ఇజ్రాయెల్ తాజా దాడుల తరువాత నెతన్యాహు అడుగులు ఎటు, ఆయన వ్యూహం ఏమిటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జొ ఫ్లొటొ
- హోదా, బీబీసీ ప్రతినిధి
లెబనాన్ మీద ఇజ్రాయెల్ భూతల దాడులు మొదలు పెట్టి రెండు వారాలు గడిచాయి. గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది. కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తులు పెరిగాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులకు రెండో రోజు కూడా గాయాలయ్యాయి.
ఉత్తర గాజాలోని జబాలియాలో ఘర్షణలకు ముగింపు పలకాలని పదే పదే కోరినప్పటికీ అక్కడ తాజాగా కొత్త దాడులు మొదలయ్యాయి. గత వారం ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఖండాంతర క్షిపణుల ప్రయోగం తర్వాత ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ఆ దేశ భాగస్వామ్య పక్షాలు కోరుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ, ఇజ్రాయెల్ తాను ఎంచుకున్న దారిలో ముందుకెళుతోంది. అలాగే తనపై వస్తున్న ఒత్తిడిని కూడా మూడు కారణాల వల్ల వ్యతిరేకిస్తోంది.
ఆ మూడు కారణాలు ఏమిటంటే..
1. అక్టోబర్ 7
2. బెంజమిన్ నెతన్యాహు
3.అమెరికా
2020 జనవరిలో ఒక రోజు రాత్రి డమాస్కస్ నుంచి ఇరానియన్ జనరల్ కాశిం సులేమానీ బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఇరాన్ అత్యున్నత దళం, కుడ్స్ ఫోర్స్‌కు సులేమాని నాయకుడు. ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ విదేశాల్లో నిర్వహించే ఆపరేషన్లలో కుడ్స్‌ఫోర్స్‌ది కీలకపాత్ర.
కుడ్స్‌ఫోర్స్ అంటే జెరూసలేం అని అర్ధం. ఇజ్రాయెల్ ఈ గ్రూప్‌కు ప్రధాన ప్రత్యర్థి. ఇరాక్, లెబనాన్, పాలస్తీనా భూభాగాలు, విదేశాల్లో ఇరాన్ మద్దతున్న సాయుధ గ్రూపులకు ఆయుధాలు, శిక్షణ, నిధులు అందించడంతో పాటు వాటికి మార్గనిర్దేశనం చేస్తుంది.
ఆ సమయంలో సులేమానీ ఇరాన్ అధినాయకుడు అయేతుల్లా అలీ ఖమినేయి తర్వాత అత్యంత శక్తిమంతుడైన రెండో వ్యక్తిగా ఉన్నారు.
సులేమానీ కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిన తర్వాత డ్రోన్ ద్వారా ఆయన కాన్వాయ్‌పై మిస్సైల్స్ వదిలారు. ఈ దాడిలో సులేమానీ అక్కడికక్కడే చనిపోయారు.


ఫొటో సోర్స్, Getty Images
సులేమానీని చంపమని చెప్పింది ఎవరు?
తమ బద్ద విరోధి కదలికల విషయంలో ఇజ్రాయెల్ నిఘా బృందాల వద్ద సమాచారం ఉంది. అయితే సులేమానీ మీద క్షిపణులు ప్రయోగించిన డ్రోన్ మాత్రం అమెరికాకు చెందినది. సులేమానీని హత్య చేయాలనే ఆదేశాలు ఇచ్చిందిఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాదు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్,.
“నెతన్యాహు మమ్మల్ని నిరాశపరచడాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను” అని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సులేమానీ హత్య గురించి ప్రస్తావిస్తూ ఓ ప్రసంగంలో చెప్పారు.
మరో ప్రత్యేక ఇంటర్వ్యూలో సులేమానీ హత్య విషయంలో ఇజ్రాయెల్ మరింత కీలక పాత్ర పోషిస్తుందని తాను భావించానన్నారు. కానీ ఇరాన్‌తో అమెరికన్ సైనికులు చివరివరకూ పోరాడాలని నెతన్యాహు భావించారని ట్రంప్ ఆరోపించారు.
సులేమానీ హత్య గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న సమయంలో, నెతన్యాహు ఈ హత్యను ప్రశంసించారు. దీంతో సులేమానీ హత్యలో ఇజ్రాయెల్ పాత్ర ఉందని దీని వల్ల ఇజ్రాయెల్ మీద భారీ దాడి జరగవచ్చని భావించారు.
ఈ దాడులు ఇరాన్ నేరుగా లేదా ఇరాన్ మద్దతున్న మిలీషియాలు లెబనాన్ లేదా పాలస్తీనా భూభాగం నుంచి చేయవచ్చని అనుకున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్‌తో నేరుగా తలపడకపోయినా, వివిధ కోణాల్లో యుద్ధం చేస్తోంది. అయితే ఇరుపక్షాలు ఓ పరిమితస్థాయివరకు మాత్రమే ఈ దాడులు పరిమితం చేసుకుంటున్నాయి. దీనివల్ల ఇరుపక్షాలు పూర్తి యుద్ధానికి దిగకుండా పరోక్ష సంఘర్షణను కొనసాగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా ఆలోచన ఏమిటి?
నాలుగేళ్ల తర్వాత 2024 ఏప్రిల్‌లో అదే నెతన్యాహు డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య ప్రాంగణంలోని ఓ భవనంపై ఫైటర్‌జెట్లతో బాంబు దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ దాడుల్లో చనిపోయిన వారిలో ఇద్దరు ఇరానియన్ జనరల్స్ ఉన్నారు.
దీని తరువాత 2024 జులైలో బేరూత్‌లో హిజ్బొల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్ మీద వైమానిక దాడి చేసి హత్య చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అనుమతి ఇచ్చారు. ఇది తమకు అవమానకరమని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ భావించారని బాబ్ ఉడ్‌వర్డ్ రాసిన కొత్త పుస్తకంలో తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల్ని ముగింపు దశకు తీసుకు వచ్చేందుకు తాము నెలలపాటు శ్రమిస్తే, నెతన్యాహు దాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నించారని బైడెన్ భావించారు.
“మీకు తెలుసా, ఇజ్రాయెల్ గురించి ప్రపంచం ఏమనుకుంటున్నదంటే మీదొక ‘రోగ్ స్టేట్, రోగ్ యాక్టర్” అని అధ్యక్షుడు బైడెన్ చెప్పినట్లు బాబ్ వెల్లడించారు.
అదే ప్రధానమంత్రిని ఒక అమెరికా అధ్యక్షుడు జాగ్రత్త పరుడని అంటే, ఆ తర్వాత వచ్చిన అధ్యక్షుడు ఆ ప్రధానమంత్రి దూకుడుగా వ్యవహరిస్తారని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
2023 అక్టోబర్ 7 తర్వాత..
పైన పేర్కొన్న రెండు ఘటనలను 2023 అక్టోబర్ 7న జరిగిన సంఘటన వేరు చేస్తోంది, ఇజ్రాయెల్ చరిత్రను రక్తంతో తడిపిన రోజు అది. రాజకీయ, సైనిక, నిఘా విభాగాల వైఫల్యానికి నిదర్శనం.
ఈ రెండు సంఘటనలను కలుపుతుతోంది ఏంటంటే, నెతన్యాహు అమెరికా అధ్యక్షుడి ఆలోచనలను ధిక్కరిస్తున్నారు. ప్రస్తుత యుద్ధాన్ని ఇజ్రాయెల్ కొనసాగిస్తుందని చెప్పడానికి ఈ రెండు అంశాలు ఉపయోగపడతాయి.
గాజా, లెబనాన్ మీద దాడులకు ముందు ఇజ్రాయెల్ చేసిన యుద్ధాలు కొన్ని వారాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగినప్పుడు అమెరికా కాల్పుల విరమణకు పట్టుబట్టేది.
అయితే ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి తీవ్రత, ఇజ్రాయెల్ సమాజం, భద్రత మీద దాని ప్రభావం లాంటివి చూస్తే, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం అంతకు ముందు జరిగిన వాటికి భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు .
అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు అందిస్తోంది. అయితే పాలస్తీనాలో పౌరుల మరణాలు, గాజాలో పరిస్థితులు అమెరికాకు తీవ్ర అసౌకర్యంగా మారడమే కాక, రాజకీయపరంగానూ ఇబ్బందిగా పరిణమించాయి. అంతే కాకుండా రాజకీయంగానూ బైడెన్ ప్రభుత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి.
ఈ ప్రాంతంలో అమెరికాని విమర్శించేవారికి అమెరికా సాయాన్ని భారీగా అందుకుంటున్న దేశాన్ని కట్టడి చెయ్యడంలో వైట్‌హౌస్ నిస్సహాయత ఆశ్చర్యం కలిగిస్తోంది.
2024 ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులను అమెరికన్ జెట్ విమానాలు తిప్పి కొట్టాయి. ఇజ్రాయెల్ భద్రతలో అమెరికా ఎంతో కీలకం అని తెలిసినా కూడా ఇజ్రాయెల్ అమెరికా మాట వినకుండా యుద్ధాన్ని కొనసాగిస్తోంది.
2024 వేసవిలో అమెరికా నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఇజ్రాయెల్ హిజ్బొల్లాపై దాడులను తీవ్రం చేసింది.
ఇజ్రాయెల్‌లో సుదీర్ఘ కాలం ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి నెతన్యాహు. ఆయన 20 ఏళ్లుగా అమెరికా నుంచి వచ్చే ఒత్తిళ్లను ఎదుర్కోవడం ఎలాగో నేర్చుకున్నారు.
అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎంచుకున్న మార్గం నుంచి తప్పుకోవాలని అమెరికా ఒత్తిడి చేయలేదనే విషయం ఆయనకు తెలుసు. పైగా తాను పోరాడుతున్న శత్రువులు ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాకు కూడా శత్రువులని ఆయన నమ్ముతున్నారు.

ఫొటో సోర్స్, EPA
అంతర్జాతీయ ఒత్తిళ్లను జయించి..
తాజా దాడుల విషయానికి వస్తే, నెతన్యాహు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అనుకోవడం పొరపాటు అవుతుంది. స్వదేశంలో హిజ్బొల్లా కంటే ఇరాన్ మీద దాడి చెయ్యాలనే ఒత్తిడి ఆయనపై ఎక్కువగా ఉంది.
2024 సెప్టెంబర్‌లో లెబనాన్‌లో 21 రోజుల కాల్పుల విరమణకు సంబంధించిన ప్రణాళికను అమెరికా, ఫ్రాన్స్ ముందుకు తీసుకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
వామపక్ష పార్టీలతో పాటు అతివాద పార్టీలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.
ఇజ్రాయెల్ ఇప్పుడు తాను చేస్తున్న యుద్ధాలను కొనసాగించాలని నిర్ణయించుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను ఎదుర్కోవడమే కాకుండా, అక్టోబర్ 7 దాడుల తరువాత ఇజ్రాయెల్ బెదిరింపులను ఓర్చుకునే విషయంలో ఆలోచనా ధోరణిని మార్చుకుంది.
ఉత్తర ఇజ్రాయెల్‌లో గలీలీ మీద దాడి చెయ్యడం తమ లక్ష్యమని హిజ్బొల్లా అనేక ఏళ్లుగా చెబుతోంది. తీవ్రవాదులు ఇళ్ల మీద దాడులు చేసి చంపేసిన సంఘటనలు ఇప్పుడు ఇజ్రాయెలీలకు కూడా అనుభవంలోకి రావడంతో ఇజ్రాయెల్ ప్రజలు కూడా హిజ్బొల్లా, హమాస్ లాంటి మిలీషియాలను అంతం చేయాలని కోరుకుంటున్నారు.
తనకు ఎదురయ్యే ముప్పు విషయంలో ఇజ్రాయెల్ దృక్పథం కూడా మారింది. ఇప్పటిదాకా పాటిస్తున్న మిలటరీ పరిమితులు కూడా ఆవిరైపోయాయి. ఏడాది కాలంగా జరిగిన అనేక సంఘటనలు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీశాయి. ఆ సంఘటనల్లో తెహ్రాన్, బేరూత్, టెల్ అవీవ్, జెరూసలేం మీద బాంబుల వర్షం, రాకెట్ల దాడులు, క్షిపణి దాడులు లాంటివి ఉన్నాయి.
ఇరాన్‌లో అతిథిగా పర్యటిస్తున్న హమాస్ నాయకుడిని తెహ్రాన్‌లో ఇజ్రాయెల్ హత్య చేసింది. నస్రల్లా సహా హిజ్బొల్లా కమాండర్లందనీ చంపేసింది. సిరియాలోని దౌత్య భవనంలో ఇరాన్ సైనికాధికారులను హత్య చేసింది.
హిజ్బొల్లా ఇజ్రాయెల్ నగరాల మీదకు 9వేలకు పైగా మిస్సైళ్లు, రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. టెల్ అవీవ్ మీదకు ఖండాంతర క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్ మద్దతున్న హూతీలు కూడా ఇజ్రాయెల్ నగరాల మీద క్షిపణులతో దాడులు చేశారు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను దాటుకుని అవి సెంట్రల్ ఇజ్రాయెల్ మీద పడ్డాయి. ఇరాన్ గత ఆరు నెలల్లో ఇజ్రాయెల్ మీద రెండుసార్లు దాడులు చేసింది. ఇందులో 500కి పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసింది.
ఈ దాడులన్నీ ఓ ప్రాంతీయ యుద్ధానికి దారితీయడానికి సరిపోయినవే. కానీ అలా జరగలేదు కనుక ఇజ్రాయెల్ ప్రధాని తన భవిష్యత్తు నిర్ణయాలపై మరింత ధృడంగా ఉంటారు. ఆయన తదుపరి వేసే అడుగులే భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














