మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని కాల్చి చంపిన దుండగులు, అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ- అజిత్ పవార్ వర్గం) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
శనివారం (అక్టోబర్ 12) రాత్రి ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన్ను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ బాబా సిద్దిఖీ చనిపోయారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారని, ఒకరు పరారీలో ఉన్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు హరియాణా, మరొకరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు.
దాదాపు 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన బాబా సిద్దిఖీ, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్‌సీపీ(అజిత్ పవార్ వర్గం)లో చేరారు.

‘‘మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై దుండగులు కాల్పులు జరిపారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ చెప్పారు. ఒకరు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన అనుమానితుల్లో ఒకరు హరియాణా, మరొకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. పారిపోయిన వ్యక్తి కోసం పోలీసు టీమ్ గాలిస్తోంది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారు.
బాబా సిద్దిఖీ మరణంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ‘ఎక్స్’లో స్పందించారు.
‘‘నా సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయాను. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. బాబా సిద్దిఖీకి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను’’ అని అజిత్ పవార్ రాశారు.

ఫొటో సోర్స్, Facebook/Baba Siddique
రాజకీయాల్లో, బాలీవుడ్‌లో..
బాబా సిద్దిఖీ రాజకీయ నేత అయినప్పటికీ, బాలీవుడ్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
బాబా సిద్దిఖీ 1958 సెప్టెంబర్ 30న జన్మించారు. బీకామ్ చదివారు.
16, 17 ఏళ్ల వయసు నుంచే కాంగ్రెస్‌లో పనిచేయడం ప్రారంభించానని ఆయన గతంలో చెప్పారు.
పలుమార్లు కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా గెలిచారు.
2004 నుంచి 2008 మధ్య కాలంలో మహారాష్ట్రలోని విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
2014 నుంచి ముంబయి కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షులుగా సిద్దిఖీ పనిచేశారు.
2000 నుంచి 2004 మధ్య కాలంలో మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
2017లో మనీ లాండరింగ్ ఆరోపణలతో బాంద్రాలోని బాబా సిద్దిఖీ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది.
ఆ తర్వాత, ఆయన రాజకీయంగా అంత చురుగ్గా ఉండటం లేదు. ప్రస్తుతం ఆయన కొడుకు జీషన్ ఎక్కువగా చురుగ్గా ఉంటున్నారు.
2014లో బాంద్రా ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసి బాబా సిద్దిఖీ ఓడిపోయారు. కానీ, 2019లో తన కొడుకు జీషన్ సిద్దిఖీ గెలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
బాబా సిద్దిఖీ ఇఫ్తార్ పార్టీ..
బాలీవుడ్‌తో ఆయనకున్న సాన్నిహిత్య సంబంధాలతో సిద్దిఖీ తరచూ వార్తల్లో కనిపిస్తూ ఉండేవారు.
15 ఏళ్లు బాంద్రా వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలామంది బాలీవుడ్ సెలట్రిటీలు అక్కడే నివసిస్తుంటారు.
ఏటా రంజాన్ నెలలో, బాబా సిద్దిఖీ ఇచ్చే ఇఫ్తార్ పార్టీ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆయన ఇచ్చే ఇఫ్తార్ పార్టీకి వచ్చేవారు.
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల మధ్య ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిన విభేదాలకు ముగింపు పలకడంలో బాబా సిద్దిఖీ కీలక పాత్ర పోషించారని చెబుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














