‘రాత్రి వర్షం కురిసింది, ఉదయం లేచి చూసేసరికి మా ఇల్లు కనపడలేదు’

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
“రాత్రి 10 గంటలకు వర్షం పడుతోంది. పిల్లలు భయపడతారని తోడు కోసం పక్కనే ఉండే మా అక్కవాళ్ల ఇంటికి వెళ్లి పడుకున్నాం. ఉదయం లేచి చూసేసరికి మా ఇల్లు కనపడలేదు. మా పక్కనున్న మరో ఇల్లు కూడా కనిపించలేదు. మా ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మాకేమి మిగల్లేదు” అని మంజులత బీబీసీతో చెప్పారు.
“ఇల్లు కొట్టుకుపోయిన సమయంలో ఇంట్లో రూ. 2 లక్షల నగదు, 5 తులాల మంగళ సూత్రం, టీవీ, ఫ్రిజ్ అన్నీ ఉన్నాయి. ఉపాధి హామీ కూలీ పనులకు పోయి సంపాదించుకున్న డబ్బు అది. ఇల్లు పెద్దగా మార్చుకునేందుకు దాచుకున్నాను. అంతా కొట్టుకుపోయింది” అని మంజులత కన్నీళ్లు పెట్టుకున్నారు.
సెప్టెంబర్ 8న ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జీకే వీధి మండలం మాదిగముళ్లు గ్రామంలోకి వరద తీసుకొచ్చిన కష్టం ఇది.
భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలోని ధారకొండ చుట్టుపక్కల కొండచరియలు విరిగిపడ్డాయి. పేట్రాయి కొండ నుంచి పెద్ద పెద్ద బండలు, చెట్లు, కొట్టుకుని వచ్చి ములసల వీధి గ్రామంలోని పంటచేలు, పశువుల పాకలను కంటికి కనిపించకుండా చేశాయి.
ఇదే పరిస్థితిని పెద్ద కొండ, కమ్మరితోట, చాట్రాపల్లి, చీడిగుంట, గొందుల వీధి వంటి ఏడెనిమిది గ్రామాల్లోనూ బీబీసీ గమనించింది.
‘‘పడిన అన్నిచోట్లకు వెళ్లలేం కానీ, 20 నుంచి 30 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి’’ అని స్థానికులు బీబీసీతో చెప్పారు.
చాట్రాపల్లిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో కొర్ర కుమారి అనే 20 ఏళ్ల యువతి మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే, ఈ ప్రాంతంలో ఒకే రోజు పదుల సంఖ్యలో కొండచరియలు ఎందుకు విరిగిపడ్డాయి? నెల రోజుల తర్వాత ఇక్కడి గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?


అల్లూరి జిల్లాలో ‘వయనాడ్’ విధ్వంసం
జీకే వీధి మండలం ములసల వీధికి బీబీసీ బృందం వెళ్లినప్పుడు, అక్కడ గ్రామస్థులంతా తమ ఊర్లోనే వయనాడ్ తరహా విధ్వంసం చూశామని, మీకూ చూపిస్తాం రండి అంటూ కొండచరియలు పడిన చోటుకు తీసుకెళ్లారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 8న కురిసిన వర్షాలకు అల్లూరి జిల్లా మొత్తం అతలాకుతలమైంది.
“ఇప్పుడు మా ఊర్లో కనిపిస్తున్న దృశ్యాలే మూడు నెలల కిందట కేరళలో చూశాం. ఫోన్లలో, టీవీలలో ఆ దృశ్యాలు చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి మా ఊళ్లో నెలకొంది. రాత్రి ఉన్న పొలాలు ఉదయానికి రాళ్లుగా ఎలా మారిపోయాయో అర్థం కావడం లేదు. ఈ బండరాళ్లు దాదాపు రెండు కిలోమీటర్లు కిందకు జారుకుంటూ గ్రామ సమీపంలోకి వచ్చి ఆగిపోయాయి. మీరే చూడండి ఈ బండ రాళ్లు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో” అంటూ వాటిని చూపిస్తూ సత్యవతి చెప్పారు.
ఆ దృశ్యాలు చూస్తుంటే ఇలాంటి బండరాళ్లు ఎలా జారిపడ్డాయి? అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది.
కొన్ని బండరాళ్లైతే రెండు నుంచి మూడు మీటర్లు ఎత్తు, పొడవు ఉన్నాయి.
వేర్లతో సహా పెకలించుకు పోయిన భారీ వృక్షాలు అక్కడ వందల సంఖ్యలో కనిపించాయి.

నా కాఫీ తోట కనిపించడం లేదు: దాలిలక్ష్మి
ఇక్కడ మా తోటలుండేవని గ్రామస్తులు చెప్తున్న చోట బండరాళ్లు కనిపిస్తున్నాయి.
“మూడు ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేస్తున్నాం. సెప్టెంబర్ 8న ఉదయం కూడా తోటలోనే ఉన్నాను. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాను. ఉదయం లేచి చూసేసరికి నా కాఫీ తోటతో పాటు ఊరిలోని అందరి తోటలు కనిపించకుండా పోయాయి. తోటలు ఉండాల్సిన చోట పడిపోయిన చెట్లు, పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి” అని ములసల వీధి గ్రామానికి చెందిన శెట్టి దాలిలక్ష్మి బీబీసీతో అన్నారు.
“ఇంతటి భారీ విపత్తు సంభవిస్తే, ఏ ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతానికి రాలేదు. ఊరికి దూరంగా ఎక్కడో రోడ్డు మీద నిలబడి మాట్లాడేసి వెళ్లిపోతున్నారు” అని దాలి లక్ష్మి చెప్పారు.
అయితే, బాధితులందరికీ కావాల్సిన నిత్యవసర వస్తువులు, దుస్తులు, పాత్రలు వంటివి పంపిణీ చేశామని జీకే వీధి మండలం ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు.
ములసల వీధికి సంభవించిన విపత్తు కూడా కేరళ వయనాడ్ వంటి పెద్ద ప్రళయమేనని, ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి ఆదుకోవాలంటూ అల్లూరి జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు సుంకర విష్ణుమూర్తి బీబీసీతో అన్నారు.

కొండచరియలు మొదలైన చోటుకు చేరుకున్న బీబీసీ
పేట్రాయి కొండపైకి వెళ్తున్న క్రమంలో చుట్టూ ఉన్న కొండలపై కూడా కొండచరియలు విరిగిపడిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి.
పేట్రాయి కొండపైనే నాలుగు చోట్ల కొండచరియలు జారిపడిన గుర్తులున్నాయి.
ములసల వీధి నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు బండరాళ్లపై నడుస్తూ పేట్రాయి కొండకు బీబీసీ చేరుకుంది.
అక్కడ నుంచి చూస్తే కిందకు ఒక పెద్ద వాగు ఎండిపోయినట్లుగా, ఒక బక్కచిక్కిన నదిలో నీళ్లు ఎండిపోయి, రాళ్లు మాత్రమే మిగిలినట్లు కనిపించింది.
దాని పక్కనే కొంత మేర సాగు చేసిన కాఫీ తోటలు, జీడీ తోటలు కూడా కనిపించాయి.
“ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరూ రాలేదు. మీరు మాత్రమే వచ్చి చూశారు, కనీసం మా కాఫీ తోటకు రండి అంటే... ఎవరూ రాలేదండి. మా కష్టం మీకు అర్థమైందా?” అంటూ కనకమ్మ అనే గ్రామస్థురాలు బీబీసీతో అన్నారు.
కొండచరియలు మోసుకుపోయిన తమ పొలాలు ఏమయ్యాయి? అసలు ఇది నిజమేనా? అనే ఆశ్చర్యం నుంచి కోలుకోనట్లుంది వాళ్ల పరిస్థితి.
పేట్రాయి కొండతో పాటు అన్నవరం, మాదిగమళ్లు, కొంతులకోట, చింతగుంప, చీడితోట, కమ్మరితోట, కొత్తూరు, నిమ్మచెట్టు గ్రామాలను కూడా బీబీసీ పరిశీలించింది. అక్కడ కూడా కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు కనిపించాయి.

కొండచరియల విధ్వంసానికి కారణమేంటంటే..
ఒకేసారి 20 నుంచి 30 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని గిరిజనులు చెప్తున్నారు.
ఇవన్నీ కూడా ఒకే రోజు సంభవించాయని అంటున్నారు.
ఆ సంఖ్యతో ఏకీభవించకపోయినా, ఒకే రోజు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటం మాత్రం వాస్తవమేనని ఐటీడీఏ అధికారులు చెప్తున్నారు.
కొండచరియలు ఇలా ఒక్కసారిగా విరిగిపడటానికి కారణాలను ఏయూ జియాలజీ విభాగం ప్రొఫెసర్ శాంతారామ్ వివరించారు.
“తూర్పు కనుమల్లో 6 నుంచి 8 మీటర్ల ఉపరితలం వరకు మట్టి ఉంటుంది. ఆ కింద కొండలైట్ అనే రాళ్లు ఉంటాయి. ఈ రాళ్లు ఏళ్ల తరబడి నీరు, గాలి, మట్టితో చర్యలు జరపడం వల్ల కాలక్రమేణ మెత్తబడిపోతాయి. పగుళ్లు ఏర్పడతాయి. భారీ వర్షాలు పడినప్పుడు ఈ పగుళ్లలోకి నీరు చేరుతుంది. అలాగే, రాళ్లని పట్టి ఉంచిన మట్టి కరుగుతుంది. దీంతో, అప్పటికే మెత్తబడి ఉన్న ఈ రాళ్లు ఒకదానితో ఒకటి విడిపోయి కిందకు జారిపోతాయి. తూర్పు కనుమల్లో ఇది సహజంగా జరిగే పరిణామమే” అని శాంతారామ్ తెలిపారు.

‘వరదలతో ఇళ్లు కనిపించకుండా పోయాయి’
ధారకొండ సమీపంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో పొలాలు కనిపించకుండా పోతే, మాదిగమళ్లు వంటి గ్రామాల్లో వరద ప్రవాహానికి ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయాయి.
“మాకు భూమిపై నూకలుండి వర్షం వస్తుంది కదా అని మా అక్క వాళ్లింటికి వెళ్లి పడుకున్నాం. కొద్ది సేపటికే వరద నీరు వచ్చి మా ఇంటిని కమ్మేసింది. అసలు మా ఇల్లు ఇక్కడ ఉండేదని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా మిగల్చలేదు” అని మాదిగమళ్లు గ్రామానికి చెందిన పడాల్ మంజులత బీబీసీతో చెప్పారు.
మాదిగమళ్లు గ్రామంలో మరో ఇల్లు కూడా కొట్టుకుపోయింది. ఈ రెండు కుటుంబాలకు కట్టుబట్టలే మిగిలాయి.
చాట్రాపల్లి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.

అధికారులు ఎక్కడ...?
అల్లూరి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి.
వర్షాలు వచ్చి నెల రోజులు దాటినా కూడా బాధిత గ్రామాల్లో పూర్తి స్థాయి చర్యలు చేపట్టిన దాఖలాలు అంతగా కనపడటం లేదు.
ఆయా గ్రామాలకు చెందిన వారే తమ అవసరాలకు అనుగుణంగా కర్రలతో వంతెనలు నిర్మించుకోవడం, మట్టిరోడ్లు వేసుకోవడంలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు.
బాధిత గ్రామాల్లో సమగ్ర సర్వే చేసి బాధితులందరికీ పరిహారం చెల్లించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
“అధికారులు బాధిత గ్రామాల్లోకి రావడం లేదు. ఎక్కడో రోడ్డు వరకు వచ్చి వెళ్లిపోతున్నారు. స్వయంగా గ్రామాల్లోకి వస్తే వారికి ఏం చేయాలో అర్థం అవుతుంది” అని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అల్లూరి జిల్లా కార్యదర్శి మార్క్ రాజు బీబీసీతో చెప్పారు.
‘సాయం అందించాం, రిపోర్టు రూపొందిస్తున్నాం’- పీవో
జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఆ రిపోర్టుని ప్రభుత్వానికి పంపించి బాధితులకు సహాయం అందేలా చేస్తామని ఐటీడీఏ పీవో అభిషేక్ చెప్పారు.
“నేను స్వయంగా చాట్రాపల్లి గ్రామానికి వెళ్లాను. అక్కడ బాధితులను పరామర్శించాను. వారికి కావాల్సిన సహాయం అందించాం. వరదలతో ఏజెన్సీ ప్రాంతాలతో తెగిపోయిన రవాణా సంబంధాలను పునరుద్ధరిస్తున్నాం. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం ఇప్పుడు ఏర్పడింది” అని పీవో అభిషేక్ తెలిపారు.
“పోడు వ్యవసాయానికి అనుకూలంగా ఉండటం కోసం గిరిజనులు కొండ దిగువ ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో వరదలు వచ్చినప్పుడు, కొండచరియలు విరిగిపడినప్పుడు బాధితులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం” అని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














