వాట్సాప్: కస్టమర్లకు ఫ్రీగా మెసేజింగ్ సర్వీస్ ఇచ్చే ఈ యాప్‌కు డబ్బులెలా వస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో క్లీన్‌మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత 24 గంటల్లో నేను 100 కంటే ఎక్కువ వాట్సాప్ మెసేజ్‌లు పంపాను. కానీ వాటిలో ఏవీ అంత ముఖ్యమైనవి కావు.
కొన్నింటిలో నా కుటుంబ సభ్యులతో సంభాషించాను. సహోద్యోగులతో వర్క్ ప్రాజెక్ట్‌ల గురించి చర్చించాను, కొంతమంది స్నేహితులతో వార్తలను, గాసిప్‌లను షేర్ చేసుకున్నాను.
బోర్ కొట్టే నా మెసేజ్‌లు కూడా వాట్సాప్‌లో డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్ట్ అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ డేటా సెంటర్‌లలో ఉన్న శక్తివంతమైన సర్వర్‌లను వాట్సాప్ ఉపయోగించుకుంటుంది. దీనికి చాలా ఖర్చే అవుతుంది.
అయినా సరే నేను లేదా నాతో చాట్ చేస్తున్న వ్యక్తులు దీన్ని ఉపయోగించుకోవడానికి ఎలాంటి డబ్బూ చెల్లించడం లేదు. ఈ ప్లాట్‌ఫారమ్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మరి వాట్సాప్ దీనికయ్యే ఖర్చును ఎలా భరిస్తోంది?


ఫొటో సోర్స్, Getty Images
వాట్సాప్ వెనక ఒక భారీ పేరెంట్ కంపెనీ మెటా ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా మెటా సంస్థవే.
నాలాంటి వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్‌లు ఉచితం కావచ్చు, కానీ వాట్సాప్ నాలాంటి యూజర్లతో సంభాషించాలనుకునే కార్పొరేట్ కస్టమర్‌ల నుంచి డబ్బు వసూలు చేస్తుంది.
గత సంవత్సరం నుంచి అనేక సంస్థలు వాట్సాప్‌లో ఉచితంగా చానళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. కాబట్టి వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్లందరికీ ఇప్పుడు మెసేజ్‌లు పంపుకోవచ్చు.
ఆ సంస్థలు ఇప్పుడు యాప్ ద్వారా కస్టమర్‌లతో వ్యక్తిగత సంభాషణ, లావాదేవీలు చేయగలిగే యాక్సెస్ పొందినందుకు ప్రీమియం చెల్లిస్తున్నాయి.
మిగతా దేశాలతో పోలిస్తే యూకేలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఉదాహరణకు భారత్‌లో బెంగళూరులాంటి నగరాలలో మీరిప్పుడు వాట్సాప్‌తో బస్ టిక్కెట్ కొనొచ్చు. మీ సీటును ఎంచుకోవచ్చు.
"మా ప్రయత్నం ఫలిస్తే, ఒక వ్యాపారసంస్థ, కస్టమర్‌లు జరిపే చాట్ థ్రెడ్‌లోనే వాళ్ల పనులు జరిగిపోవాలి" అని మెటాలో బిజినెస్ మెసేజింగ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ నికిలా శ్రీనివాసన్ చెప్పారు.
“మీరు టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా రీఫండ్ పొందాలన్నా, పేమెంట్లు చేయాలన్నా మీ చాట్ థ్రెడ్‌లోనే ఆ పనులన్నీ చేయొచ్చు.’’ అని నికిలా శ్రీనివాసన్ అన్నారు.

ఫొటో సోర్స్, Meta
వ్యాపార సంస్థలు ఇప్పుడు డబ్బు చెల్లించి, ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆన్‌లైన్ ప్రకటన నుంచి నేరుగా పర్సనల్ అకౌంట్‌కు కొత్త వాట్సాప్ చాట్‌ను ప్రారంభించే లింక్‌ను పొందవచ్చు. దీని వల్లనే తమకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని నికిలా శ్రీనివాసన్ చెప్పారు.
ఇతర మెసేజింగ్ యాప్‌లు ఇప్పుడు వేర్వేరు మార్గాల్లో ఆదాయాన్ని పొందుతున్నాయి.
మెసేజ్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లకు ప్రసిద్ధి చెందిన లాభాపేక్ష లేని సంస్థ ‘సిగ్నల్’. ఈ సంస్థ తాము ఎప్పుడూ ఇన్వెస్టర్ల నుంచి డబ్బు తీసుకోలేదని చెప్పింది. దానికి బదులు, ఇది విరాళాలపై నడుస్తుంది.
"విరాళాలపై ఆధారపడుతూ, పూర్తిగా చిన్న దాతల సహకారం తీసుకోవడమే మా లక్ష్యం" అని దాని ప్రెసిడెంట్ మెరెడిత్ విట్టేకర్ గత సంవత్సరం తన బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.
యువ గేమర్‌లు ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ డిస్కార్డ్‌లో ప్రీమియం మోడల్ ఉంది. దీనిలో సైన్-అప్ చేయడం ఉచితమే అయినా, గేమ్‌లకు యాక్సెస్‌తో సహా అదనపు ఫీచర్‌లు పొందాలంటే డబ్బు చెల్లించాలి.

ఫొటో సోర్స్, Getty Images
స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ కూడా ఇలాంటి పలు మోడల్స్‌ను మిళితం చేస్తుంది. దీనిలో ప్రకటనలు ఉంటాయి. దీనికి 1.1 కోట్ల మంది డబ్బు చెల్లించే సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. (ఆగస్టు 2024 నాటికి). ఇది స్నాప్‌చాట్ స్పెక్టకిల్స్ అనే ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌నూ విక్రయిస్తుంది.
అంతే కాకుండా, ఫోర్బ్స్ వెబ్‌సైట్ ప్రకారం, 2016-2023 మధ్య ఈ సంస్థ వడ్డీల రూపంలోనే దాదాపు రూ. 2,500 కోట్లు సంపాదించింది. కానీ స్నాప్ ప్రధాన ఆదాయ వనరు వ్యాపార ప్రకటనలే. వాటి నుంచి ఇది సంవత్సరానికి రూ. 33 వేల కోట్లకన్నా ఎక్కువ ఆదాయం పొందుతోంది.
యూకేలోని ఎలిమెంట్ సంస్థ తన సెక్యూర్ మెసేజింగ్ సిస్టమ్‌ను ఉపయోగించుకునే ప్రభుత్వాలు, పెద్ద సంస్థల నుంచి చార్జీలు వసూలు చేస్తుంది. దీని కస్టమర్‌లు ఈ సంస్థ సాంకేతికతను ఉపయోగించుకున్నా, వాళ్లు తమ సొంత ప్రైవేట్ సర్వర్‌లలో దానిని రన్ చేస్తారు. పదేళ్ల వయసున్న ఈ సంస్థ "డబుల్ డిజిట్ మిలియన్ ఆదాయం" పొందుతూ, "లాభాలకు దగ్గరలో" ఉందని, దాని సహ వ్యవస్థాపకుడు మాథ్యూ హోడ్గ్సన్ అన్నారు.
మెసేజింగ్ యాప్‌ల అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపార నమూనా ఇప్పటికీ అడ్వర్టైజింగేనని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనిలో ఉన్న రహస్యం ఏంటంటే ఎన్‌క్రిప్షన్, గోప్యత ఉన్నప్పటికీ, యాప్‌లు తమ వినియోగదారుల గురించి తెలుసుకోవడానికి వాళ్లు చేసే మెసేజ్‌లను ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. అవి ప్రకటనలను అమ్ముకోవడానికి ఆ డేటాను ఉపయోగించుకోవచ్చు.
"ఇది పాత కథే - మీరు డబ్బు చెల్లించని కస్టమర్లయితే , మీరే వారికి ఒక ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది" అని హోడ్గ్సన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














