అదే నిజమైతే భారత్ చాలా పెద్ద తప్పు చేసినట్లే: ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాదైన్ యూసిఫ్, నిఖిత యాదవ్
- హోదా, బీబీసీ న్యూస్ టొరంటో, బీబీసీ న్యూస్ దిల్లీ
కెనడాలో గత ఏడాది సిక్కు వేర్పాటువాద నేత మృతి వెనుక దిల్లీ హస్తం కనుక ఉంటే భారత్ ‘పెద్ద తప్పు’ చేసినట్లే అని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు.
కెనడా గడ్డపై భారత అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకుని హత్యలు, బెదిరింపులు, ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్లు కెనడా అధికారులు ఆరోపించిన రెండు రోజుల తర్వాత ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం కెనడా ఆరోపణలు చేసిన తరువాత, రెండు దేశాలు ఇరుదేశపు రాయబారులు, దౌత్యవేత్తలను బహిష్కరించాయి.
అయితే కెనడా ఆరోపణలు "నిరాధారమైనవి" అని భారతదేశం తోసిపుచ్చింది. ట్రూడో కెనడాలోని సిక్కు వర్గం నుంచి రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించింది.
బుధవారం, భారతదేశం మళ్లీ ట్రూడో తీరును తప్పుపట్టింది.
భారత్, భారత దౌత్యవేత్తలపై కెనడా చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలు తమకు అందించలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

కెనడా రాజకీయాల్లో విదేశీ జోక్యంపై బహిరంగ విచారణకు ముందు మాట్లాడిన ట్రూడో.. 2023 జూన్‌లో జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దర్యాప్తుపై భారతదేశం స్పందనను ట్రూడో విమర్శించారు.
నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉన్నట్లు తనకు ఇంటిలిజెన్స్ సమాచారం ఉందని ట్రూడో ఆరోపించారు.
తమ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు వచ్చిన ఎలాంటి ఆరోపణలను అయినా కెనడా తీవ్రంగా పరిగణించాలని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
నిజ్జర్‌ను బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కాల్చి చంపారు. ఖలిస్తాన్ ఉద్యమ మద్దతుదారుడైన ఆయన దాని కోసం బహిరంగంగానే ప్రచారం చేశారు.
అయితే, హత్య జరిగిన సమయంలో కెనడా ఇంటెలిజెన్స్ వద్ద సరైన సాక్ష్యాలు లేవని ట్రూడో విచారణలో చెప్పారు.
నిజ్జర్ మరణంపై పోలీసులు నలుగురు భారతీయ పౌరులపై అభియోగాలు మోపారు.
ముఖ్యమైన వాణిజ్య భాగస్వామితో ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోకుండా ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలనుకున్నా, దర్యాప్తులో సహాయం కోసం కెనడా చేసిన అభ్యర్థనలను భారత అధికారులు తిరస్కరించినట్లు ట్రూడో తెలిపారు.
సెప్టెంబరులో ఈ ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆయన భారత ప్రభుత్వ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు తమ వద్ద "విశ్వసనీయమైన సమాచారం" ఉందని అన్నారు.
ఈ వారం రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎమ్‌పీ) విడుదల చేసిన మరిన్ని ఆరోపణలకు ట్రూడో బుధవారం మరిన్ని వివరాలను జోడించారు.
ఆర్‌సీఎమ్‌పీ సోమవారం ఖలిస్తాన్ అనుకూల ఉద్యమ సభ్యులకు డజనుకు పైగా బెదిరింపులు వచ్చాయని తెలిపింది.
తదుపరి పరిశోధనలో, భారత ప్రభుత్వ ఏజెంట్లు నిర్వహించిన అనేక నేర కార్యకలాపాలు బయటపడ్డాయని ఆర్‌సీఎమ్‌పీ తెలిపింది.
కెనడాలోని దక్షిణాసియా సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో తమ భద్రతా బలగాలు ఈ ప్రకటన చేసినట్లు ట్రూడో చెప్పారు.
భారతదేశం ఈ ఆరోపణలన్నిటినీ తీవ్రంగా ఖండించింది, కెనడా తన వాదనలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలూ చూపలేదని పేర్కొంది.
కెనడా అధికారుల ఆరోపణల నేపథ్యంలో, కెనడాలోని చట్టపరమైన ప్రక్రియకు భారత్ సహకరించాలని యూకే, అమెరికా భారతదేశాన్ని కోరాయి.
వైట్‌హౌస్ ఆశించినట్లు భారత్ కెనడా అధికారులకు సహకరించడం లేదని అమెరికా పేర్కొంది.
కెనడా విదేశాంగ మంత్రి, మెలానీ జోలీ ఈ విషయంపై అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో కూడిన ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ కూటమితో తాము కలిసి పని చేస్తున్నామని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














