గాజా: ‘మంటల్లో కాలిపోతున్నా ఏమీ చేయలేకపోయాను, అది చూసి నా మనసు ముక్కలైంది’

- రచయిత, మలోరీ మోంచ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: ఈ కథనంలోని విషయాలు మిమ్మల్ని కలచివేయవచ్చు
గాజాలోని ఒక ఆసుపత్రి కాంపౌండ్‌లో ఉన్న టెంట్ క్యాంప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి కారణంగా జరిగిన అగ్నిప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో ఆ భయానక అనుభవాన్ని, మంటల్లో మరణించిన వ్యక్తులను చూసినప్పుడు తమలో కలిగిన భయాన్ని, తమ నిస్సహాయతను పంచుకున్నారు.
‘‘మేం చూసిన అత్యంత దారుణ దృశ్యాలలో ఇది ఒకటి’’ అని ఒక తల్లి చెప్పారు.
‘‘మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి కొందరు గుడారాన్ని కూల్చివేస్తున్నప్పుడు నాకు అరుపులు వినిపించాయి’’ అని మరొక అమ్మాయి తెలిపారు.
కాలిపోతున్న వాళ్లకు సహాయం చేయలేక తన మనస్సు ముక్కలైందని మరొక వ్యక్తి చెప్పారు.
సోమవారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలోని డీర్ అల్-బలాహ్‌లోని అల్-అక్సా ఆసుపత్రి కాంపౌండ్‌లో శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన క్యాంపుపై ఈ దాడి జరగడంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ ప్రకారం, ఈ దాడిలో కనీసం నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
ఒక వ్యక్తి మంటల్లో కాలిపోతున్నట్లు వీడియో కనిపించిన ప్రాంతాన్ని బీబీసీ ధృవీకరించింది. మరికొన్ని వీడియోలలో పేలుళ్లు, అరుపుల మధ్య మంటలను ఆర్పడానికి పరుగెత్తుతున్న వ్యక్తులు కనిపించారు.

కమాండ్ సెంటర్‌లో పనిచేస్తున్న హమాస్ ఫైటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. ‘‘సెకండరీ పేలుళ్ల కారణంగా’’ ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని, ఈ ఘటనను సమీక్షిస్తున్నామని తెలిపింది.
తమ సిబ్బందితో అల్-అక్సాలో పని చేస్తున్న ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ (ఎంఎస్‌ఎఫ్) మాత్రం, హమాస్ కేంద్రం గురించి తమకు ఎలాంటి సమాచారమూ లేదని, ఈ ఆసుపత్రి ఆసుపత్రిలాగే పని చేస్తోందని అంది.
"ఇజ్రాయెల్ వైమానిక దాడి తరువాత క్యాంపులోని పౌరులు సజీవ దహనం అవుతున్నట్లు కనిపించే చిత్రాలు, వీడియోలు చాలా కలవరపెడుతున్నాయి. దీనిపై మేము ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మా ఆందోళనను వ్యక్తం చేశాం’’ అని వైట్‌హౌస్ జాతీయ భద్రతా విభాగం ప్రతినిధి అన్నారు.
‘‘ప్రాణనష్టాన్ని నివారించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్‌కు ఉంది. ఒకవేళ హమాస్ ఆసుపత్రి సమీపంలో పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసినా, జరిగిన ఘటన చాలా భయానకమైనది’’ అని చెప్పారు.
భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 03:45 గంటలప్పుడు ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ దాడి ఆసుపత్రి భవనాల మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లపై జరిగింది.

ఫొటో సోర్స్, Reuters
ఆసుపత్రి వెనుక ఒక టెంట్‌లో నివసిస్తున్న హిబా రాడి అనే మహిళ, గాజాలోని బీబీసీ ఫ్రీలాన్సర్‌తో మాట్లాడుతూ, డేరాల చుట్టూ పేలుళ్లు, మంటలు చెలరేగడంతో తాను మేల్కొన్నానని తెలిపారు.
‘‘నేను చూసిన అత్యంత దారుణ దృశ్యాలలో ఇది ఒకటి. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విధ్వంసం చూడలేదు’’ అన్నారు.
కొన్ని ధృవీకరించిన వీడియోలను రికార్డ్ చేసిన ఫొటోగ్రాఫర్ అటియా డార్విష్, తనకు ఇది ‘‘పెద్ద షాక్’’ అని, ప్రజలు కాలిపోతున్నా తాను చూస్తూ ‘‘ఏమీ చేయలేకపోయాను. నా మనసు ముక్కలైంది’’ అని చెప్పారు.
ఈ ఘటనలో నలుగురు మరణించారని, 40 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది.
అయితే, ఐదుగురు మరణించారని, 65 మంది గాయపడ్డారని ఎంఎస్‌ఎఫ్ మంగళవారం వెల్లడించింది.
గాయపడిన వారిలో ఎనిమిది మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఎనిమిది మందిని ప్రత్యేక బర్న్స్ యూనిట్‌కు తరలించారు.
ఉత్తర గాజా నివాసితులను ఎక్కడైతే ఉండమని చెప్పారో, అక్కడే ఈ దాడి జరిగిందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.
‘‘ప్రజలు వెళ్ళడానికి గాజాలో ఎక్కడా సురక్షితమైన స్థలం లేదు’’ అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్‌కు 30 రోజుల గడువు: అమెరికా
గాజాలో ప్రజలు మానవతా సహాయాన్ని అందుకునే అవకాశాలను ఇజ్రాయెల్ మరింత పెంచాలని, లేదంటే ఆ దేశాని (ఇజ్రాయెల్)కి ఇచ్చే సైనిక సహాయంలో కోత విధిస్తామని ఇజ్రాయెల్‌కు అమెరికా 30 రోజుల గడువు ఇచ్చింది.
ఆదివారం పంపిన ఈ లేఖలో, అమెరికా తన మిత్రదేశానికి బలమైన రాతపూర్వక హెచ్చరికను జారీ చేసింది. ఇటీవల ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో అమెరికా ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
గాజాలో క్షీణిస్తున్న మానవతా పరిస్థితులపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోందని, ఇజ్రాయెల్ గత నెలలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య దాదాపు 90 శాతం మానవతా సహాయ కార్యక్రమాలను అడ్డుకుందని అమెరికా పేర్కొంది.
అయితే, ఈ లేఖను తాము సమీక్షిస్తున్నామని ఒక ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నారు. అమెరికా లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











