యురేనస్‌పై మనుషులు జీవించడానికి అవకాశం ఉందా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది

ఫొటో సోర్స్, SPL
- రచయిత, పల్లవ్ ఘోష్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్
ఎంతోకాలంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు యురేనస్, దాని ఐదు అతిపెద్ద చందమామలు ఇక ఏమాత్రం జీవం లేని ప్రాంతాలు కాదు.
వాటిపై మహా సముద్రాలు ఉండొచ్చు, ఆ చందమామలపై జీవం మనుగడ సాధ్యమయ్యే పరిస్థితులు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాటి గురించి మనకు ఇంతవరకు తెలిసిన సమాచారంలో చాలావరకు 40 ఏళ్ల క్రితం నాసా వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ అందించినదే. కానీ వోయేజర్ యాత్ర సమయంలో శక్తిమంతమైన సౌర తుపాను కారణంగా అప్పట్లో యురేనస్‌పై వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని ఓ కొత్త పరిశోధన వెల్లడించింది.


ఫొటో సోర్స్, NASA
యురేనస్ ఓ అందమైన గ్రహం. మన సౌర వ్యవస్థలో సుదూరంగా ఉండే గ్రహం. అన్ని గ్రహాల్లోకి అత్యంత చల్లగా ఉండేది ఇదే. ఇతర గ్రహాలతో పోలిస్తే ఇది ఎవరో నెట్టినట్లుగా ఇంకొంచెం ఎక్కువగా వంగి ఉంటుంది. ఇదే దీన్ని ఓ వింత గ్రహంగా పరిగణించేలా చేస్తోంది.
1986లో వోయేజర్ 2 యురేనస్ మీదుగా వెళ్తూ, ఆ గ్రహంతోపాటు, దాని 5 ప్రధాన ఉపగ్రహాల అద్భుతమైన ఫొటోలు తీయడంతో వాటిని మొదటిసారి దగ్గరగా చూసే అవకాశం లభించింది.
కానీ శాస్త్రవేత్తలను అంతకన్నా అబ్బురపరిచిన అంశం ఏంటంటే... వోయేజర్ 2 పంపించిన డాటా. యురేనస్ వాతావరణం తాము ఊహించిన దానికన్నా మరింత వింతగా ఉంటుందని దాని ద్వారా తెలిసింది.
స్పేస్ క్రాఫ్ట్‌లోని పరికరాలు లెక్కించిన దాని ప్రకారం చూస్తే... గ్రహాలు, దాని ఉపగ్రహాలు క్రియాశీలకంగా లేవు. సౌరవ్యవస్థ బయట ఉన్న ఇతర చందమామలు ఇలా లేవు. యురేనస్ చుట్టూ ఉన్న రక్షిత అయస్కాంత క్షేత్రం చాలా వింతగా మార్పులకు గురైందని వాళ్లు గుర్తించారు. అది ఒత్తిడికి గురై, సూర్యుడి నుంచి దూరంగా జరిగింది.

ఫొటో సోర్స్, NASA
ఓ గ్రహానికి చెందిన అయస్కాంత క్షేత్రం ఆ గ్రహం నుంచి, దాని ఉపగ్రహాల నుంచి వచ్చే వాయువులను, ఇతర పదార్ధాలను తనవైపు లాక్కుంటుంది. ఇవి మహాసముద్రాల నుంచి వచ్చేవి కావచ్చు లేదా భౌగోళిక చర్యల వల్ల ఏర్పడేవి కావచ్చు. వోయేజర్ 2 ఇలాంటివేమీ గుర్తించలేదు. అంటే యురేనస్, దాని 5 అతిపెద్ద ఉపగ్రహాలు శుభ్రంగా, క్రియారహితంగా ఉన్నాయని సూచిస్తోంది.
ఇది నిజంగానే ఎంతో ఆశ్చర్యానికి గురిచేసే అంశం. ఎందుకంటే ఇది సౌరవ్యవస్థలోని ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాల తీరుకు భిన్నంగా ఉంది.
కానీ దశాబ్దాలుగా కొనసాగుతున్న మిస్టరీకి కొత్త విశ్లేషణ పరిష్కారాన్ని చూపించింది. వోయేజర్ 2 దీని మీదుగా వెళ్లిన సమయం మంచిగా లేదని దీంతో తెలుస్తోంది.
తాజా పరిశోధన ఫలితాలను బట్టి చూస్తే... యురేనస్ మీదుగా వోయేజర్ 2 ప్రయాణించినప్పుడు సూర్యుడు తీవ్రంగా ఉన్నాడు, శక్తిమంతమైన సౌర తుపాను సంభవించింది. దీనివల్ల యురేనస్‌పై ఉన్న పదార్ధాలు కొట్టుకుని పోయి ఉండొచ్చు, దీనివల్ల అక్కడి అయస్కాంత క్షేత్రంలో తాత్కాలికంగా మార్పులు సంభవించి ఉండొచ్చు.
అందుకే యురేనస్, దాని ఐదు పెద్ద చందమామలు ఎలా ఉంటాయనే దానిపై 40 ఏళ్లుగా మనకు తప్పుడు సమాచారమే అందుబాటులో ఉందని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన డాక్టర్ విలియమ్ డున్ అన్నారు.

ఫొటో సోర్స్, NASA
“యురేనస్ వ్యవస్థ గతంలో అనుకున్న దానికన్నా మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుందని ఈ తాజా పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులున్న కొన్ని ఉపగ్రహాలు అక్కడ ఉండొచ్చు. దాని ఉపరితలం కింద చేపలు సమృద్ధిగా ఉండే మహాసముద్రాలు ఉండొచ్చు.”
యురేనస్ సమాచారం వచ్చిన సమయంలో వోయేజర్ ప్రోగ్రామ్ కోసం పనిచేస్తున్న లిండా స్పైకర్ ఓ యువ శాస్త్రవేత్త. ఇప్పటికీ ఆమె వోయేజర్ మిషన్‌లకు ప్రాజెక్ట్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. జర్నల్ నేచర్ ఆస్ట్రోనమీలో ప్రచురితమైన తాజా ఫలితాల గురించి విని చాలా సంతోషించానని ఆమె అన్నారు.
“ఈ ఫలితాలు ఆసక్తిగా ఉన్నాయి. యురేనస్ వ్యవస్థలో జీవానికి అవకాశం ఉందని తెలిసి చాలా సంతోషించాను” అని ఆమె బీబీసీ న్యూస్‌తో అన్నారు.
“వోయేజర్ అందించిన సమాచారంతో చాలా అధ్యయనం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నా. 1986లో మేం సేకరించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు మరోసారి అధ్యయనం చేయడం, కొత్త విషయాలు కనుక్కోవడం, కొత్త అంశాలను వెల్లడించడం ఆనందంగా ఉంది.”
ఈ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని డబ్లిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు చెందిన డాక్టర్ అఫెలియా విబిసోనో పేర్కొన్నారు. ఆయనకు ఈ పరిశోధన బృందంతో సంబంధం లేదు.
“పాత సమాచారాన్ని మరోసారి అధ్యయనం చేయడం ఎంత ముఖ్యమో ఇది తెలియచేస్తోంది. ఎందుకంటే కొన్నిసార్లు వాటి వెనక దాగి ఉన్న కొత్త విషయాలు బయటకొస్తాయి. రాబోయే కాలంలో చేపట్టబోయే స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ల రూపకల్పనలో ఆ సమాచారం మనకు ఉపయోగపడొచ్చు.”
నాసా చేస్తున్నది కూడా ఇదే. కొత్త పరిశోధనల ఫలితంగానే ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మంచుతో నిండిన యురేనస్, దాని ఉపగ్రహాల మీదుగా వోయేజర్ 2 ప్రయాణించి దాదాపు 40 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు నాసా మరో కొత్త మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. అదే యురేనస్ ఆర్బిటర్ అండ్ ప్రోబ్. పదేళ్ల తర్వాత ఇది అక్కడ దిగిన తర్వాత ఆ గ్రహాన్ని మరింత లోతుగా పరిశీలించాలనేది లక్ష్యం.

ఫొటో సోర్స్, NASA
వోయేజర్ 2 అందించిన డాటాను మరోసారి పరిశీలించాలని చెప్పిన నాసాకు చెందిన డాక్టర్ జేమీ జసిన్‌స్కీ అభిప్రాయం ప్రకారం... ఈ మిషన్‌కు సంబంధించిన పరికరాల రూపకల్పనలో, సైంటిఫిక్ సర్వేను రూపొందించడంలో ఈ ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
“వోయేజర్ 2 నుంచి నేర్చుకున్న అనుభవాల ఆధారంగా భవిష్యత్ స్పేస్ క్రాఫ్ట్‌లలోని కొన్ని భాగాలను రూపొందిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో అది ఓ అసాధారణ తుపాను పరిస్థితుల్లో యురేనస్ మీదుగా ప్రయాణించింది. అందుకే కొత్త మిషన్‌లో ఉపయోగించే పరికరాలు ఎలా ఉండాలో మనం మరోసారి ఆలోచించాల్సి ఉంది. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి అనువుగా మంచి డాటాను సేకరించవచ్చు.”
నాసాకు చెందిన యురేనస్ ప్రోబ్ 2045 నాటికి ఆ గ్రహంపై దిగుతుందని అంచనా. అప్పుడు సుదూరంగా ఉంటూ, మంచుతో నిండి ఉన్న, ఇంతవరకూ ప్రాణుల మనుగడకు అవకాశం లేదని భావిస్తున్న దీని ఉపగ్రహాలపై జీవం మనుగడకు అవకాశం ఉందేమో పరిశీలించే అవకాశం శాస్త్రవేత్తలకు దొరకచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














