భారత్‌తో వివాదం: కెనడాలో విపక్షాలు ఎవరివైపు?

ఫొటో సోర్స్, Getty Images
కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వైఖరిని రాజకీయాలతో ముడిపెడుతున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు.
ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా ట్రూడో ఇదంతా చేస్తున్నారని ఇటు భారత్ కూడా ఆరోపిస్తోంది.
కెనడాతో ముదిరిన వివాదంపై భారత్‌లోని విపక్ష నేతలు కూడా స్పందిస్తున్నారు. అయితే, మోదీ ప్రభుత్వ పంథాకు పెద్దగా వారు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.
అయితే, భారత్‌పై ట్రూడో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, చేస్తున్న విమర్శలను అక్కడి విపక్షాలు ఎలా చూస్తున్నాయి? అన్నది చర్చనీయాంశంగా మారింది.
విపక్షాలు ట్రూడో వైఖరితో ఏకీభవిస్తున్నాయా, లేదా?

కెనడా ప్రధాని ట్రూడో ప్రభుత్వ వైఖరిపై అక్కడి విపక్ష పార్టీలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ట్రూడో ఈ సమస్యను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కెనడాలోని విపక్షాలకు చెందిన పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆయన వైఖరికి మద్దతు ఇచ్చే వారు కూడా ఉన్నారు.
ఈ సమస్యను పరిష్కరించడంలో ట్రూడో ప్రభుత్వం విఫలమైందని కెనడా విపక్ష నేత పియర్ పోలియెవ్ర్ విమర్శించారు.
ఏదైనా విషయంపై ప్రజల ముందుకు వెళ్లేటప్పుడు ఆధారాలను సమర్పించాలని ఆయన ట్రూడోను డిమాండ్ చేశారు.
ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దీన్ని వాడుతున్నారని జస్టిన్ ట్రూడోపై మరో విపక్షం పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నేత మ్యాక్సిమ్ బెర్నియర్ అన్నారు.
అలాగే, కెనడాలో హిందూవుల భద్రతపై ఆ దేశ హిందూ ఎంపీ చంద్ర ఆర్య కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కెనడా విపక్ష నేత ఏమన్నారు?
కెనడాలో విపక్ష నేత పియర్ పోలియెవ్ర్, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేత.
భారత్‌పై కెనడా పోలీసులు ఆరోపణలు చేసిన తర్వాత, ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పియర్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు(ఆర్‌సీఎంపీ)ల ఆరోపణలు తీవ్ర ఆందోళనకరంగా అనిపించాయి. వీటిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి’’ అని పియర్ అన్నారు.
‘‘కెనడా వ్యవహారాలలో భారత్ సహా మరే దేశం జోక్యం చేసుకున్నా, దాన్ని సహించేది లేదు. తప్పనిసరిగా దీన్ని అడ్డుకోవాలి. విదేశీ ముప్పు నుంచి దేశ పౌరులను రక్షించడం ప్రభుత్వ తొలి బాధ్యత కావాలి’’ అని పియర్ అన్నారు.
‘‘గత తొమ్మిదేళ్లలో, లిబరల్ పార్టీ ప్రభుత్వం(ట్రూడో ప్రభుత్వం) దేశ పౌరులకు భద్రత కల్పించడంలో విఫలమైంది. విదేశీ జోక్యాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. దీనివల్ల, ఇలాంటి కార్యకలాపాలకు కెనడా నిలయంగా మారింది’’ అని ఆ విపక్ష నేత ఆరోపించారు.
విదేశీ జోక్యానికి సహకరించిన ఎంపీల పేర్లను బహిర్గతం చేయాలని జస్టిన్ ట్రూడోను ఆయన డిమాండ్ చేశారు.
‘‘వాళ్ల పేర్లు బయటపెట్టాలని నేను జస్టిన్ ట్రూడోకు మెసేజ్ పంపాను. కానీ, ట్రూడో అలా చేయరు. ఎందుకంటే, ఆయనేం చేయాలనుకుంటారో అదే చేస్తారు. ఆయన అబద్ధాలు చెబుతుంటారు’’ అని పియర్ అన్నారు.
‘‘ట్రూడో వద్ద ఆధారాలుంటే, వాటిని ప్రజల ముందు పెట్టాలి. విచారణ కమిషన్‌కు ఈ విషయం చెప్పానని ఆయన ఇప్పుడు చెబుతున్నారు. వాస్తవమేంటో ప్రజలకు చెప్పాలి. కానీ, ఆయనలా చేయరు. పైగా దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు.’’ అని పియర్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రూడో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నది ఎవరు?
భారత్-కెనడా వివాదంపై ట్రూడో ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా చీఫ్ మ్యాక్సిమ్ బెర్నియర్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘కెనడా నేలపై భారత్ దౌత్యవేత్తలు క్రిమినల్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు, ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలు నిజమైతే, ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, చర్యలు తీసుకోవాలి’’ అని మాక్సిమ్ బెర్నియర్ అన్నారు.
‘‘ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. ఇతర వివాదాలను కప్పిపుచ్చుకునేందుకు ట్రూడో ఈ వివాదాన్ని వాడుతున్నారని స్పష్టమైంది’’ అని అన్నారు.
వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు పౌరసత్వం కల్పించడంపై బెర్నియర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్‌తో ఉన్న ఈ వివాదాన్ని కెనడా పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
‘‘ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరుడనే అపోహను తొలగించుకోవాలి. ఆయన అసలు విదేశీ తీవ్రవాది. 1997 నుంచి మోసపూరిత డాక్యుమెంట్లతో పలుమార్లు కెనడాలో శరణార్ధి వీసా కోసం ప్రయత్నించాడు. 2007లో ఎలాగోలా పౌరసత్వం సంపాదించాడు’’ అని చెప్పారు.
నిజ్జర్ పౌరసత్వాన్ని వెనక్కి తీసుకోవాలని బెర్నియర్ డిమాండ్ చేశారు.
‘‘నిజ్జర్ అసలు కెనడా పౌరుడే కాదు. పాలనాపరమైన ఈ తప్పును సరిదిద్దుకోవాలి. ఆయన హత్య తర్వాతైనా నిజ్జర్ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సింది. తప్పుడు పత్రాలతో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్న వారు కెనడాలో లక్షల మంది ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.
దశాబ్దాలుగా కెనడాలోకి ఇలాంటి విదేశీయులకు, వారి జాతి ఘర్షణలకు ఆహ్వానం పలకడం వల్లనే ఇదంతా జరుగుతోందని బెర్నియర్ ఆరోపించారు.
‘‘జరిగిన తప్పును ఒప్పుకోవాలి. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తి, కీలకమైన మిత్రదేశంతో మన సంబంధాలను ప్రమాదంలో నెట్టడానికి బదులు ఈ సమస్యపై పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి’’ అని బెర్నియర్ సూచించారు.
విదేశీ విధానంపై కూడా జస్టిన్ ట్రూడోను లక్ష్యంగా చేసుకుని బెర్నియర్ విమర్శలు చేశారు. ప్రధాని ట్రూడోను విమర్శిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్ వ్యాఖ్యలు చేయడాన్ని కూడా బెర్నియర్ సోషల్ మీడియాలో విమర్శించారు.
‘‘విదేశీ జోక్యంపై ట్రూడో, పియర్‌లు మాట్లాడుకోవడం చూస్తే, కెనడా రాజకీయాల్లో అత్యంత హాస్యాస్పదమైన విషయం ఇదేనని అనిపిస్తుంది’’ అని ఆయన రాశారు.
‘‘విదేశీయులను కెనడాకు తీసుకురావాలి, వారికి ఇక్కడ గౌరవాలు కల్పించాలి, స్థానిక కెనడా వాసుల కంటే పైన వారిని కూర్చోబెట్టాలి, వారి విదేశీ సంఘర్షణలను ఇక్కడకు తీసుకొచ్చేలా చేయాలి, వారిని సంతృప్తిపరిచి, వారి ఓట్లను కొనుగోలు చేయాలి. ఇదే ఈ ఇద్దరి రాజకీయ వ్యూహం’’ అని బెర్నియర్ అన్నారు.

ఫొటో సోర్స్, @ARYACANADA
కెనడాలోని హిందూ ఎంపీ ఏం చెప్పారు?
నెపియన్ ప్రాంతం నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు సభ్యుడైన, భారత సంతతికి చెందిన కెనడియన్ లిబరల్ నేత చంద్ర ఆర్య దీనిపై సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు.
‘‘ఇటీవల నెలకొన్న పరిణామాలపై కెనడా హిందూవుల ఆందోళనలను నేను విన్నాను. హిందూ ఎంపీగా నాకు కూడా ఈ ఆందోళనలు ఉన్నాయి’’ అని అన్నారు.
‘‘కెనడియన్లుగా, ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం నుంచి మన పౌరులను రక్షించుకునేందుకు ప్రభుత్వం, దాని ఏజెన్సీలు ఇతర ప్రభావిత దేశాలకు సహకరిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అని చెప్పారు.
‘‘కెనడాలో హింసాత్మక తీవ్రవాద ముప్పు పెరుగుతుందని ఆర్‌సీఎంపీ కమిషనర్ మైఖేల్ దుహెమ్ అన్నారు. దీన్ని అరికట్టేందుకు భారత్, కెనడాలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఖలిస్తాని తీవ్రవాదం పేరుతో ఉన్న క్రాస్ బోర్డర్ ముప్పును తొలగించాల్సిన ప్రాముఖ్యతను మనమందరం గుర్తించడం చాలా కీలకం. దాన్ని తగ్గించేందుకు మన ప్రయత్నాలను రెండింతలు చేయాలి’’ అని చంద్ర ఆర్య అన్నారు.
రాజకీయ అండదండలతో కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం పెరుగుతోందని విమర్శించారు.
తాజా పరిణామాల వల్ల తమ భద్రత గురించి భయపడుతున్న, ఆందోళన చెందుతున్న హిందూ కెనడియన్లకు ప్రభుత్వ అధికారులు లేదా ఎవరైనా నేత భరోసా ఇచ్చినట్లు తాను వినలేదని చంద్ర ఆర్య అన్నారు.
‘‘దేశంలో అత్యంత ఎక్కువగా ప్రతిభావంతులైన, విజయవంతులైన వర్గాల్లో మనం ఒకరిగా ఉన్నామని హిందూ-కెనడియన్లకు నేను చెప్పాలనుకుంటున్నా. కెనడా పురోగతికి మనం ఎక్కువగానే సహకరిస్తున్నాం. మనం లో-ప్రొఫైల్ మెయింటెయిన్ చేయడాన్ని రాజకీయ నాయకులు బలహీనతగా భావిస్తున్నారు.’’ అని చెప్పారు.
‘‘హిందూ-కెనడియన్లు తమ గొంతును పెంచడమే సమస్యల పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం. నేతలందరూ దీనికి కట్టుబడి ఉండాలి. మనమందరం కలిసి మన భద్రత, ప్రయోజనాలను కాపాడుకోవచ్చు’’ అని చంద్ర ఆర్య అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














