భారత్ – కెనడా మధ్య హఠాత్తుగా ఉద్రిక్తతలు పెరగడానికి కారణం ఏంటి? కెనడాలోని పంజాబీలు ఏమంటున్నారు?

- రచయిత, కుషాల్ లాలి
- హోదా, బీబీసీ ప్రతినిధి, బ్రాంప్టన్ నుంచి
సోమవారం జరిగిన పరిణామాలతో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. భారత్‌లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. తాము కూడా కెనడాలో ఉన్న ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు.
ఈ పరిణామాలతో, కెనడాలో నివసిస్తున్న భారతీయులు మళ్లీ 2023 నాటి పరిస్థితులు తలెత్తినట్లు భావిస్తున్నారు. 2023లో భారత్ వీసాల జారీపై ఆంక్షలు విధించడంతో పాటు కెనడా హైకమిషన్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది.
ఈ అంశం గురించి కెనడాలో ఉంటున్న భారతీయుల స్పందన ఏంటో తెలుసుకునేందుకు బీబీసీ బృందం ప్రయత్నించింది. అయితే, మేం కలిసినవారిలో ఎక్కువ మంది తాజా ఉద్రిక్తతల గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. కొద్ది మంది మాత్రమే మాట్లాడేందుకు ముందుకొచ్చారు.
దీనిపై స్పందించడం వల్ల భారత్‌కు వెళ్లిరావడం, కెనడాలో శాశ్వత నివాసం, పౌరసత్వం లాంటి అంశాలపై ప్రభావం పడుతుందని కెనడాలో ఉంటున్న విద్యార్థులు భయపడుతున్నారు. మెజారిటీ భారతీయులు ఈ దౌత్యపరమైన వ్యవహారం గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.
ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తు విషయంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది కెమెరా వెనుక సమర్థించారు.

తాజా వివాదం ఏంటి?
కెనడా విడుదల చేసిన దౌత్య సందేశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
సిక్కు వేర్పాటువాద నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్‌తోపాటు ఇతర దౌత్యవేత్తలను ‘పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (దర్యాప్తుకు సంబంధించిన సమాచారం ఉండటం, లేదా కేసుతో సంబంధం ఉండటం)గా కెనడా పేర్కొనడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆదివారం కెనడా నుంచి ఈ దౌత్య సందేశం అందిందని, దీనిపై ప్రతిగా చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ట్రూడో ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఇలా చేస్తోందని భారత్ ఆరోపించింది. భారత్‌లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వారు 2024 అక్టోబర్ 19 శనివారం రాత్రి 11:59 గంటలలోపు భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
అలాగే, కెనడాలోని తమ హైకమిషనర్ సంజయ్ వర్మతో పాటు, మరికొందరు దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నట్టు భారత్ ప్రకటించింది.
మరోవైపు, “భారత ఏజంట్లు నిజ్జర్ హత్యలో పాల్గొన్నారు. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని, కిడ్నాప్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటి పనులు చేశారు” అని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారి ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలు ‘నిరాధారమైనవి’ అని భారత్ ప్రకటించింది. కెనడా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ దేశంలో సిక్కుల్ని తమవైపు ఆకర్షించేందుకు ఇలా చేస్తోందని ఆరోపించింది.
భారత్ ప్రకటన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఆరుగురు భారత దౌత్యవేత్తలను తాము బహిష్కరించామని చెప్పారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుకు భారత ప్రభుత్వం సహకరించకపోవడమే ఇందుకు కారణమని ట్రూడో అన్నారు. భారత దౌత్యవేత్తలపై ట్రూడో మరికొన్ని ఆరోపణలూ చేశారు.

ఫొటో సోర్స్, RAJAT GUPTA/EPA
ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?
జస్వీర్ షామిల్ కెనడాలో పదిహేనేళ్ల నుంచి జర్నలిస్టుగా పని చేస్తున్నారు. భారత్- కెనడా మధ్య ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని బీబీసీ ఆయన్ను అడిగింది.
ఆయన ఈ అంశాన్ని వేరే కోణంలో వివరించారు. “హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్‌లో భారత ప్రభుత్వాన్ని నిందించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి” అని షామిల్ తెలిపారు.
"అయితే కెనడాలో విదేశీ జోక్యం గురించి బహిరంగ విచారణ నిర్వహిస్తున్నారు. అది కేవలం భారత్ గురించి మాత్రమే కాదు, ఇతర దేశాల గురించి కూడా. పబ్లిక్ ఎంక్వైరీ కమిషన్ ముందు ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఈ వారంలో హాజరవుతున్నారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు” అని షామిల్ చెప్పారు.
‘‘ప్రభుత్వం మీద రాజకీయ ఒత్తిడి ఉంది. ఏదో ఒక చర్య తీసుకోవాలని కొంతమంది కోరుతున్నారు. కెనడాలో విదేశీ జోక్యం గురించి కెనడియన్ మీడియాలో వార్తలు వచ్చాయని జస్టిన్ ట్రూడో ఇటీవల కూడా పార్లమెంట్‌లో ప్రకటించారు” అని షామిల్ వివరించారు.
విదేశీ జోక్యంపై జరుగుతున్న విచారణకు ప్రధానమంత్రి హాజరు కావడం, ఈ విషయంలో ప్రభుత్వ మెతక వైఖరిని ప్రతిపక్షాలు విమర్శించడం తాజా పరిణామానికి ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు షామిల్ చెప్పారు.
దీంతో పాటు కెనడియన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం, హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణాన్ని భారతీయ దౌత్యవేత్తలకు లింక్ పెడుతూ వ్యవస్థీకృత నేరంగా ప్రకటించడంతో తాజాగా మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘వారందరూ ఖలిస్తాన్ మద్దతుదారులే అనుకోవద్దు’
భారత్- కెనడా మధ్య దౌత్య పరిస్థితుల విషయానికొస్తే, రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ఘర్షణ ఉందని హర్మిందర్ ధిల్లాన్ భావిస్తున్నారు. ధిల్లాన్ 30 ఏళ్లుగా కెనడాలో నివసిస్తున్నారు. ఆయన బ్రాంప్టన్‌లో సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు.
కెనడాలో సిక్కుల మద్దతు కోసమే ట్రూడో ప్రభుత్వం భారత్ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోందనే వాదనను హర్మిందర్ థిల్లాన్ అంగీకరించలేదు.
“అలాంటిదేమీ లేదు. మీరు భారత్‌లో కూర్చుని, ఖలిస్తాన్‌కు ఇక్కడ అనేక మంది మద్దతుదారులు ఉన్నారని అనుకోవచ్చు. ఖలిస్తాన్ మద్దతుదారులు కొన్ని నియోజకవర్గాల్లో, బ్రాంప్టన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నారు” అని థిల్లాన్ చెప్పారు.
‘‘కెనడాలో ఉన్న సిక్కుల్లోనూ అందరూ ఖలిస్తాన్ మద్దతుదారులు కారు. కెనడా లాంటి పెద్ద దేశంలో ఖలిస్తాన్ మద్దతుదారులను బుజ్జగించి ఓటమిని గెలుపుగా మార్చుకునే అవకాశం లేదు. కెనడాలో అది సాధ్యం కాదు’’ అని థిల్లాన్ విశ్లేషించారు.
తాజా పరిస్థితుల వల్ల గతంలో మాదిరిగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుందేమోనని హర్మిందర్ థిల్లాన్ భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇదంతా రాజకీయం’
కరమ్‌జిత్ సింగ్ గిల్ 24 ఏళ్లుగా కెనడాలో ఉంటున్నారు. ఆయన పంజాబ్‌లో స్వచ్చంధంగా సామాజిక సంస్థలకు సాయం చేస్తున్నారు.
“ఈ వార్త వినగానే నాకు చాలా బాధ కలిగింది. భారతదేశం మా మాతృభూమి, కెనడాలో నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు రెండు దేశాలు ఇష్టమే. ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఒక మహిళ తన తల్లిదండ్రులను వదిలేయలేరు, అత్తమామల్ని వదిలేయలేరు అన్నట్లుగా ఉంది. దీని వల్ల కెనడా పౌరసత్వం ఉన్న భారతీయులు రావడం, పోవడం కష్టంగా మారుతుంది. వారి కుటుంబాలు భారత దేశంలో ఉన్నాయి” అని కరమ్‌జిత్ చెప్పారు.
బిక్రమ్ సింగ్ కెనడాలో విద్యార్థి హక్కుల కోసం పోరాడుతున్న సంస్థకు నాయకుడు. నెలన్నర కాలంగా, ఆయన తన సంస్థలోని ఇతర సభ్యులతో కలిసి కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ వ్యవహారమని ఆయన అభివర్ణించారు. ఇందులో భారత ప్రభుత్వం, కెనడా ప్రభుత్వానికి సొంత రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. దీని వల్ల సామాన్య ప్రజలకు నష్టం జరుగుతోందని బిక్రమ్ సింగ్ చెప్పారు.
“ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి లక్షల మంది విద్యార్థులు కెనడాకు వస్తారు. ముఖ్యంగా పంజాబ్ నుంచి. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటే, వీసాలు పొందడం కష్టం కావచ్చు. కెనడా ఇతర దేశాలకు మార్గం తెరుస్తుంది, కానీ భారతీయులు నష్టపోతారు" అని బిక్రం సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత సంతతి ప్రజలు ఎందుకు మాట్లాడటం లేదు?
"దౌత్యపరమైన అంశాలు కొన్నిసార్లు సామాన్యులకు అర్థం కావు. చాలా మందికి దాని గురించి ఏం చెప్పాలో స్పష్టంగా తెలియదు, అందుకే కొన్నిసార్లు రాజకీయపరమైన అంశాల గురించి ఏమీ మాట్లాడరు," అని షామిల్ చెప్పారు.
ఏ రాజకీయ పార్టీకి చెందని వారు లేదా రాజకీయంగా అవగాహన లేని వారు మీడియాలో ఏదైనా చెబితే, భారత ప్రభుత్వం లేదా కెనడా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురు కావచ్చనే భయంతో కొంతమంది మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని హర్మీందర్ సింగ్ థిల్లాన్ అభిప్రాయపడ్డారు.
"భారతదేశం లేదా కెనడాలో ఎక్కడ వ్యవస్థీకృత నేరాలు జరిగినా, ఆ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నాను" అని హర్మీందర్ చెప్పారు.
‘‘గత ఏడాది జరిగినట్లుగా వీసా ఆంక్షల వంటి చర్యల వల్ల కెనడాలో భారత ప్రజలే ఇబ్బంది పడతారనే విషయం భారత ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. దౌత్యపరమైన సమస్యలను ప్రభుత్వాలు తమ స్థాయిలోనే పరిష్కరించుకోవాలి’’ అని కరమ్‌జిత్ సింగ్ గిల్ చెప్పారు.
వివాదం ఎక్కడ మొదలైంది?
2023 సెప్టెంబరులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండవచ్చని తన దేశ పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రకటన తర్వాత, భారత సీనియర్ దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ను కెనడా బహిష్కరించింది.
ప్రతీకారంగా, అప్పుడు కెనడా సీనియర్ దౌత్యవేత్త ఐదు రోజుల్లో భారత్‌ను విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
కెనడా ఆరోపణలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు, ఎంబసీ అధికారుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటూ కెనడియన్ పౌరులకు వీసా జారీ సేవలను భారత్ నిలిపివేసింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















