డీజేలు వాడారంటూ హైదరాబాద్ మేయర్‌పై కేసు: ఈ నగరంలో డీజే ఎంత శబ్దం వచ్చేలా వాడొచ్చు? నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష ఏమిటి

డీజే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నిర్దేశిత సమయం దాటిన తర్వాత డీజే సౌండ్ సిస్టం ఉపయోగించి భారీ శబ్దాల మధ్య బతుకమ్మ వేడుకలు జరిపారనే ఆరోపణలపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదైంది.

అక్టోబరు 10న జరిగిన ఈ కార్యక్రమంపై 13న బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

డీజేల వినియోగంపై నియంత్రణలను ఈ మధ్యనే హైదరాబాద్ పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు.

దీనికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారనేది మేయర్ విజయలక్ష్మి సహా పలువురిపై పోలీసులు మోపిన అభియోగం.

అసలు డీజే (డిస్క్ జాకీ) సౌండ్ సిస్టంలకు ఉన్న పరిమితులు ఏమిటి? నియంత్రణలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీవీ ఆనంద్

ఫొటో సోర్స్, X/CVAnand

ఫొటో క్యాప్షన్, డీజేలపై నిషేధం విధించడానికి ముందు పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు .

హైదరాబాద్‌లో నియంత్రణలు ఎందుకు?

డీజే శబ్దాల కారణంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని తమకు ఫిర్యాదులు వచ్చినట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు చెబుతున్నారు.

‘‘డీజేలపై నియంత్రణలు విధించడానికి ముందు మాకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి’’ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ విలేఖరులకు చెప్పారు.

మతపరమైన కార్యక్రమాల సందర్భంగా బాణసంచా, డీజే సౌండ్ సిస్టమ్స్, డీజే సౌండ్ మిక్సర్స్, సౌండ్ యాంప్లిఫయర్స్, ఇతర శబ్ద కారకాలపై హైదరాబాద్ నగర పరిధిలో నియంత్రణలు విధిస్తూ సీవీ ఆనంద్ సెప్టెంబరు 30న ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిబంధనలు ఆ రోజు నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‘‘సెప్టెంబర్ 26న అన్ని భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించాం. డీజేల కారణంగా మనిషి ఆరోగ్యంపై పడుతున్న ప్రభావంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాం. మణికొండలో ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. మనుషులపై ప్రభావమే పడటమే కాదు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు డీజేల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజే సిస్టమ్స్, బాణసంచాలను మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపుల్లో వాడకూడదని రాజకీయ పార్టీలు, ఉత్సవ కమిటీల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

డీజే మ్యూజిక్ సిస్టమ్

ఫొటో సోర్స్, Getty Images

శబ్ద పరిమితులకు లోబడి…

డీజేలపై నియంత్రణలు విధించినప్పటికీ పగలు, రాత్రి సమయాల్లో నిర్దేశిత పరిమితులకు లోబడి.. అంటే తక్కువ శబ్దంతో సౌండ్ సిస్టం వాడుకునేందుకు అనుమతి ఉంటుంది.

‘‘పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న డెసిబుల్స్ ప్రకారం చూస్తే, అది చాలా తక్కువ సౌండ్. మనం ఇంట్లో పెట్టుకునే సౌండ్ సిస్టమ్ మాదిరి ఉంటుంది. డీజే పెడితే కచ్చితంగా భారీ శబ్దాలే వస్తాయి. రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకే నియంత్రణలు అని చెబుతున్నప్పటికీ, శబ్ద పరిమితులు చూస్తే పూర్తిస్థాయిలో నిషేధం పెట్టినట్లు అనిపిస్తోంది’’ అని బంజారాహిల్స్‌కు చెందిన డీజే నిర్వాహకులు ఒకరు బీబీసీకి చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో డీజేలపై నియంత్రణలు విధించడం సమంజసమేనని ఖైరతాబాద్‌కు చెందిన డీజే నిర్వాహకులు శ్రీనివాస్ చెప్పారు.

‘‘డీజే సౌండ్ సిస్టమ్ అనేది బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడంపై నియంత్రణలు గతం నుంచే ఉంది. కొందరు వివిధ కార్యక్రమాల్లో బహిరంగంగానే డీజేలు వినియోగిస్తుంటారు. ఇళ్ల మధ్య డీజేలు, లౌడ్ స్పీకర్లు వినియోగిస్తుంటారు. మా వద్దకు వచ్చే ఈవెంట్ నిర్వాహకులకు ముందుగానే చెబుతుంటాం. డీజేలు బయట వినియోగించకూడదని, ఇండోర్‌లోనే వాడాలని చెబుతుంటాం. అది కూడా నిర్దేశిత శబ్ద పరిమితులకు లోబడి ఉండాలని చెబుతుంటాం. కానీ ఎక్కువ శబ్దం కావాలంటూ కొందరు నిర్వాహకులు ఒత్తిడి తెస్తుంటారు’’ అని బీబీసీకి చెప్పారు శ్రీనివాస్.

2000 ఆగస్టు 30న చర్చ్ ఆఫ్ గాడ్ (ఫుల్ గాస్పెల్) ఇన్ ఇండియా వర్సెస్ కేకేఆర్ మెజస్టిక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కేసులో తమిళనాడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నివాస ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు వాడటం సరికాదని స్పష్టం చేసింది.

అలాగే 1986 పర్యావరణ (పరిరక్షణ) చట్టం ప్రకారం నివాసాలు, వాణిజ్య, పరిశ్రమలు లేదా సైలెన్స్ ప్రాంతాల వారీగా శబ్ద పరిమితులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

శబ్ద కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, పరిమితులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సవరిస్తూ 2017లో మార్గదర్శకాలు జారీ చేసింది.

డీజే

ఫొటో సోర్స్, Getty Images

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పరిమితుల విధింపు

ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్దేశిత సమయాలను దాటిన తర్వాత డీజేల వినియోగంపై నిషేధం ఉంది.

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అప్పటి ప్రభుత్వం శబ్ద పరిమితులు ఏ మేరకు ఉండాలనే విషయంపై ఉత్తర్వులు తీసుకువచ్చింది. కానీ, ఆచరణలో వీటిని పాటించడం లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

2010 అక్టోబరు 12న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 172 ప్రకారం.. పగలు, రాత్రి సమయాల్లో నిర్దేశిత ప్రాంతాలను బట్టి ఎంత మేర డీజే శబ్దాలు ఉండొచ్చనే విషయంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇలా ఉన్నాయి.

డీజే పరిమితి
ఫొటో క్యాప్షన్, ప్రాంతాన్ని బట్టి శబ్ద పరిమితి నిబంధనలు

ఈ ఉత్తర్వుల ప్రకారం పగలు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అని అర్థం.

ఈ మార్గదర్శకాలకు తగ్గట్టుగా లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేదా డీజే సిస్టమ్ వంటివి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య వినియోగించడానికి వీల్లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అనంతరం, రాచకొండ పరిధిలోనూ డీజేలు, బాణసంచాను మతపరమైన ఊరేగింపులు, నిర్దేశిత పరిమితులు, సమయాన్ని మించి వినియోగించడాన్ని నిషేధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

కేవలం డీజే సౌండ్ సిస్టమ్‌లే కాకుండా అన్ని మతపరమైన ఊరేగింపుల్లో టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘‘సాధారణంగా నగరంలో డీజేలు అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకు 24 గంటలు లేదా 48 గంటలు ముందుగానే పోలీసుల నుంచి అనుమతులు తీసుకుంటాం. స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు వస్తాయి. ఇండోర్‌లో అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిస్తారు. కాస్త బయట కార్యక్రమం జరిగినప్పుడు అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తుంటుంది. అది ఈవెంట్ నిర్వాహకుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మేం డీజే సహకారం అందిస్తాం’’ అని డీజే నిర్వాహకులు ఖాన్ బీబీసీకి చెప్పారు.

సైలెన్స్ జోన్ అంటే ఏమిటి?

పోలీసులు ఇచ్చిన ఉత్తర్వుల్లో సైలెన్స్ జోన్ అని ప్రత్యేకంగా కనిపిస్తుంది.

సైలెన్స్ జోన్ అనేది ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోర్టుల నుంచి వంద మీటర్లకు తక్కువ కాకుండా ఉంటుందని పోలీసులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆ ప్రాంతాల్లో చాలా తక్కువ డెసిబుల్స్‌లో మాత్రమే శబ్దాలు చేసేందుకు వీలుంటుంది.

DJ

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర్వులు ఉల్లంఘిస్తే...

ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీవీ ఆనంద్ హెచ్చరించారు . పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 – సెక్షన్ 15 ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ చట్టం ప్రకారం ఉల్లంఘనలు రుజువైతే నిందితులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు.

తాజాగా హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మిపై నమోదైన కేసు నేపథ్యంలో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ ద్వారా ఆమెను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నిచింది. ఆమె నుంచి స్పందన రావాల్సి ఉంది.

గుండె పోటు

ఫొటో సోర్స్, Getty Images

డీజేలతో గుండెపోటు సమస్యలు వస్తాయా?

డీజే సౌండ్ సిస్టమ్ శబ్దాల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘‘డీజే వ్యవస్థ కారణంగా మాకు గుండెపోటు వస్తుందేమో అని భయంగా ఉంది. మా అమ్మకు గుండె ఆపరేషన్ జరిగింది. దగ్గర్లో డీజేలు వాయిస్తుండటంతో భయంగా ఉంది అని వివిధ ఫిర్యాదులు మాకు అందాయి’’ అని సీవీ ఆనంద్ చెప్పారు.

డీజే సౌండ్ సిస్టమ్ కారణంగా అప్పటికప్పుడు గుండెపోటు రాదని.. అప్పటికే గుండె జబ్బులు ఉన్నవారిపై దీని ప్రభావం ఉంటుందని యశోద ఆసుపత్రి కార్డియాలజిస్టు డాక్టర్ ఎ.రవికాంత్ బీబీసీతో చెప్పారు.

‘‘డీజే శబ్దాలు ఒక్కసారిగా మొదలై.. షాక్‌కు గురయ్యే పరిస్థితి ఎదురైతే గుండెపై ప్రభావం పడుతుంది. అది కూడా అప్పటికే గుండె జబ్బులు లేదా ఏదైనా బ్లాక్స్ వంటివి ఉంటే ఒక్కసారిగా మొదలయ్యే డీజే శబ్దంతో ఆ వ్యక్తిపై ప్రభావం పడుతుంది. ఆ సందర్భాల్లో గుండెపోటు రావడం లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం జరగవచ్చు. డీజేల భారీ శబ్దాల వల్ల గుండె దడ మొదలై గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. కానీ, అప్పటికే గుండెలో ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది’’ అని డాక్టర్ రవికాంత్ చెప్పారు .

పరిమితులకు మించి డీజే శబ్దాలు వస్తే మన చెవి కర్ణభేరిపై ప్రభావం పడుతుందని, మానసిక ఆందోళనకు గురిచేస్తుందని డాక్టర్ రవికాంత్ వివరించారు.

డీజే శబ్దాల కారణంగా గుండెపోటు వంటివి వచ్చే అవకాశం ఉందా అన్న కోణంలో గతంలో బీబీసీ చేసిన వీడియో మీరు చూడొచ్చు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)