చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్: ‘50 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, నేనే తిరిగి 55 లక్షలు అప్పు ఉన్నానంటున్నారు’

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
‘‘నేను 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాను. కానీ, 55 లక్షల రూపాయలు బ్యాంక్‌కు కట్టాలంటూ చూపిస్తోంది.’’
ఆంధ్రప్రదేశ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఇటీవల జరిగిన ‘మోసం’ కేసులో డబ్బులు పోగొట్టుకున్నానంటూ మొహ్మద్ సదరుద్దీన్ బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఇల్లు అమ్మగా వచ్చిన 50 లక్షల రూపాయలను ఐసీఐసీఐ బ్యాంక్ చిలకలూరిపేట బ్రాంచ్‌లో డిపాజిట్ చేశాను. కానీ ఇప్పుడు నేనే బ్యాంక్‌కు 55లక్షలు అప్పు ఉన్నట్లు చూపిస్తోంది. బ్రాంచ్ మేనేజర్ నా ఎఫ్‌డీ మీద ఓడీ తీసుకుని అతని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని తెలిసింది’’ అని మొహమ్మద్ సదరుద్దీన్ బీబీసీతో చెప్పారు.
మొహమ్మద్ సదరుద్దీన్ వంటి ఎంతో మంది బాధితులు ఇప్పుడు తమ డబ్బుల కోసం బ్యాంకు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

అసలేం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
డి.నరేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్‌గా 2017 ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. తమ ఖాతాదారుల్లో సంపన్నులు ఎవరో గుర్తించి.. వాళ్ల ఇళ్లకు వెళ్లి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే రూపాయికిపైగా వడ్డీ ఇస్తానని నమ్మించారు.
మేనేజరే ఇంటికి వచ్చి చెప్పడంతో చాలా మంది నమ్మి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) చేశారు. ఎఫ్‌డీ మీద ఓడీ రూపంలో ఖాతాదారులు 90% లోన్ తీసుకోవచ్చు. దాంతో ఖాతాదారుల ఎఫ్‌డీల మీద నరేశ్ ఓడీలు తీసుకొని ఆ డబ్బును తన ఖాతాలో వేసుకున్నారు.
ఎఫ్‌డీలు చేయించేటప్పుడే తన ఫోన్ నంబరును లింక్ చేయించడంతో పాటు ఎఫ్‌డీల రెన్యువల్ పేరుతో ఆయన ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
‘‘ఖాతాదారులకు ఎఫ్‌డీలను రెన్యువల్ చేస్తున్నట్లు చెప్పి వాళ్ల మొబైల్‌కు వచ్చే ఓటీపీలు అడిగేవారు.
తన ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా నుంచే ఖాతాదారులకు ఎఫ్‌డీల మీద నెలనెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఇందుకోసం అతను 17 అకౌంట్లు వినియోగించారు. బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా వేరే బ్యాంక్ ఖాతా నుంచి వడ్డీ జమవుతున్నా ఖాతాదారులెవరూ ఆ విషయం పట్టించుకోలేదు.
ఇలా చిలకలూరిపేటలో 65మందికి పైగా ఖాతాదారులను నరేశ్ మోసం చేశారు’’ అని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం మీద రుణాలు
‘‘చిలకలూరిపేట బ్రాంచ్‌లోనే గోల్డ్ అప్రైజర్‌గా పని చేసే అన్నం హరీశ్.. నరేశ్‌కు సహకరించడంతో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారం మీద వేరే వారి పేరిట రుణం తీసుకున్నారు.
నరసరావుపేట, విజయవాడలకు బదిలీ అయిన తరువాత కూడా అధిక వడ్డీ పేరుతో ఖాతాదారులను నరేశ్ మోసం చేశారు. నరసరావుపేటలో రెండేళ్లు, విజయవాడ భారతీనగర్‌లో ఏడాదిలోపే పని చేయడంతో ఇక్కడ బాధితుల సంఖ్య చిలకలూరిపేటతో పోల్చితే తక్కువగా ఉంది’’ అని పోలీసులు చెప్పారు.

ఈ మోసం ఎలా బయట పడింది?
ఈ ఏడాది అక్టోబరు 1న చిలకలూరిపేటకు చెందిన కొంతమంది ఖాతాదారులకు వడ్డీ జమ కాకపోవడంతో రెండు రోజులు వేచి చూసి, 3న బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీశారు.
వారి వివరాలను పరిశీలించిన బ్యాంక్ సిబ్బంది వారి ఖాతాల్లో డబ్బులు లేవని చెప్పడంతో ఖాతాదారులు మోసపోయామని తెలుసుకున్నారు.
కొంతమంది ఎఫ్‌డీలైతే చెల్లవని చెప్పారు.
దీంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేష్, హరీశ్‌తోపాటు వీరికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ సేల్స్ హెడ్ కె. కరుణాకర్ పరారీలో ఉన్నారు.

రూ. 28 లక్షలకు ఫేక్ ఎఫ్‌డీ
‘‘హైవే విస్తరణలో నా భూమి కోల్పోవడంతో ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిన డబ్బులకు తోడు కొంత డబ్బు పోగేసుకుని భార్యా, పిల్లల పేరిట మొత్తం 72 లక్షల రూపాయలు చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్‌లో డిపాజిట్ చేశాను.
అప్పట్లో నరేశ్ వచ్చి మా బ్యాంక్‌లో వేయండి 8 శాతం వడ్డీ ఇస్తానంటే జమ చేశాను.
44 లక్షల రూపాయలకు ఓ డిపాజిట్ పత్రం, 28 లక్షల రూపాయలకు మరో డిపాజిట్ బాండ్.. అలా రెండు బాండ్లు ఇచ్చాడు.
44 లక్షల రూపాయలు ఓడీల ద్వారా సొంత ఖాతాకు మళ్లించుకున్నారని ఇప్పుడు తేలింది. మిగిలిన 28 లక్షల రూపాయలకు సంబంధించిన నరేశ్ ఇచ్చిన ఎఫ్‌డీ చెల్లదని, అది ఫేక్ అని ఇప్పుడు బ్యాంక్ సిబ్బంది అంటున్నారు’’ అని చిలకలూరిపేట సమీపంలోని పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన శీనయ్య నాయుడు బీబీసీతో చెప్పారు.
’’మేం 70 లక్షల రూపాయలు బంగారం తాకట్టు పెట్టి, 23 లక్షల 85వేల రూపాయలు రుణం తీసుకున్నాం. కానీ, ఇప్పుడు బ్యాంక్‌లో మా రుణం 40 లక్షల రూపాయలకు వరకు చూపిస్తోంది. మా గోల్డ్‌పైనే వేరే వారి పేరిట రుణం తీసుకున్నారు’’ అని చిలకలూరిపేటకు చెందిన భార్యాభర్తలు బాజీ, షేక్ బాజీలు బీబీసీకి చెప్పారు.
అదే విధంగా తాము 17.44 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే దాని మీద కూడా ఓడీ తీసుకున్నారని బాజీ ఆరోపించారు.

ఇంకా బాధితులు పెరుగుతున్నారు: సీఐడీ అడిషనల్ ఎస్పీ
ఇప్పటివరకు 72మంది బాధితులకు సంబంధించి రూ. 28 కోట్లను నిందితులు ఇతర ఖాతాలకు మళ్లించినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఫిర్యాదు వచ్చిందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ బీబీసీతో చెప్పారు.
‘‘మా విచారణలో నరసరావుపేట, విజయవాడ బ్రాంచ్‌లలోనూ బాధితులు ఉన్నట్లు తేలింది. మూడు బ్రాంచ్‌లలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా ఇప్పటివరకు 90మందికి పైగా బాధితులకు సంబంధించిన 35 కోట్ల రూపాయల విలువైన సొమ్ము మళ్లించారని తెలుస్తోంది. నరేశ్, హరీశ్, కరుణాకర్‌లు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం నిఘా పెట్టాం’’ అని ఆదినారాయణ అన్నారు.
ఖాతాదారులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఐసీఐసీఐ బ్యాంక్ మీద ఉందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బీబీసీతో అన్నారు.
ఏ ఒక్కరూ నష్టపోకుండా బ్యాంక్ త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
బాధితులందరికీ న్యాయం చేస్తాం : ఐసీఐసీఐ బ్యాంక్
’’పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మేం కూడా శాఖాపరమైన విచారణ చేపట్టాం. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేశాం. బాధితులందరికీ న్యాయం చేస్తాం. ఎవరూ ఆందోళన చెందొద్దు’’ అని చెన్నైకి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నతాధికారి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ నరేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన విడుదల చేశారని చెబుతున్న ఒక సెల్ఫీ వీడియో మీడియాలో కనిపించింది. ఆ వీడియో ప్రకారం తన తప్పును అంగీకరించిన నరేశ్, కొందరు బ్యాంక్ అధికారులకు కూడా ఈ మోసంలో భాగం ఉన్నట్లు ఆరోపించారు.
అయితే ఆ వీడియోను, అందులోని విషయాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














