48 గంటల్లో 10 భారతీయ విమానాలకు బెదిరింపులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, కోచీ
బూటకపు బాంబు బెదిరింపులు భారతీయ విమానయాన సంస్థలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
గత 48 గంటల్లో కనీసం 10 భారతీయ విమానాలకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయా విమానాలు ఆలస్యం కావడమో, వాటిని దారి మళ్లించడమో జరిగింది.
ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ విమానాలకూ బెదిరింపులు వచ్చాయి.
మంగళవారం, ఒక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో దాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి సింగపూర్ వైమానిక దళం రెండు ఫైటర్ జెట్‌లను పంపింది.
మంగళవారం, సింగపూర్ రక్షణ మంత్రి మాట్లాడుతూ, సిటీ స్టేట్‌కు చెందిన రెండు ఫైటర్ జెట్‌లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం చాంగి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యే ముందు దానిని ఎస్కార్ట్ చేశాయని తెలిపారు.
ఈ విమానం భారతదేశంలోని మదురై నుంచి సింగపూర్‌కు వెళుతోంది.

దానికి కొన్ని గంటల ముందు దిల్లీ నుంచి షికాగో వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానానికి ఇలాంటి బెదిరింపులు రావడంతో దానిని కెనడాలోని ఇకాలుయిత్ విమానాశ్రయంలో దింపేశారు.
అనంతరం ఎయిర్ ఇండియా విమానం ఏఐ 127లోని ప్రయాణికులను కెనడియన్ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో షికాగోకు పంపించారు.
విమానయాన సంస్థలకు బూటకపు బాంబు బెదిరింపులు భారతదేశంలో అసాధారణమేమీ కాకపోయినా.. సోమవారం నుంచి ఇలా ఒకేసారి ఇన్ని బెదిరింపు కాల్స్ రావడానికి కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు.
ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు స్పందన కోసం బీబీసీ వారిని ఈమెయిల్‌లో సంప్రదించగా జవాబు రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సోమవారం, ఓ ఎక్స్ (గతంలో ట్విటర్) హ్యాండిల్ నుంచి బెదిరింపులను పోస్ట్ చేయడంతో ముంబయి నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. దీనికి సంబంధించి పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం బెదిరింపులు కారణంగా రెండు ఎయిర్ ఇండియా విమానాలు సహా ఏడు విమానాల రాకపోకల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం తాత్కాలికంగా సస్పెండ్ చేసిన మరో ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చిన బెదిరింపులే దీనికి కారణం.
బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులకు సహకరిస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రతి భారతీయ విమానాశ్రయంలో బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ ఉంటుంది, అది ఆ బెదిరింపు నిజమా కాదా అని నిర్ధరించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














