల్లలు - ఇలాంటి వాటిపై నమ్మకం లేదు. ఈ ఆలోచనే లేనప్పుడు, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అనే ఆలోచన ఎందుకు వస్తుందని అడిగాను.’’

‘‘లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో ఉండేందుకు వ్యక్తిగతంగా అభ్యంతరాలు లేనప్పటికీ, నచ్చిన వ్యక్తి జీవితాంతం ఒకే మాదిరిగా ఉంటారనే నమ్మకం లేదు’’

‘‘ఒంటరితనం లేదని కాదు. చాలాసార్లు ఒంటరితనం ఆవహిస్తుంది. కానీ, అలాంటి ఒక దశలో ఒక పిల్లిని పెంచుకున్నాను. నా ప్రేమ, కేర్ దానిపై చూపించాను. ఆ పిల్లి చాలా దగ్గరైపోయింది. నా బంధాన్ని పిల్లి చుట్టూ అల్లుకున్నాను. మన జీవితంలో మొదటిసారి ఒక వ్యక్తి అడుగుపెడితే, ఆ వ్యక్తి కోసం ఎలా ఆలోచిస్తామో, మెలుగుతామో, అలా ఆ పిల్లితో ఉండటం మొదలయింది. అది నా కోసం ఎదురు చూసేది. బెంగ పెట్టుకునేది. నేను కూడా దానిని చూడకుండా ఉండలేకపోయేవాడిని.’’

‘‘ఒక ఏడాది తర్వాత నాకు ఎలర్జీ మొదలయింది. డాక్టర్లు పిల్లితో దూరంగా ఉండాలని చెప్పారు. చాలా కష్టంగా అనిపించింది. ఒక అడాప్షన్ హోమ్ చూసి, వాళ్లు ఆ పిల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అని నిశితంగా పరిశీలించి, ప్రేమించిన వ్యక్తిని అప్పగింతలు పెట్టినంత జాగ్రత్తగా వదిలిపెట్టి వచ్చాను’’

‘‘వినడానికి మీకు పిల్లే కదా అనిపించొచ్చు. కానీ, ఆ పిల్లి చుట్టూ ఒక మానసిక బంధాన్ని సృష్టించుకున్నాను అని నాకనిపించింది.’’

పెళ్లిళ్లపై విముఖత

ఫొటో సోర్స్, Getty Images

‘‘నాకిప్పుడు 34 సంవత్సరాలు. ఇప్పటివరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదు. ఒకవేళ ప్రేమిస్తే, ఆ ప్రేమను పెళ్లి అనే బంధంలో ఇరికించాలని మాత్రం అనుకోవడం లేదు. ఒక మనిషితో కలిసి ఉండేందుకు ఇవేమీ అవసరం లేదు అని అనుకునే వ్యక్తి నా జీవితంలో తారసిల్లినప్పుడు, సహజీవనం గురించి ఆలోచిస్తానేమో. కానీ పెళ్లి చేసుకునే ప్రసక్తి మాత్రం లేదు’’

‘‘నా ఆలోచనలు సాధారణ సమాజపు ఫ్రేమ్ వర్క్‌లో ఇమడవు. నేను బంధువుల నుంచి చాలా రకాల అవమానాలు ఎదుర్కొన్నాను. వాడు మా ఫంక్షన్స్‌కు రాకుండా ఉంటే మంచిది. ‘వస్తే మా పిల్లలూ వాడిలా మాట్లాడటం మొదలుపెడతారు’, ఇలాంటి మాటలు విని బాధపడ్డాను. ఒక్కొక్కసారి ప్రాణాలు తీసుకోవాలని కూడా అనిపించింది.’’

‘‘కానీ, సమాజం వేసిన ఒక ప్రశ్నకు, తిరిగి తూటాలాంటి సమాధానం చెప్పగలిగే ధైర్యాన్ని తెచ్చుకున్నాను. ఇతరుల మాటలు పట్టించుకోవడం మానేశాను. నేను సమాజపు ఆమోదం కోసం ఎదురు చూడటం మానేశాను. నాలా మరొకరు ఉండాలని, ప్రభావితం చేయాలని కూడా అనుకోను. మొదట్లో అలా అడిగేవాళ్ళ మీద చాలా కోపం వచ్చేది. తర్వాత జాలిపడటం మొదలుపెట్టాను.’’

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

‘‘నా ఆలోచనలను అర్ధం చేసుకున్న మా అమ్మ, నాన్న ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకు రావడం మానేశారు.’’

‘‘ఇవన్నీ విన్న మా నానమ్మ మాత్రం, ఒక మాట అంది: ‘నీకిప్పుడు ఉన్నంత జ్ఞానం నా వయసులో నాకు ఉండి ఉంటే , నా జీవితాన్ని మరింత బాగా తీర్చిదిద్దుకుని ఉండేదాన్ని.’ నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్లతో నా కష్టసుఖాలు షేర్ చేసుకుంటాను. కానీ, నేను ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడను. మనకు మనమే బెస్ట్ ఫ్రెండ్.’’

‘‘ప్రస్తుతం నాకొక స్నేహితురాలు ఉంది. తనతో కలిసి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాను. ఇద్దరం కలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కానీ, అది పెళ్లి చేసుకునే బంధం కాదు. మేము ఒకే ఇంట్లో కలిసి ఉంటే మా ఇద్దరి స్నేహంలో కూడా సమస్యలు రావచ్చు. తనొక మంచి కంపానియన్. నేనీ బంధాన్ని పెళ్ళిలో ఇరికించాలనుకోవడం లేదు.’’

‘‘కుటుంబంలో స్వేచ్ఛగా మాట్లాడగలిగే పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా సాధ్యమవుతుంది. నేను చదివిన పుస్తకాలు నా ఆలోచనలను చాలావరకు ప్రభావితం చేశాయి. ఆధ్యాత్మికత, యోగ, వంట చేయడం నాకు చాలా సహకరించాయి.’’

వినయ్ ఇలా సుదీర్ఘంగా తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నాడు.

పెళ్లిళ్లపై విముఖత

ఫొటో సోర్స్, Getty Images

ఇదే మాదిరిగా పెళ్లి వద్దు అనుకున్న హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి (33 సంవత్సరాలు) కూడా బీబీసీతో తన ఆలోచనలను పంచుకుంది.

లక్ష్మి ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తోంది.

‘‘నేను 90లలో పుట్టిన అమ్మాయిని. పూర్తిగా ఆధునికం కాదు, అలా అని పాతకాలపు ఆలోచనలు కూడా లేవు. నేను ప్రేమలో విఫలం అయ్యాను. 10 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత, ఇద్దరికీ పడడం లేదంటూ తను వెళ్ళిపోయాడు. మరొకరిని నా జీవితంలో ఊహించుకోలేకపోవడం వల్ల ప్రేమ, పెళ్లి భారంగా అనిపించాయి.’’

‘‘అలా అని నేను జీవితం పట్ల ఆశను కోల్పోలేదు. నా ఉద్యోగం, నా చిన్న చిన్న సంతోషాలు అన్నీ మామూలే. మాది నెల్లూరు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగంలో చేరిన తర్వాత నా ఆలోచనలకు మరింత స్పష్టత వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత అవతలి వ్యక్తి నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తాడనే గ్యారంటీ ఏమిటి? నేను సంపాదించుకుంటున్నాను, నా బ్రతుకు నేను బ్రతకగలను. అమ్మా, నాన్నను చూసుకోగలను. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్లాలంటే ఇంట్లో ఒక్క మాట చెప్పి వెళ్ళవచ్చు. అది ఫ్రెండ్స్‌తో సినిమాకు కావచ్చు, లేదా ఒక ట్రిప్ కావచ్చు. అదే, పెళ్ళైన తర్వాత ప్రతి చర్యా భర్త, అవతలి కుటుంబంతో ముడిపడి ఉంటుంది.’’

‘‘అప్పుడు నేను నా స్వతంత్రం కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. రెండుచోట్లా నా పట్ల ప్రేమ లేదా బాధ్యత ఉండొచ్చు. కానీ, అత్తింట్లో ఉండే కంట్రోల్ లేదా అనుమానాలను నేనెందుకు భరించాలి?’’

‘‘పెళ్ళైన తర్వాత ఎంతమంది తమ భాగస్వాముల విషయంలో నమ్మకంగా ఉంటున్నారు? ఇలాంటి చాలా భయాలు నాలో ఉన్నాయి. ఇంట్లో అమ్మానాన్నలు ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా అంటారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఇంకా పెళ్లి చేసుకోలేదా అని అడుగుతారు. మొదట్లో నలుగురిలోకి వెళ్లేందుకు, ప్రశ్నలను ఎదుర్కోవడానికి భయపడేదానిని. కానీ, నేనేం తప్పు చేసాను అనే ఆలోచనతో ఇప్పుడు అన్ని చోట్లకూ వెళుతున్నాను.’’

‘‘మొదట్లో బాధపడేదానిని. నెమ్మదిగా అలవాటు పడిపోయాను. ఇప్పుడు చూద్దాం లెండి అని నవ్వేస్తాను. ఎవరినైనా దంపతుల్ని చూసినప్పుడు ఒక్క క్షణం నాకు కూడా పెళ్ళై ఉంటే, కుటుంబం పిల్లలు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. కానీ, అది క్షణం మాత్రమే. ఇప్పటికి నా ఆలోచన ఇది. ఐదేళ్ల తర్వాత ఎలా ఆలోచిస్తానో నాకు తెలియదు.’’

‘పెళ్లి వద్దనుకునే వాళ్లు పెరుగుతున్నారు’

‘‘జెన్ జీ, జెన్ ఆల్ఫాలో పెళ్లి వద్దనుకునే వాళ్ళ శాతం ఎక్కువగానే ఉంది. పెళ్లంటే ఒక గమ్యం లేదా సెటిలై పోవడం కాదు, అదొక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే బాధ్యతలను, బరువును మోసేందుకు చాలా మంది సిద్ధంగా లేరు,’’ అని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ కవిత పాణ్యం అన్నారు.

‘‘పితృస్వామ్యం విధించిన కట్టుబాట్లు, అమ్మాయిలపై పడే భారం, వారిపై నియంత్రణ, భార్యాభర్తల జీవితాల్లో ఇరు కుటుంబాల అనవసర జోక్యం, తద్వారా వచ్చే కలహాల లాంటివి అలోచించి అమ్మాయిలు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. అమ్మాయిల్లో కనిపించే స్వతంత్ర భావాలు, సంపాదన, ఒక వ్యక్తిత్వం కలిగి ఉండటం, కుటుంబం కెరీర్‌కు ఆటంకం అనే ఆలోచనలు అబ్బాయిలను పెళ్లి వద్దు అనుకునేట్లు చేస్తున్నాయి,’’ అని కవిత అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)