ఎనభై ఏళ్ల వయసులో పిల్లలను కంటే ఏమవుతుంది? తండ్రి కావడానికి ఏది సరైన వయసు?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికన్ నటుడు అల్ పాసినో గత ఏడాది 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రయ్యారు. పాసినో స్నేహితురాలు అయిన 29 ఏళ్ల నూర్ అల్ ఫల్లాహ్ ఈ బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా లేటు వయసులో తండ్రులయినవారి క్లబ్‌లో ఇప్పుడు మరొకరు చేరారు. అల్ పాసినో సహనటుడు రాబర్ట్ డి నిరో 79 ఏళ్ల వయసులో ఏడవ బిడ్డకు గత నెలలో తండ్రయ్యారు.
పెద్ద వయసున్న తండ్రులు వారిద్దరు మాత్రమే కాదు. అనేకమంది నటులు, మ్యుజీషియన్లు, అలాగే అమెరికా అధ్యక్షులు సైతం లేటు వయసులో తండ్రులుగా మారారు.
2015లో ఒక మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన అధయ్యనం ప్రకారం, తండ్రులయ్యే సగటు వయసు క్రమంగా పెరుగుతోంది. అమెరికాలో 1972 నుంచి 2015 మధ్య ఇది సగటున మూడున్నర ఏళ్లు పెరిగింది. అమెరికాలో తండ్రయ్యేవారి సగటు వయసు 30 ఏళ్ల 9 నెలలుగా ఉంది.
40 ఏళ్ల వయసులో తొలిసారి తండ్రులవుతున్నవారు 9 శాతం మంది ఉన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం, ఇప్పటిదాకా అత్యంత లేటు వయసులో తండ్రి అయిన వ్యక్తికి 92 ఏళ్లు. అయితే ఇంతకన్నా పెద్ద వయసులో తండ్రయ్యారంటూ అప్పుప్పుడు అనధికారిక వివరాలు బయటికొస్తుంటాయి.


ఫొటో సోర్స్, Getty Images
పెద్ద వయసులో తండ్రవ్వడమంటే ఇబ్బందులు కొని తెచ్చుకోవడమేనా?
యూటా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులతోపాటు పాటు ఇంకొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు 2022 డిసెంబరులో ఓ సమగ్ర సమీక్షను ప్రచురించాయి. పెద్ద వయసులో తండ్రవడం, సంతానోత్పత్తిపై దాని ప్రభావం, గర్భధారణలో సమస్యలు, పిల్లల ఆరోగ్యం వంటి విషయాల గురించి ఈ సమీక్షలో పరిశోధకులు వివరించారు.
నటుడు పాసినో మాదిరిగా అంత పెద్ద వయసులో తండ్రులయినవారి గురించి చాలా అధ్యయనాలు పట్టించుకోలేదు. ఇలాంటి వయసులో తండ్రులవడం అసాధారణమైన విషయం కావడంతో పరిశోధకులు దానిపై పెద్దగా దృష్టిపెట్టలేదు.
మిగిలిన వయసుల వారిపై జరిగిన అధ్యయనంలో అనేక విషయాలు తెలిశాయి. 40లు, 50ల వయసులో ఉన్న పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, నాణ్యత తక్కువగా ఉందని తేలింది.
పెద్దవయసులో తండ్రవ్వడం వల్ల వంధ్యత్వం వచ్చే ప్రమాదంతో పాటు గర్భం కోల్పోయే ప్రమాదమూ చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అధ్యయనంలో రాశారు. పురుషుడి వయసు పెద్దదిగా ఉంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది.
పుట్టిన పిల్లలకూ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. 1950ల నుంచి గమనిస్తే ఎక్కువ వయసున్న తండ్రులకు పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన రుగ్మత ఆకోండ్రోప్లాసియా ఎక్కువగా ఉంటుందని తేలింది.
పెద్ద వయసులో తల్లయినవారికి పుట్టిన పిల్లల్లానే, పెద్ద వయసులో తండ్రయిన వారికి పుట్టిన పిల్లలకూ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంటుందని యూటా విశ్వవిద్యాలయం పరిశోధకులు రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలు తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం
పెద్ద వయసులో తండ్రులయ్యేవారికి పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉండే ప్రమాదం, మూర్ఛ వచ్చే ముప్పు పెరుగుతోందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు చెప్పారు.
పెద్ద వయసులో తండ్రులయ్యేవారికి పుట్టే పిల్లల్లో రకరకాల క్యాన్సర్లు సోకే అవకాశమూ ఉంటోందని తెలిపారు. పుట్టుకతో పిల్లల్లో గుండె సంబంధిత సమస్యలు ఉండడానికి ఇదీ ఓ కారణం అని పరిశోధకులు అంటున్నారు.
అరోగ్యంగా ఉండడానికి ఇదే కచ్చితమైన విధానమని స్పష్టంగా ఏ అధ్యయనాలూ చెప్పలేదు. ఆరోగ్యంపై అనేక ఇతర కారణాలు ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రుల జీవన విధానం, వాతావరణ కాలుష్యం వంటివాటి ప్రభావమూ ఉంటుంది.
వీర్య కణాల మ్యుటేషన్లు, డీఎన్‌ఏ వంటివి తర్వాతి తరానికి సంక్రమించడంపై వయసు ప్రభావం ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు.
ఇలాంటి అధ్యయనాల వల్ల డాక్టర్లు, శాస్త్రవేత్తలు సంతానోత్పత్తిపై చేసే పరిశోధనల కోణంలో మార్పు వస్తుంది.
ఓ జంటకు పిల్లలు పుట్టకపోతే సాధారణంగా మహిళపై, వారి వయసుపై దృష్టిపెడుతుంటారు. వయసు పెరిగే కొద్దీ మహిళల సంతానోత్పత్తి సామర్థ్యంపైనే ఎక్కువ పరిశోధనలు సాగుతుంటాయి. అయితే వయసు ప్రభావం పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపైనా ఉంటుందని, వారి వయసు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతుందని, కాలం గడిచేకొద్దీ మహిళలకన్నా తక్కువగా ఉంటుందని ఇప్పుడు తేలింది. పిల్లల పుట్టుకపై తండ్రి వయసు ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అర్ధమైంది.
పాసినో, డి నిరోతో పాటు 70 ఏళ్లు, 80 ఏళ్లు, 90 ఏళ్ల వయసులో తండ్రులైన వారు ఉన్నప్పటికీ అది అరుదుగా జరుగుతుంటుంది. మొత్తంగా చెప్పాలంటే తండ్రవ్వడం అనేది యువకులకు సంబధించిన విషయం మాత్రమే కాదు.
1970ల నుంచి గమనిస్తే అమెరికాలో 30 ఏళ్లలోపు తండ్రయ్యేవారి సంఖ్య 27 శాతం తగ్గింది. అదే సమయంలో 45 నుంచి 49 ఏళ్ల మధ్య వయసులో తండ్రులవుతున్నవారి సంఖ్య 52 శాతం పెరిగింది.
ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే వైద్యపరంగానూ, సామాజిక ప్రవర్తన విషయంలోనూ వీటిని అంగీకరించకతప్పదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














