ఏపీ ఇసుక ‘కుంభకోణం’: ఎవరీ వెంకటరెడ్డి? ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ ఎందుకు కోరుతోంది

వెంకటరెడ్డి, గనుల శాఖ, ఇసుక దోపిడి, అక్రమాలు, ఇసుక పాలసీ, ఆంధ్రప్రదేశ్, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విజయవాడ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.

ఈ మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం వెల్లడించారు.

వెంకటరెడ్డి బెయిల్‌పై బయటకు వస్తే మైనింగ్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. కాబట్టి బెయిల్ పిటిషన్ రద్దు కోరుతూ తమ శాఖ తరపున వాదిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘రూ. 2,566 కోట్ల కుంభకోణం’

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2,566 కోట్ల ఇసుక కుంభకోణం జరిగిందంటూ కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్‌గా పని చేసిన వీజీ వెంకటరెడ్డిని ఈ ఏడాది సెప్టెంబర్ 26న అరెస్టు చేసింది.

జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయన్ను కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికార బృందం విచారించింది.

అక్టోబర్ మొదటి వారంలో జరిగిన విచారణకు ఆయన పూర్తి స్థాయిలో సహకరించలేదని.. ఇసుక కుంభకోణానికి సంబంధించి“కర్త, కర్మ నేను కాదు. నేను కేవలం ‘క్రియ’ను మాత్రమే’’ అని వెంకటరెడ్డి చెప్పారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

కర్త, కర్మ ఎవరని మాత్రం నిందితుడు నేరుగా చెప్పలేదని ఏసీబీ అంటోంది.

కానీ తమ వద్దనున్న ఆధారాలు, తాము చేసిన విచారణలో బయటికొచ్చిన కొందరు గత ప్రభుత్వ పెద్దల పేర్లను ప్రస్తావించినప్పుడు వెంకటరెడ్డి స్పందించిన తీరు ఆధారంగా.. ఉన్నతాధికారులతో చర్చించి, మరికొందరు పేర్లను నిందితులుగా చేర్చాలని ఏసీబీ నిర్ణయించినట్టు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

వెంకటరెడ్డి, గనుల శాఖ, ఇసుక దోపిడి, అక్రమాలు, ఇసుక పాలసీ, ఆంధ్రప్రదేశ్, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి
ఫొటో క్యాప్షన్, వెంకటరెడ్డి చర్యలతో రాష్ట్ర ఖజానాకు రూ.2,566 కోట్ల మేర నష్టం వచ్చిందని కోర్టుకి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది.

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నెలలోనే..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం జూన్‌లో కొలువుదీరగా జులైలో ‘ఇసుక కుంభకోణం’ వెలుగులోకి వచ్చింది.

వెంకటరెడ్డి మైన్స్‌ డైరెక్టర్‌గా ఉన్న కాలంలో ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ గనుల శాఖ కమిషనర్‌ జులైలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం బయటకు వచ్చింది.

నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఉత్తర్వులు.. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రైవేటు వ్యక్తులకు ఇసుకను దోచిపెట్టడంతో రాష్ట్ర ఖజానాకు రూ.2,566 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

శాఖాపరమైన విచారణ తర్వాత ఈ నివేదికను ఏసీబీ డీజీకి పంపగా, ప్రాథమిక విచారణ జరిపి అవినీతి నిరోధక (సవరణ) సెక్షన్లు 7, 9, 10, 12,13(1)(ఎ) కింద సెప్టెంబర్ 11న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

అలాగే ఐపీసీ 406, 409, 120బీ సెక్షన్లతో పాటు మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (డెవలప్‌మెంట్‌–రెగ్యులేషన్‌) యాక్ట్‌ కింద 4 (1), 4 (1) (ఎ) 21సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ప్రభుత్వానికి రూ.2,566 కోట్లు నష్టం వాటిల్లేలా గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) మాజీ ఎండీ వెంకటరెడ్డి వ్యవహరించారని ఏసీబీ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ఈ కేసులో ఏ–1 గా వెంకటరెడ్డి, ఏ2 గా జేపీ పవర్‌ వెంచర్స్‌ ప్రతినిధి అనిల్‌ ఆత్మారామ్‌ కామత్, ఏ3 గా ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రతినిధి పి.అనిల్‌ కుమార్, ఏ4గా జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రతినిధి ఆర్‌.వెంకట కృష్ణారెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

అలాగే జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (జేపీవీఎల్‌)ను ఏ5గా, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ను ఏ6గా, జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ను ఏ7గా ఏసీబీ పేర్కొంది.

రిమాండ్‌ రిపోర్టులో ఏముందంటే..

ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతిలో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డిది నేరపూరిత కుట్రేనని న్యాయస్థానానికి ఏసీబీ తెలిపింది.

వెంకటరెడ్డి చర్యలతో రాష్ట్ర ఖజానాకు రూ.2,566 కోట్ల మేర నష్టం వచ్చిందని కోర్టుకి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది.

47 పేజీల ఆ రిమాండ్‌ రిపోర్టులో... ప్రాథమిక విచారణలో ఏసీబీ గుర్తించిన అంశాలు, అక్రమాల గురించి ప్రస్తావించింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయాల కాంట్రాక్టు దక్కించుకున్న జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ప్రభుత్వానికి రూ. 1,528 కోట్ల 80 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ. 201 కోట్ల 66 లక్షలే జమ చేసినట్లు ఏసీబీ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.

జగనన్న ఇళ్ల కాలనీలకు రూ.859 కోట్ల 72 లక్షలు.. నాడు–నేడు కింద నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ బడులకు రూ.71 కోట్ల 44 లక్షలు విలువైన ఇసుక సరఫరా చేసినట్లు లెక్కల్లో చూపిందని ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.

కానీ రూ.931 కోట్ల 16 లక్షలను ప్రభుత్వానికి కట్టకుండా సర్దుబాటు పేరిట దోచేసుకుందని రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ పొందుపరిచింది.

ఆ మొత్తాన్ని మినహాయించుకున్నారని అనుకున్నా, జేపీ సంస్థ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.395 కోట్ల 96 లక్షలు చెల్లించాలని.. ఇక స్టాంప్ డ్యూటీ, సకాలంలో వాయిదాలు కట్టనందుకు చెల్లించాల్సిన వడ్డీ, ఇతరత్రా కలిపితే ఆ సంస్థ ప్రభుత్వానికి రూ. 624 కోట్ల 82 లక్షలు బకాయి పడిందని తెలిపింది.

అయినప్పటికీ ఆ సంస్థ సబ్‌లీజుదారు అయిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజస్‌ సమర్పించిన రూ. 120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేందుకు వెంకటరెడ్డి నిరభ్యంతర పత్రం ఇచ్చేశారని రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది.

వెంకటరెడ్డి, గనుల శాఖ, ఇసుక దోపిడి, అక్రమాలు, ఇసుక పాలసీ, ఆంధ్రప్రదేశ్, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి

జేపీవీఎల్‌తో పాటు ఆ రెండు సంస్థలు కూడా..

జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌తో పాటు ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్, జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు, వాటి ప్రతినిధులతో కలిసి వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ ఆరోపించింది.

ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, సరఫరా, విక్రయాలు చేపట్టే కాంట్రాక్టును 2021 మే నెలలో దక్కించుకున్న జయప్రకాశ్ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సబ్‌లీజు అప్పగించేసిందని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.

రెండేళ్లపాటు కార్యకలాపాలన్నీ టర్న్‌కీయే నిర్వహించిందని టెండరు నిబంధనలకు విరుద్ధమైన ఈ వ్యవహారానికి వెంకటరెడ్డి అక్రమంగా అనుమతిచ్చారని పేర్కొంది.

ఇక 2023 డిసెంబరులో ఇసుక కాంట్రాక్టు దక్కించుకున్న జీసీకేసీ, ప్రతిమ సంస్థలు ఇసుక రీచ్‌ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయని తెలిపింది. అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయని పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టాయని పేర్కొంది.

జిల్లా స్థాయి ఇసుక కమిటీల నివేదికల్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయని, వెంకటరెడ్డి సహకారంతోనే ఈ అక్రమాలన్నీ నిరాటంకంగా సాగాయని వివరించింది.

ప్రభుత్వానికి జేసీకేసీ సంస్థ రూ.155 కోట్ల 32 లక్షలు, ప్రతిమ ఇన్‌ఫ్రా రూ.147 కోట్ల 90 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిపడ్డాయని పేర్కొంది.

ఇసుక తవ్వకాల లీజు ఒప్పందం రిజిస్ట్రేషన్‌ స్టాంపుడ్యూటీ, ఇతర చట్టబద్ధమైన రుసుముల కింద ఈ రెండు సంస్థలు రూ.30 కోట్ల 63 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నా ఆ సొమ్ము కట్టలేదని తెలిపింది.

ఆ బకాయిలపై 24 శాతం వడ్డీ వసూలు చేయాలని, ఇవేమీ వసూలు చేయకుండా వెంకటరెడ్డి ఆ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారని వివరించింది.

కొత్త ప్రభుత్వం రాగానే ఈ మూడు సంస్థలకు కలిపి రూ.717 కోట్ల 32 లక్షలు జరిమానా విధించిందని ఏసీబీ రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించింది.

వెంకటరెడ్డి, గనుల శాఖ, ఇసుక దోపిడి, అక్రమాలు, ఇసుక పాలసీ, ఆంధ్రప్రదేశ్, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి

ఏపీఎండీసీ తవ్వి తీసిన ఇసుక కూడా ఆ సంస్థకే

ప్రైవేటు సంస్థలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు అప్పగించక ముందు ఏపీఎండీసీ తవ్వి తీసిన రూ.130 కోట్ల 73 లక్షలు, ప్రకాశం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్‌ ద్వారా తవ్వితీసిన రూ.39 కోట్ల 24 లక్షల విలువైన ఇసుకను వెంకటరెడ్డి జేపీవీఎల్‌కు అప్పగించేశారని ఏసీబీ రిమాండ్‌ రిపోర్టులో ప్రస్తావించింది.

ఇసుక రీచ్‌ల్లో ఉన్న ఏపీఎండీసీకి చెందిన రూ.27 కోట్ల 35 లక్షల విలువైన వే బ్రిడ్జిలు, సీసీ టీవీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర పరికరాలన్నింటినీ అప్పట్లో జేపీవీఎల్‌కు అప్పగించారని తెలిపింది.

జేపీవీఎల్‌ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసినా నవంబరు వరకూ ఆ సంస్థే అనధికారికంగా తవ్విందని వెల్లడించింది.

ఈ అక్రమ తవ్వకాలకు వెంకటరెడ్డి సహకరించారని ఆ సంస్థ 896 కోట్ల 47 లక్షల విలువైన 45 లక్షల 62 వేల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసిందని రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచింది.

ఆన్‌లైన్‌ పర్మిట్లు జారీచేయాలనే మార్గదర్శకాలు ఉండగా జేపీవీఎల్‌ వాటిని పాటించకుండా మాన్యువల్‌ లావాదేవీలు నిర్వహించిందని, అయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారని తెలిపింది.

ఇసుక కుంభకోణానికి సంబంధించి అంతిమ లబ్ధిదారులు ఎవరని ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని పదే పదే ప్రశ్నించగా తనను ఇబ్బంది పెట్టొద్దంటూ సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించినట్లు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

వెంకటరెడ్డి, గనుల శాఖ, ఇసుక దోపిడి, అక్రమాలు, ఇసుక పాలసీ, ఆంధ్రప్రదేశ్, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్‌గా పని చేసిన వీజీ వెంకటరెడ్డి

ఎవరీ వెంకటరెడ్డి?

వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కోస్ట్‌గార్డ్‌ సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు.

2019లో రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డెప్యుటేషన్‌పై రాష్ట్ర సర్వీసులోకి రాగా జగన్ ప్రభుత్వం ఏపీఎండీసీ ఎండీగా, గనుల శాఖ డైరెక్టర్‌గా జోడు పదవులనిచ్చింది.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు సంబంధించి జులై 31న వెంకటరెడ్డిని సస్పెండ్‌ చేసింది.

ఆ తర్వాత సెప్టెంబర్‌ 11న కేసు నమోదైంది. కొన్ని రోజుల పాటు ఆచూకీ తెలియకుండా పోయిన ఆయన్ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచగా, అక్టోబర్‌ 10 వరకు కోర్ట్ రిమాండ్‌ విధించింది.

ఇసుక కొనుగోళ్లకు సంబంధించి అప్పట్లో జేవీపీఎల్ పేరుతో జారీ చేసిన బిల్లులు
ఫొటో క్యాప్షన్, ఇసుక కొనుగోళ్లకు సంబంధించి అప్పట్లో జేవీపీఎల్ పేరుతో జారీ చేసిన బిల్లులు

స్పందించని జేపీవీఎల్‌

ఇసుక కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (జేపీవీఎల్‌) వివరణ తీసుకునేందుకు ఆ సంస్థను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది.

వారి ప్రతినిధులకు ఈ విషయంపై మెయిల్‌ చేసినా, ఫోన్‌ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

నిందితులెంతటి వారైనా వదలం: మంత్రి కొల్లు రవీంద్ర

ఇసుక కుంభకోణం కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఇతర నిందితులను అరెస్టు చేస్తారని, వారు ఎంతటివారైనా వదిలేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బీబీసీకి తెలిపారు.

గనుల శాఖ ప్రాథమిక విచారణ చేసిన అనంతరం కేసును ఏసీబీకి అప్పగించిందని, విచారణ స్థాయిలో ఉన్నప్పుడు ఏదీ చెప్పలేమని అన్నారు.

అదంతా కక్షపూరితమే: వైఎస్సార్‌సీపీ

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనల మేరకే ఇసుక తవ్వకాలు జరిగాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మేరుగ నాగార్జున బీబీసీతో చెప్పారు.

“నియమ నిబంధనలను అనుసరించే అప్పటి అధికారులు వ్యవహరించారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కేవలం కక్షపూరితంగానే ఆ కేసులో అరెస్టులు మొదలు పెట్టింది. ఇవన్నీ నిలబడేవి కావు’’ అని నాగార్జున వ్యాఖ్యానించారు.

ఈ మొత్తం వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గనులశాఖ మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సంప్రదించేందుకు బీబీసీ ఫోన్‌లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ తెలుగు కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)