లారెన్స్ బిష్ణోయీ ఎవరు? కాలేజ్ రోజుల్లోనే క్రైమ్ రికార్డులలోకి ఆయన పేరు ఎందుకు చేరింది

లారెన్స్ బిష్ణోయీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లారెన్స్ బిష్ణోయ్

మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత బాబా సిద్ధిఖీ శనివారం హత్యకు గురయ్యారు. 66 ఏళ్ల సిద్ధిఖీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

బాబా సిద్ధిఖీ చాలా కాలం పాటు కాంగ్రెస్‌లో ఉన్నారు. 2004 నుంచి 2008 వరకు కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ మధ్య అభిప్రాయభేదాలు తొలగించి సయోధ్య కుదర్చడంలో బాబా సిద్ధిఖీ కీలకపాత్ర పోషించారని చెప్తారు.

సిద్ధిఖీ హత్యలో ముగ్గురు షూటర్ల ప్రమేయం ఉందని ముంబయి పోలీసులు ధ్రువీకరించారు.

లారెన్స్‌ బిష్ణోయీ గ్యాంగ్‌తో వారికి సంబంధం ఉందని తెలిపారు.

బాబా సిద్ధిఖీ హత్యలో లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్ ప్రమేయంపై ముంబయి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ దత్తా నలవాడేను ఆదివారం విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని బదులిచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గత ఏడాది అరెస్టయిన లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్ సభ్యులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గత ఏడాది అరెస్టయిన లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్ సభ్యులు

గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారారు..?

‘‘మొదటసారి జైలుకు వెళ్లినప్పటికి నేను విద్యార్థిని. నేను జైలు లోపల గ్యాంగ్‌స్టర్‌గా మారాను. మా సోదరులను హత్య చేశారు. మేం దానికి స్పందించాం అంతే. ఒక వ్యక్తి ప్రవర్తన అతని చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని లారెన్స్ ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

లారెన్స్ బిష్ణోయీ జైలు నుంచి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారని ఆ టీవీ చానల్ చెబుతోంది.

అయితే భటిండా జైలులోగానీ, పంజాబ్‌లోని మరే ఇతర జైలులోగానీ ఈ ఇంటర్వ్యూ జరగలేదని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు.

తమ రాష్ట్రంలోని ఏ జైలులోనూ బిష్ణోయీతో ఇంటర్వ్యూ జరగలేదని రాజస్థాన్ పోలీసులు కూడా ప్రకటించారు.

లారెన్స్‌పై దాదాపు 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి. చాలా నేరాలను ఆయన జైలు నుంచే చేయించారని పోలీసులు చెప్పారు.

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు కుట్ర పన్నినట్లూ ఆయనపై ఆరోపణలున్నాయి.

లారెన్స్ బిష్ణోయీ హత్య, దొంగతనం, దోపిడీ, ఉద్దేశపూర్వక దాడి వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పంజాబ్, దిల్లీ, రాజస్థాన్‌లలో ఈ కేసులు నమోదయ్యాయి.

తన క్లయింట్ అమాయకుడని, ఆయన ఎలాంటి నేరం చేయలేదని లారెన్స్ బిష్ణోయీ లాయర్ విశాల్ చోప్రా బీబీసీ మాజీ జర్నలిస్ట్ సుచిత్రా మొహంతితో చెప్పారు.

పంచ్‌కుల కోర్టులో లారెన్స్ బిష్ణోయీ

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి

2024 జులైలో సీనియర్ పాత్రికేయుడు సంజీవ్ చౌహాన్ బీబీసీ హిందీ కోసం రాసిన ఒక కథనంలో లారెన్స్ బిష్ణోయీ వయసు గురించి ప్రస్తావించారు.

మీడియా నివేదికలలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లారెన్స్ పుట్టిన తేదీ రెండు రకాలుగా ఉంది. కొన్ని చోట్ల 1992 ఫిబ్రవరి 22 అని ఉండగా, మరికొన్ని చోట్ల 1993 ఫిబ్రవరి 12 అని ఉందని సంజీవ్ చౌహాన్ తన కథనంలో రాశారు.

దీన్ని బట్టి లారెన్స్ వయసు 31-32 ఏళ్లు ఉండొచ్చని ఆయన రాశారు.

పంజాబ్‌ ఫజిల్కాలోని ధత్రన్‌వాలి గ్రామానికి చెందిన బిష్ణోయీ కుటుంబంలో లారెన్స్ పుట్టారు.

పోలీసు రికార్డుల ప్రకారం లారెన్స్ బిష్ణోయీ అసలు పేరు సత్వీందర్ సింగ్. ఆయన 1993లో జన్మించారు.

అయితే చిన్నప్పుడు సత్వీందర్ సింగ్‌ను లారెన్స్ అనే ముద్దుపేరుతో పిలుచుకునేవారు.

అదే ఆయన పేరుగా మారిపోయింది. లారెన్స్ తండ్రి లవీందర్ సింగ్ మొదట హరియాణాలో కానిస్టేబుల్‌‌గా పనిచేసేవారు. 1992లో ఉద్యోగంలో చేరిన ఆయన ఐదేళ్ల తర్వాత వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు.

పంజాబ్‌లోని అబోహర్‌లో ఇంటర్ పూర్తిచేసిన లారెన్స్ పైచదువుల కోసం 2010లో చండీగఢ్ వెళ్లారు.

2011లో అక్కడి డీఏవీ కాలేజీలో చేరారు. ఇక్కడి నుంచే ఆయన విద్యార్థి రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. ఇక్కడే లారెన్స్‌కు గోల్డీ బ్రార్‌తో స్నేహం కుదిరింది.

విదేశాల్లో లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్‌ కోసం గోల్డీ బ్రార్‌ పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

2011-2012లో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఓపీయూ)ని స్థాపించిన లారెన్స్ తర్వాత దాని నాయకుడయ్యారు.

లారెన్స్‌కు పంజాబీ, బాగ్రీ, హర్యాణ్వీ భాషలు తెలుసని ఆయనతో చదువుకున్నవారు చెప్తారు.

లారెన్స్ బిష్ణోయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లారెన్స్ బిష్ణోయీ

సబర్మతి జైలులో లారెన్స్

విద్యార్థి జీవితం చివరిలో లారెన్స్‌పై తొలి కేసు నమోదైంది. ఇది హత్యాయత్నానికి సంబంధించిన కేసు. 2011-2012లో ఈ కేసు నమోదైంది.

స్టూడెంట్ ఎలక్షన్స్‌లో ఓటమిపై కలత చెందిన లారెన్స్ సహచరుల్లో ఒకరు విద్యార్థి నాయకుడిపై కాల్పులు జరిపారు. ఆ కేసులో తొలిసారి లారెన్స్ పేరును పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

లారెన్స్ బిష్ణోయీని 2014లో తొలిసారి రాజస్థాన్‌లో అరెస్టు చేసి భరత్‌పూర్ జైలుకు తరలించారు.

విచారణ కోసం పంజాబ్‌లోని మొహాలీకి తీసుకెళ్తుండగా ఆయన తప్పించుకున్నారు.

2016లో లారెన్స్ మళ్లీ అరెస్టయ్యారు. భద్రతాకారణాలతో 2021లో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీఓసీఏ) కింద ఆయన్ను తీహార్‌కు పంపారు.

తీహార్‌కు తరలించేముందు ఆయన్ను పంజాబ్‌లోని భటిండా జైలులో ఉంచారు.

2022లో సిద్ధూ మూసేవాలా హత్య కేసులో భటిండా జైలులోనే పంజాబ్ పోలీసులు లారెన్స్‌ను అరెస్టు చేశారు.

లారెన్స్ 'ఏ కేటగిరీ' గ్యాంగ్‌స్టర్ అని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని ఈ కేటగిరీలో చేరుస్తారు.

సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన కొద్ది రోజులకే సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. అది కూడా లారెన్స్ పనేనన్న ఆరోపణలున్నాయి.

2022లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్‌ పేరును చేర్చింది. కచ్‌లోని పాకిస్తానీ ఓడ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న కేసు ఇది.

ఆ సరకును ఆర్డర్ చేయడంలో లారెన్స్ హస్తం ఉందన్నది పోలీసులు అనుమానం.

ఆ తర్వాత గుజరాత్ పోలీసులు 23 ఆగస్టు 2023న లారెన్స్‌ను దిల్లీ జైలు నుంచి గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు.

అప్పటి నుంచి ఆయన సబర్మతి జైలులోనే ఉన్నారు. ఆగస్టు 30, 2023న లారెన్స్ బిష్ణోయీపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీఆర్‌పీసీ సెక్షన్ 268 (1)ని విధించింది. ఏడాది పాటు సబర్మతి జైలు నుంచి ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు.

దీంతో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణకు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరుస్తున్నారు.

లారెన్స్ బిష్ణోయీ హత్య, దోపిడీ, దాడి వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పంజాబ్, దిల్లీ, రాజస్థాన్‌లలో ఆయనపై పదులసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నాలుగు కేసుల్లో లారెన్స్ దోషిగా తేలారని పోలీసులు చెప్పారు.

 లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు
ఫొటో క్యాప్షన్, గోల్డీ బ్రార్

700 మందితో గ్యాంగ్

బిష్ణోయ్ గ్యాంగ్‌లో దాదాపు 700 మంది సభ్యులు ఉన్నట్టు చెప్తారు. కెనడా నుంచి గోల్డీ బ్రార్ దీన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సిద్ధూ మూసేవాలా హత్యలో గోల్డీ బ్రార్ ప్రధాన కుట్రదారు అనే ఆరోపణలున్నాయి. ఈ కేసుతో పాటు ఇతర కేసుల్లో గోల్డీ బ్రార్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సిద్ధూ మూసేవాలా హత్యకు గోల్డీ బ్రార్‌దే బాధ్యతని పంజాబ్ పోలీసులంటున్నారు.

లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్‌లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లకు చెందిన వారు ఉన్నారు. ఈ గ్యాంగ్ మూడు రాష్ట్రాల్లో చురుగ్గా ఉంది.

"ఇది గ్యాంగ్ కాదు. ఒకే బాధతో ఉన్న వ్యక్తుల సమూహం" అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయీ చెప్పారు.

సాధారణంగా నేరం చేసిన తర్వాత నేరస్థులు పోలీసులకు దొరక్కుండా, చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటారు. కానీ లారెన్స్ బిష్ణోయీ, ఆయన గ్యాంగ్ మాత్రం వివిధ నేరాలకు తమదే బాధ్యత అని ప్రకటించుకుంటుంది.

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా, జైపూర్‌లో కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసుల్లో లారెన్స్ పేరు వినిపించింది. ఇప్పుడు బాబా సిద్ధిఖీ హత్యకేసులో మరోసారి లారెన్స్ పేరు వినిపిస్తోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)