ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చు: ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ

తిరుమల ఘాట్ రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు తొలగిస్తున్న టీటీడీ సిబ్బంది
ఫొటో క్యాప్షన్, తిరుమల ఘాట్ రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు తొలగిస్తున్న టీటీడీ సిబ్బంది
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

‘గురువారం తెల్లవారుజామున చెన్నై దగ్గర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీంతో, బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి” అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ చెప్పారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ హెచ్చరించింది.

“ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 15 కి.మీ. వేగంతో వాయుగుండం కదులుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయానికి చెన్నైకి 320 కి.మీ దూరంలో, నెల్లూరుకు 370 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావం బుధ, గురువారాల్లో ఉంటుంది” అని కూర్మనాథ్‌ బీబీసీతో చెప్పారు.

“ఈ రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. వాయుగుండం ప్రభావం ఉండే జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన సూచించారు.

వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో హెచ్చరించింది.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.

పెన్నానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సహాయ చర్యల కోసం ఆయా జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారీ వర్షానికి జలమయమైన రోడ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ వర్షానికి చెన్నైలో జలమయమైన రోడ్లు

ఏయే జిల్లాలపై ప్రభావం ఉంటుందంటే...

ఈ వాయుగుండం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలపై ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడొచ్చని, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంవో అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు.

వాయుగుండం తీవ్రతను పరిశీలిస్తున్న హోంమంత్రి అనిత

ఫొటో సోర్స్, @Anitha_TDP/X

ఫొటో క్యాప్షన్, వాయుగుండం తీవ్రతను పరిశీలిస్తున్న హోంమంత్రి అనిత

వాయుగుండం తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోం మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహించారు.

వాయుగుండం నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో జిల్లాల యంత్రాంగాలు సంసిద్ధంగా ఉంచాలని సూచించారు.

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలను ఫోన్‌లు, మెసేజ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఫొటో క్యాప్షన్, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరింది.

సహాయ చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ఆమె తెలిపారు.

ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని ప్రతి మండలంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు.

ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)