జోధ్‌పూర్: కనుమరుగవుతున్న 'నీలి' నగరం

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అర్షియా
- హోదా, బీబీసీ కోసం
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను 'బ్లూ సిటీ' అని పిలుస్తారు. ఇక్కడి నీలం రంగు ఇళ్లు ప్రపంచవ్యాప్తంగా పర్యటకులను ఆకర్షిస్తున్నాయి.
జోధ్‌పూర్ నగరంలోని బ్రహ్మపురి ప్రాంతం, ఒక కొండపైన ఓ సుప్రసిద్ధ కోట పాదాల వద్ద ఉంటుంది. 1459లో రాజ్‌పుత్ రాజు రావ్ జోధా నిర్మించిన, ఎత్తైన గోడలతో నీలం రంగు ఇళ్లు ఉన్న ఈ సెటిల్మెంట్ క్యాంప్‌ను, పాత జోధ్‌పూర్ లేదా అసలైన జోధ్‌పూర్ నగరం అంటారు.
అయితే, 17వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతంలో నీలం రంగును ఉపయోగించేవారు కాదని, ఆ తర్వాతే ఇలాంటి రంగు ఇళ్లు జోధ్‌పూర్ ప్రత్యేక గుర్తింపుగా మారాయని జిందాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ఎస్తేర్ క్రిస్టీన్ ష్మిత్ చెప్పారు.
గత 70 సంవత్సరాలుగా ఈ నగరం బాగా విస్తరిస్తున్నా, ఇప్పటికీ బ్రహ్మపురి ప్రాంతమే జోధ్‌పూర్‌కు గుండెకాయలా ఉందని మెహ్రాన్‌గఢ్ మ్యూజియం క్యురేటర్ సునయన రాథోడ్ అన్నారు.

బ్రహ్మపురి అంటే సంస్కృతంలో ‘బ్రాహ్మణుల పట్టణం’ అని అర్థం. నీలం రంగును తమ సాంస్కృతిక పవిత్రతకు చిహ్నంగా స్వీకరించిన బ్రాహ్మణ కుటుంబాల కాలనీగా దీన్ని నిర్మించారు.
15వ శతాబ్దంలో స్పానిష్‌ల దాడి నుంచి పారిపోతూ మదీనాలో శెఫ్చెవెన్ లేదా బ్లూ సిటీ ఆఫ్ మొరాకో అని పిలిచే పట్టణంలోని పాత భాగంలో స్థిరపడిన యూదుల్లా, వారు ప్రత్యేకంగా ఉన్నారు.
శెఫ్చెవెన్‌లోని ఇళ్లు, మసీదులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీలం రంగులో ఉంటాయి. జుడాయిజంలో దీన్ని పవిత్రమైన ఆకాశాన్ని సూచించే రంగుగా పరిగణిస్తారు.
అయితే, ఈ నీలం రంగు చాలా రకాలుగా ఉపయోగపడింది. బ్రహ్మపురిలో లైమ్‌స్టోన్ ప్లాస్టర్‌తో కలిపిన ఈ నీలి రంగు పెయింట్, పర్యటకులను ఆకర్షించడంతో పాటు, ఇళ్ల లోపలి భాగాలను చల్లబరుస్తుంది.
కానీ శెఫ్చెవెన్‌లా కాకుండా, జోధ్‌పూర్‌లో నీలి రంగు మసకబారడం ప్రారంభించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
చరిత్రాత్మకంగా, ఈ ప్రాంతంలో సహజమైన నీలి మందు సులభంగా లభ్యం కావడం వల్ల బ్రహ్మపురి నివాసితులు ఈ రంగును ఎంచుకున్నారు. తూర్పు రాజస్థాన్‌లోని బయానా పట్టణం ఒకప్పుడు దేశంలోని ప్రధాన నీలిమందు ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి.
కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆ పంటను ఎక్కువగా పండించడం వల్ల నేల ఎక్కువగా దెబ్బతిని, దానిని పండించడం, ఉపయోగించడం తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు ఉష్ణోగ్రతలు బాగా పెరడడంతో నీలి రంగు పెయింట్ ఇళ్లను చల్లబరచలేకపోతోంది. దీంతో ప్రజలు వేడిని తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్ల (ఏసీ) వంటి వాటిని వాడుతున్నారు.
ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని గాంధీ నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఉదిత్ భాటియా తెలిపారు.
ఐఐటీ గాంధీనగర్ చేసిన విశ్లేషణ ప్రకారం, జోధ్‌పూర్ సగటు ఉష్ణోగ్రత 1950లలో 37.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే, 2016 నాటికి 38.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగింది.
ఇళ్ళను చల్లబరచడమే కాకుండా, సహజమైన నీలి మందును బ్రైట్ బ్లూ కాపర్ సల్ఫేట్‌తో కలపడం వల్ల, పెయింట్‌లలో సాధారణంగా ఉపయోగించే ప్రసిద్ధ యాంటీఫౌలింగ్ ఏజెంట్ కారణంగా, ఆ పెయింట్‌లో తెగుళ్లను తరిమికొట్టే గుణాలు ఉంటాయని భాటియా చెప్పారు.
పట్టణీకరణ వల్ల పర్యావరణానికి మేలు చేసే సంప్రదాయాలను అశాస్త్రీయంగా వదిలేస్తున్నారని భాటియా అభిప్రాయపడ్డారు.
“జోధ్‌పూర్‌లో ఇప్పుడు ఎవరైనా నీలి రంగు ఇళ్ల మధ్య నడుస్తుంటే, తేలికపాటి గాలి కూడా వాళ్లకు గతంలోకన్నా ఎక్కువ వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని ఆయన చెప్పారు.
దీనిని ‘హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ అంటారు. కాంక్రీటు, సిమెంట్, గాజును ఎక్కువగా ఉపయోగిస్తే, వేడి, సూర్యకాంతి తిరిగి పర్యావరణంలోకి ప్రతిబింబించి, ఉష్ణోగ్రత ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ముదురు రంగులతో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Tarun Sharma
అంతేకాకుండా నగరాలలో కొత్త సంస్కృతులు, కొత్త ప్రజలు రావడంతో, స్వదేశీ నిర్మాణ పద్ధతులు - వేడి వాతావరణంలో లైమ్ ప్లాస్టర్‌ను ఉపయోగించడం, నీలం రంగును సరిగా గ్రహించని సిమెంట్ లేదా కాంక్రీటును ఉపయోగించడం వంటి కొత్త సాంకేతికతలు వస్తున్నాయి.
బ్రహ్మపురికి చెందిన 29 ఏళ్ల సివిల్ ఇంజనీర్ ఆదిత్య దవే మాట్లాడుతూ, తమ 300 ఏళ్ల నాటి సొంత ఇల్లు చాలా వరకు నీలం రంగులో ఉందని, అయితే ఇప్పుడు బయటి గోడలకు ఇతర రంగుల్లో పెయింట్ వేస్తున్నామని చెప్పారు.
దవే ఐదేళ్ల కిందట బ్రహ్మపురిలో తన సొంత ఇంటిని నిర్మించినప్పుడు, ముందు భాగంలో తరచుగా మార్చాల్సిన అవసరం లేని టైల్స్‌ను పెట్టించారు.
దీనికి కారణం ప్రధానంగా నీలిమందు ధర పెరగడం. గోడలను పాడుచేసే ఓపెన్ డ్రెయిన్ వల్ల కూడా ఈ రంగు వాడకం తగ్గుతోంది.

ఫొటో సోర్స్, Tarun Sharma
ఈ మార్పు సందర్శకులను మోసగించినట్లు అనిపిస్తుందని బ్రహ్మపురిలో నీలిరంగు ఇళ్ల సంరక్షణ, వాటి పునరుద్ధరణ కోసం స్థానిక అధికారులతో కలిసి పనిచేసే వస్త్రాల వ్యాపారి దీపక్ సోని చెప్పారు.
“మన నగరానికి గుర్తింపుగా నిలిచిన ఇళ్ల కోసం ఎవరైనా వెతుకుతున్నారంటే, మనం సిగ్గుపడాలి. చాలా మంది విదేశీయులు జోధ్‌పూర్‌ని శెఫ్చెవెన్‌తో పోలుస్తారు. శెఫ్చెవెన్ నగరంలో ఇళ్లు శతాబ్దాలుగా నీలం రంగులో ఉంటే, మనమెందుకు ఆ పని చేయలేం?’’ అని ఆయన ప్రశ్నించారు.
2018లో బ్రహ్మపురి వారసత్వాన్ని కాపాడేందుకు స్థానిక అధికారులు, సంఘాలతో దీపక్ సోని చర్చలు జరిపారు. 2019 నుంచి, ఆయన ప్రతి సంవత్సరం 500 ఇళ్ల బయటి గోడలకు నీలం రంగు వేయడానికి బ్రహ్మపురి నివాసితుల నుంచి నిధులు సేకరిస్తున్నారు.
గత కొన్నేళ్లలో ఆయన బ్రహ్మపురిలోని దాదాపు 3,000 మంది ఇంటి యజమానులను తమ ఇంటి బయటి గోడలు, పైకప్పులకు నీలం రంగులోకి మార్చేలా ఒప్పించారు. "ఎవరైనా బ్రహ్మపురి ఫొటోను తీసినప్పుడు, కనీసం బ్యాక్‌గ్రౌండ్ నీలం రంగులో కనిపిస్తుంది" అని ఆయన చెప్పారు.
బ్రహ్మపురిలోని దాదాపు 33,000 ఇళ్లలో దాదాపు సగం ప్రస్తుతం నీలం రంగులో ఉన్నాయని సోనీ అంచనా వేస్తున్నారు.
ఆయన స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇళ్లకు లైమ్ ప్లాస్టర్‌ను వేయించే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘మా సొంతం అనుకునే ఈ నగరానికి నేను చేయగలిగే అతి చిన్న మేలు ఇదే’’ అని ఆయన అన్నారు.
"జోధ్‌పూర్ ప్రజలే దాని వారసత్వం గురించి పట్టించుకోకపోతే, బయటివాళ్లు మన నగరం గురించి ఎందుకు పట్టించుకుంటారు?" అని ఆయన అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














