అత్యంత వేగంగా ఆహారం తిన్నప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది?

Food

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద.వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేరళలోని పాలక్కాడ్‌లో కొన్ని వారాల కిందట ఓనం పండుగ సందర్భంగా జరిగిన ఓ ఆహార పోటీలో పాల్గొన్న 49 ఏళ్ల వ్యక్తి మరణించారు.

తొందరగా తిని విజేతగా నిలవాలనే ఆతృతలో ఓ పోటీదారు గొంతులో ఆహారం ఇరుక్కుపోయింది. చుట్టుపక్కలవారు ఆయన గొంతులోంచి ఆహారాన్ని బయటకు తీసి, ఆసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

ఆ వ్యక్తిది అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసినట్టు పీటీఐ తెలిపింది.

భారత్‌లోని రెస్టరెంట్లు, ఆహార పదార్థాల తయారీ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి ఇటువంటి ఆహార పోటీలను నిర్వహించడం సాధారణం.

ఈ పోటీలలో ఎవరు పాల్గొంటారు? వారిని ప్రేరేపించేది ఏంటి? ఇలాంటి పోటీలు ఎప్పుడు ప్రాణాంతకంగా మారతాయి? నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆహారపోటీ, ప్రైజ్ మనీ ,విజేత

ఫొటో సోర్స్, YouTube/Wake and Bite

ఫొటో క్యాప్షన్, ఆహార పోటీలలో విజేతకు ప్రకటించే ప్రైజ్ మనీ చాలామందిని ఆకర్షిస్తోంది.

పోటీలో పాల్గొనేవాళ్ల శరీరంలో ఏం జరుగుతుంది?

ఏ రకమైన ఆహారం అనే దానితో సంబంధం లేకుండా, ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం శరీరానికి ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

ఇలాంటి పోటీల్లో పాల్గొంటున్నప్పుడు ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో ఊహించలేమని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

“ఆహార పోటీలలో పాల్గొనేవారికి పోటీలో గెలవాలన్న టెన్షన్ ఉంటుంది. కాబట్టి వారి గుండె వేగం ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే అన్నవాహిక, పొట్ట తట్టుకోలేవు. పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకున్నప్పుడు, వాగస్ అనే నాడి గుండె కార్యకలాపాలను నెమ్మదింపజేసే సంకేతాన్ని అందుకుంటుంది. ఇది తరచుగా గుండెపోటుకు కారణం అవుతుంది. పోటీలో పాల్గొనే వారికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉంటే, అది మరింత ప్రమాదం’’ అని ఆయన చెప్పారు.

అన్నవాహిక,శ్వాసనాళం,ఆహారం

ఫొటో సోర్స్, Dr.Chandrasekar

ఫొటో క్యాప్షన్, శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కుపోతే ఊపిరాడదని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

వేగంగా తింటే ఏమవుతుంది?

ఆహారాన్ని వేగంగా తినడం వల్ల ఏం జరుగుతుందో డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు.

“మన నోటిలోని ఆహారాన్ని అన్న వాహికలోకి సాఫీగా పంపేది మన నాలుక. ఒక ముద్ద తిన్న తరువాత మరో ముద్ద నోట్లో పెట్టుకునే లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని వేగంగా తీసుకున్నప్పుడు, ఆహారం అన్నవాహికకు బదులుగా శ్వాసనాళంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలో నీళ్లు తాగితే ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లిపోతుంది. ఇది ఊపిరాడకుండా చేసి, ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది’’ అని ఆయన చెప్పారు.

"మానవ శరీరం ఏ పనినైనా అలవాటుగా నేర్చుకుంటుంది. ఏళ్ల తరబడి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవడానికి అలవాటుపడిన శరీరంలోకి అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ఆహారం చేరితే, అది శరీరానికి షాక్ లాంటిది" అని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు.

 ప్రాణాపాయం,వైద్యులు

ఫొటో సోర్స్, R. Archana

ఫొటో క్యాప్షన్, డోపమైన్ కారణంగానే ఎక్కువ తింటారని అంటున్నారు డాక్టర్ అర్చన

ఆహార పోటీలలో ఎందుకు పాల్గొంటారు?

సెప్టెంబర్‌లో తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా బిర్యానీ తినే పోటీ జరిగింది. అరగంటలో 6 బిర్యానీలు తిన్న వారికి లక్ష రూపాయలు, 5 బిర్యానీలు తింటే 50 వేల రూపాయలు, 3 బిర్యానీలు తింటే 25 వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు.

ఈ పోటీలో మొదటి మూడు స్థానాల్లో ఆటో డ్రైవర్లు, రోజు కూలీలు నిలిచారు. బహుమతి గెలుచుకున్న గణేశ మూర్తి... అద్దె కారు డ్రైవర్. ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుడి వైద్య ఖర్చులకు, చదువుకు డబ్బు కావాలని, అందుకే ఈ పోటీలో పాల్గొన్నానని ఆయన చెప్పారు.

“నేను చిన్నప్పటి నుంచి బాగా తినేవాడిని. నేను రోజూ వ్యాయామం కూడా చేస్తాను. ఒకసారి ఫేస్‌బుక్‌లో పరోటాలు తినే పోటీ చూశాను. ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నేనూ పాల్గొన్నాను. ఎనిమిది పరోటాల కంటే ఎక్కువ తినలేకపోయాను. ఆ పోటీలో చాలా మంది ఎక్కువ ఆహారం తినలేక వాంతులు చేసుకున్నారు" అని చెన్నైకి చెందిన ఒక ఐటీ ఉద్యోగి చెప్పారు.

“మనకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు శరీరంలో డోపమైన్ విడుదల అవుతుంది. ఈ పోటీల్లో పాల్గొనేవారు కొన్ని ఆహారపదార్థాలు తిన్నప్పుడు డోపమైన్‌ విడుదలవుతుంది. కాబట్టి గబగబా ఉత్సాహంగా తింటారు" అని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అర్చన చెప్పారు.

"ఈ పోటీల్లో వారు ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారనే కారణాలు ముఖ్యమైనవి, ఈ ఆహార పోటీలలో అందించే ప్రైజ్ మనీ చాలా మందిని ఆకర్షిస్తుంది. ఆర్థిక అవసరాలు ఉన్నవారు, ఒక్కపూటైనా మంచి భోజనం తినవచ్చని భావించే వారు ఇందులో పాల్గొంటారు. కొంతమందికి ఈ పోటీలో పాల్గొనడం ద్వారా వచ్చే ప్రశంసలు, గుర్తింపు ప్రేరణ కావచ్చు" అని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

కోయంబత్తూరు,ఫుడ్,ట్యాక్సీ డ్రైవర్

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, ఆహార పోటీ (ప్రతీకాత్మక చిత్రం)

"అతిగా తినడం" అనేది మనం తరచూ వినే పదం. ఈ పదానికి 'ఆపకుండా తింటూనే ఉండడం' అని అర్థం.

“కొంతమంది బరువు తగ్గించుకోవడం, షుగర్ తగ్గించుకోవడం వంటి వివిధ కారణాల వల్ల తినడం తగ్గించేస్తారు. కానీ జంక్ ఫుడ్ తినడం మాత్రం ఆపరు. రెండు రోజులపాటు ఆహారాన్ని కాస్త తక్కువగా తీసుకుంటే, కొద్ది రోజులయ్యాక విపరీతమైన ఆకలి ఉంటుంది. అప్పుడు మీకు ఏది కావాలంటే అది తినాలని, తింటూనే ఉండాలని అనిపిస్తుంది” అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

ఇలా తినడం, ఆహార పోటీల్లో పాల్గొనడం రెండూ ఒకటి కాదని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.