భారత్, కెనడా వివాదంలో ఏ దేశం ఎటు వైపు?

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడాల మధ్య వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మాత్రం తమ దౌత్యవేత్తలను తామే వెనక్కి పిలిచామని ప్రకటించింది.

తాజాగా భారత్, కెనడాల మధ్య నెలకొన్న వివాదంపై అమెరికా స్పందించింది. నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని అమెరికా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం అన్నారు.

"విచారణలో కెనడాకు భారత ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం. కానీ, దిల్లీ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది" అని మిల్లర్ అన్నారు.

భారత్, కెనడా రెండూ అమెరికాకు మిత్ర దేశాలు. అయితే ఈ విషయంలో అమెరికా ప్రస్తుతానికి కెనడాకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది సెప్టెంబర్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన దేశ పార్లమెంటులో నిజ్జర్ హత్యలో భారతీయ 'ఏజెంట్' ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఆ సమయంలో కూడా విచారణకు సహకరించాలని భారత్‌కు అమెరికా సూచించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్‌

ఫొటో సోర్స్, P.A.

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్

బ్రిటన్ వైఖరి ఏమిటి?

ఈ అంశంపై మద్దతు సేకరించేందుకు జస్టిన్ ట్రూడో సోమవారం బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌కు కాల్ చేశారు.

మీడియా నివేదికల ప్రకారం.. రెండు దేశాల నాయకులు 'రూల్ ఆఫ్ లా'పై మాట్లాడుకున్నారు. బ్రిటన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత్‌ ప్రస్తావన ప్రత్యక్షంగా తేకపోయినా కెనడాలో జరుగుతున్న విచారణను ప్రస్తావించింది. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తు ముగిసే వరకు పరస్పరం టచ్‌లో ఉంటామని హామీ ఇచ్చుకున్నారు.

భారత్, కెనడాల మధ్య నెలకొన్న వివాదంపై బ్రిటన్‌తో పాటు న్యూజీలాండ్ కూడా స్పందించింది.

న్యూజీలాండ్ ప్రకటన

ఫొటో సోర్స్, X/Winston peters

ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్ ప్రకటన

న్యూజీలాండ్ ఏం చెప్పింది?

న్యూజీలాండ్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల మంత్రి విన్‌స్టన్ పీటర్స్ ‘ఎక్స్‌’లో "దక్షిణాసియా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై దేశంలో జరుగుతున్న హింస, బెదిరింపులపై చేస్తున్న దర్యాప్తు విషయాలను కెనడా తెలియజేసింది" అని తెలిపారు.

నేరపూరిత కార్యకలాపాలు జరిగినట్లు కెనడా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయని ఒకవేళ అవి నిరూపణ అయితే, ఆందోళన పరిచే అంశమేనని పీటర్స్ చెప్పారు.

"అయినప్పటికీ, న్యూజీలాండ్ లేదా విదేశాలలో జరిగే నేర విచారణలపై వ్యాఖ్యానించబోం. అయితే, చట్టం, దాని ప్రక్రియలను గౌరవించడం ముఖ్యం" అని ఆయన సూచించారు.

"న్యూజీలాండ్ జనాభాలో భిన్న ప్రాంతాల వారున్నారు. ఇక్కడ ఆసియా, పసిఫిక్‌తో పాటు ఐరోపాలోని అనేక దేశాల ప్రజలున్నారు. ఈ కమ్యూనిటీల్లోని ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా వ్యవహరిస్తూ, గౌరవంగా ఉంటారని ఆశిస్తున్నాం" అని పీటర్స్ ఎక్స్‌లో తెలిపారు.

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్

ఫొటో సోర్స్, AAP/Reuters

ఫొటో క్యాప్షన్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్

ఆస్ట్రేలియా వైఖరి ఏంటి?

భారత్, కెనడాల వివాదంపై ఆస్ట్రేలియా కూడా తన వైఖరిని స్పష్టం చేసింది.

కెనడాలో జరుగుతున్న విచారణ, అక్కడి న్యాయ ప్రక్రియకు సంబంధించిన ఆరోపణలపై ఆస్ట్రేలియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

"అన్ని దేశాల సార్వభౌమాధికారం, చట్ట ప్రక్రియను గౌరవించాలనేది మా సూత్రం" అని మంత్రిత్వ శాఖ ఎక్స్‌ వేదికగా తెలిపింది.

అయితే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం విలేకరుల సమావేశంలో భారత్, కెనడాల మధ్య వివాదంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.

అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లు ఫైవ్ ఐస్ అలయన్స్‌లో సభ్యులు. ఫైవ్ ఐస్ అలయన్స్ అనేది ఈ దేశాల మధ్య గూఢచర్యాన్ని పంచుకునే ఒప్పందం.

ఈ ఒప్పందానికి ప్రపంచయుద్ధాలు ముగిసిన తర్వాత కాలంలో అంటే 1946లో పునాది పడిందని, అప్పట్లో ఈ రహస్య ఒప్పందం అమెరికా, బ్రిటన్ దేశాల మధ్య మాత్రమే ఉందని బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ గోర్డాన్ కొరెరా చెప్పారు.

‘నిజ్జర్ హత్యను ఖండిస్తూ బహిరంగంగా ఉమ్మడి ప్రకటన విడుదల చేయడానికి 'ఫైవ్ ఐస్' కూటమి నిరాకరించింది’ అని అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌ గత సంవత్సరం నిజ్జర్ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఒక కథనం రాసింది.

హర్దీప్ సింగ్ నిజ్జర్

ఫొటో సోర్స్, FB/VIRSA SINGH VALTOHA

ఫొటో క్యాప్షన్, హర్దీప్ సింగ్ నిజ్జర్ (ఫైల్)

వివాదం ఎలా మొదలైంది?

గత ఏడాది జూన్‌లో నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 2023 జూన్ 18న సాయంత్రం, కెనడాలోని సర్రేలో గురుద్వారా వద్ద ఖలిస్తాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ముసుగు ధరించిన సాయుధులు కాల్చి చంపేశారు.

దీంతో భారత ఏజెంట్లే నిజ్జర్‌ను హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ 18న ఆరోపించగా, దానిని భారత్ ఖండించింది. కెనడా నుంచి రుజువులను కోరింది.

2024 అక్టోబర్ రెండో వారంలో నిజ్జర్ హత్య కేసులో భారతీయ దౌత్యవేత్తలు, ఇతర హైకమిషన్ అధికారులను 'పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా కెనడా చేసిన ప్రకటన, ఇరు దేశాల దౌత్యవేత్తల బహిష్కరణకు దారి తీశాయి. కెనడాలో 'పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్' అంటే నేరానికి సంబంధించిన కీలక సమాచారం ఉందని విచారణ అధికారులు భావించే వ్యక్తులు.

ట్రూడో ప్రభుత్వం తమ అధికారులపై చేసిన ఆరోపణలను రుజువు చేసే ఒక్క ఆధారం కూడా చూపించలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 14న పేర్కొంది.

కెనడా ఆరోపణలు ట్రూడో ‘రాజకీయ అజెండా’లో భాగమని విమర్శించింది. అనంతరం, కెనడాలోని దౌత్యవేత్తలను వెనక్కి రప్పిస్తున్నట్లు భారత్ తెలిపింది.

అయితే సంజయ్ కుమార్ వర్మ సహా ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలు, కాన్సులర్ అధికారులను బహిష్కరించినట్లు కెనడా ప్రకటించింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)