“నీకు కాలు లేదు, నాకు చేయి లేదు, అయితేనేం.. మన ప్రేమకు అడ్డులేదు” యుద్ధంలో మొలకెత్తిన ఓ ప్రేమగాథ..!

ప్రేమ, తొలిచూపు, ఎవ్జెన్, మరియా
ఫొటో క్యాప్షన్, తొలిచూపులోనే ప్రేమలో పడ్డ ఎవ్‌జెన్, మరియా
    • రచయిత, లెస్యా కేసర్చుక్
    • హోదా, బీబీసీ న్యూస్ యుక్రెయిన్

“ఆయన మద్దతు లేకుండా నేను పారాలింపిక్స్‌లో ఎప్పటికీ మెడల్ సాధించలేను” అని మరియా ష్పాట్కివాస్కా చెప్పారు .

తొలిచూపులోనే మరియా, ఎవ్‌జెన్ బుక్షా ప్రేమలో పడ్డారు. 9 నెలల డేటింగ్ తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

మరియా వయసు 24 ఏళ్లు. పుట్టుకతోనే ఎడమ చేయి వైకల్యంతో జన్మించారు. ఈ ఏడాది పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసి, షాట్‌పుట్‌లో ‘సిల్వర్ మెడల్’ గెలుచుకున్నారు.

ఎవ్‌జెన్ ఓ సైనికుడు. 2022 ఫిబ్రవరిలో రష్యా దండయాత్రకు దిగిన తొలినాళ్లలో లుహాన్స్క్ ప్రాంతంలో జరిగిన దాడిలో గాయపడ్డారు. ఆ ప్రమాదంలో ఆయన ఓ కాలు కోల్పోయారు.

రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్‌గా మరియా పని చేసే ఆర్థోపెడిక్ సెంటర్‌లో వీళ్లిద్దరూ కలుసుకున్నారు.

 బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మరియా
ఫొటో క్యాప్షన్, 8 ఏళ్ల వయసులోనే క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మరియా

8 ఏళ్లకే ఆటల్లోకి..

తను ఉండే పట్టణంలోనే స్థానికంగా ఉండే ఓ కోచ్ సహకారంతో 8 ఏళ్ల వయసులోనే మరియా క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

పారా అథ్లెట్స్‌కు ఆయన శిక్షణనిస్తుంటారు. ఆయన మరియాలో ఉన్న ప్రతిభను గుర్తించి స్విమ్మింగ్‌లో ప్రోత్సహించారు.

“నేను స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టాను. కానీ, మరమ్మతుల కారణంగా స్థానికంగా ఉండే పూల్‌ను చాలా కాలం పాటు మూసివేశారు. దీంతో, స్విమ్మింగ్‌ను వదిలి అథ్లెటిక్స్ వైపు కదిలాను” అని మరియా నాటి విశేషాలు గుర్తు చేసుకున్నారు.

మరియా తొలినాళ్లలో రన్నింగ్, స్ప్రింటింగ్, జావెలిన్ త్రో వంటి క్రీడలపై దృష్టి పెట్టారు. ఎక్కువ సమయాన్ని జిమ్‌లో కసరత్తులు చేయడానికి, స్టేడియంలో పోటీల్లో పాల్గొనడం వంటి వాటికే కేటాయించేవారు.

యుక్రెయిన్, యూరప్‌లో జరిగే అన్ని పోటీల్లో మరియా విజయం సాధించడంతో 19 ఏళ్లకే ఆమెకు బాగా పేరువచ్చింది.

తన కృత్రిమ చేయిని సర్దుబాటు చేసుకోవడానికి, సెంట్రల్ యుక్రెయిన్‌లోని విన్నిత్సియాలోని ఓ ఆర్థోపెడిక్ సెంటర్‌కు మరియా వెళుతుండేవారు. అలా ఆమెకు అక్కడి పరికరాలు, పరిస్థితులపై చక్కని అవగాహన ఏర్పడింది. దీంతో సిమ్యూలేటర్స్ ఎలా ఉపయోగించాలి..?వంటి అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమెకు ఆహ్వానాలు వచ్చేవి. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం మొదలైన తొలినాళ్లలో రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్‌గా పని చేయాలని పలువురు అడిగారు.

“తొలిసారిగా ఆర్థోపెడిక్ సెంటర్‌లో పని చేయడానికి వచ్చినప్పుడు, తన రెండు కాళ్లు కోల్పోయిన ఓ 19 ఏళ్ల సైనికుడిని చూసి షాకయ్యాను” అని మరియా చెప్పారు.

“క్రీడల్లో భాగంగా చాలా మంది వికలాంగులను దగ్గరి నుంచి చూశాను. కానీ, ఈ తరహా వారిని చూడటం ఇదే మొదటిసారి. అయినప్పటికీ, కాలక్రమేణా నేను వాటికి అలవాటు పడ్డాను” అని ఆమె చెప్పారు.

యూరప్, యుక్రెయిన్, రష్యా
ఫొటో క్యాప్షన్, 19 ఏళ్లకే క్రీడల్లో మంచి పేరు సంపాదించిన మరియా

స్ఫూర్తి నింపుతూ, పొందుతూ..

గాయపడిన సైనికులతో మరియా క్రీడల గురించి మాట్లాడేవారు. వైకల్యాన్ని పక్కన పెట్టి, కృత్రిమ అవయవాల సాయంతో రన్నింగ్, జంపింగ్, జావెలిన్ త్రో వంటి క్రీడల్లో పాల్గొన్న పారా అథ్లెట్స్ ఫొటోలు, వీడియోలను సైనికులకు చూపించేవారు.

వీటి వల్ల వారిలో నిరాశ పోయి ప్రేరణ కలుగుతుందని మరియా విశ్వసిస్తారు.

2018లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ యూరోపియన్ ఛాంపియన్స్‌షిప్‌లో పక్షవాతానికి గురైన వారు సైతం రన్నింగ్ చేయడం ఆమెలో స్ఫూర్తినింపింది. దీని తరువాత, తాను కూడా కృత్రిమ అవయవాలు ధరించడం మానేయాలని నిర్ణయించుకున్నారు.

యూరప్, పారా అథ్లెట్స్,
ఫొటో క్యాప్షన్, మరియా, ఎవ్‌జెన్

అలా మొదలైంది..

ఆర్థోపెడిక్ సెంటర్స్‌లో రోగులకు ఉపశమనం కలిగించేలా ఆటలు నిర్వహిస్తుంటారు. అలా, బిలియర్డ్స్ గేమ్ ఆడేటప్పుడు మరియా, ఎవ్‌జెన్ తొలిసారిగా కలుసుకున్నారు.

యుద్ధం గురించి, తమకు కలిగిన గాయాల గురించి మాట్లాడుకుంటూ ఒకరిపట్ల మరోకరు ఆకర్షితులయ్యారు.

అంతకుముందు, ఎవ్‌జెన్ ఓ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవారు. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన సమయంలో ఆర్మీలో చేరారు.

2022 ఫిబ్రవరిలో తూర్పు యుక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ బాంబు శకలం తాకి ఆయన కుడి కాలుకు గాయమైంది.

రక్తస్రావం ఎక్కువగా జరగకుండా గాయంపై భాగాన ఓ కట్టు కట్టుకుని సుమారు పది గంటల పాటు అలాగే పడుకున్నానని ఎవ్‌జెన్ గుర్తు చేసుకున్నారు.

ఆ సమయంలో రష్యన్ డ్రోన్లు అక్కడక్కడే తిరుగుతుండటంతో ఆయనను ఆసుపత్రికి తరలించడం సాధ్యపడలేదు. ఫలితంగా, ఎవ్‌జెన్ తన కాలును శాశ్వతంగా కోల్పోయారు.

మరియాను కలిసిన మూడు నెలల తరువాత , తను ఎక్కడైతే పని చేస్తుందో అదే ఆర్థోపెడిక్ సెంటర్‌కే ఎవ్‌జెన్‌ను తరలించారు. మారియా కూడా ఎవ్‌జెన్‌ను వెంటనే చేర్చుకుని ఆయన బాగోగులు చూడటానికి అంగీకరించారు. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య బంధం మరింత బలోపేతమైంది.

ఎవ్‌జెన్ పట్టుదల, దయ, చిత్తశుద్ధి చూసి మరియా ఆయన ప్రేమలో పడిపోయారు. అదే సమయంలో మరియాలోని ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం ఎవ్‌జెన్‌ను ఆకర్షించాయి.

డేటింగ్, పెళ్లి, పారా ఒలింపిక్స్
ఫొటో క్యాప్షన్, 9 నెలల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న ఎవ్‌జెన్ మరియా

‘నాకు కాలు లేదు, అయితే ఏంటి నాకు చేయిలేదు’

“ఓ చేయి లేని అమ్మాయి, చేతికర్ర సాయంతో నడుస్తున్న ఓ కాలు లేని అబ్బాయి... తరచుగా వీళ్లిద్దరు కలిసి వాకింగ్‌కు వెళ్లేవారు” అని మరియా తమ గురించి చెప్పారు.

“పుట్టుకతోనే ఓ చేయి లేకుండా జన్మించాను. కాబట్టి, చుట్టుపక్కల వారు చూసే చూపులను ఎలా పట్టించుకోకూడదో నాకు తెలుసు. కానీ, ఎవ్‌జెన్‌కు అలా కాదు, ఆయనకు ఇటీవలే కదా గాయమైంది” అని మరియా అన్నారు.

“ఒకనొక సందర్భంలో... నాకు ఒక కాలు లేదు, ఇక నేను నడవలేను అని ఆయన అన్నారు. అప్పుడు నేను.. అయితే ఏంటి..? నాకూ ఒక చేయి లేదు అని సమాధానమిచ్చాను” అని మరియా చెప్పారు.

తన గాయం మరియాకు భారం కాదని తెలుసుకున్న ఎవ్‌జెన్ ఆమెకు ప్రపోజ్ చేశారు.

షాట్‌పుట్, మెడల్, విజేత
ఫొటో క్యాప్షన్, షాట్‌పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన మరియా

పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్

మరియా ప్రోత్సాహంతో ఎవ్‌జెన్ తన కృత్రిమ కాళ్లతో సైక్లింగ్ చేయడం ప్రారంభించారు. పారాలింపిక్స్‌లో పాల్గొనడం తన చిరకాల కోరిక అని మరియా చెప్పినప్పుడు ఆయన మద్దతుగా నిలిచారు.

ఈ ఏడాది మొదట్లో పారాలింపిక్స్ కోసం మరియా ట్రైనింగ్ తీసుకున్నారు. విదేశాల్లో ఓ నెల రోజుల పాటు స్పోర్ట్స్ క్యాంప్‌కు కూడా హాజరయ్యారు. అలా, తన కల త్వరలోనే నిజమవుతోందని మురిసిపోయారు.

అయితే, పారాలింపిక్స్ ప్రారంభమయ్యే రెండు వారాల ముందు వెన్నెముక సమస్యతో ఇబ్బందిపడ్డారు. అయినప్పటికీ, మరియా పట్టుదల ముందు ఆ సమస్య చిన్నబోయింది.

“యుద్ధంలో గాయపడి మా దగ్గర చికిత్స పొందుతున్న సైనికుల సంతకాలతో కూడిన యుక్రెయిన్ జాతీయ జెండా నా వద్ద ఎప్పుడూ ఉంటుంది. దానిపై నా భర్త కూడా సంతకం చేశారు. నేను ఆ గాయం నుంచి కోలుకుని, పోటీల్లో పాల్గొనేలా ఆ జెండా నాకు స్పూర్తినిచ్చింది” అని మరియా అన్నారు.

పారాలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ మరియా ఫైనల్‌లో అడుగుపెట్టారు. షాట్‌పుట్‌ను 12.35 మీటర్ల దూరం విసిరి ‘సిల్వర్ మెడల్’ గెలుచుకున్నారు.

అయితే, దీనితోనే సరిపెట్టుకోవాలని మరియా అనుకోవట్లేదు. 2025లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రస్తుతానికి తన వీరాభిమాని, బలమైన మద్దతుదారుడైన తన భర్తతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)